
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2(Group 2) అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొంది. అందుకు ఏపీ ప్రభుత్వం చేసిన పనే కారణం. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ APPSC సెక్రటరీకి లేఖ రాసింది. అయితే స్వయంగా ప్రభుత్వమే లేఖ రాసినా బోర్డు నుంచి ఇంతదాకా స్పందన లేదు.
షెడ్యూల్ ప్రకారం రేపు(ఫిబ్రవరి 23, ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంది. రోస్టర్ తప్పులను సరి చేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఆ పరీక్షను వాయిదా వేయాలంటూ శనివారం ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. మార్చి 11న రోస్టర్ అంశంపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్ వేసేందుకు సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే..

మరోపక్క మెయిన్స్(Group 2 Mains Exam) వాయిదా పడింది అంటూ వస్తున్న కథనాలను ఇంతకుముందు బోర్డు కొట్టిపారేసింది. యధావిథిగా రేపు(23 ఫిబ్రవరి) పరీక్ష జరుగుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజ్ఞప్తిని బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా? ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
చట్టరీత్యా చర్యలు తప్పవు
పలు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అని సర్కులేట్ అవుతున్న వార్త అవాస్తవం. ఏపీపీఎస్సీ నుండి అందిన సమాచారం మేరకు గ్రూప్ -2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.
:::తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్