పార్టీ స్థాపనకు ఏడాది ముందు... | Sakshi Guest Column On TRS Party establishment by KCR in Telangana | Sakshi

పార్టీ స్థాపనకు ఏడాది ముందు...

Apr 27 2025 12:22 AM | Updated on Apr 27 2025 12:22 AM

Sakshi Guest Column On TRS Party establishment by KCR in Telangana

2001 ఏప్రిల్‌ 27న పార్టీ ఆవిర్భావాన్ని ప్రకటిస్తున్న కేసీఆర్‌

సందర్భం

టీఆర్‌ఎస్‌ ఆవిర్భవించే సమయంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ లక్ష్య శుద్ధితో విజయం సాధించాలని కేసీఆర్‌ పార్టీని స్థాపించారు. ఆనాడు తెలుగుదేశం, కాంగ్రెస్‌ రెండు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాలు. వీరికి ధన బలంతో పాటు ప్రసార మాధ్యమాల తోడు ఉంది. ఒక్క అంశం అనుకూలంగా లేని, చుట్టూ గాఢాంధకారం అలుముకున్న ప్రతికూల పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు సాహసోపేతం. ఈ సాహసం ఒక్క కేసీఆర్‌కే చెల్లు.

విస్తృత చర్చలు– సంతృప్తికర వివరణలు
తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ స్థాపనకు ఒక సంవత్సరం ముందు నుండే సన్నాహాలు, చర్చలు ప్రారంభమయ్యాయి.   పార్టీ పేరు, జెండా, కండువా 2000 లోనే నిర్ణయమైనాయి. తెలుగుదేశం పార్టీ స్థాపించబడిన నాటి పరిస్థితుల సమీక్ష జరిగింది. కాంగ్రెస్‌పై ఉన్న వ్యతిరేకతను, తనపై ఉన్న అభిమానాన్ని ఓట్లుగా మల్చుకొని కేవలం 9 మాసాల కాలంలోనే ఎన్టీయార్‌ అధికారం చేపట్టిన విషయం ప్రస్తావనకొచ్చింది.

పార్టీ పెట్టాలనుకునే విషయం తెలిసి తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష దీపాన్ని ఆరిపోకుండా అప్పటివరకు కాపాడుతున్న సంఘాలు... తెలంగాణ జన సభ, తెలంగాణ మహా సభ, తెలంగాణ ఐక్య వేదిక, తెలంగాణ ప్రజా సమితి, తెలంగాణ ప్రజా పార్టీ, తెలంగాణ స్టూడెంట్స్‌ యూనియన్, తెలంగాణ లాయర్స్‌ అసోసియేషన్, తెలంగాణ టీచర్స్‌ ఫెడరేషన్, తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్, తెలంగాణ స్టడీ ఫోరం, సెంటర్‌ ఫర్‌ తెలంగాణ స్టడీస్, తెలంగాణ డెవలప్మెంట్‌ ఫోరం, తెలంగాణ జన పరిషత్, తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్, తెలంగాణ సాంస్కృతిక వేదిక, తెలంగాణ జన సంఘటనలకు చెందిన కొందరు వచ్చి చర్చించడం, తమ అభిప్రాయాలను వెలిబుచ్చడం జరిగింది. మరికొందరిని కేసీఆరే స్వయంగా ఆహ్వానించి చర్చించారు. 

తెలంగాణలోని ప్రముఖుల వివరాలను సేకరించి, సందర్భానుసారంగా వారితోనూ కేసీఆర్‌ చర్చలు జరిపారు. వారిలో దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు, వైస్‌ ఛాన్స్‌లర్లు నవనీత రావు, ఆర్వీయార్‌ చంద్రశేఖర్‌ రావు, జయశంకర్, జస్టిస్‌ సీతారాం రెడ్డి, గౌరవ నిఖిలేశ్వర్, ‘ప్రెస్‌ అకాడమీ’ పొత్తూరి వెంకటేశ్వరరావు, జస్టిస్‌ భాస్కర్‌ రావు, ప్రొఫెసర్లు మధుసూదన్‌ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, కోదండరాం రెడ్డి, సింహాద్రి, బియ్యాల జనార్ధన రావు, కంచె ఐలయ్య, కేశవరావు జాదవ్, జల సాధన సమితి దుశర్ల సత్యనారాయణ, సీనియర్‌ జర్నలిస్టు పాశం యాదగిరి, తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ప్రభాకర్, ప్రజ్ఞా మ్యాగజైన్‌ కెప్టెన్‌ పాండురంగ రెడ్డి తదితరులున్నారు. వీరిలో చాలామందితో సంప్రదింపులు జరిపి, వారి సూచనలు స్వీకరించారు.

తెలంగాణ మేధావులు, విద్యావంతులు, యువకులు, కవులు, కళాకారులతో చర్చలు సాగిస్తూనే, మరొవైపు తెలంగాణ రాష్ట్ర సాధన విషయంలో తన వద్దకు వచ్చేవారి సందేహాలన్నిటికీ సవివరమైన, సంతృప్తికరమైన వివరణ ఇచ్చి, అప్పటివరకు అపనమ్మకం ఉన్నవారిలో సంపూర్ణ విశ్వాసం పెంచేవారు. వివిధ పార్టీలలో పనిచేసే నాయకులు ఎవరికి వారుగా కేసీఆర్‌ను కలిసి, చర్చించి, అనుమానాలు నివృత్తి చేసుకున్న తర్వాత కలిసి పనిచేయడానికి సంసిద్ధత చెప్పేవారు. 

ఇటువంటి వారిలో కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు, దేశిని చిన్న మల్లయ్య, నాయిని నర్సింహారెడ్డి లాంటి పెద్దలు ఉన్నారు. ఒకానొక సందర్భంలో లక్ష్మీకాంతరావు ‘తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనా? ఎలా సాధ్యమవుతుంది?’ అని సంశయం వ్యక్తం చేయగా, కేసీఆర్‌ ఇచ్చిన సుదీర్ఘ వివరణ అనంతరం, ‘తెలంగాణ సిద్ధించిందనే భావన మీ జవాబుతో నాకు కలిగింది. ఇక నుండి ఎప్పుడు ఈ విషయంలో అనుమానం వ్యక్తం చేయను, వివరణ కోరను. తెలంగాణ సాకారం అయ్యేంత వరకు మీతోనే నా పయనం’ అని ఉద్విగ్నుడయ్యారు. 

స్టేట్‌ ఫైట్‌– స్ట్రీట్‌ ఫైట్‌ కాదు!
వివిధ రాజకీయ పార్టీల నాయకుల, కార్యకర్తల తాకిడి రోజురోజుకు పెరుగుతూ రేయింబవళ్ళు చర్చోపచర్చలు సాగేవి. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే చర్చలు మధ్యరాత్రి వరకు జరిగేవి. కొన్ని సందర్భాల్లో తెల్లవారు వరకు ఈ చర్చలు జరిగేవి. ఒకరిద్దరు ఉన్నా, పది మంది ఉన్నా, వందలాది మందిలో ఉన్నా కేసీఆర్‌ నాలుగైదు గంటలు నిరాఘాటంగా తెలంగాణ ఉద్యమం సాగించే క్రమాన్ని సోదాహరణలతో సహా వివరించేవారు. వారు లేవనెత్తిన సంశయాలకు సంతృప్తికర సమాధానం ఇచ్చి, వచ్చిన వారిలో అత్యధికులను ఉద్యమ కార్యోన్ముఖులను చేసేవారు. 

ఒకట్రెండు సందర్భాల్లో ఉద్యమం ఆవేశభరితంగా, ఆందోళన పథంలో సాగాలని అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేయగా... ఇది స్టేట్‌ ఫైట్, స్ట్రీట్‌ ఫైట్‌ కాదనీ; లక్ష్యం సాధించే వరకు సుదీర్ఘ పోరాటానికి సమాయత్తం కావాలనీ; పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి భావవ్యాప్తిని సాగించి, ప్రజలను సమీకరించి, శక్తిగా మలిచి, ఎన్నికల్లో గెలిచి, గాంధీజీ ప్రబోధించిన అహింసా మార్గంలోనే రాష్ట్రం సాధించాలనీ; ఒక ప్రాంతానికి న్యాయం జరగాలని చేసే ఈ ప్రయత్నంలో ఇంకొక ప్రాంతం వారికి ఇబ్బందులు కలిగించడం వాంఛనీయం కాదనీ; తాను శాంతియుత పంథాలో మాత్రమే పయనిస్తాననీ కరాఖండిగా చెప్పేవారు. ఈ విధానం నచ్చని కొందరు మళ్ళీ వచ్చేవారు కాదు. 

