సాక్షి, హైదరాబాద్/ నెట్‌వర్క్: స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరిగిన ఆరు శాసనమండలి స్థానాలను టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో దండె విఠల్ (ఆదిలాబాద్), ఎల్.రమణ, టి.భానుప్రసాద్‌రావు (కరీంనగర్), తాతా మధు (ఖమ్మం), ఎంసీ కోటిరెడ్డి (నల్లగొండ), డాక్టర్ యాదవరెడ్డి (మెదక్) గెలుపొందారు. అన్నిచోట్ల కలిపి మొత్తంగా 5,035 ఓట్లు చెల్లుబాటుకాగా.. టీఆర్‌ఎస్ అభ్యర్థులకే 77.19శాతం ఓట్లు వచ్చాయి. ఉమ్మడి మెదక్, ఖమ్మంలలో కాంగ్రెస్ అభ్యర్థులు.. కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో స్వతంత్ర అభ్యర్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు.
ఖమ్మం మినహా అన్నిచోట్లా ఇతర పార్టీల ఓటర్లు కూడా టీఆర్‌ఎస్‌కు ఓటేసినట్టు సంబంధిత జిల్లాల మంత్రులు ప్రకటించారు. ఖమ్మంలో మాత్రం టీఆర్‌ఎస్ ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి పడ్డాయి. దీనిపై అంతర్గతంగా సమీక్షిస్తామని, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఎమ్మెల్సీగా గెలుపొందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి తాతా మధు ప్రకటించారు.
ఇదివరకే ఆరు ఏకగ్రీవం
రాష్ట్రంలో జనవరి 4న ఖాళీకాబోయే 12 ‘స్థానిక’కోటా ఎమ్మెల్సీ స్థానాలకు గత నెల 16న నోటిఫికేషన్ వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే కల్వకుంట్ల కవిత (నిజామాబాద్), పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (వరంగల్), శంభీపూర్ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి (రంగారెడ్డి), కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా ఆరు సీట్లకు ఈ నెల 10న పోలింగ్ నిర్వహించగా.. మంగళవారం ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడించారు.
క్యాంపుల మధ్య!
కాంగ్రెస్‌తోపాటు బలమైన స్వతంత్ర అభ్యర్థి బరిలో ఉన్న స్థానాలకు సంబంధించి టీఆర్‌ఎస్ క్యాంపులు నిర్వహించింది. నామినేషన్ల ప్రక్రియ ముగియగానే కరీంనగర్, మెదక్, ఖమ్మం స్థానాలకు చెందిన టీఆర్‌ఎస్ ఓటర్లను ఢిల్లీ, బెంగుళూరు, గోవాలలో క్యాంపులకు తరలించింది. ఇందులో మెదక్, ఖమ్మంలలో కాంగ్రెస్ అభ్యర్థులు రంగంలో ఉండగా.. కరీంనగర్‌లో టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ బరిలో నిలిచారు. టీఆర్‌ఎస్ ఓటర్లను కాపాడుకోగలిగిందని.. ఆరుచోట్లా తొలి ప్రాధాన్యత ఓటుతో గెలవడం సంతృప్తికరమని టీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
♦ ఆదిలాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్ధి దండె విఠల్‌కు 742 ఓట్లు.. స్వతంత్ర అభ్యర్థి పుష్పరాణికి 75 ఓట్లు వచ్చాయి.
♦కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్‌రావుకు 585 ఓట్లు, ఎల్.రమణకు 479 ఓట్లురాగా.. స్వతంత్ర అభ్యర్థి సర్దార్ రవీందర్‌సింగ్ 232 ఓట్లు సాధించారు. కరీంనగర్‌లో ఏకగ్రీవం కావాల్సి ఉన్నా కొందరు కడుపు మంట, అక్రమ పొత్తుతో ఎన్నికదాకా తెచ్చారని.. ఈటల రాజేందర్ పాచిక పారలేదని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. అయితే ఈ స్థాయిలో ఓట్లు సాధించడం అంటే తాను నైతికంగా విజయం సాధించినట్టేనని రవీందర్‌సింగ్ చెప్పారు.
♦ మెదక్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి యాదవరెడ్డికి 762 ఓట్లురాగా, కాంగ్రెస్ అభ్యర్థి నిర్మల జగ్గారెడ్డికి 238 ఓట్లు, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డికి ఆరు ఓట్లు పోలయ్యాయి.
♦ నల్లగొండలో టీఆర్‌ఎస్ అభ్యర్థి కోటిరెడ్డికి 917 ఓట్లు, రెండో స్థానంలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థి కుడుదుల నగేశ్‌కు 226 ఓట్లు వచ్చాయి.
♦ ఖమ్మంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి తాతా మధుకు 480 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రాయల నాగేశ్వర్‌రావుకు 242 ఓట్లు వచ్చాయి. ఇక్కడ టీఆర్‌ఎస్‌కు 530కిపైగా ఓట్లు ఉండగా.. 34 మంది ప్రజాప్రతినిధులున్న సీపీఐ మద్దతివ్వడంతో 564 ఓట్లకుపైగా వస్తాయని భావించారు. కానీ క్రాస్ ఓటింగ్ జరిగి.. 116 మంది స్థానిక ప్రజాప్రతినిధులున్న కాంగ్రెస్‌కు 242 ఓట్లు వచ్చాయి. ఇది తమ నైతిక విజయమని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.
♦ స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన సుధారాణి (ఖమ్మం), ఇనుముల సత్యనారాయణ, రమేశ్, గంగాధర్ (కరీంనగర్) సైదులు (నల్లగొండ) ఒక్క ఓటు కూడా సాధించలేక పోయారు.
తెలంగాణ భవన్‌లో సంబరాలు..
‘స్థానిక’కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేయడంతో మంగళవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో సంబరాలు జరుపుకొన్నారు. గులాబీ రంగు చల్లుకుని, బాణసంచా కాల్చి.. మిఠాయిలు పంచుకున్నారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, పలువురు నేతలు ఈ సంబరాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ విజయాల పరంపర కొనసాగుతోందని, కేసీఆర్ పథకాలే విజయాలకు కారణమని తలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రతిపక్షాల ఓట్లు కూడా టీఆర్‌ఎస్ అభ్యర్థులకు పడ్డాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు.
టీఆర్‌ఎస్‌కు తిరుగులేదని తేలింది: హరీశ్
ఎమ్మెల్సీలుగా గెలుపొందిన వారిని మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు అభినందించారు. ముఖ్యమంత్రి ఊహించిన విధంగానే ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చాయని, కాంగ్రెస్ జిమ్మిక్కులు, ప్రలోభాలు పనిచేయలేదని మంత్రి హరీశ్‌రావు అన్నారు. టీఆర్‌ఎస్ తిరుగులేని రాజకీయ శక్తిగా మరోమారు రుజువైందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. వీరితోపాటు మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీలు కవిత, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తదితరులు ‘కొత్త ఎమ్మెల్సీ’లను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment