Madhusudhana Chary
-
కేటీఆర్ పర్యటనలో మాజీ స్పీకర్ మదుసుదనాచారికి చేదు అనుభవం!
గణపురం: మంత్రి కేటీఆర్ గణపురం మండల పర్యటనలో మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసుదనాచారికి చేదు అనుభవం ఎదురైంది. కేటీఆర్‌కు స్వాగతం పలికేందుకు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న క్రమంలో గణపురం ప్రధాన రోడ్డుపై ఆయన వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తాను మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసుదనాచారిని అని తెలపడంతో ఆయన వాహనాన్ని వదిలిపెట్టారు. కానీ ఆయన వెంట వచ్చే నాయకుల వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన సిరికొండ వాహనంలో నుంచి దిగి వచ్చి నన్ను, నా వెంట వచ్చే నేతలను అడ్డుకుంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు వాహనాన్ని హెలిప్యాడ్ వద్దకు వెళ్లేందుకు అనుమతిచ్చారు. అక్కడ నుంచి హెలిప్యాడ్ వద్ద పోలీసులు ఏర్పాటు చేసిన మరో బందోబస్తు వద్ద కూడా సిరికొండ వాహనాన్ని నిలిపి ఆయన అధికార పీఏను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో కావాలనే సిరికొండను అడుగడుగునా అవమానించారని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్సీ కవిత పర్యటనలో టీబీజీకేఎస్ భవన నిర్మాణ శంకుస్థాపన శిలాఫలకంలో సిరికొండ పేరు లేకపోవడం ఆయన వర్గీయులను ఆగ్రహానికి గురిచేసింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే గండ్ర వ్యవహారంపై అసంతృప్తితో ఉన్నారు. ఈక్రమంలో కవిత సమక్షంలోనే సిరికొండ, గండ్ర వర్గీయులు పోటా పోటీగా నినాదాలు చేసుకున్నారు. కాగా.. కేటీఆర్ పర్యటనలో సిరికొండ వాహనాన్ని పోలీసులు తెలియక అడ్డుకున్నారా? లేక గండ్ర ఆదిపత్య పోరు కోసం చేయించారా? అని సిరికొండ వర్గీయులు, ప్రజలు చర్చింకుంటున్నారు. అంతటా వర్గపోరే.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ పర్యటనలో ఆసాంతం బీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు కనిపించింది. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గీయులు నినాదాలతో హోరెత్తించారు. డబుల్ బెడ్ రూంల ప్రారంభోత్సవం, బహిరంగ సభ వద్ద జై సిరికొండ, చారి సాబ్ జిందాబాద్ అంటూ కొందరు నినాదాలు చేయగా.. మరికొందరు జై గండ్ర జైజై గండ్ర అంటూ నినదించారు. బహిరంగ సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతున్న సమయంలో అభిమానులు చాలామంది జై సిరికొండ అంటూ నినాదాలు చేయడంతో.. ‘మీకు దండం పెడతా, ఆపండి.. ఇది మన కార్యక్రమం, సజావుగా జరగనివ్వండి’ అని మంత్రి కోరారు. ఇదిలా ఉండగా సభలో కూర్చున్న పలువురు ‘భూకబ్జాదారులు.. ఎమ్మెల్యే అనుచరులు’ అంటూ నినాదాలు చేశారు. -
కవిత సమక్షంలోనే కస్సుబుస్సు.. ‘రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానే..’
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లిలో అధికార పార్టీ నాయకులు బజారున పడ్డారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు మంత్రి సత్యవతి రాథోడ్, సీఎం కేసిఆర్ తనయ ఎమ్మెల్సీ కవిత సమక్షంలోనే బహిర్గతమయ్యాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవనం ప్రారంబోత్సవానికి హాజరైన మంత్రి సత్యవతి, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి బలప్రదర్శనకు దిగారు. రాబోయే కాలానికి కాబోయే ఎమ్మెల్యేను తానేనని చాటిచెప్పేందుకు ఇదదరూ తీవ్రంగా ప్రయత్నించారు. అనుచరగణాన్ని రెచ్చగొట్టి వారిమధ్య ఉన్న వైరాన్ని బహిర్గతం చేసుకున్నారు. పార్టీ శ్రేణులను ఆయోమయానికి గురిచేశారు. ఎవరి గోల వారిదే బిఆర్ఎస్కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘ భవన శిలాఫలకం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోసింది. శిలాఫలకంపై ఎమ్మెల్సీ మదుసూధనాచారి, జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి పేరు లేకపోవడంతో వారిద్దరి అనుచరులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా ఎమ్మెల్సీ చారికి, జడ్పీ చైర్మన్ శ్రీహర్షిణికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానపరుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తామేమి తక్కువ కాదన్నట్లు గండ్ర అనుచరులు సైతం నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంత ఇరువర్గాల నినాదాలు, గోలతో కార్మికసంఘ భవనం వర్గపోరుకు వేదికలా మారిపోయింది. వేదికపై ఉన్న మంత్రి సత్యవతి రాథోడ్, కేసిఆర్ తనయ కవిత అవాక్కయ్యారు. ఘర్షణ పడుతున్నవారిని వారించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. నివురు గప్పిన నిప్పు వాస్తవానికి భూపాలపల్లిలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి రాజకీయ ప్రత్యర్థులు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన గండ్ర అధికార పార్టీ అభ్యర్థి మధుసూదనాచారిపై ఘన విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌కు చేయిచ్చి కేసిఆర్ సమక్షంలో కారెక్కారు గండ్ర వెంకటరమణారెడ్డి. రాజకీయ ప్రత్యర్థులిద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీలో ఉన్నప్పటికీ అంతర్గత విబేధాలు మాత్రం అలానే ఉన్నాయి. గులాబీ దళపతి ఎవ్వరిని తక్కువ చేయకుండా ఓడిపోయిన మధుసూదనాచారికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన ప్రాధాన్యత కల్పించారు. ఇంతకాలం నివురుగప్పిన నిప్పులా ఉన్న విబేధాలు ఎమ్మెల్సీ కవిత, మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో బయటపడడం పార్టీలో కలకలం సృష్టించింది. వీరి గొడవ పార్టీ శ్రేణులను అయోమయానికి గురిచేసింది. కారులో అసంతృప్తి ఎమ్మెల్యే గండ్ర మీద జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి సైతం అసంతృప్తితో రగిలిపోతున్నారు. తనను