రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం | Rajasthan MP Hanuman Beniwal on agricultural loans | Sakshi
Sakshi News home page

రైతులపై జులుం... కార్పొరేట్లకు సలాం

Published Sat, Feb 22 2025 4:01 AM | Last Updated on Sat, Feb 22 2025 4:01 AM

Rajasthan MP Hanuman Beniwal on agricultural loans

బ్యాంకులు ప్రదర్శిస్తున్న ఈ అసమానత వింత గొలుపుతుంది. ఒక ఆర్టీఐ అభ్యర్థనకు ప్రతిస్పందిస్తూ, 2014 ఏప్రిల్‌ 1 నుండి కార్పొరేట్‌ ఇండియాకు సంబంధించి రూ. 16.61 లక్షల కోట్ల మొండి రుణాలనుబ్యాంకులు మాఫీ చేశాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలియజేసింది. మరుసటి రోజు రాజస్థాన్‌ ఎంపీ హనుమాన్‌ బేనీవాల్‌ పార్లమెంటులో మాట్లాడుతూ, దేశంలో బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు ఇప్పుడు రూ. 32 లక్షల కోట్లు దాటాయని అన్నారు. 

18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ అని బేనీ వాల్‌ అన్నారు. రైతులకు వ్యవసాయ రుణ మాఫీ పథకం గురించి బడ్జెట్‌లో ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు.

కార్పొరేట్లకు రుణమాఫీ
దీనికి విరుద్ధంగా, గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్లు చేసిన మొత్తం రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) రద్దు చేశారు. గత ఐదేళ్లలో కార్పొరేట్లు చెల్లించని రుణా లలో రూ. 10.6 లక్షల కోట్లను రద్దు చేయడానికి భారతీయబ్యాంకులు ఏమాత్రం సందేహించలేదు. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలకు చెందినవని నివేదికలు చెబుతున్నాయి. అదే కర్ణాటక, శివమొగ్గలోని ఒక రైతు కేవలం తన రూ. 3.46 పైసల బకాయి చెల్లించేందుకు సాధారణ బస్సు సర్వీస్‌ లేకపోతే, 15 కిలో మీటర్లు నడిచివెళ్లాల్సినంతటి ఆత్రుతను బ్యాంక్‌ ప్రదర్శించింది.

2023–24 ఆర్థిక సంవత్సరంలోనే బ్యాంకులు రూ. 1.7 లక్షల కోట్లు మాఫీ చేశాయి. ఒక సంవత్సరం క్రితం, 2022–23లో రూ. 2.08 లక్షల కోట్లు మాఫీ చేశాయి. కానీ వ్యవసాయ రుణాలను మాఫీ చేసే విషయానికి వస్తే, కేంద్రం రెండుసార్లు మాత్రమే ఆ పని చేసింది: 1990, 2008లో. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విడివిడిగా వ్యవ సాయ రుణాల మాఫీ చేశాయి. కానీ మాఫీ చేసిన మొత్తాన్ని బ్యాంకు లకు రాష్ట్రాలు చెల్లిస్తున్నందున అది బ్యాంకులపై భారం కాదు. కార్పొ రేట్లు చెల్లించని బ్యాంకు రుణాలను అవి దేశ నిర్మాణానికి తోడ్ప డ్డాయనేంత జాగ్రత్తగా మాఫీ చేశారు. 

చిన్న రుణాలు మాఫీ చేయలేమా?
పేద రైతులు, గ్రామీణ శ్రామికవర్గం చేసిన చిన్న చిన్న రుణా లను మాఫీ చేయడం అనేది జాతీయ బ్యాలెన్స్ షీట్‌ను కలవర పెట్టడానికి కారణంగా కనిపిస్తుంది. అదే ధనవంతులైన రుణమాఫీ దారులు సులభంగా తప్పించుకుంటారు. వీరిలో రూ.3.45 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను చెల్లించని 16,000 మందికి పైగా ఉద్దేశ పూర్వక రుణమాఫీదారులు ఉన్నారు. పైగా వారివద్ద డబ్బు ఉందని ఆర్బీఐ అంగీకరించినప్పటికీ వారు తిరిగి చెల్లించడానికి ఇష్టపడలేదు. కచ్చితంగా, వీరు సంపద సృష్టికర్తలు. దేశం వారిని అభినందించాలన్నమాట!

