బీజేపీ, పీఆర్‌టీయూకు చెరొకటి | Telangana: Results of Teacher MLC seats announced | Sakshi
Sakshi News home page

బీజేపీ, పీఆర్‌టీయూకు చెరొకటి

Published Tue, Mar 4 2025 3:40 AM | Last Updated on Tue, Mar 4 2025 3:40 AM

Telangana: Results of Teacher MLC seats announced

కరీంనగర్‌లో కౌంటింగ్‌ కేంద్రం వద్ద విజయసంకేతం చూపుతున్న అభ్యర్థి మల్క కొమురయ్య, కేంద్ర మంత్రి బండి సంజయ్‌. నల్లగొండలో విక్టరీ సింబల్‌ చూపుతున్న శ్రీపాల్‌రెడ్డి

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఫలితాల వెల్లడి  

కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల టీచర్స్‌ఎమ్మెల్సీగా మల్క కొమురయ్య (బీజేపీ).. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపు  

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి...రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు

కొనసాగుతున్న కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఓట్ల వడబోత 

మంగళవారం మధ్యాహ్నం కౌంటింగ్‌ మొదలయ్యే అవకాశం  

అధికారుల తీరుపై అభ్యర్థుల మండిపాటు... ఓటేయడంపై ఈసీ అవగాహన కల్పించలేదని విమర్శలు 

చిన్న పొరపాట్లు, కామెంట్లతో ఓట్లపై అనర్హత వేటు 

50 వేల గ్రాడ్యుయేట్‌ ఓట్లు చెల్లలేదని ప్రచారం... ఖండించిన ఈసీ

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/నల్లగొండ: రాష్ట్రంలో  రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో ఒకటి బీజేపీ కైవసం చేసుకోగా, మరొకటి పీఆర్‌టీయూ సొంతం చేసుకుంది. కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలవగా, వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీపాల్‌రెడ్డి రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. 

కరీంనగర్‌–మెదక్‌– నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్ల వడబోత కార్యక్రమం సోమవారం సాయంత్రం మొదలుకాగా, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఓట్ల వడబోత పూర్తయ్యాక, కట్టలు కట్టి, మంగళవారం మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తారు.  

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ స్థానంలో....
వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి 19 మంది అభ్యర్థులు పోటీ చేశారు. సమీప ప్రత్యర్థి అయిన సిట్టింగ్‌ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిపై 5,521 ఓట్ల మెజారిటీతో శ్రీపాల్‌రెడ్డి విజయం సాధించారు. శ్రీపాల్‌రెడ్డికి 13,969 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 8,848 ఓట్లు వచ్చాయి. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టుగా ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్‌ ఇలా త్రిపాఠి సోమవారం రాత్రి ప్రకటించారు.  

మొదటి నుంచీ ఆధిక్యంలోనే...  
పీఆర్‌టీయూ–టీఎస్‌ బలపరిచిన అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి మొదటి నుంచీ ఆధిక్యంలోనే కొనసాగారు. నల్లగొండలోని ఆర్జాలబావిలో ఉన్న రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాముల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లో కౌంటింగ్‌ నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్‌ రూమ్‌ల నుంచి బ్యాలెట్‌ బాక్సులను తీసుకొచ్చి కౌంటింగ్‌ హాలులో 25 టేబుళ్లపై మొదట కట్టలు కట్టే ప్రక్రియ చేపట్టి 11 గంటల వరకు పూర్తి చేశారు. అనంతరం కౌంటింగ్‌ ప్రారంభించారు. సాయంత్రం 3 గంటల వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. 

మొదటి ప్రాధాన్యతలో శ్రీపాల్‌రెడ్డి అత్యధికంగా ఓట్లు సాధించారు. ఆయనకు 6,035 ఓట్లు లభించగా, ద్వితీయస్థానంలో 4,820 ఓట్లతో అలుగుబెల్లి నర్సిరెడ్డి నిలవగా, మూడో స్థానంలో 4,437 ఓట్లు పొంది గాల్‌రెడ్డి హర్షవర్ధన్‌రెడ్డి నిలిచారు. ఆ తర్వాత పూల రవీందర్‌ 3,115 ఓట్లతో నాలుగో స్థానంలో, బీజేపీ అభ్యర్థి సరోత్తంరెడ్డి 2,289 ఓట్లు సాధించి ఐదో స్థానంలో నిలిచారు. సుందర్‌రాజ్‌ యాదవ్‌ 2,040 ఓట్లతో ఆరో స్థానంలో ఉన్నారు. మిగిలిన అభ్యర్థుల్లో ఒక్కరు మినహా మిగిలిన వారంతా 500 లోపు ఓట్లు వచ్చినవారే ఉన్నారు.  