భూపాలపల్లికి చెందిన పార్టీ నేతలు, అధికారులు పట్టించుకోవడంలేదని ఆమె బాహాటంగానే విమర్శలు చేశారు. భూపాలపల్లికి జడ్పీ చైర్ పర్సన్ శ్రీహర్షిణి అయితే వరంగల్ జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతికి భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చి స్థానికులకు ప్రాధాన్యత లేకుండా చేశారనే ప్రచారం జరుగుతోంది. పెద్దపల్లి జడ్పీ చైర్మన్, మంథని నియోజకవర్గ ఇంఛార్జీ పుట్ట మధు అనుచరురాలుగా ముద్రపడ్డ శ్రీహర్షిణికి భూపాలపల్లిలో తగిన ప్రాధాన్యత లభించడం లేదనే చర్చ సాగుతోంది. భూపాలపల్లి బీఆర్ఎస్లో విబేధాలకు రాబోయే ఎన్నికలే కారణంగా జనం భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గండ్ర బిఆర్ఎస్ నుంచి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్దమవుతుండగా ఎమ్మెల్సీ చారి సైతం ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తున్నారు. అందులో భాగంగానే ఒకరిపై మరొకరిపై చేయి సాధించేందుకు పోరు సాగిస్తున్నారట. ఇప్పటికే సిట్టింగ్‌లకే టిక్కెట్ ఇస్తామని గులాబీ దళపతి ప్రకటించడంతో ఎమ్మెల్యే పై ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుని టిక్కెట్ పొందే పనిలో చారి ఉన్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గండ్ర వెంకటరమణారెడ్డి సైతం ఎట్టి పరిస్థితుల్లోనూ తన కుటుంబం నుంచి భూపాలపల్లి చేజారిపోకుండా అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ తనకు టిక్కెట్ ఇవ్వకపోతే...తన భార్య గండ్ర జ్యోతిని బరిలో నిలిపేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కవిత సమక్షంలో బయటపడ్డ బీఆర్ఎస్ వర్గపోరు
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: జిల్లాలో బీఆర్ఎస్ కీలక నేతలు విబేధాలతో రచ్చకెక్కారు. మధుసూదనాచారి, గండ్ర మధ్య ఆధిపత్య పోరు కీలక నేతల సాక్షిగా బయటపడింది. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత పర్యటనలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో.. కార్మిక సంఘం భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అయితే.. జిల్లాకు చెందిన నేతలు మధుసూదనాచారి, గండ్ర వెంకటరమణరెడ్డిలు బలప్రదర్శనలు దిగారు. ఈ క్రమంలో శిలాఫలకం మీద మధుసూదనాచారి పేరు లేదని ఆయన వర్గీయులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈలోపు గండ్ర వర్గీయులు అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాలు పోటాపోటీ నినాదాలకు దిగాయి. ఆపై తోపులాటకు దిగాయి. దీంతో పోలీసులు, ఇతర నేతలు జోక్యం చేసుకుని పరిస్థితి సరిదిద్దే యత్నం చేశారు. -
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్.. మాజీ స్పీకర్ VS సిట్టింగ్ ఎమ్మెల్యే
గులాబీ కోటలో భూపాలపల్లి ఫైట్ మొదలైందా? మాజీ స్పీకర్‌కు, సిట్టింగ్ ఎమ్మెల్యేకు మధ్య పోరు షురూ అయిందా? టీఆర్ఎస్ నాయకత్వం ఎవరికి మద్దతిస్తోంది? భూపాలపల్లిలో అధికార పార్టీ తరపున పరీక్ష రాసేదెవరు? సీటు రానివారి పరిస్థితి ఏంటి? జయశంకర్ భూపాలపల్లిలోని ఏకైక అసెంబ్లీ నియోజకవర్గం భూపాలపల్లిలో అధికార పార్టీలో సెగలు మొదలయ్యాయి. అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ఎమ్మెల్సీ మధుసూదనాచారి, సిటింగ్ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మధ్య సీటు కోసం పంచాయతీ అక్కడి రాజకీయాల్ని వేడెక్కిస్తున్నాయి. ఎమ్మెల్సి మధుసూదనాచారి పుట్టినరోజు వేడుకలు ఇటీవల ఘనంగా జరిగాయి. సారు రావాలి.. మీరు కావాలి అంటూ ఆయన అనుచరులు, అధికార పార్టీ నేతలు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు జరపడం వెనుక మతలబేంటని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. మధుసూదనాచారి భూపాలపల్లి నుండి మళ్ళీ పోటీ చేస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. అధిష్టానం నుండి వచ్చిన స్పష్టమైన సూచనల ప్రకారమే చారి మళ్ళీ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. సర్వేలు ఏం చెబుతున్నాయి? 2018 ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్ధి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో మధుసూదనాచారి ఓడిపోవడం, తర్వాత గండ్ర అధికార పార్టీలో చేరిపోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో చారి భూపాలపల్లి నియోజకవర్గానికి దాదాపు దూరమయ్యారు. సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన మధుసూదనాచారి, ముఖ్యమంత్రి మాట మేరకే నియోజకవర్గానికి దూరంగా ఉన్నారన్న మాటలు వినిపించాయి. కేసీఆర్ మాట జవ దాటకుండా ఉండి మళ్ళీ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సి పదవి పొందారు. భూపాలపల్లిలో అధికార పార్టీకి వ్యతిరేకత మొదలైందని కేసీఆర్ చేయించిన సర్వేలో వెల్లడైందన్న వార్తలు అప్పట్లో బాగానే వినిపించాయి. బర్త్‌డే పాలిట్రిక్స్? మాజీ స్పీకర్ హయాంలోనే అభివృద్ధి జరిగిందని, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరగలేదనే ఆలోచన ప్రజల్లో మొదలైనట్లుగా సీఎం దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రజల్లో చారీ పట్ల మళ్ళీ ఆదరణ మొదలైందని ఊహాగానాలు వినిపించాయి. దీనికి తగ్గట్టుగానే మధుసూదనాచారి నియోజకవర్గంలో వరుసగా పర్యటించడం...ఎమ్మెల్సీ నిధులను అభివృద్ధి పనులకు ఉపయోగించుతుండటంతో ఆయన వర్గం నాయకులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 13న నియోజకవర్గ వ్యాప్తంగా మధుసూదానాచారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరగటంతో భూపాలపల్లిలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నియోజకవర్గంలో మధుసూదనాచారి మళ్ళీ యాక్టివ్ అవుతుండటంతో స్థానిక ఎమ్మెల్యే గండ్ర తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఈ మధ్య ఎమ్మెల్యే చేస్తున్న వాఖ్యలు కూడా చర్చకు దారితీస్తున్నాయి. ఎమ్మెల్యే పరీక్ష రాయబోతున్న మీ సహాయ సహకారాలు కావాలి అనడం, ఎమ్మెల్యే సీటు నాదే.. గెలుపు నాదే అని మాట్లాడుతుండటంతో భూపాలపల్లి ఎమ్మెల్యే సీటు విషయంలో ఏదో జరుగుతుందనే చర్చ సాగుతోంది. స్థానికంగా అధికార పార్టీ పట్ల వ్యతిరేకత మొదలవడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మధుసూదనాచారి మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరో ఏడాదిలో జరిగే ఎన్నికల పరీక్షలో రాసేదెవరో.. ఉత్తీర్ణులయ్యేదెవరో అన్న చర్చ నియోజకవర్గంలో తీవ్రంగా జరుగుతోంది. -
నేను ఈ స్థాయికి రావడానికి ప్రేక్షకులే కారణం: కమెడియన్ అలీ
సినీ నటుడు అలీకి జీవన సాఫల్య రజిత కిరీట జాతీయ పురస్కారాన్ని అందజేశారు. మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతిని పురస్కరించుకొని త్యాగరాయ గానసభ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ మధుసూదనచారి మాట్లాడుతూ.. పీవీ నరసింహరావు ప్రతికూలపరిస్థితులలో జాతీయ స్థాయికి ఎదిగారని అలీ కూడా ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని సినీ రంగంలో ఉన్నతస్థాయికి ఎదిగి సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తున్నారని కొనియాడారు. నటుడు అలీ మాట్లాడుతూ చిన్న దర్జీగా మా నాన్న పనిచేసేవారని, అలాంటి కుటుంబం నుంచి ఈ స్థాయికి రావటానికి ప్రేక్షకులే కారణమని అన్నారు. పీవీ ప్రభాకర్‌రావు, గానసభ అధ్యక్షులు కళా జనార్ధనమూర్తి, తదితరులు పాల్గొన్న సభకు సురేందర్ స్వాగతం పలుకగా దైవజ్ఞశర్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పీవీ నరసింహారావు 101 జయంతిని పురస్కరించుకుని 101 మంది నృత్యకళాకారులు విభిన్న నృత్యాలు చేయగా సంస్థ అధ్యక్షురాలు పుష్ప రికార్డ్ పత్రం అందుకొన్నారు. చదవండి: థియేటర్లో రెండే, ఓటీటీలో మాత్రం బోలెడు సినిమాలు రిలీజ్‌కు రెడీ! సెట్లో నోరుపారేసుకున్న హీరో, చెంప చెల్లుమనిపించిన సిబ్బంది -
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్:తెలంగాణలో గవర్నర్ కోటా నామినెటేడ్ ఎమ్మెల్సీగా సిరికొండ మధుసూదనాచారి శానసమండలికి ప్రాతినిధ్యం వహించనున్నారు. గతంలో గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం ఈ ఏడాది జూన్ 16న ముగిసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో మధుసూదనాచారి పేరును ప్రతిపాదిస్తూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫారసును గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఆమోదిందారు. మధుసూదనాచారిని శాసన మండలికి నామినేట్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం నుంచి మధుసూదనాచారి పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
గవర్నర్ కోటాలో మండలికి మధుసూదనాచారి
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా అసెంబ్లీ మాజీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి అభ్యర్థిత్వానికి రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదముద్ర వేశారు. గవర్నర్ కోటాలో మధుసూదనాచారి పేరును రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 16న సర్క్యులేషన్ పద్ధతిలో సిఫారసు చేసింది. ఈ కోటాలో ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫె సర్ శ్రీనివాస్ రెడ్డి పదవీ కాలం ఈ ఏడాది జూన్‌లో ముగిసింది. ఈ ఖాళీ భర్తీ చేసేందుకు ఆగస్టు 2న పాడి కౌశిక్‌రెడ్డి పేరును రాష్ట్ర కేబినెట్ ప్రతిపాదించింది. అయితే కౌశిక్‌రెడ్డిపై పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదై ఉండటంతో ఆ ప్రతిపాదనను గవర్నర్ వెనక్కి పంపారు. ఇటీవల ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కౌశిక్‌రెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో మధుసూదనాచారిని గవర్నర్ కోటాలో మండలికి పంపుతారనే ఊహాగానాలు వెలువడగా.. చివరకు అదే నిజమైంది. మధుసూదనాచారి పేరును గవర్నర్ కోటాలో ప్రతిపాదిస్తూ కేబినెట్ సమావేశంలో కాకుండా మంత్రులకు విడివిడిగా సంబంధిత పత్రాలు సర్క్యులేట్ చేశారు. అనంతరం మంత్రుల సంతకాలతో కూడిన సిఫారసును గవర్నర్‌కు సమర్పించారు. ఎమ్మెల్యే కోటాలోనే దక్కుతుందనుకున్నా.. విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గానికి మండలిలో ప్రాతినిథ్యం కల్పిస్తామని గతంలో ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మధుసూదనాచారికి ఎమ్మెల్యే కోటాలోనే అవకాశం దక్కుతుందని అంతా భావించారు. అయితే అభ్యర్థుల ఎంపికలో చివరి నిమిషంలో అనూహ్యంగా జరిగిన మార్పులు, చేర్పులతో ఆయనను గవర్నర్ కోటాలో మండలికి నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. 22న ఆరుగురి ఎన్నిక ప్రకటన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఈ నెల 16న టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేసిన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, తక్కల్లపల్లి రవీందర్రావు, బండా ప్రకాశ్ ముదిరాజ్, వెంకట్రామ్రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ నెల 17న జరిగిన నామినేషన్ల పరిశీలనలో ఆరుగురి అభ్యర్థిత్వం చెల్లుబాటు కాగా, స్వతంత్రులుగా నామినేషన్ వేసిన ఇద్దరి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. ఈ నెల 22తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియనుండగా, ఇతరులెవరూ పోటీలో లేకపోవడంతో అదే రోజు ఈ ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఆ 12 టీఆర్ఎస్ ఖాతాలోకే..! స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు గాను ఈ నెల 16 నుంచి ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ఈ నెల 23 వరకు కొనసాగనుంది. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్కు అత్యధిక మెజారిటీ ఉండటంతో ఈ 12 స్థానాలు కూ డా అధికార పార్టీ ఖాతాలోనే చేరే అవకాశముంది. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కసర త్తు చేస్తుండగా ఈ నెల 22 లేదా 23 తేదీల్లో జాబితా ప్రక టించే అవకాశం ఉంది. వచ్చే నెల 10వ తేదీలోగా ఈ ప్రక్రి య ముగియనుంది. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత శాస న మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ ఎన్నిక, మంత్రివర్గ వి స్తరణ వంటి అంశాలు తెరమీదకు వచ్చే అవకాశముంది. -
జయశంకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలి
వనస్థలిపురం: ప్రొఫెసర్ జయశంకర్ లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని, సమాజంలో గౌరవప్రదంగా జీవించడానికి పిల్లలను బాగా చదివించుకోవాలని మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి సూచించారు. స్వర్ణకార సమాజం బలమైన శక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. వనస్థలిపురంలోని బొమ్మిడి లలితా గార్డెన్లో ఆదివారం జరిగిన ఆ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింజమూరి రాఘవా చారి, ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, కోశాధికారి చంద్రశేఖరాచారి తదితర కార్యవర్గంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వకర్మ భగవానుడు వీరబ్రహ్మేంద్రస్వామి ప్రపంచాన్ని శాసించారని, కానీ విశ్వకర్మీయులు ఇంకా అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర నూతన అధ్యక్షులు రాఘవాచారి మాట్లాడుతూ విశ్వకర్మీయులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి కుటుంబానికి 5 ఎకరాల భూమి కేటాయించాలని, స్వర్ణకారులపై దాడులను నివారించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు చిట్టన్నోజు ఉపేంద్రాచారి, ఏపీ స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్, కందుకూరి పూర్ణాచారి, కన్నెకంటి సత్యం, కీసరి శ్రీకాంత్, ఆర్.సతీష్‌కుమార్, రాచకొండ గిరి తదితరులు పాల్గొన్నారు. -
మరి నేనెక్కడికి వెళ్లాలి?
ములుగు/భూపాలపల్లి: ‘ఈ సమావేశం అయిపోయాక మీరంతా మీ ఇళ్లకు వెళ్లిపోతారు.. మరి నేను ఎక్కడికెళ్లాలి.. నాకు కనీసం ఇల్లు కూడా లేదు’అని మాజీ స్పీకర్ మధుసూదనాచారి కంటతడి పెట్టారు. సోమవారం భూపాలపల్లిలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. ‘‘పేదలందరికీ ఇళ్లు కట్టించాకే నేను ఇల్లు కట్టుకుంటా అని ప్రమాణం చేసిన.. మీరంతా ఇళ్లకు వెళ్లిపోతే.. నేను ఎక్కడికెళ్లాలి. అయినా అధైర్యపడను.. నన్ను ఆదరించి ప్రేమ చూపించిన భూపాలపల్లిని విడిచి వెళ్లలేను. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నియోజకవర్గంపై ప్రేమ చూపిస్తా’అంటూ గద్గద స్వరంతో మాట్లాడారు. భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. దీంతో సభ మీద, కింద ఉన్న పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బోరున విలపించారు. అలాగే ములుగులో జరిగిన కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి చందూలాల్ మాట్లాడుతూ మీడియా పిచ్చోళ్లు కావాలని తనపై 15 రోజులపాటు పిచ్చిపిచ్చి వార్తలు రాశారని, వార్తలు రాసిన వారు ఖబడ్దార్ అని హెచ్చరించారు. పత్రికలకు తాను చేసిన అభివృద్ధి కనిపించకపోవడం సిగ్గుచేటని పేర్కొంటూ ఆయన కంటతడిపెట్టారు. ఇదే సభలో ఆయన కుమారుడు ప్రహ్లాద్ మాట్లాడుతూ అందరూ తన మనుషులు అనుకుంటే కలసికట్టుగా మోసం చేశారన్నారు. టీఆర్ఎస్లో చేరేందుకు ఎమ్మెల్యేల రాయబారం: బాలమల్లు ములుగు: తమ పార్టీలో చేరడానికి టీడీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాయబారాలు పంపుతున్నారని పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి, టీఎస్ఐఐసీ కార్పొరేషన్ చైర్మన్ గాదరి బాలమల్లు అన్నారు. అయితే.. ఇద్దరు స్వతంత్ర సభ్యులతో కలసి 90 మంది ఎమ్మెల్యేలు ఉండగా మిగతావారి అవసరం లేదని సీఎం కేసీఆర్ తిరస్కరిస్తున్నారని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగులో ఏర్పాటు చేసిన పార్టీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ఈ విషయం తెలిపారు. -
ఓటు మీది.. అభివృద్ధి బాధ్యత నాది
సాక్షి, భూపాలపల్లి: ‘మీరు ఓటు వేసి నన్ను గెలిపించండి.. అభివృద్ధి బాధ్యత నాది.. గడిచిన 50 నెలల పదవీ కాలంలో రూ.3 వేల కోట్లతో భూపాలపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాను’ అని శాసన సభాపతి, టీఆర్ఎస్ భూపాలపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. భూపాలపల్లి మునిసిపాలిటీ పరిధిలోని కాశీంపల్లిలో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారానికి వచ్చిన స్పీకర్‌కు కాశీంపల్లి వాసులు పూల వర్షం, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడుతూ.. నాడు అభివృద్ధిలో వెనుకబడి ఉన్న కాశీంపల్లికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి అంతర్గత రోడ్లు, సైడ్ కాల్వలు తదితర అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని అన్నారు. మహాకూటమికి ఓటు వేస్తే అధికారాన్ని మరోమారు ఆంధ్రులకు అప్పగించినట్లేనని అన్నారు. భూపాలపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దానని, ఫలితంగానే వ్యాపార రంగం అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో భూపాలపల్లి మునిసిపాలిటీ చైర్పర్సన్ బండారి సంపూర్ణరవి, కౌన్సిలర్లు తాటి హైమావతిఅశోక్, టీఆర్ఎస్ నాయకులు క్యాతరాజు సాంబమూర్తి, మేకల సంపత్‌కుమార్, చెరకుతోట శ్రీరాములు, మారెల్ల సేనాపతి, సింగనవేని చిరంజీవి, మాడ హరీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గొంగడి... గొర్రెపిల్లతో చారి..
సాక్షి, టేకుమట్ల: ఎన్నికల వేళ ప్రతి రాజకీయ నాయకుడు సామాన్యుడిని ఆకర్షించడానికి వింత వింత ప్రచారలు, వేశాలు వేస్తుంటారు. వెంకట్రావుపల్లిలో యాదవులు బహుకరించిన గొర్రెపిల్లతో టీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి ప్రచారాలు చేశారు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని భవిష్యత్ చెప్పారు. -
గండ్రలు గెలిస్తే చేస్తారా?
చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి టీఆర్ఎస్ అభ్యర్థి ఎస్.మధుసూదనాచారి పార్టీ బలహీనతల గురించి ప్రస్తావించిన కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆయన జిల్లా చిట్యాలలో మండల స్థాయి కార్యకర్తల సమావేశంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రైతుబంధు పథకం చెక్కులు సరిగా అందలేదని, దళితులకు మూడు ఎకరాల భూమి, డబుల్ బెడ్రూం ఇళ్లు, కార్పొరేషన్ రుణాల గురించి మైనస్ ఉందని నాయకులు, కార్యకర్తలు చెప్పడంతో వారిపై మధుసూదనాచారి కన్నెర్ర చేశారు. గండ్రలు గెలిస్తే చేస్తారా..? ఏం మాట్లాడుతున్నారు? అంటూ గద్దించడంతో వారు నిరాశతో వెళ్లిపోయారు. ‘ఈయన మారడు.. చెబితే అర్థం చేసుకోడు.. పలకరింపు సరిగా ఉండదు.. అంటూ పలు గ్రామాలకు చెందిన కార్యకర్తలు విమర్శించుకుంటూ వెళ్లిపోవడం విశేషం. -
చల్లారని అసమ్మతి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితిలో టికెట్ల చిచ్చు కొనసాగుతోంది. అభ్యర్థిత్వం కావాలని కొందరు, అభ్యర్థులను మార్చాలని మరికొందరు అధిష్టానానికి డిమాండ్లు వినిపిస్తున్నారు. 20కిపైగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసమ్మతి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అసమ్మతి, అసంతృప్త నేతలతో అభ్యర్థులు చర్చలకు ప్రయత్నిస్తున్నా వారు అంగీకరించకపోవడంతో మంత్రి కేటీఆర్‌కు విన్నవించుకుంటున్నారు. కేటీఆర్‌తో చర్చల సమయంలో అన్నింటికీ అంగీకరిస్తూనే నియోజకవర్గానికి వెళ్లాక మాత్రం అభ్యర్థులకు పోటాపోటీగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు కేటీఆర్‌తో చర్చలకు సైతం రావడంలేదు. ఆశావహులు ఎందరో... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకేసారి 105 అభ్యర్థులను ప్రకటించారు. టీఆర్ఎస్కు ఉన్న 90 మంది ఎమ్మెల్యేలలో 83 మందికి అభ్యర్థులుగా మళ్లీ అవకాశం ఇచ్చారు. జాబితా ప్రకటించగానే కొందరు అభ్యర్థుల పేర్లు మారతాయనే ప్రచారం మొదలైంది. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ అసమ్మతి నేతలు అభ్యర్థుల కంటే ముందే ప్రచారంలోకి దిగారు. మరికొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థిని మారిస్తేనే పార్టీ విజయం సాధిస్తుందని అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. 20కిపైగా నియోజకవర్గాల్లో రెబల్స్... - శాసనసభ స్పీకర్ మధుసూదనచారి భూపాలపల్లిలో ప్రచారం ప్రారంభించకముందే అసమ్మతి నేత గండ్ర సత్యనారాయణరావు ప్రచారంలోకి దిగారు. టీఆర్ఎస్ టికెట్ ఇస్తామని కేటీఆర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ హామీ ఇచ్చినందునే పార్టీలో చేరానని, కానీ తనకు అన్యాయం జరిగిందని చెబుతున్నారు. - ములుగులో మంత్రి చందులాల్‌ను మార్చాలని ద్వితీయశ్రేణి నేతలు డిమాండ్ చేస్తున్నారు. పోరిక గోవింద్ నాయక్, తాటి కృష్ణ, రూప్‌శంకర్‌లలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. - స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే టి. రాజయ్యను తొలగించి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలని ద్వితీయశ్రేణి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. - పాలకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు పోటీగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రచారాన్ని ప్రారంభించారు. - జనగామ అభ్యర్థి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిని మారిస్తేనే టీఆర్ఎస్ గెలుస్తుందని, అభ్యర్థిని మార్చకుంటే ప్రచారం చేయబోమని ద్వితీయశ్రేణి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. - మహబూబాబాద్ అభ్యర్థి శంకర్ నాయక్‌ను మార్చాలంటూ ప్రచారంలో అడ్డుకుంటున్నారు. - వేములవాడలో టీఆర్ఎస్ అభ్యర్థి రమేశ్‌బాబును తప్పించి ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీని గెలిపించుకుంటామని ద్వితీయశ్రేణి నేతలు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. - రామగుండంలో తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణతోపాటు కోరుకంటి చందర్ ఎవరికి వారు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. - ఆలేరులో గొంగడి సునీతను మార్చకుంటే ఆమెను ఓడిస్తామని కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. - ఖానాపూర్‌లో రేఖానాయక్‌కు పోటీగా రమేశ్ రాథోడ్ సిద్ధమయ్యారు. లంబాడీ వర్గం నేతలకు టికెట్ ఇవ్వడాన్ని ఆదివాసీలు వ్యతిరేకిస్తున్నారు. - నల్లగొండ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డికి పోటీగా దుబ్బాక నరసింహారెడ్డి ప్రచారం చేస్తున్నారు. - మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి పోటీగా వేనేపల్లి వెంకటేశ్వర్రావు ప్రచారం చేస్తున్నారు. కచ్చితంగా పోటీలో ఉంటానని ప్రకటిస్తున్నారు. - దేవరకొండ నియోజకవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌కు మళ్లీ టికెట్ ఇవ్వగా జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్ పోటీలో స్వతంత్ర అభ్యర్థిగా దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. - మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు టికెట్ ఇవ్వగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి సైతం టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సొంతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. - నాగార్జునసాగర్‌లో నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్యకు టికెట్ కేటాయించడంపై పార్టీ నేతలు భగ్గుమన్నారు. స్థానికుడికే టికెట్ ఇవ్వాలని ఎం.సి. కోటిరెడ్డి, బొల్లెపల్లి శ్రీనివాసరాజు భారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. - ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీఆర్ఎస్ అధికారిక అభ్యర్థి మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి వ్యతిరేకంగా గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. - రాజేంద్రనగర్ సెగ్మెంట్లో పార్టీ అభ్యర్థి టి. ప్రకాశ్‌రెడ్డికి పోటీగా టికెట్ ఆశించి భంగపడ్డ తోకల శ్రీశైలంరెడ్డి బరిలో ఉంటారని చెబుతున్నారు. - షాద్‌నగర్ అభ్యర్థి అంజయ్య యాదవ్‌కు పోటీగా వి.శంకర్, అందె బాబయ్యలలో ఒకరు పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. - మక్తల్ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి అనుచరులుగా ముద్రపడిన ఆరుగురు నేతలు ఒక్కటయ్యారు. తమలో ఒకరికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. - పటాన్చెరు టికెట్ మహిపాల్‌రెడ్డికే ఇవ్వగా పార్టీ నేతలు సఫాన్దేవ్, కె. బాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్ టికెట్ ఆశిస్తూ బలప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. - నారాయణఖేడ్‌లో తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ఎమ్మెల్సీ రాములు నాయక్ టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. - ఆందోల్‌లో నియోజకవర్గ నేతలకు చెప్పకుండా పార్టీ అభ్యర్థిని ఖరారు చేసినందుకు నిరసనగా టీఆర్ఎస్ ఏకైక జెడ్పీటీసీ సభ్యురాలు మమత బ్రహ్మం పార్టీకి రాజీనామా చేశారు. - సత్తుపల్లి అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా గత ఎన్నికల్లో ద్వితీయ స్థానంలో నిలిచిన మట్టా దయానంద్ ప్రచారాన్ని మొదలుపెట్టారు. - వైరా అభ్యర్థి మదన్ లాల్‌ను మార్చాలని అసంతృప్తులు డిమాండ్ చేస్తున్నారు. -
స్పీకర్‌కు నోటీసులపై కోర్టుమెట్లెక్కిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో గురువారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించిన విషయం తెలిసిందే. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎమ్మెల్యేల కేసుపై సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. డివిజన్ బెంచ్‌లో అప్పీలు చేసింది. ప్రభుత్వం వేసిన పిటిషన్ స్వీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్తు 21కి వాయిదా వేసింది. -
బైక్‌పై నుంచి కిందపడ్డ స్పీకర్ మధుసూదనాచారి
-
బైక్‌పై నుంచి పడిపోయిన తెలంగాణ స్పీకర్
శాయంపేట: బైక్ అదుపుతప్పి స్పీకర్ మధుసూదనాచారి కిందపడి పోయారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం శివారులో మంగళవారం జరిగింది. ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. పల్లె ప్రగతి నిద్ర కార్యక్రమంలో భాగంగా స్పీకర్ సోమవారం రాత్రి శాయంపేట మండల కేంద్రంలో నిద్రించారు. మంగళవారం ఆరెపల్లి గ్రామానికి బైక్ ర్యాలీ నిర్వహించారు. తిరుగు ప్రయాణంలో శాయంపేట శివారుకు చేరుకోగానే మూలమలుపు వద్ద ఎదురుగా ఎడ్లబండి రావడంతో బైక్‌ను రోడ్డు కిందికి దించారు. మళ్లీ రోడ్డెక్కే క్రమంలో టైర్ స్కిడ్ అయి అదుపుతప్పి బైక్ పై నుంచి కిందపడిపోయారు. సెక్యూరిటీ సిబ్బంది స్పీకర్‌ను పైకి లేపారు. మళ్లీ యథావిధిగా స్పీకర్ బైక్‌పై ర్యాలీ కొనసాగించారు. -
కోమటిరెడ్డి–సంపత్ కేసులో హైకోర్టు సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఆది నుంచీ అనేక మలు పులు తిరుగుతూ వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్ కుమార్ల సభా బహిష్కరణ వ్యవహారంలో మంగళవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల సభా బహిష్కరణ తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ తానిచ్చిన తీర్పును అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహించింది. తీర్పును అమలు చేయనందుకు కోర్టు ధిక్కారం కింద ఎందుకు నోటీసులు జారీ చేయరాదో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది! అంతేగాక కోర్టు ధిక్కార వ్యాజ్యంలో సహ ప్రతివాదిగా చేర్చి, ఫాం 1 నోటీసులిచ్చి వ్యక్తిగత హాజరుకు ఆదేశాలు ఎందుకివ్వరాదో కూడా తెలియజేయాలని నోటీసుల్లో స్పీకర్‌కు స్పష్టం చేసింది. బహిష్కరణ నోటిఫికేషన్ ఉపసంహరణకు స్పీకర్ అనుమతివ్వకపోవడం ఎలా చూసినా కోర్టు తీర్పును అమలు చేయకపోవడమేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారంలో కోర్టు తీర్పు పట్ల స్పీకర్ ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ప్రదర్శించారని ఆక్షేపించింది. ‘‘ఇందుకు కోర్టు ధిక్కార పిటిషన్లో స్పీకర్‌ను నేరుగా ప్రతివాదిగా చేర్చే అవకాశమున్నా అలా చేయకుండా నిగ్రహం పాటిస్తున్నాం. అలా ఎందుకు చేర్చకూడదో చెప్పాల్సిందిగా స్పీకర్‌ను కోరుతున్నాం’అని షోకాజ్ నోటీసుల్లో పేర్కొంది. న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు మంగళవారం ఈ మేరకు సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. ఓ స్పీకర్‌కు నోటీసులు జారీ చేయడం, అది కూడా కోర్టు ధిక్కారం కింద ఎందుకు చర్యలు తీసుకోరాదో వివరించాలని కోరడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి. కోమటిరెడ్డి, సంపత్ భద్రతను పునరుద్ధరించకపోవడంపైనా న్యాయమూర్తి స్పందించారు. డీజీపీ, నల్లగొండ, జోగులాంబ గద్వాల్ జిల్లాల ఎస్పీలను సుమోటోగా ధిక్కార పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. ఫాం 