సంకీర్ణాల్లో ఒక్క ఓటైనా విలువే!
2000వ సంవత్సరంలో తెరాస పార్టీని స్థాపించవలెననే చర్చలు సాగుతున్న తరుణంలో దేశ రాజకీయ చిత్రపటం అనుకూలంగా ఉందా లేదా అనే సమీక్ష కూడా జరిగింది. కారణం గతంలోని చేదు అనుభవం. అయితే 1969 – 71 నాటి రాజకీయ పరిస్థితులకు పూర్తి భిన్నమైన పరిస్థితులు అప్పుడు నెలకొన్నాయి. ఒకప్పుడు ఇందిరా గాంధీ భారీ మెజారిటీతో ఏక పార్టీ పాలన సాగింది. తదనంతరం కొన్ని దశాబ్దాలు తక్కువ మెజారిటీతో ఏక పార్టీ పాలన, అటుపిమ్మట సంకీర్ణ ప్రభుత్వాల కాలం సాగుతోంది. 

సంకీర్ణ యుగం రాష్ట్రం సాధించుకోవడానికి అనువైనదిగా తేలింది. 1999వ సంవత్సరంలో అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రధానమంత్రిగా ఒక్క ఓటు తేడాతో విశ్వాస పరీక్షను కోల్పోయి ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. లోక్‌సభలో ఒక సభ్యుడి ఓటు కూడా అత్యంత కీలకంగా మారిన ఈ పరిణామం ప్రస్తావనకు వచ్చింది. అంటే సంకీర్ణాల యుగంలో మూడు, నాలుగు లోక్‌సభ స్థానాలతో కూడా జాతీయ రాజకీయాల్లో ప్రభావవంతమైన పాత్ర పోషించవచ్చని తేలింది. 

1971 లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజా సమితిని 14 స్థానాల్లో పదింట గెలిపించారు. టీఆర్‌ఎస్‌ చిత్తశుద్ధి, నిబద్ధతతో ఉద్యమాన్ని నడిపి ప్రజా విశ్వాసాన్ని పొందగలిగితే, కచ్చితంగా లోక్‌సభకు చెప్పుకోదగిన సంఖ్యకు ప్రతినిధులను తెలంగాణ ప్రజలు తప్పక గెలిపిస్తారనే నమ్మకం కలిగింది. 10 మంది లోక్‌సభ సభ్యులున్నప్పటికీ 1971లో తెలంగాణ రాష్ట్రం సాధించబడక పోవడానికి బలమైన కారణం లోక్‌సభలో ఇందిరా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్‌ పార్టీకి తిరుగులేని సంఖ్యా బలం ఉండటమే. నాడు అధికార బలంతో కాంగ్రెస్‌ తెలంగాణ ప్రజా సమితి సభ్యులను విలీనపర్చుకుంది. కానీ దానికి భిన్నంగా నేడు సంకీర్ణాలే శరణ్యం కాబట్టి పార్లమెంట్‌లో కనీస ప్రాతినిధ్యంతో ఒత్తిడి ద్వారా రాష్ట్రాన్ని సాధించవచ్చని నమ్మకం కుదిరింది. 

తెలంగాణ రాష్ట్రం సాధ్యమేనని సంపూర్ణ విశ్వాసం కలిగిన కేసీఆర్‌... శాసన సభ్యత్వానికి, డిప్యుటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రజలను ఆలోచింపజేసి, ఆశలు రేకెత్తించి విశ్వాస బీజాలు నాటారు. ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో జలదృశ్యం కేంద్రంగా 2001 ఏప్రిల్‌ 27న పార్టీ జెండా ఎగురవేయబడింది. పదవీ త్యాగంతో పార్టీ స్థాపించారు, ప్రాణ త్యాగానికి సిద్ధమై తెలంగాణ రాష్ట్రం సాధించారు. 
వ్యాసకర్త బీఆర్‌ఎస్‌ వ్యవస్థాపక సభ్యులు, తెలంగాణ శాసన మండలిలో ప్రతిపక్ష నేత

సిరికొండ మధుసూదనాచారి 
(బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవాల సందర్భంగా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement