- తొలుత ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ మధుసూదనాచారి
- మాఫీ, జీహెచ్‌ఎంసీ కార్మికుల తొలగింపుపై చర్చించాలని విపక్షాల పట్టు
- మంత్రి తుమ్మల సమాధానం చెబుతున్నా ఆగని విపక్షాల ఆందోళన
- స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు.. గందరగోళం
- సోమవారానికి సభను వాయిదా వేసిన స్పీకర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ గురువారం ప్రారంభమైన పది నిమిషాల్లోనే అర్ధంతరంగా వాయిదా పడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీ, వామపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ ప్రశ్నోత్తరాలకు అడ్డుపడడం, పోడియం వద్ద సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడడంతో ఎలాంటి చర్చ లేకుండానే స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు. గురువారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు.
వెంటనే రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని... జీహెచ్‌ఎంసీలో తొలగింపునకు గురైన 1,200 మంది పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టి.జీవన్‌రెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. రైతుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. వీరికి టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు జతకలిశారు.
ఈ సమయంలో విపక్షాల నిరసనను పట్టించుకోకుండా స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు. టీఆర్‌ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అంగన్‌వాడీ సమస్యలపై అడిగిన ప్రశ్నను తొలుత లేవనెత్తారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు లేచి దీనికి సమాధానమిస్తున్నా... కాంగ్రెస్ సభ్యులు నిరసన కొనసాగించారు. నినాదాలు చేస్తూనే పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌తో వాదనకు దిగారు. రైతులకు వన్‌టైం సెటిల్‌మెంట్ ద్వారా రుణమాఫీ చేయాలని, ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారితోపాటు టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు డిమాండ్ చేశారు.
దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ మధుసూదనాచారి అనూహ్యంగా సభను సోమవారం(5వ తేదీ) నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక జీహెచ్‌ఎంసీలో తొలగించిన 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ బీజేపీ.. ఎర్రబెల్లి దయాకర్‌రావు అరెస్టు, టీఆర్‌ఎస్ ప్రొటోకాల్ పాటించడం లేదన్న అంశాలపై టీడీపీ.. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై వామపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ అంతకుముందే తిరస్కరించారు.
అంగన్‌వాడీ పోస్టులు భర్తీ: తుమ్మల
అంగన్‌వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై టీఆర్‌ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అడిగిన ప్రశ్నకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమాధానమిచ్చారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 30,700 అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, అంగన్‌వాడీ కేంద్రాల కోసం వెయ్యి భవనాలు నిర్మించనున్నామని తెలిపారు.
సభ సాగింది10 నిమిషాలే!
Published Fri, Oct 2 2015 1:02 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM
Advertisement
Advertisement