సాక్షి, హైదరాబాద్: శాసన మండలి పట్టభద్రుల స్థానం ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉంటోంది. గతంలో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈ సారి పార్టీ తరుఫున అభ్యర్థిని పోటీలో పెట్టకూడదని నిర్ణయించింది. పోటీలో ఉండే స్వతంత్ర అభ్యర్థుల్లో ఒకరికి మద్దతు ఇవ్వనుంది. పోలింగ్‌కు రెండుమూడు రోజుల ముందు ఈ మేరకు ప్రకటన చేయాలని భావిస్తోంది. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరుఫున ఎవరినీ బరిలో దింపకూడదని టీఆర్‌ఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పట్టభద్రుల స్థానం విషయంలోనూ ఇదే నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమ కాలంలో, రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ప్రతి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు దూరంగా ఉండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పదవీకాలం ముగియడంతో కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు... వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 5న నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. మార్చి 22న పోలింగ్, 26న ఫలితాలను వెల్లడించనున్నారు.
తొలిసారి దూరం...
రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైన టీఆర్‌ఎస్ విద్యావంతుల్లో తెలంగాణ భావజాలాన్ని పెంచే ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనమండలిని 2007లో పునరుద్ధరించారు. అప్పటి నుంచి ప్రతి పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ పోటీ చేసింది. ఒక్క హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో మినహా అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ వరుసగా గెలిచింది. ఉద్యమ సమయంలో రాజీనామాలతో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015లో జరిగిన వరంగల్, నల్లగొండ, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ ఆ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి గెలిచారు. కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఇప్పటి వరకు మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. అన్నిసార్లు టీఆర్‌ఎస్ విజయం సాధించింది. ఇలాంటి స్థానంలో టీఆర్‌ఎస్ పోటీకి దూరంగా ఉండటంపై అధికార పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీఆర్‌ఎస్ అధికారిక అభ్యర్థిని బరిలో దించకున్నా... స్వతంత్రుల్లో ఒకరికి మద్దతు తెలపాలని నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఉద్యోగుల సంఘం నేతకు టీఆర్‌ఎస్ మద్దతు తెలిపే అవకాశం ఉంది.
5న మామిండ్ల నామినేషన్...
టీఆర్‌ఎస్ టికెట్ ఆశించిన గ్రూప్‌ృ1 అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిండ్ల చంద్రశేఖర్‌గౌడ్ ఈ నెల 5న పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. రవాణా శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పని చేస్తున్న చంద్రశేఖర్‌గౌడ్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ కోసం ప్రభుత్వ ఉద్యోగానికి శనివారం రాజీనామా చేశారు. చంద్రశేఖర్ రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది.
Comments
Please login to add a commentAdd a comment