teachers MLC elections
-
టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం
సాక్షి,కాకినాడ : ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి విజయం సాధించారు. గోపి మూర్తికి 8 వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు పోలయ్యాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిదే గెలుపు కాయం అవుతుంది. కాగా, ఈ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లు 15,490.జేఎన్టీయూలో ఇవాళ ( (సోమవారం) ఉదయం 8 గంటలకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. 14 టేబుళ్ళపై 9 రౌండ్లలో ఓట్లను లెక్కించగా.. మొదటి ప్రాధ్యానత ఓట్ల లెక్కింపులో పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తిని విజయం వరించింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపుపై పీడీఎఫ్ అభ్యర్థి గోపి మూర్తి మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రజాస్వామ్య విజయం. నా విజయం దివంగత మాజీ ఎమ్మెల్సీ షేక్ షాబ్జీకి అంకితం. నాకు ఓట్లు వేసిన టీచర్లకు కృతజ్ఞతలు.ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. టీచర్లపై అదనపు భారం తగ్గించాలి. సీపీఎస్ రద్దుపై పోరాటం కొనసాగిస్తాను. పిపుల్స్ రిప్రజెంటీవ్ నుండి పొలిటికల్ రిప్రజెంటీవ్ అయ్యాను’’ అని సంతోషం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు డిసెంబర్ 5న జరిగాయి. ఈ ఎన్నికల్లో 15,490 మంది టీచర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న షేక్ సాబ్జీ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఎన్నికల అధికారులు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలవగా ప్రధానంగా గంధం నారాయణరావు, బొర్రా గోపిమూర్తిలకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మద్దతు పలికాయి. ఇద్దరి పోరులో గోపిమూర్తి విజయం సాధించారు. -
TS: చారిత్రాత్మక విజయమిది.. అమిత్ షా ట్వీట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి విజయం పట్ల బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ట్వీట్ ద్వారా తెలంగాణ బీజేపీకి అభినందనలు తెలియజేశారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు, తెలంగాణ బీజేపీ కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారాయన. తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రంలో అవినీతి పాలనతో విసిగిపోయారని, మోదీ నాయకత్వంలోని పారదర్శకమైన బీజేపీ ప్రభుత్వ పాలన కోరుకుంటున్నారని ఈ విజయం తెలియజేస్తోందని ట్వీట్ చేశారాయన. Congratulations to Shri AVN Reddy,@bandisanjay_bjp and @BJP4Telangana for the historic victory in Mahbubnagar-Rangareddy-Hyd Teachers' MLC polls. This victory shows that Telangana people are fed up with corruption and want a pro-poor, transparent govt under Modi Ji's leadership. — Amit Shah (@AmitShah) March 17, 2023 అంతకు ముందు.. ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గం ఎన్నికల ఫలితాలపై నెలకొంది. ఓట్ల లెక్కింపు మందకొడిగా కొనసాగడంతో గురువారం వరకు మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తవగా.. అభ్యర్థుల్లో ఏ ఒక్కరూ కూడా మ్యాజిక్ ఫిగర్ 12,709 దాటలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనివార్యమైంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున వరకు ఓట్ల లెక్కింపు కొనసాగగా.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కించడంతో ఏవీఎన్ రెడ్డి గెలుపొందారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి సుమారు 1150 ఓట్ల తేడాతో సమీప పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై విజయం సాధించారు. -
ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఘట్టం.. పావులు కదుపుతున్న పార్టీలు!
హైదరాబాద్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రచారంలో మునిగిపోయారు. మరోవైపు తెర వెనక రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్న కాటేపల్లి జనార్ధన్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది మార్చి 29తో ముగియనుంది. 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పీఆర్టియు టీఎస్ నేత జనార్ధన్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి పీఆర్టియు టీఎస్ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్సీని కాదని... ఉపాధ్యాయ సంఘం సీనియర్ నాయకుడు చెన్నకేశవరెడ్డిని బరిలోకి దించారు. చెన్నకేశవరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ మద్దతు తమకే ఉందని పీఆర్టీయు నేతలు చెబుతున్నారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డిని సొంత సంఘం మూడోసారి పోటీకి నో చెప్పడంతో... టీఎస్ పీఆర్టియు పేరుతో మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇక బీజేపీ అధికారికంగానే ప్రైవేటు విద్యా సంస్థల అధినేత ఏ.వెంకటనారాయణ రెడ్డి పేరును ప్రకటించడంతో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయ వర్గాల్లో ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని బీజేపీ భావిస్తోంది. మొత్తానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజకీయ రంగు పులుముకోవడంతో ఆసక్తికరంగా మారాయి. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ను అన్ని రాజకీయ పక్షాలు సవాల్ గా స్వీకరిస్తున్నాయి. -
బీజేపీకి ఎమ్మెల్సీ ఫలితాల షాక్.. అయిదు స్థానాల్లో మూడు ఓటమి
