సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా–గుంటూరు ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికలు ఆదివారం జరిగాయి. పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి రెండు జిల్లాల పరిధిలో 92.95 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 13,505 మంది ఓటర్లకు 12,554 మంది ఓటు వేశారు. గుంటూరు జిల్లాలో 7,081 మందికి 6,566 మంది ఓటు వేయడంతో 92.73 శాతం పోలింగ్ నమోదైంది. కృష్ణా జిల్లాలో 6,424 మందికి గాను 5,988 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడంతో 93.21 శాతం పోలింగ్ నమోదైంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ స్థాయిలో పోలింగ్ శాతం నమోదవడంతో అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు తలెత్తకుండా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది. ఉదయం పది గంటల వరకు 27.12 శాతం, మధ్యాహ్నం 12 గంటలకు 56.33 శాతం, రెండు గంటలకు 76.88 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ బాక్సులను ఏసీ కాలేజీలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. కృష్ణా జిల్లా నుంచి కూడా బ్యాలెట్ బాక్సులను పటిష్టమైన బందోబస్తు నడుమ గుంటూరుకు తరలించారు. కోవిడ్–19 నిబంధనల ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకొని పోలింగ్ నిర్వహించారు. మాస్క్ ధరించిన వారినే పోలింగ్ కేంద్రంలోనికి అనుమతించారు.
కౌంటింగ్‌కు ఏర్పాట్లు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ఈ నెల 17వ తేదీన మొదలు కానుంది. గుంటూరు నగరంలోని ఏసీ కళాశాలలో కౌంటింగ్ చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా అధికారులు మొదలుపెట్టారు. పోలైన ఓట్లు 12,554 అయినా బరిలో 19 మంది అభ్యర్థులు ఉన్నారు. ఏ ఒక్కరికీ మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చే అవకాశం లేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా తప్పనసరి అయ్యే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో ఓట్ల లెక్కింపునకు సమయం ఎక్కువగా పట్టే అవకాశం ఉంది.
గెలుపు ఎవరి తలుపు తడుతుందో...
పోలింగ్ 92.95 శాతం నమోదవడంతో అభ్యర్థుల్లో గుబులు పట్టుకుంది. గెలుపు ఎవరి తలుపు తడుతుందని లెక్కలు వేసుకోవడంలో అభ్యర్థులు, వారి అనుచరులు తలమునకలయ్యారు. బరిలో 19 మంది అభ్యర్థులు ఉండటంతో ఓట్లు చీలి ప్రథమ ప్రాధాన్యత ఓట్లతో గెలిచే పరిస్థితి కనిపించటం లేదు. రెండో ప్రాధాన్యత ఓట్లు ఎవరికి పడ్డాయో అన్న దానిపైనే విజయం ఆధారపడి ఉంది.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా కుక్కునూరు, కొవ్వూరు, ఏలూరు, నరసాపురం డివిజన్లలో 49 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 7,765 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా 92.14 శాతం పోలింగ్ నమోదైంది. 7,155 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో 4,365 మంది పురుష ఓటర్లు, 2,790 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఏలూరులో జరిగిన ఎన్నికలను ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు పరిశీలించారు.
కుక్కునూరు కేంద్రంలో కేవలం ముగ్గురు ఓటర్లు మాత్రమే ఉండగా వారిలో ఇద్దరు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. వేలేరుపాడులో ఆరుగురు ఓటర్లు ఉండగా అందరూ ఓటు వేశారు. డివిజన్ల వారీగా చూస్తే జంగారెడ్డిగూడెం డివిజన్‌లో 91.43 శాతంతో 800 మంది, కొవ్వూరు డివిజన్‌లో 94.73 శాతంతో 1,636 మంది, ఏలూరు డివిజన్‌లో 89.51 శాతంతో 2,388 మంది, నరసాపురం డివిజన్‌లో 93.44 శాతంతో 2,323 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న షేక్ సాబ్జి ఏలూరులోని సెయింట్ గ్జేవియర్ స్కూల్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
పోలింగ్‌కు పటిష్ట భద్రత
ఏలూరు టౌన్: ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని ఏలూరు రేంజ్ డీఐజీ కేవీ మోహనరావు చెప్పారు. ఏలూరులోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. బందోబస్తు, పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. డీఐజీ మోహనరావుతో పాటు ఏలూరు డీఎస్పీ డాక్టర్ దిలీప్ కిరణ్, ఏలూరు వన్‌టౌన్ సీఐ వైబీ రాజాజీ, టూటౌన్ సీఐ బోనం ఆదిప్రసాద్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment