మంచిర్యాల సిటీ : తెలంగాణ తెలుగుదేశం పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టుగా రాష్ట్ర శాసన సభ స్పీకర్ మధుసుధనాచారి ప్రకటించడం రాజ్యాంగ విరుద్ధమని టీడీపీ తూర్పు జిల్లా అధ్యక్షుడు బోడ జనార్దన్ అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీని విలీనం చేయాలంటే గ్రామ కమిటీ నుంచి మొదలుకొని రాష్ట్ర కమిటీ వరకు తీర్మానం చేయాలని.. తర్వాతనే అమలు చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. రాజ్యాంగంలోని 73,74 ఆర్టికల్ ప్రకారం ఏ పార్టీ నుంచి గెలుపొందితే ఆ పార్టీ సభ్యుడిగానే కొనసాగాలని ఉందన్నారు. సమావేశంలో తూర్పు జిల్లా కోశాధికారి గోపతి మల్లేష్, మేరడికొండ శ్రీనివాస్, రాజారాం, వెంకటేశ్వర్లు, పుట్ట మధు, గౌస్ ఉన్నారు.