సాక్షి ముంబై: ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజకవర్గాలు ఐదింటికి జరిగిన ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చాయి. అయిదింటిలో మూడు స్థానాలను శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహావికాస్ ఆఘాడి(ఎంవీఏ) కైవసం చేసుకుంది. ఒక స్థానాన్ని బీజేపీ, మరోస్థానంలో ఇండిపెండెంట్ విజయం సాధించారు. ఇటీవలే ఐదు ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం నుంచి ప్రారంభమైంది. శుక్రవారం వరకు లెక్కింపు కొనసాగింది. అనంతరం అయిదు నియోజకవర్గాల ఫలితాలు అధికారికంగా ప్రకటించారు. జ్ఞానేశ్వర్ మాత్రే విజయంతో ఊరట ఐదు నియోజకవర్గాల్లో మహావికాస్ ఆఘాడీ మూడింటిని కైవసం చేసుకోగా బీజేపీ ఒకస్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా అమరావతి పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి రంజిత్‌పాటిల్ ఓడిపోయారు. మరాఠ్వాడాలో మహావికాస్ ఆఘాడి అభ్యర్థి విక్రమ్ కాలే విజయం సాధించారు. ఇక నాగపూర్ ఉపాధ్యాయుల స్థానంలో బీజేపీ బలపరిచిన నాగో గానార్‌లు పరాజయం పాలయ్యారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ల సొంత నియోజకవర్గమైన నాగపూర్‌లో పరాజయం పాలవడం ఆ పార్టీని షాక్‌కు గురి చేసింది. కొంకణ్‌లో బీజేపీ అభ్యర్థి జ్ఞా్ఞనేశ్వర్ మాత్రే విజయం సాధించడం కొంత ఊరటనిచ్చింది. నాసిక్‌లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థి సత్యజిత్ తాంబే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి విజయం సాధించారు. ఆ స్థానంలో ఆయనకు బీజేపీ మద్దతు పలికింది. దీంతో ఫలితాల అనంతరం ఆయన కాంగ్రెస్‌లో కొనసాగుతారా లేదా బీజేపీలో చేరుతారా అనే అంశంపై అనేక ఊహగానాలు కొనసాగుతున్నాయి. తాంబే నుంచి మాత్రం ఈ అంశంపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేద -
AP: 3 నియోజకవర్గాల్లో 9,96,393 మంది పట్టభద్రులు
సాక్షి, అమరావతి: త్వరలో ఎన్నికలు జరిగే మూడు పట్టభద్రులు, రెండు టీచర్ల ఎమ్మెల్సీ స్థానాలకు తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) విడుదల చేసింది. 3 పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల్లో 9,96,393 మంది ఓటర్లు ఉండగా, రెండు టీచర్ల స్థానాల్లో 54,681 మంది ఓటర్లు ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా శుక్రవారం తెలిపారు. శ్రీకాకుళం–విజయనగరం– విశాఖపట్నం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎంపిౖకైన పీవీఎన్ మాధవ్, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎంపికైన వై.శ్రీనివాసులరెడ్డి, కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి వెన్నపూస గోపాలరెడ్డి, ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గం నుంచి విఠపు బాలసుబ్రమణ్యం, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గం నుంచి కత్తి నరసింహారెడ్డిల పదవీ కాలం మార్చి 29,2023తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయా స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు కొత్త ఓటర్ల జాబితాను సీఈసీ విడుదల చేసింది. నవంబర్1, 2022 నాటికి అర్హత ఉన్నవారికి ఓటు హక్కును కల్పిస్తూ కొత్త ఓటర్లను నవంబర్ 7 వరకు చేర్చుకొని నవంబర్ 23న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు మీనా తెలిపారు. ఈ జాబితాపై అభ్యంతరాలు, ఫిర్యాదులను నవంబర్ 23 నుంచి డిసెంబర్ 9 వరకు ఆహ్వానించి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. పోలింగ్ స్టేషన్లు, తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం సీఈవో ఆంధ్రా వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. నామినేషన్లు వేసే 10 రోజుల ముందు వరకు కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాలను స్వీకరించనుంది. ఓటర్లు..పోలింగ్ స్టేషన్ల సంఖ్య ఇదీ... 3 పట్టభద్రుల నియోజకవర్గాల్లో కలిపి 9,96,393 మంది ఓటర్లు ఉంటే అందులో అత్యధికంగా ప్రకాశం–నెల్లూరు–చిత్తూరులో 3,83,396 మంది ఓటర్లు ఉన్నారు. వారి కోసం 320 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. కడప–అనంతపురం–కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గంలో 3,29,248 మంది ఓటర్లకు గాను 358 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం–విజయనగరం– విశాఖ నియోజకవర్గంలో 2,83,749 మంది ఓటర్లకు 297 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ప్రకాశం–నెల్లూరు–చిత్తూరు టీచర్ల నియోజకవర్గంలో 26,907 ఓటర్లకు 175 పోలింగ్ స్టేషన్లు, కడప–అనంతపురం–కర్నూలు టీచర్ల నియోజకవర్గంలో 27,774 మంది ఓటర్లకు 173 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. -
ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఈ నెల 14వ తేదీన ఉభయ గోదావరి, కృష్ణా–గుంటూరు జిల్లాలకు సంబంధించి జరిగిన రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బుధవారం ఉదయం 8కి లెక్కింపు మొదలైంది. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను కాకినాడ జేఎన్టీయూ కాలేజీలోను, కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఓట్లను గుంటూరు ఏసీ కాలేజీలోను లెక్కిస్తున్నారు. ఎన్నికల కౌంటింగ్‌కు మొత్తం 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ► ఉభయగోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీగా షేక్ సాబ్జీ గెలుపొందారు. 1537 ఓట్ల మెజార్టీతో యూటీఎఫ్ అభ్యర్థి షేక్ సాబ్జీ విజయం సాధించారు. కృష్ణా గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏసీ కాలేజీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కౌంటింగ్ జరుగుతోంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలవగా..అయిదుగురు మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓట్ల కౌంటింగ్‌కు 14 టేబుళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేశారు, ప్రాధాన్యత ఓటును బట్టే అభ్యర్థుల గెలుపు అవకాశాలు ఉన్నాయి. 13575 ఓట్లకు గాను 12554 ఓట్లు పోలయ్యాయి. 92.95 శాతం పోలింగ్ జరిగింది. -
ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఫలితాలపై ఉత్కంఠ!
సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు ఆదివారం జరిగాయి. పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి రెండు జిల్లాల పరిధిలో 92.95 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 13,505 మంది ఓటర్లకు 12,554 మంది ఓటు వేశారు. గుంటూరు జిల్లాలో 7,081 మందికి 6,566 మంది ఓటు వేయడంతో 92.73 శాతం పోలింగ్ నమోదైంది. కృష్ణా జిల్లాలో 6,424 మందికి గాను 5,988 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93.21 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఉదయం పది గంటల వరకు 27.12 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 56.33 శాతం, రెండు గంటలకు 76.88 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ బాక్సులను ఏసీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. కృష్ణా జిల్లా నుంచి కూడా బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన బందోబస్తు నడుమ గుంటూరుకు తరలించారు. కోవిడ్–19 నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ నిర్వహించారు. మాస్క్ ధరించిన వారినే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు. కౌంటింగ్‌కు ఏర్పాట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 17వ తేదీన మొదలు కానుంది. గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో కౌంటింగ్ చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా అధికారులు మొదలుపెట్టారు. పోలైన ఓట్లు 12,554 అయినా బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఏ ఒక్కరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చే అవకాశం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా తప్పనసరి అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉంది. గెలుపు ఎవరి తలుపు తడుతుందో... పోలింగ్ 92.95 శాతం నమోదవడంతో అభ్యర్థుల్లో గుబులు పట్టుకుంది. గెలుపు ఎవరి తలుపు తడుతుందని లెక్కలు వేసుకోవడంలో అభ్యర్థులు, వారి అనుచరులు తలమునకలయ్యారు. బరిలో 19 మంది అభ్యర్థులు ఉండటంతో ఓట్లు చీలి ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో గెలిచే పరిస్థితి కనిపించటం లేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయో అన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంది. ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా కుక్కునూరు, కొవ్వూరు, ఏలూరు, నరసాపురం డివిజన్లలో 49 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 7,765 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 92.14 శాతం పోలింగ్ నమోదైంది. 7,155 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 4,365 మంది పురుష ఓటర్లు, 2,790 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఏలూరులో జరిగిన ఎన్నికలను ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పరిశీలించారు. కుక్కునూరు కేంద్రంలో కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉండగా వారిలో ఇద్దరు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలేరుపాడులో ఆరుగురు ఓటర్లు ఉండగా అందరూ ఓటు వేశారు. డివిజన్ల వారీగా చూస్తే జంగారెడ్డిగూడెం డివిజన్లో 91.43 శాతంతో 800 మంది, కొవ్వూరు డివిజన్లో 94.73 శాతంతో 1,636 మంది, ఏలూరు డివిజన్లో 89.51 శాతంతో 2,388 మంది, నరసాపురం డివిజన్లో 93.44 శాతంతో 2,323 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ సాబ్జి ఏలూరులోని సెయింట్ గ్జేవియర్ స్కూల్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. పోలింగ్‌కు పటిష్ట భద్రత ఏలూరు టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు చెప్పారు. ఏలూరులోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు, పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. డీఐజీ మోహనరావుతో పాటు ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, ఏలూరు వన్‌టౌన్ సీఐ వైబీ రాజాజీ, టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ తదితరులు ఉన్నారు. -
విజేత.. వర్మ
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు విజయం వరించింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా చక్రం తిప్పిన గాదె ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడంతో.. కొత్తగా పోటీ చేసిన రఘువర్మకు ఉపాధ్యాయులు పట్టం కట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన వర్మ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు శాసనమండలిలో గళం విప్పుతానన్నారు. విశాఖసిటీ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంరంభంలో పాకలపాటి రఘువర్మ ఘన విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదె శ్రీనివాసుల నాయుడిపై తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రఘువర్మ గెలుపొందారు. ఈ నెల 22న నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైంది. మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం 19,593 ఓట్లుండగా.. 17,293 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 550 చెల్లని ఓట్లుగా లెక్కింపు అధికారులు పరిగణించారు. మిగిలిన 16,743 ఓట్లకు గాను.. 8,372 ఓట్లను గెలుపు కోటా ఓట్లుగా నిర్ధారించారు. ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన మొదటి రౌండ్లో పాకలపాటి రఘువర్మకు 6165 ఓట్లు, గాదె శ్రీనివాసుల నాయుడికి 4659, అడారి కిశోర్‌కుమార్‌కు 2,173, జన్నెల బాలకృష్ణకు 299, నూకల సూర్యప్రకాష్‌కు 122, డా.పాలవలస శ్రీనివాసరావుకు 60, గాది బాలగంగాధర్తిలక్కు 44, ఉప్పాడ నీలం 24 ఓట్లతో నిలిచారు. రెండు రౌండ్లు ముగిసేసరికి పాకలపాటి రఘువర్మ 7,834 ఓట్లు, గాదె శ్రీనివాసుల నాయుడు 5,632, అడారి కిశోర్‌కుమార్ 2,548, జన్నెల బాలకృష్ణకు 444, నూకల సూర్యప్రకాష్‌కు 135, డా.పాలవలస శ్రీనివాసరా>వుకు 66, గాది బాలగంగాధర్తిలక్కు 50, ఉప్పాడ నీలం 34 ఓట్లు సాధించారు. అయితే.. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థీ కోటా ఓట్లయిన 8,372 ఓట్లకు చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించారు. ఊరించిన విజయం: కోటా ఓట్లకు ఇంకా 538 ఓట్ల దూరంలో రఘువర్మ నిలిచిపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల గణన ప్రారంభమైంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారి నుంచి లెక్కింపు మొదలుపెట్టారు. రౌండ్లు పూర్తవుతున్నా.. మ్యాజిక్ ఫిగర్‌కు చేరువ కాకపోవడంతో వర్మ విజయం కాసేపు ఊరించింది. ఉప్పాడ నీలం అనే అభ్యర్థికి సంబంధించిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా వర్మకు 12 ఓట్లు వచ్చాయి, ఆ తర్వాత గాది బాలగంగాధర్ ఓట్లలో 15, పాలవలస శ్రీనివాసరావు ఓట్లలో 9, నూకల సూర్యప్రకాష్ ఓట్లలో 45, బాలకృష్ణ ఓట్లలో 147 ఓట్లు వచ్చాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి 8062 ఓట్లతో రఘువర్మ నిలిచారు. దీంతో.. విజయానికి ఇంకా 310 ఓట్ల దూరంలో నిలిచారు. ఏడో రౌండ్లో అడారి కిశోర్‌కుమార్‌కు సంబంధించి 2,709 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇవన్నీ లెక్కించినా.. గాదె విజయం సాధించే అవకాశం లేకపోవడంతో ఎన్నికల అధికారుల సూచన మేరకు రఘువర్మ కోటా ఓట్లను చేరుకునేంత వరకూ లెక్కించి విజేతను ప్రకటించాలని నిర్ణయించారు. అడారి ఓట్లలో 922 ఓట్లు లెక్కించే సరికి రఘువర్మ విజయం ఖరారైనట్లు అధికారులు ప్రకటించారు. రఘువర్మకు 8,372 ఓట్లు రాగా, గాదె శ్రీనివాసుల నాయుడు 6,044 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్ కాటంనేని భాస్కర్, జాయింట్ కలెక్టర్ సృజన పర్యవేక్షించారు. విజయం ఖరారు చేసిన అనంతరం రఘువర్మకు ధ్రువపత్రాన్ని కలెక్టర్ భాస్కర్ అందించారు. సమస్యలపరిష్కారానికి కృషి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు తన గళాన్ని మండలిలో వినిపిస్తానని విజయం సాధించిన అనంతరం పాకలపాటి రఘువర్మ ప్రకటించారు. తన విజయం ఉపాధ్యాయులందరిదీ అని వ్యాఖ్యానించారు. గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పాకలపాటి రఘువర్మకు ఉద్యమ సంఘాలైన యూటీఎఫ్, ఎస్టీయూ, గిరిజన ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్ట్ లెక్చరర్లు, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులతో పాటు 20 వరకూ సంఘాలు మద్దతు ఇచ్చాయి. మరోవైపు... ఎమ్మెల్సీగా రెండు దఫాలుగా చేసిన గాదెపై ఉన్న వ్యతిరేకత ఓటింగ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో గాదె పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలూ గెలుపుపై ప్రభావం చూపాయి. రఘువర్మకు అభినందనలు మురళీనగర్(విశాఖ ఉత్తర): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మను రామాటాకీస్ సమీపంలోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేÔశంలో ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్టీయూ సంఘాల ప్రధాన నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి కృషి వల్లే తాను గెలుపొందానని రఘువర్మ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని చెప్పారు. అందరిని స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుతానని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తమరాన త్రినా«థ్, బి.వెంకటపతిరాజు, యూటీఎఫ్ నాయకులు జాజులు, ఎస్టీయూ అధ్యక్షుడు పైడిరాజు పాల్గొన్నారు. -
‘పట్టభద్రులకు’ టీఆర్ఎస్ దూరం
సాక్షి, హైదరాబాద్: శాసన మండలి పట్టభద్రుల స్థానం ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉంటోంది. గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈ సారి పార్టీ తరుఫున అభ్యర్థిని పోటీలో పెట్టకూడదని నిర్ణయించింది. పోటీలో ఉండే స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి మద్దతు ఇవ్వనుంది. పోలింగ్‌కు రెండుమూడు రోజుల ముందు ఈ మేరకు ప్రకటన చేయాలని భావిస్తోంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరుఫున ఎవరినీ బరిలో దింపకూడదని టీఆర్ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పట్టభద్రుల స్థానం విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్ఎస్ ఇప్పుడు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పదవీకాలం ముగియడంతో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు... వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 5న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మార్చి 22న పోలింగ్, 26న ఫలితాలను వెల్లడించనున్నారు. తొలిసారి దూరం... రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్ఎస్ విద్యావంతుల్లో తెలంగాణ భావజాలాన్ని పెంచే ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని 2007లో పునరుద్ధరించారు. అప్పటి నుంచి ప్రతి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్ఎస్ పోటీ చేసింది. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మినహా అన్ని స్థానాల్లోనూ టీఆర్ఎస్ వరుసగా గెలిచింది. ఉద్యమ సమయంలో రాజీనామాలతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో జరిగిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లు టీఆర్ఎస్ విజయం సాధించింది. ఇలాంటి స్థానంలో టీఆర్ఎస్ పోటీకి దూరంగా ఉండటంపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థిని బరిలో దించకున్నా... స్వతంత్రుల్లో ఒకరికి మద్దతు తెలపాలని నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఉద్యోగుల సంఘం నేతకు టీఆర్ఎస్ మద్దతు తెలిపే అవకాశం ఉంది. 5న మామిండ్ల నామినేషన్... టీఆర్ఎస్ టికెట్ ఆశించిన గ్రూప్‌ృ1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఈ నెల 5న పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్‌గౌడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి శనివారం రాజీనామా చేశారు. చంద్రశేఖర్ రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. -
‘మండలి’ మెట్లెక్కేదెవరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. పోటీకి సై అంటే సై అంటూ ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాల నేతలు ముందుకు వస్తున్నారు. పీఆర్టీయూ సిట్టింగ్ ఎమ్మెల్సీ పూల రవీందర్‌తోపాటు ఇదే యూనియన్‌లో పని చేసి బయటకు వచ్చిన నేతలూ పోటీకి సిద్ధమయ్యారు. ప్రధానంగా పీఆర్టీయూ వ్యవస్థాపకుల్లో ఒకరైన మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఇటీవల ఈ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన పులి సరోత్తంరెడ్డి బరిలో ఉన్నారు. ఖమ్మంలో పీఆర్టీయూ సిట్టింగ్ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆ జిల్లా కమిటీ తీర్మానం చేసింది. అయితే సంఘం నేతల ఒత్తిడితో చివరకు వెనక్కి తగ్గినట్లు తెలిసింది. మరోవైపు నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు పోటీకి సిద్ధమై వెనక్కి తగ్గారు. ఇద్దరు సిట్టింగ్ అభ్యర్థులు తమ పార్టీ వారే అయినప్పటికీ టీఆర్ఎస్ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకుండా ఈ ఎన్నికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ముఖ్య నేతల మధ్య పోటాపోటీ.. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, కరీంనగర్–మెదక్–నిజమాబాద్–ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు కూడా వచ్చింది. ఆయా స్థానాల నుంచి పోటీ పడుతున్న ముఖ్య నేతలు 16 మంది వరకు ఉండగా, అందులో ప్రధాన పోటీ పీఆర్టీయూకు సంబంధించిన అభ్యర్థుల మధ్యే ఉండే అవకాశం ఉంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి పోటీలో నిలిపేందుకు పూల రవీందర్‌కు పీఆర్టీయూ మద్దతు ప్రకటించగా, ఇక్కడి నుంచి సరోత్తంరెడ్డి కూడా పోటీకి సిద్ధమయ్యారు. అలాగే మరో ప్రధాన సంఘమైన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షునిగా పని చేసిన ఎ.నర్సిరెడ్డి ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) తరఫున పోటీలో ఉంటున్నారు. మరోవైపు ఇతర సంఘాల నుంచి కలుపుకొని మొత్తంగా 13 మంది పోటీలో ఉండేందుకు సిద్ధమయ్యారు. పీఆర్టీయూ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షుడు కోమటిరెడ్డి నర్సింహారెడ్డి బరిలో ఉన్నారు. అయితే బుధవారం టీఆర్ఎస్ ముఖ్య నేతల చర్చల నేపథ్యంలో పూల రవీందర్‌కు మద్దతుగా నర్సింహారెడ్డి పోటీ చేయకుండా ఉండాలన్న నిర్ణయానికి వచ్చారు. దీంతో ఈ స్థానంలో ప్రధాన పోటీ రవీందర్, సరోత్తంరెడ్డి, నర్సిరెడ్డి మధ్యే ఉండే అవకాశాలున్నాయి. వీరే కాకుండా టీటీఎఫ్, ఆటా అభ్యర్థిగా ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ తాటికొండ వెంకటరాజయ్య, రిటైర్డ్ డీఈవో చంద్రమోహన్, కేయూ అసోసియేట్ ప్రొఫెసర్ సంగాని మల్లేశం, పారుపల్లి సురేషన్, కొత్తపల్లి గురుప్రసాద్‌రావు పోటీలో ఉన్నారు. ఇప్పు డు వారంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు. పీఆర్టీయూ జీవం పోసిన ఆ ఇద్దరు.. పీఆర్టీయూ వ్యవస్థాపక నేతల్లో ముఖ్యులు బత్తాపురం మోహన్‌రెడ్డి, పాతూరి సుధాకర్‌రెడ్డి. ఇప్పుడు వారిద్దరు కరీంనగర్–మెదక్–నిజమాబాద్– ఆదిలాబాద్ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. పీఆర్టీయూను వీడి మోహన్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరగా, సుధాకర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. పీఆర్టీయూ తమ అభ్యర్థిగా ఆ సంఘం సిద్ధిపేట జిల్లా అధ్యక్షుడు కె.రఘోత్తంరెడ్డికి మద్దతు ప్రకటించగా ఆయన ప్రచారం కూడా చేసుకుంటున్నారు. సుధాకర్‌రెడ్డికి మద్ద తివ్వాలని టీఆర్ఎస్ అడిగితే రఘోత్తంరెడ్డిని ఆపే అవకాశాలున్నాయి. ఈ స్థానం నుంచి యూఎస్పీసీ అభ్యర్థిగా కొండల్‌రెడ్డి, ఎస్టీయూ అభ్యర్థిగా సుధాకర్‌రెడ్డి, టీటీఎఫ్ అభ్యర్థిగా సీహెచ్ రాములు, టీపీటీయూ అభ్యర్థిగా వేణుగోపాలస్వామి పోటీలో ఉన్నారు. వ్యూహాత్మకంగా టీఆర్ఎస్ ఈ రెండు స్థానాల్లోనూ సిట్టింగ్‌లు ఇద్దరూ టీఆర్ఎస్ పార్టీ వారే అయినా ఆ పార్టీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పార్టీ పేరుతో అభ్యర్థులను నిలబెట్టకూడదన్న నిర్ణయంతో టీఆర్ఎస్ ఉన్నట్లు తెలిసింది. అయితే అనధికారికంగా మాత్రం వారికి మద్దతును కూడగట్టే ఆలోచన చేస్తోంది. ఇందులో భాగంగానే నల్లగొండలో కె. నర్సింహారెడ్డి పోటీలో ఉండకుం డా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. ఇక కరీంనగర్ స్థానం నుంచి కూడా ఒకరిద్దరిని పోటీ నుంచి తప్పుకునేలా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
సాక్షి, విశాఖపట్నం : ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు త్వరలో నగరా మోగనుంది. ప్రస్తుత ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు పదవీ కాలం 2019 ఫిబ్రవరి 26వ తేదీతో ముగుస్తుంది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నియోజకవర్గ ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటర్ల నమోదు, సవరణకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నవంబర్ 6వ తేదీ వరకు కొత్త ఓటర్ల నమోదు, సవరణ అనంతరం అభ్యంతరాలను పరిష్కరించి 2019 జనవరిలో తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు. జనవరిలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. శాసనమండలిని పునరుద్ధరించిన తర్వాత రెండోసారి 2013 ఫిబ్రవరిలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. నాడు 14,600 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు నమోదు చేసుకోగా వారిలో 12,996 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.నాటి ఎన్నికల్లో 21 మంది పోటీచేయగా, పంచాయతీరాజ్ ప్రొగ్రెస్సివ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) తరపున బరిలోకి దిగిన గాదె శ్రీనివాసులు నాయుడు తన ప్రత్యర్థి ఏపీ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థి సింహాద్రప్పుడుపై గెలుపొందారు. ఈయన పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి 26వ తేదీతో ముగియనుం ది. ఈలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందు న ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముందస్తు ఏర్పాట్లు చేసేందుకు కసరత్తు మొదలైంది. రేపటి నుంచే ఓటర్ల నమోదు ఓటర్ల నమోదు, సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీపై నియోజకవర్గ ఎన్నికల అధికారైన విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ సోమవారం (అక్టోబర్–1) నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. విశాఖ కలెక్టర్ నేతృత్వంలో అసిస్టెంట్ ఎన్నికల అధికారి హోదాలో విశాఖ జిల్లా రెవెన్యూ అధికారి సి.చంద్రశేఖరరెడ్డి మూడు జిల్లాల్లో ఎన్నికలకు ముందస్తు ప్రక్రియ నిర్వహణకు మోనటరింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. మూడు జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ఓటర్లు ఎంతమంది ఉన్నారు. కొత్తగా ఎంత మంది నమోదయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పోలింగ్ కేంద్రాలు, కొత్తగా నమోదయ్యే ఓటర్ల సంఖ్యను బట్టి ఏ మేరకు కేంద్రాలు పెంచాలి, జిల్లాల వారీగా ఎన్నికల నిర్వహణ అధికారులు, బూత్ లెవల్ అధికారుల నియామకం, శిక్షణ వంటి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది.సోమవారం నుంచి మూడు జిల్లాల పరిధిలో ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియకు ఆయా జిల్లాల అసిస్టెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించే డీఆర్ఒల పర్యవేక్షణలో చేపడతారు. ఎవరు అర్హులు.. ఎలా నమోదు చేసుకోవాలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుహక్కు వినియోగించుకోవాలనుకునే వారు కనీసం ఆరేళ్ల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగిన వారై ఉండాలి. 2012 అక్టోబర్‌కు ముందు ఉపాధ్యాయ వృత్తిలో చేరి 2018 అక్టోబర్ వరకు ఫుల్‌టైం ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు మాత్రమే ఓటుహక్కు నమోదుకు అర్హులుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, యూనివర్శిటీలు, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేసిన ఉపాధ్యాయులు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ప్రైవేటు విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఓటు నమోదుకు హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ జిల్లా విద్యా శాఖాధికారి, కళాశాలలైతే ఆర్‌ఐఒ, యూనివర్సిటీ సంబంధిత హెడ్స్ నుంచి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నట్టుగా ధృవీకరణ పత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో పనిచేసే ఉపాధ్యాయులైతే ఓటు నమోదు సందర్భంలో విధిగా జీపీఎఫ్, ఈపీఎఫ్ సంబంధిత వివరాలు అందజేయాల్సి ఉంటుంది. మండల ఎన్నికల అధికారులకు స్వయంగా దరఖాస్తు చేయొచ్చు. అంతేకాకుండా ఈసారి ఆన్లైన్లో కూడా కొత్త ఓటర్లుగా చేర్పులు, మార్పులు, తప్పొప్పులు సవరణకు ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించింది. ఇలా అందిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి చేర్పులు, మార్పులపై అభ్యంతరాలు పరిష్కరించి జనవరిలో తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తారు. ఉపాధ్యాయులకు సంతృప్తికరమైన సేవలందించా.. ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆరేళ్లుగా ఎనలేని సేవలందించా. ముఖ్యంగా సర్వీస్ రూల్స్ అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తేవడం ఎంతో సంతృప్తినిచ్చింది. 2008 డీఎస్సీ ఉపాధ్యాయులకు పీఆర్సీలో ఉన్న తేడాలను సవరిస్తూ జీవో తీసుకొచ్చాం. 1400 మంది పీఈడీ పోస్టులను అప్‌గ్రేడ్ చేయగలిగాం. విశాఖ, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలందేలా జీవో తీసుకొచ్చాం. ఎయిడ్ఎడ్ ఉపాధ్యాయులకు అప్రంటీ‹స్షి ప్, నోషనల్ ఇంక్రిమెంట్లు, ప్ర మోషన్లు, కారుణ్య నియామకాలకు అవకాశం కల్పించేలా కృషి చేశాం. విశాఖలో డీఈవో కార్యాలయానికి సొంత భవనం నిర్మించడంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆర్జేడీ కార్యాలయాన్ని విశాఖకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగాం. – గాదె శ్రీనివాసులు నాయుడు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ -
మండలి పోరుకు పకడ్బందీ ఏర్పాట్లు
► 27 పోలింగ్ కేంద్రాలు ► ప్రతి మండల కేంద్రంలో ఓటర్లకు అందుబాటులో.. ► ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి.. ► నేటి సాయంత్రం 5గంటలకు ప్రచారానికి తెర సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్లు స్వేచ్ఛగా, ప్రశాంతంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపడుతోంది. ఈ నెల 9వ తేదీన రంగారెడ్డి–హైదరాబాద్–మహబూబ్‌నగర్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. జిల్లాలో మొత్తం 6,528 మంది ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లుగా ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. వీరంతా 9వ తేదీన తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. మొత్తం 27 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రం అందుబాటులో ఉంటుంది. అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో ఓటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇవి అందుబాటులో లేనిచోట, బడుల్లో అరకొర సౌకర్యాలు ఉన్న ప్రాంతాల్లో ప్రైవేటు సంస్థల వైపు మొగ్గు చూపారు. ఉదయం 8 నంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. పూర్తిగా బ్యాలెట్ పేపర్ ఆధారంగానే ఈ ఎన్నిక జరుగుతుంది. ఆయా ఉపాధ్యాయ సంఘాల తరఫున మొత్తం 12మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరంతా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నీచర్ తదితర సౌకర్యాలు ఉండేలా చూస్తున్నట్లు పేర్కొంటున్నారు. ప్రచారం ఈ నెల 7 తేదీ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. సమస్యాత్మక కేంద్రాలు లేనప్పటికీ.. అన్ని కేంద్రాలపై పోలీసుల పటిష్ట నిఘా ఉంటుందని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. స్లిప్పుల పంపిణీ.. నమోదైన ఓటర్లకు ఇప్పటికే ఓటరు స్లిప్పులు పంపిణీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రతి ఓటరు ఓటరు స్లిప్పుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపు కార్డు వెంట బెట్టుకుని పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలని సూచిస్తున్నారు. ఇవి లేకుంటే కేంద్రంలోనికి అనుమతించబోమని స్పష్టం చేశారు. మొత్తం ఓటర్లు : 6,528 పురుష ఓటర్లు : 3,655 మహిళా ఓటర్లు : 2,873 పోలింగ్ తేది : మార్చి 9 పోలింగ్ సమయం : ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటలు -
‘మండలి’ బరిలో 16 మంది
సాక్షి ప్రతినిధి, కాకినాడ :ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. మొత్తం 16మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల ఉపసంహరణకు వచ్చే నెల 2 వరకూ గడువు ఉంది. అనంతరం బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రకటిస్తారు. నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన గురువారం టీడీపీ బలపరచిన కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు) భారీ ర్యాలీతో తరలివెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అంతకు ఒక రోజు ముందు టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగిన ప్రగతి విద్యాసంస్థల అధినేత పరుచూరి కృష్ణారావు అట్టహాసంగా నామినేషన్ వేశారు. యూటీఎఫ్ బలపరిచిన అభ్యర్థిగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రాము సూర్యారావు ఉపాధ్యాయ వర్గంతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. వీరు కాకుండా మరో 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 16 మంది అభ్యర్థులు 34 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి నలుగురు, తూర్పు గోదావరి నుంచి 12 మంది నామినేషన్లు వేసిన వారిలో ఉన్నారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలైనప్పటికీ టీడీపీ బలపరిచిన అభ్యర్థి చైతన్యరాజు టీడీపీ తరఫున ఒక నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మరో నామినేషన్ వేశారు. ఆయన తనయుడు కిమ్స్ ఎండీ శశికిరణ్‌వర్మ మరో నామినేషన్ దాఖలు చేశారు. ముందుచూపుతోనే ఈవిధంగా ఒకటికి మించి నామినేషన్లు వేశారు. మిగిలిన 14 మంది స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికలు కావడంతో పార్టీపరంగా దాఖలైనవి పరిశీలనలో నిలుస్తాయా లేదా అనేది వేచి చూడాలి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాదిరిగానే అభ్యర్థులు వ్యూహ, ప్రతివ్యూహాలకు నామినేషన్ల దాఖలు సమయంలోనే తెరతీశారు. కృష్ణారావు పేరుతో నలుగురు, సత్యనారాయణరాజు పేరుతో రెండు నామినేషన్లు దాఖలవడం ఇందులో భాగమేనంటున్నారు. -
ఎమ్మెల్సీ ఎన్నికలపై బాబు సమాలోచన!
‘పశ్చిమ’కు వెళుతూ మధురపూడిలో ఆగిన సీఎం ఎన్నికల సమన్వయకర్తగా ఉప ముఖ్యమంత్రి రాజప్ప! సాక్షి, రాజమండ్రి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధురపూడి విమానాశయంలో ఆదివారం ఉదయం కొద్దిసేపు జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఆయన ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై సమాలోచన జరిపినట్టు సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లా వేలివెన్నులో స్మార్ట్ విలేజ్ కార్యక్రమం ప్రారంభానికి వెళ్లేందుకు ముఖ్యమంత్రి ఆదివారం ఉదయం 10.25 గంటలకు ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి 10.40 గంటలకు హెలికాప్టర్లో వేలివెన్ను వెళ్లారు. ఆయనకు విమానాశ్రయంలో జిల్లా నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ఎమ్మెల్సీ చైతన్యరాజు, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్యే చందన రమేష్, ఇతర నేతలు ముఖ్యమంత్రిని విమానాశ్రయం లోపల కలుసుకున్నారు. వారితో చంద్రబాబు 15 నిముషాల పాటు మాట్లాడారు. తెలిసిన సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలను ఆరా తీశారు. గతంలో ఉన్న ఓట్లు, ఇప్పుడు పెరిగిన ఓట్లు, గతంలో చైతన్యరాజుకు పోలయిన ఓట్ల వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికలకు సమన్వయకర్తగా వ్యవహరించాలని చినరాజప్పను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారంపై మాట్లాడేందుకు సోమవారం నిడదవోలు రావాల్సిందిగా ముఖ్య నేతలను చంద్రబాబు ఆహ్వానించారు. విమానాశయం వద్ద ముఖ్యమంత్రిని కలిసిన అధికారుల్లో జేసీ సత్యనారాయణ, అర్బన్ ఎస్పీ హరికృష్ణ, రాజమండ్రి సబ్ కలెక్టర్ విజయరామరాజు తదిత రులున్నారు. పల్లెల అభివృద్ధికే ‘స్మార్ట్ విలేజ్’ : చినరాజప్ప రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పల్లెలను స్మార్ట్‌గా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని హోం మంత్రి చినరాజప్ప అన్నారు. ముఖ్యమంత్రి వేలివెన్ను బయల్దేరాక ఆయన విమానాశ్రయం ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ స్వచ్ఛ భారత్ పిలుపు స్ఫూర్తితో గ్రామాల అభివృద్ధికి తమ నేత పూనుకున్నారన్నారు. తాను పెద్దాపురం మండలం జె.తిమ్మాపురాన్ని దత్తత తీసుకున్నానని, జిల్లాలో ప్రతి ఎమ్మెల్యే కొన్ని గ్రామాలను దత్తత తీసుకుని స్మార్ట్ పల్లెలుగా తీర్చిదిద్దేందుకు కార్యాచరణ జరుగుతోందని చెప్పారు. అన్ని గ్రామాల్లో ర్యాలీలు నిర్వహించి పారిశుద్ధ్యం, విద్యాభివృద్ధి, రోడ్లు, డ్రైన్లు తదితర అభివృద్ధి కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనేలా ప్రజలను చైతన్య పరుస్తామన్నారు. గ్రామాల ప్రజలు, ఎన్ఆర్ఐలు సహకరించాలని పిలుపునిచ్చారు. దివంగత నేత ఎన్టీ రామారావు పార్టీలకు అతీతంగా ప్రజల అభివృద్ధికి పాటు పడ్డారని, ఆయన 19వ వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను మననం చేసుకుంటున్నామని చెప్పారు. విమానాశ్రయంలో భారీ పోలీసు బందోబస్తు కోరుకొండ : ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో మధురపూడి విమానాశ్రయం వద్ద, పరిసరాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రతి ఒక్కరినీ క్షుణ్నంగా తనిఖీ చేశారు. కాగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులు, ప్రభుత్వాధికారులు సీఎంకు స్వాగతం పలికారు. విమానం దిగి, తిరిగి హెలికాప్టర్లో పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లే లోగా సీఎం జిల్లానేతలతో భేటీ అయ్యారు.