రౌండ్‌ రౌండ్‌కూ పెరిగిన ఆధిక్యం 
ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉండగా, 24,135 ఓట్లు పోలయ్యాయి. అందులో 499 ఓట్లు చెల్లలేదు. 23,641 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. అయితే చెల్లిన ఓట్లలో సగానికి ఒకటి ఎక్కువగా పరిగణనలోకి తీసుకొని 11,821 ఓట్లు గెలుపు కోటాగా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠి నిర్ణయించారు. మొదటి ప్రాధాన్యత కోటా ఓట్లు ఎవరికి రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించారు. 

తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేట్‌ చేస్తూ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. అలా 14 మందిని ఎలిమినేషన్‌ చేసి ఓట్లు లెక్కించడంతో శ్రీపాల్‌రెడ్డికి 6,165 ఓట్లు రాగా, నర్సిరెడ్డికి 4,946 ఓట్లు, హర్షవర్ధన్‌రెడ్డికి 4,596 ఓట్లు, పూల రవీందర్‌కు 3,249 ఓట్లు, సరోత్తంరెడ్డికి 2,394 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత తక్కువగా ఓట్లున్న సుందర్‌రాజును ఎలిమినేట్‌ చేసి 15వ రౌండ్‌ ఓట్లు లెక్కించారు. 

ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 6,916కు పెరిగాయి. ఆ తర్వాత బీజేపీ అభ్యర్ధి సరోత్తంరెడ్డిని ఎలిమినేట్‌ చేసి 16వ రౌండ్‌లో ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డి ఓట్లు 7,673కు చేరుకున్నాయి. ఆ తర్వాత పూల రవీందర్‌ను ఎలిమినేట్‌ చేసి 17వ రౌండ్‌ ఓట్లు లెక్కించగా, శ్రీపాల్‌రెడ్డి 9,021 ఓట్లకు చేరుకున్నారు. 

ఆ తర్వాత మూడో స్థానంలో ఉన్న హర్షవర్ధన్‌రెడ్డిని ఎలిమినేట్‌ చేసి ఓట్లు లెక్కించారు. ఇందులో శ్రీపాల్‌రెడ్డికి 11,099 ఓట్లు లభించగా, నర్సిరెడ్డికి 8,448 ఓట్లు లభించాయి. నర్సిరెడ్డికి వచ్చిన మొదటి ప్రాధాన్యత ఓట్లలోని రెండో ప్రాధాన్యత ఓట్లను కూడా లెక్కించి.. శ్రీపాల్‌రెడ్డి గెలిచినట్టు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఇలా త్రిపాఠి ప్రకటించారు.  

కరీంనగర్‌లో కమల వికాసం  
కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల టీచర్స్‌ ఎమ్మెల్సీ స్థానాన్ని ముందు నుంచీ ఊహించినట్టుగానే బీజేపీ కైవసం చేసుకుంది. ఉదయం 8 గంటలకే ఓట్ల లెక్కింపు ప్రారంభమైనా.. అధికారులు జాప్యం చేయడం వల్ల ఓట్ల వడబోత తీవ్ర ఆలస్యమైంది. దీంతో సాయంత్రం 7 గంటలు దాటాక టీచర్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. 

రాత్రి 9.30 గంటలకు ఫలితం తేలింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 27,088 ఓట్లకుగాను.. 25,041 ఓట్లు పోల్‌ అయ్యాయి. అందులో 24,144 ఓట్లు చెల్లుబాలు అయ్యాయి. 897 ఓట్లు చెల్లలేదని అధికారులు ప్రకటించారు. గెలుపు కోటాగా 12,073 ఓట్లను నిర్ధారించారు. 

మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులోనే బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్యకు 12,959 ఓట్లు, వంగ మహేందర్‌రెడ్డికి 7,182, అశోక్‌కుమార్‌కు 2,621, కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి. తొలిరౌండ్‌లోనే బీజేపీ అభ్యర్థి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలిచారు. రాత్రి 10.20 గంటల సమయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కౌంటింగ్‌ సెంటర్‌ వద్దకు వచ్చి మల్క కొమురయ్యను అభినందించారు. 

అధికారుల లెక్కల్లో గందరగోళం.. 
టీచర్‌ ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం పోలైన ఓట్లలో మూడు రకాల గణాంకాలతో అధికారులు గందరగోళానికి తెరతీశారు. పోలింగ్‌ రోజు రాత్రి 24,895 ఓట్లు వచ్చాయని, మరునాడు శుక్రవారం 24,968 మంది ఓటేశారని, తాజాగా సోమవారం మొత్తంగా 25,041 ఓట్లు పోలయ్యాయని వెల్లడించడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు. 

కొనసాగుతున్న గ్రాడ్యుయేట్‌ ఓట్ల వడబోత 
కరీంనగర్‌–మెదక్‌–నిజామాబాద్‌–ఆదిలాబాద్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ స్థానానికి సంబంధించి కౌంటింగ్‌లో ఓట్ల వడబోత ఇంకా కొనసాగుతోంది. గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గపరిధిలో 3.55 లక్షలకు 2,50,106 ఓట్లు పోలయ్యాయి. అందులో ముందుగా లక్ష ఓట్లను వడబోశారు. 

అందులో 92,000 ఓట్లు చెల్లుబాటు కాగా, 8,000 చెల్లనివిగా అధికారులు ప్రకటించారు. ఇంకా 1.5 లక్షల ఓట్లు వడబోయాల్సి ఉంది. గ్రాడ్యుయేట్‌ ఓటర్ల బ్యాలెట్లు కట్టలు కట్టే ప్రక్రియ మంగళవారం మధ్యాహ్నం వరకు సాగుతుందని, ఆ తర్వాతే ఓట్ల లెక్కింపు ఉంటుందని పేరు తెలిపేందుకు ఇష్టపడట్లో అధికారి సాక్షికి తెలిపారు. 

భారీగా ఇన్‌వాలీడ్‌ ఓట్లు.. ఆర్వోపై ఈసీకి ఫిర్యాదు 
గ్రాడ్యుయేట్‌కు సంబంధించి భారీగా ఇన్‌వాలీడ్‌ ఓట్లు నమోదయ్యాయని సమాచారం. దాదాపు 50 వేల ఓట్లు చెల్లకుండా పోయాయని ప్రచారం జరిగినా.. సాయంత్రానికి అధికారులు దానిని ఖండించారు. ఓటర్లు చిన్న చిన్న తప్పులతో తమ విలువైన ఓటును చెల్లకుండా చేసుకున్నారు. 

ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అంకెలకు ముందు సున్నా రాయడం, ఆ అంకెకు సున్నా చుట్టడం, అంకె వేసినాక సంతకం చేయడం, దానికి ఎదురుగా టిక్‌ గుర్తు పెట్టడం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్లు పెట్టడం తదితర తప్పిదాల వల్ల భారీగా ఓట్లు చెల్లకుండా పోయాయని కాంగ్రెస్‌ అభ్యర్థి నరేంందర్‌ రెడ్డి, ఏఐఎఫ్‌బీ అభ్యర్ధి, మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌లు వాపోయారు. 

అదే సమయంలో తమకు ఓటేసిన వారిలో అంకె ముందు సున్నా పెట్టిన వారి ఓట్లను ఇన్‌వాలీడ్‌ కాకుండా గుర్తించాలని ఆర్వోకు ఇచ్చిన వినతిపత్రంలో కోరారు. అదే విధంగా రవీందర్‌సింగ్‌ ఓట్లు లెక్కించే సమయంలో జంబ్లింగ్‌ విధానం పాటించలేదని ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. 

అంతేకాకుండా పలు బూత్‌ల ఓట్ల విషయంలో గోప్యత పాటించకుండా బయటకు వెల్లడించేలా సిబ్బంది వ్యవహరించారని ఆరోపిస్తూ.. ఆర్వో మీద ఈసీకి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తానని రవీందర్‌సింగ్‌ చెప్పారు. కొత్త ఓటర్లకు ఓటేసే విధానంపై అవగాహన కల్పించడంలో ఎన్నికల కమిషన్‌ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement