రాజధాని కృష్ణా-గుంటూరు మధ్యే
ఏపీ రాజధాని సలహా కమిటీ చైర్మన్ నారాయణ వ్యాఖ్య
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి కృష్ణా- గుంటూరు జిల్లాల మధ్య ప్రాంతం అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని శివరామకృష్ణన్ కమిటీకి వివరించినట్టు రాజధాని ఏర్పాటు సలహా కమిటీ చైర్మన్, ఏపీ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి.నారాయణ వెల్లడించారు. కృష్ణా- గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాలకు సమాన దూరంలో ఉండడంతోపాటు నీటి వసతి, విమానా శ్రయాలు, రైలు, రోడ్డు సదుపాయాలు అందుబాటులో ఉంటాయని వారికి వివరించామన్నారు. రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై వచ్చే నెలాఖరున శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కమిటీని మరోమారు కోరినట్టు ఆయన తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్న అంశాలతోపాటు రాజధాని ఏర్పాటునకు స్థానికంగా సానుకూలంగా ఉన్న అంశాలను రాష్ట్రప్రభుత్వం తరఫున వారికి వివరించినట్టు చెప్పారు. ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావుతో కలిసి ఆయన మంగళవారం ఉదయం ఢిల్లీలో శివరామకృష్ణన్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. అనంతరం ఏపీభవన్‌లోని గురజాడ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయనేం చెప్పారంటే...
వచ్చే నెల ఆఖరున శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో బిల్లులో పేర్కొన్న అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారా లేదా అని విషయంపై చర్చించేందుకు వారికి కలిశాం. కృష్ణా-గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పాటు చేస్తే ఉత్తరకోస్తా, రాయలసీమ జిల్లాలకు సమాన దూరంలో ఉంటుందని చెప్పాం. నీటి వసతి, ఎయిర్‌పోర్టులు, రైలు, రోడ్డు సదుపాయాలు, అన్ని జిల్లాలకు అందుబాటులో ఉంటుందని కమిటీ దృష్టికి తెచ్చాం. ఈనెల 26న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మరోసారి సమావేశమయ్యాక కమిటీ తుది నివేదికను సమర్పిస్తుంది.
రాజధాని ఎక్కడన్న అంశంపై తుది నిర్ణయం తీసుకునే ముందు బిల్లులో పేర్కొన్నట్టు రాష్ట్రానికి ఇచ్చిన 11 జాతీయ సంస్థలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందన్న అంశాలను కమిటీకి వివరించాం. విజయనగరంలో ట్రైబల్ యూనివర్సిటీ, కాకినాడలో పెట్రోలియం యూనివర్సిటీ, విశాఖపట్నంలో ఐఐఎం, 13 జిల్లాలకు మధ్యలో ఉండేలా ఎయిమ్స్‌ను, ఐఐటీని తిరుపతిలో, అనంతపురం- కర్నూలు మధ్యలో ఐఐఐటీ, కర్నూలులో ఎన్‌ఐటీ, విజయవాడలో సెంట్రల్ యూనివర్సిటీ, వెస్ట్ గోదావరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టాలని రాష్ట్రప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించిన అంశాలను శివరామకృష్ణన్ కమిటీ దృష్టికి తెచ్చాం.
రాజధాని నిర్మాణానికి మా కమిటీ పనిచేస్తుంది
- రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్నదానిపై శివరామకృష్ణన్‌కమిటీ తుది నివేదిక సమర్పించిన తర్వాత రాజధాని నిర్మాణంలో ఏయే చర్యలు తీసుకోవాలన్నదానిపై రాజధాని ఏర్పాటు సలహా కమిటీ పనిచేస్తుంది. ప్రపంచస్థాయి రాజధాని నగరాన్ని నిర్మించేందుకు మా కమిటీ పనిచేస్తుంది. ఇది కాకుండా త్వరలోనే సాంకేతిక నిపుణులతో మరో కమిటీని ఏర్పాటు చేయనున్నాం. రాజధాని నగరం ఏర్పాటు అవసరమైన భూమి సేకరణకు మూడు నెలలు, మౌలిక వసతుల కల్పనకు ఆరు నెలల సమయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం.
- 13 జిల్లాల ప్రజలకు సౌలభ్యంగా ఉండేలా రాజధాని ఏర్పాటు చేయాలని కోరినట్టు ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌రావు తెలిపారు. అదేవిధంగా కమిటీలతో సంబంధం లేకుండా రాజధాని నిర్మాణానికి అవసరమైన సలహాలు ఎవరైనా ఇవ్వొచ్చని ఆయన చెప్పారు.