ఇప్పుడు రాజస్థాన్‌లోని పీలీబంగాకు చెందిన ఒక రైతును చూడండి: ఆయన ఒక ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 2.70 లక్షల రుణం తీసుకొని రూ. 2.57 లక్షలను తిరిగి చెల్లించాడు (మహమ్మారి సమయంలో రాష్ట్రం నుండి అందుకున్న రూ. 57,000 మద్దతుతో సహా). మిగిలిన మొత్తాన్ని తిరిగి చెల్లించలేకపోయాడు. ఆయన ఒక రోజు ఇంటికి వచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉంది. తరువాత, ఆగ్రహించిన గ్రామస్థులు ఆ తాళం పగలగొట్టారు.

ఈ దురదృష్టకర సంఘటనను మరొకదానితో పోల్చి చూద్దాం. ప్రముఖ మిశ్రమ లోహ, ఉక్కు తయారీదారు అయిన ‘ఆధునిక్‌ మెటాలిక్స్‌’... 2018 జూలైలో నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) కోల్‌కతా శాఖ తన పరిష్కార ప్రణాళికను ఆమోదించిన తర్వాత, తమ బకాయిలు రూ. 5,370 కోట్లకుగానూ కేవలం రూ. 410 కోట్లు చెల్లించడానికి ఒప్పుకుంది. 

అంటే 92 శాతం రుణమాఫీ! స్పష్టంగా, ఇంత పెద్ద ‘రుణమాఫీ’ తర్వాత, కంపెనీ ప్రమోటర్లు అన్ని కార్యకలాపాలను పూర్తి చేయడానికీ, ప్రధానసంస్థను పునరుద్ధరించి తిరిగి పని చేయడం ప్రారంభించడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఒకప్పుడు పరివర్తనాత్మక పరిష్కార యంత్రాంగంగా ప్రశంసలందుకున్న దివాళా కోడ్‌ ఇప్పుడు ఒక వైఫల్యంగా మారిపోయింది.

అయితే, పెద్ద ప్రశ్న మిగిలే ఉంది. పెండింగ్‌లో ఉన్న రూ. 20,000 మొత్తాన్ని తిరిగి పొందలేకపోయినందుకు రాజస్థాన్‌ రైతు ఇంటికి తాళం వేయగలిగినప్పుడు, పెండింగ్‌లో ఉన్న బకాయిలలో 92 శాతం మాఫీ చేసి రాజమార్గాన పంపడానికి బదులుగా, ఆధునిక్‌ మెటాలిక్స్‌ వంటి సంస్థల ప్రాంగణాన్ని ఎన్సీఎల్‌టీ ఎందుకు తాళం వేయలేకపోయింది? రైతుల వంటి వారే అయిన ఆ యజమానులను ఎందుకు కటకటాల వెనుక ఉంచలేకపోయింది?

చట్టాల్లో ఎందుకు తేడా?
ఒక పెద్ద కంపెనీకి ఇంత పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, రైతులు ఇలాంటి విధానంతో ప్రయోజనాన్ని, అది కూడా సాపేక్షంగా తక్కువ అయినాసరే ఎందుకు పొందకూడదు? వివిధ వర్గాల బ్యాంకు వినియోగదారులకు బ్యాంకింగ్‌ చట్టాలు ఎందుకు భిన్నంగాఉండాలి? గృహనిర్మాణం, కారు, ట్రాక్టర్‌ లేదా మోటార్‌ సైకిల్‌ రుణాలు తీసుకునే వారిని బ్యాంకులు ఎప్పుడైనా అదే రకమైన సున్ని తత్వంతో చూస్తాయా? ఆర్థిక వృద్ధి పేరుతో కంపెనీల మొండి బకాయిలను మాఫీ రూపంలో తమ సొంతం చేసుకోవాల్సిన అగత్యాన్ని బ్యాంకులు ఎంతకాలం సమర్థించుకోగలవు?