1 నోటీసు జారీ చేసి ఎందుకు కోర్టు ధిక్కార చర్యలు తీసుకోరాదో స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. ఈ వ్యవహారంలో అధికారులంతా మోసగించే ఆలోచలు చేశారని న్యాయమూర్తి తీవ్రస్థాయిలో ఆక్షేపించారు. కోర్టు తీర్పును అమలు చేయకుండా ఏ ఒక్కరూ తప్పించుకోజాలరన్నారన్నారు. తీర్పును అమలు చేసి న్యాయవ్యవస్థ ప్రతిష్టను కాపాడాల్సిందన్నారు. ‘‘బహిష్కరణ తీర్మానం రద్దుతో వారి శాసనసభ్యత్వాలు వాటంతటవే పునరుద్ధరణ అవుతాయి. ఇందుకు ప్రత్యేక ఆదేశాలేవీ అవసరం లేదు. మా తీర్పుతో ఎమ్మెల్యేలిద్దరూ చట్ట ప్రకారం అన్ని సౌకర్యాలకూ అర్హులు. అందులో భాగంగా వారికి గతంలో ఉన్న భద్రతను పునరుద్ధరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. కానీ ఎస్పీలు తమకు ఆదేశాలు రాలేదంటూ మౌనం వహించారు. కోర్టు తీర్పు ఉన్నాక వారికింకా ఏ ఆదేశాలు అవసరమో అర్థం కాకుండా ఉంది. బహిష్కరణ తీర్మానాన్ని ఉపసంహరించుకోలేదని, కాబట్టి ఎమ్మెల్యేలకు భద్రతను పునరుద్ధరించాల్సిన అవసరం లేదని డీజీపీ నేతృత్వంలోని కమిటీ అభిప్రాయపడింది. ఇదెంతమాత్రమూ సరికాదు’’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. 2018 జనవరి నుంచి ఈ రోజు దాకా కోమటిరెడ్డి, సంపత్‌కుమార్ తీసుకున్న అలవెన్సులు, సమర్పించిన బిల్లుల వివరాలను ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 28కి వాయిదా వేశారు. కార్యదర్శులకు ఫాం 1 నోటీసులు మరోవైపు తమ బహిష్కరణను రద్దు తీర్పును అమలు చేయకపోవడంపై అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహాచార్యులు, న్యాయ శాఖ కార్యదర్శి వి.నిరంజన్‌రావులకు కోర్టు ధిక్కార చట్టం కింద ఫాం 1 నోటీసులను జస్టిస్ శివశంకరరావు జారీ చేశారు. వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరై వివరణ ఇవ్వాలని వారికి స్పష్టం చేశారు. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేశారు. వీరిద్దరు కూడా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా జరిగింది ఇదీ... కోమటిరెడ్డి, సంపత్‌కుమార్‌లను బహిష్కరిస్తూ సభ తీర్మానం చేసింది. ఆ వెంటనే వారు ప్రాతినిధ్యం వహిస్తున్న నల్లగొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్లు ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. వీటిని సవాలు చేస్తూ వారు హైకోర్టును ఆశ్రయించారు. బహిష్కరణ తీర్మానాన్ని, నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ ఏప్రిల్ 17న జస్టిస్ శివశంకరరావు తీర్పు ఇచ్చారు. దీనిపై అసెంబ్లీ, న్యాయ శాఖ కార్యదర్శులు అప్పీళ్లు దాఖలు చేయలేదు. వారికి బదులు 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. వారికి ఆ అర్హత లేదంటూ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. అయినా అసెంబ్లీ, న్యాయశాఖ కార్యదర్శులు కోర్టు తీర్పును అమలు చేయకపోవడంతో కోమటిరెడ్డి, సంపత్ వారిపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు ఇద్దరు కార్యదర్శులూ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందుకు ప్రాథమిక ఆధారాలున్నాయని పేర్కొన్నారు. వారికి ఫాం 1 నోటీసులిస్తానని స్పష్టం చేశారు. దాంతో కార్యదర్శులు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందు 61 రోజుల ఆలస్యంతో వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ధర్మాసనం వారికి అనుకూలంగా ఉత్తర్వులివ్వకుండా విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్ శివశంకరరావు మంగళవారం మధ్యాహ్నం రెండు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డీజీపీ, ఇద్దరు ఎస్పీలకు నోటీసులిస్తూ 83 పేజీలతో ఉత్తర్వులు, ఇరువురు కార్యదర్శులకు వ్యక్తిగత హాజరుకు ఫాం 1 నోటీసులిస్తూ మరో ఉత్తర్వు ఇచ్చారు. -
మెకానిక్‌ల సమస్యలను అసెంబ్లీలో చర్చిస్తా
భూపాలపల్లి అర్బన్ : రాష్ట్ర వ్యాప్తంగా టూ వీలర్స్ మెకానిక్‌ల సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి కృషి చేస్తానని అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక ఎస్ఎస్ఆర్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన రాష్ట్ర టూ వీలర్స్ మెకానిక్‌ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక రకాల వృత్తుల వారు అభివృద్ధి చెందున్నప్పటికీ మెకానిక్‌లు మాత్రం వెనుకబడి పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు అంబేడ్కర్ సెంటర్ నుంచి బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి సదస్సుకు సుమారు రెండు వేల మంది మెకానిక్‌లు హాజరయ్యారు. కార్యక్రమంలో రాష్ట్ర స్థానిక నాయకులు తోడేటి బాబు, స్వామి, రమేష్, ఆశోక్‌రెడ్డి, సుజేందర్, రాము, రవికాంత్, లక్ష్మణ్, రాజు, రాజినీకాంత్, మనోహర్, జాఫర్, రమేష్, పాషా, శంకర్, సురేష్, వినయ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్‌కు పోలీసుల గౌరవ వందనం
ఖమ్మంఅర్బన్ : నగరానికి వచ్చిన స్పీకర్ మధుసూదనాచారి పోలీసులు ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఇంటి వద్ద ఆదివారం పోలీసులు మర్యాదపూర్వకంగా ఆయనకు గౌరవ వందనం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సీఐ నాగేంద్రాచారి తదితరులు ఉన్నారు. -
చదువుతోనే బంగారు భవిష్యత్
చిట్యాల: చదువు ద్వారానే విద్యార్థులకు బంగారు భవిష్యత్ ఉంది.. అందుకోసం మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి అన్నారు. స్థానిక కస్తూరిబాగాంధీ బాలికల గురుకుల కళాశాలలో ఇంటర్ తరగతులను స్పీకర్ శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు దుప్పట్లు, నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఎంతో కష్టపడి చదువుకుని రాజ్యాంగ నిర్మాత అయ్యారని, పీపీ నర్సింహారావు బహుభాషా కోవిదుడిగా పేరుగాంచి భారత ప్రధానమంత్రి అయ్యారని గుర్తు చేశారు. గతంలో చదువుకోవడం కష్టంగా ఉండేదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని, క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి ఉత్తమ ఫలితాలు సాధించాల ని కోరారు. ఉపాధ్యాయులు ప్రణాళిక ప్రకారం విద్యాబోధన చేయాలని సూచించారు. అనంతరం ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా స్పీకరును టీచర్లు, విద్యార్థులు సత్కరించారు. డీఈఓ శ్రీనివాసరెడ్డి, సెక్టోరియల్ అధికారి నిర్మల, ఎంపీడీఓ చందర్, సర్పంచ్ పుల్లూరి రమాదేవి, పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ కుంభం రవీందర్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ సుమలత, తహసీల్దార్ షరీఫ్‌మొహినొద్దీన్ పాల్గొన్నారు. -
రైల్వేకోర్టుకు హాజరైన స్పీకర్ మధుసూదనాచారి
కాజీపేట రూరల్: కాజీపేట రైల్వేకోర్టుకు రైల్‌రోకో కేసులో భాగంగా మంగళవారం స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, టీఆర్ఎస్ నాయకులు హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా 2013 సంవత్సరంలో చేపట్టిన రైల్‌రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, అచ్చ విద్యాసాగర్, ఎస్.శ్రీనివాస్, డి.దయాసాగర్, ఎ.వినోద్, దిడ్డి నరేష్, వి.సత్యనారాయణ, బొల్లం సంపత్, మేకల రవి, రామగళ్ల పరమేశ్వర్ హాజరయ్యారు. అదేవిధంగా ధర్మారం రైల్వే గేట్ వద్ద 2014 సంవత్సరంలో జరిగిన రైల్‌రోకో కేసులో స్పీకర్ మధుసూదనచారి, ల్యాదెళ్ల బాలు, విజయ్, ఎల్.రామారావు, పి.ప్రేమ్‌కుమార్, జి.రమేష్, జి.రాజు, కె.రాములు, వి.లింగారెడ్డి, జి.సందీప్‌లు హాజరుకాగా వరంగల్, ధర్మారం కేçసులను పరిశీలించిన రైల్వే మెజీస్ట్రేట్ ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ తీర్పు చెప్పినట్లు వారు తెలిపారు. -
స్పీకర్, రేవంత్‌ల మధ్య స్వల్ప వాగ్వాదం
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కమార్‌ల సభ్యత్వ రద్దు విషయంలో హైకోర్టు తీర్పు అమలు చేయడంలేదంటూ సీఎల్పీ బృందం సోమవారం స్పీకర్ మధుసూదనచారిని కలసి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి, సంపత్‌ల సభ్యత్వాన్ని పునరుద్దరించాలని వారు స్పీకర్‌ను కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస నేతలు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జనారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్, అసెంబ్లీ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని స్పీకర్‌కు సలహాలు ఇవ్వాలని సూచించారు. కోర్టు తీర్పును ఎందుకు అమలు చేయడంలేదని స్పీకర్‌ను అడిగినట్టు వారు పేర్కొన్నారు. కోర్టు తీర్పును అమలు చేయకుంటే జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామన్నారు. అవసరమైతే సుప్రీం కోరుఓటను కూడా ఆశ్రయిస్తామని హెచ్చరించారు. స్పీకర్, రేవంత్ మధ్య స్వల్ప వాగ్వాదం కాంగ్రెస్ నేతలు స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్న సమయంలో స్పీకర్‌కు, రేవంత్‌కు మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. హైకోర్టు తీర్పును అమలు చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని రేవంత్ స్పీకర్‌ని ప్రశ్నించారు. దీంతో అక్కడి వాతావరణం కొద్దిగా వేడెక్కింది. ఒకింత అసహనానికి లోనైన స్పీకర్ రేవంత్ ఇలా మాట్లాడితే తాను ఇక్కడి నుంచి వెళ్లిపోతానని తెలిపారు. దీంతో కొందరు కాంగ్రెస్ నేతలు స్పీకర్‌ను సముదాయించారు. -
స్పీకర్‌కు తప్పిన ప్రమాదం
గణపురం: శాసన సభాపతి మధుసూదనాచారికి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌పైకి లారీ దూçసుకెళ్లింది. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలకేంద్రంలో శుక్రవారంరాత్రి స్పీకర్ పల్లెనిద్ర చేశారు. శనివారం ఉదయం గణపురంలో నిర్మించిన బస్టాండ్‌ను ప్రారంభించి తిరిగి భూపాల పల్లికి బయలుదేరారు. ఈ క్రమంలో గణపసముద్రం చెరువు మత్తడి సమీపంలోకి స్పీకర్ కాన్వాయ్ చేరుకుంది. గాంధీనగర్ నుంచి ములుగు వైపు దేవాదుల పైపులను తీసుకుని ఎదురుగా వస్తున్న లారీ కాన్వాయ్‌పైకి దూసుకెళ్లింది. స్పీకర్ వెనుక వస్తున్న ఎస్కార్ట్ డ్రైవర్ అప్రమత్తమై వాహనాన్ని రోడ్డు పక్కకు దిం పాడు. అంతలో లారీ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. వెనకాల వస్తున్న మరో లారీ ముందున్న లారీని ఢీకొట్టింది. దీంతో సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురై వాహనాలను నిలిపి వేశారు. స్పీకర్ వాహనాన్ని పక్క నుంచి మళ్లించారు. కాన్వాయ్‌లోని వాహనానికి, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో పోలీసులు, టీఆర్ఎస్ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. -
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
-
స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం
సాక్షి, జయశంకర్ భూపాల్పల్లి: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. భూపాలపల్లి జిల్లాలోని గణపురం శివారులో స్పీకర్ కాన్వాయిలోని వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తన నియోజవర్గమైన గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని భూపాలపల్లికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. లారీ ఢీకొనడంతో కాన్వాయిలోని వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. అంతకుముందు గణపురం మండల కేంద్రంలో మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఉదయం స్థానిక ప్రజలతో కలిసి నడుచుకుంటూ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.