పంజాబ్, హరియాణా రాష్ట్రాలలో నిటారుగా నిలబడి ఉన్న తమ కాలీఫ్లవర్, క్యాబేజీ పంటలను తిరిగి దున్నడానికి ట్రాక్టర్లను నడుపుతున్న రైతుల బాధాకరమైన వీడియోలను; ఛత్తీస్‌గఢ్, మధ్య ప్రదేశ్‌లలో టమోటా ధరలు పతనమై రైతులు కుప్పగూలిపోవడాన్ని నేను సోషల్‌ మీడియాలో చూసినప్పుడు తీవ్రంగా బాధపడ్డాను. టమోటా, ఉల్లిపాయ, బంగాళాదుంపల ధరలను స్థిరీకరించడానికి రూ. 500 కోట్ల వ్యయంతో 2018–19 బడ్జెట్‌లో ప్రారంభించిన ఆపరేషన్‌ గ్రీన్స్ పథకం నాకు ఇలాంటి సందర్భాల్లో గుర్తుకువస్తుంది. 

కోల్డ్‌ చైన్స్ నెట్‌వర్క్‌తో సహా వ్యవసాయ మౌలిక సదుపా యాలలో తగినంత పెట్టుబడి పెట్టడం అనేది నష్టాలను తగ్గించడంలో సహాయపడుతుందని అందరూ అంగీకరిస్తున్నారు. కానీ వాస్తవికత ఏమిటంటే, కూరగాయల ధరలను స్థిరీకరించడంలో ఆపరేషన్‌ గ్రీన్స్‌ పథకం ఘోరంగా విఫలమైంది. తగిన నిధుల మద్దతు లేకపోవడం ఒక కారణం కావచ్చు.

రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఐఎల్‌) దివాళా తీసిన తీర్మానాన్ని నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) 2023 డిసెంబర్‌లో ఆమోదించింది. ఈ సంస్థ క్లెయిమ్‌ చేసిన రుణంలో 99 శాతాన్ని మాఫీ చేయడం జరిగింది. చూడండి విచిత్రం: 2018–19లో ఆపరేషన్‌ గ్రీన్స్ కోసం కేటాయించిన రూ. 500 కోట్లతో పోలిస్తే, ఆర్‌సీఐఎల్‌ రూ. 47,251.34 కోట్ల క్లెయిమ్‌కు బదులుగా కేవలం రూ. 455.92 కోట్లు చెల్లించి బయటపడింది. మాఫీ చేసిన ఆ మొత్తాన్ని తిరిగి పొంది ఆపరేషన్‌ గ్రీన్స్ లో పెట్టుబడి పెడితే, పండ్లు, కూరగాయల ధరలను స్థిరీకరించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఆర్థిక వనరుల కొరత ఏమాత్రం ఉండేది కాదు.

- దేశంలో 18.74 కోట్లకు పైగా రైతులు తమ రుణాలతో సతమతమవుతున్నారు. మొత్తం బకాయి ఉన్న వ్యవసాయ రుణాలు వార్షిక వ్యవసాయ బడ్జెట్‌ వ్యయం కంటే 20 రెట్లు ఎక్కువ.

- గత 11 ఏళ్లలో ఇండియా కార్పొరేట్ల రూ.16.61 లక్షల కోట్ల నిరర్థక రుణాలను (కేవలం 16 శాతం రికవరీతో) బ్యాంకులు రద్దు చేశాయి. ఈ మొండి బకాయిలలో 50 శాతం పెద్ద కంపెనీలవి.

- ఒక పెద్ద కంపెనీకి పెద్ద ‘రుణమాఫీ’ అవసరమైనప్పుడు, ఒక చిన్న రైతు అలాంటి ప్రయోజనం ఎందుకు పొంద కూడదు?

- వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు , ఈ–మెయిల్‌: hunger55@gmail.com
- దేవీందర్‌ శర్మ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement