Group 2 mains
-
గ్రూప్–2 మెయిన్స్.. పేపర్–1 సులభం.. పేపర్–2 కొంచెం కఠినం
సాక్షి, ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్విస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్–2 మెయిన్స్ పరీక్షలో పేపర్–1 సులభంగా ఉందని, పేపర్–2 ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించినవారు, ప్రామాణిక మెటీరియల్‌తో సిద్ధమైనవారు సులువుగా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నపత్రం ఉందంటున్నారు.పేపర్–2లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి ఎక్కువ శాతం ఇటీవల పరిణామాలపై ప్రశ్నలు అడిగారని చెబుతున్నారు. అయితే రెండు పేపర్లలోనూ అసెర్షన్ అండ్ రీజన్, స్టేట్మెంట్ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉండటంతో అన్నింటికి సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు. పేపర్–1 కోర్ అంశాల నుంచే.. పేపర్–1లో రెండు సెక్షన్లలోనూ ప్రశ్నలు కోర్ అంశాల నుంచే ఉన్నాయి. సెక్షన్–ఎగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సాంఘిక, సాంస్కృతిక చరిత్ర విభాగం నుంచి 75 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో ఎక్కువ శాతం.. కవులు, శాసనాలు, ఆయా రాజ్య వంశాల కళలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ఉద్యమాల నుంచే అడిగారు. చోళులు, చాళుక్యులు, కాకతీయులు గురించి ప్రశ్నలు ఉన్నాయి. అదే విధంగా నిజాం రాజుల గురించిన ప్రశ్నలు కూడా ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్ పాలనకు సంబంధించిన అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడిగారు. పేపర్–1 సెక్షన్ 2.. రాజ్యాంగానికి ప్రాధాన్యత పేపర్–1లోని సెక్షన్–2లో రాజ్యాంగ అధికరణలు, ప్రకరణలకు సంబంధించిన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అయితే ఈ విభాగంలో డైరెక్ట్ కొశ్చన్స్ దాదాపు 50 వరకు ఉండడం అభ్యర్థులకు ఉపశమనం కలిగించే అంశమని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కాగా అసెర్షన్ అండ్ రీజన్ విధానంలో అడిగిన 15 ప్రశ్నలకు విశ్లేషణాత్మక అధ్యయనం చేసినవారే సమాధానాలు ఇవ్వగలరని పేర్కొంటున్నారు. 10 ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.రాజ్యాంగంలోని అంశాలు, వాటిని ఏ దేశాల నుంచి సంగ్రహించారు? ఏ ఆర్టికల్‌ను ‘రాజ్యాంగానికి హృదయం, ఆత్మ’ అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వరి్ణంచారు? భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో జోడించారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి సరైన అంశం? ఆర్టికల్ 365కు సంబంధించిన ప్రశ్న, సెక్యులర్ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? వంటి కోర్ పాలిటీ ప్రశ్నలు అడిగారు.అదేవిధంగా రాజ్యాంగ బద్ధ సంస్థలైన కాగ్, ఎన్నికల సంఘం, యూనియన్ పబ్లిక్ సర్విస్ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? భారత ప్రభుత్వ చట్టం, లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013 అమల్లోకి వచ్చిన సంవత్సరం? 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ? వంటి ప్రశ్నలు, అశోక్‌మెహతా, రాజమన్నార్ కమిటీలపై ప్రశ్నలు కోర్ సిలబస్ నుంచే ఉన్నాయని సబ్జెక్ట్ నిపుణులు చెబుతున్నారు. పేపర్–1కు సంబంధించి సిలబస్‌ను పూర్తిగా చదివిన వారికి 150 మార్కులకు గాను 110కి పైగా మార్కులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.పేపర్–2.. ఎకానమీ, ఎస్ అండ్ టీ.. ఇక.. రెండో పేపర్లో ఎకానమీ విభాగంలో ఎక్కువ శాతం ప్రశ్నలు సమకాలీన అంశాల నుంచే వచ్చాయి. కోర్ అంశాల నుంచి 15 వరకు మాత్రమే ప్రశ్నలు ఉన్నాయి. ఆయా విభాగాలకు సంబంధించి తాజా గణాంకాలు, పాలసీలు (రైతు భరోసా కేంద్రాలు, జల్ జీవన్ మిషన్, గోకుల్ మిషన్, పూర్వోదయ తదితర పథకాలు) గురించి ప్రశ్నలు అడిగారు. అయితే వీటిలో ఎక్కువ శాతం ప్రశ్నలు అసెర్షన్ అండ్ రీజన్, మ్యాచింగ్ టైప్ విధానంలో ఉండడంతో అభ్యర్థులకు సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదు. కోర్ అంశాలపైనే దృష్టి సారించినవారు కొంత ఇబ్బంది పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేపర్–2లోని సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఎక్కువగా పర్యావరణ కాలుష్యం, కాలుష్య కారకాలు, వ్యర్థాలు, వ్యాధులు, వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, పక్షులు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ప్రశ్నలు అడిగారు. అదే విధంగా పథకాలు (ఆయుష్మాన్ భారత్, ఆరోగ్య మిత్ర, స్వచ్ఛ్ భారత్ అభియాన్ తదితర) నుంచి ప్రశ్నలు వచ్చాయి. టెక్నాలజీకి సంబంధించి డిజిటల్ అరెస్ట్, పవన శక్తి ఉత్పాదనలో భారత్ స్థానం, బ్రహ్మోస్ క్షిపణి సంబంధిత ప్రశ్నలు వచ్చాయి.ఈ విభాగంలోనూ ఎక్కువగా మ్యాచింగ్ టైప్ కొశ్చన్స్, అసెర్షన్ అండ్ రీజన్ కొశ్చన్స్ ఉన్నాయి. తాజా పరిణామాలు (ఇటీవల ప్రయోగాలు)పై ఎక్కువ ప్రశ్నలు లేకపోవడం గమనార్హం. ఈ విభాగంలో ప్రశ్నలకు.. కోర్ సబ్జెక్ట్‌ను పూర్తిగా ఆకళింపు చేసుకున్న వారే సరైన సమాధానాలు ఇవ్వగలిగి ఉంటారని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా గ్రూప్–2 మెయిన్స్ పేపర్–2లో.. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ సాగించిన అభ్యర్థులు 110–120 మార్కులు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.కోర్ టాపిక్స్ నుంచే.. గ్రూప్–2 మెయిన్స్ పేపర్–1 ఎంతో సులభంగా ఉంది. ప్రిలిమ్స్‌తో పోల్చితే దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. అభ్యర్థులు అసెర్షన్ అండ్ రీజన్ కొశ్చన్స్ విషయంలో కొంత తికమక పడటం సహజం. మొత్తంగా చూస్తే ఓ మోస్తరు ప్రిపరేషన్ సాగించిన వారు 115 మార్కులు, సిలబస్‌పై బాగా పట్టు సాధించినవారు అంతకంటే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. పేపర్–2లో సైన్స్ అండ్ టెక్నాలజీలో కోర్ టాపిక్స్‌కు ప్రాధాన్యం కనిపించింది. రెండు పేపర్లలోనూ ఎక్కువగా అసెర్షన్ అండ్ రీజన్, కాంబినేషన్ టైప్ కొశ్చన్స్ ఉన్నాయి. ప్రామాణిక మెటీరియల్ చదివిన వారు సమాధానాలు ఇచ్చే విధంగానే ప్రశ్నలు ఉన్నాయి. – కృష్ణప్రదీప్, డైరెక్టర్, ట్వంటీఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ -
వెబ్సైట్లో గ్రూప్–2 మెయిన్స్ ‘కీ’
సాక్షి, అమరావతి: గ్రూప్–2 మెయిన్స్ ప్రాథమిక ‘కీ’ని కమిషన్ వెబ్సైట్లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ ప్రకటించింది.ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఈ నెల 25 నుంచి 27వరకు http://psc.ap.gov.in లో తెలపాలని విజ్ఞప్తి చేసింది. -
గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా.. ఉంటుందా? ఉండదా?
విజయవాడ, సాక్షి: గ్రూప్ 2(Group 2) అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. మెయిన్స్ పరీక్ష ఉంటుందా? ఉండదా? అనే గందరగోళం నెలకొంది. అందుకు ఏపీ ప్రభుత్వం చేసిన పనే కారణం. మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలంటూ APPSC సెక్రటరీకి లేఖ రాసింది. అయితే స్వయంగా ప్రభుత్వమే లేఖ రాసినా బోర్డు నుంచి ఇంతదాకా స్పందన లేదు. షెడ్యూల్ ప్రకారం రేపు(ఫిబ్రవరి 23, ఆదివారం) గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష ఉంది. రోస్టర్ తప్పులను సరి చేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థులు ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగొచ్చింది. ఆ పరీక్షను వాయిదా వేయాలంటూ శనివారం ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీకి లేఖ రాసింది. మార్చి 11న రోస్టర్ అంశంపై కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అఫిడవిట్ వేసేందుకు సమయం ఉంది కాబట్టి అప్పటిదాకా పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో ఏపీ ప్రభుత్వం కోరింది. అయితే.. మరోపక్క మెయిన్స్(Group 2 Mains Exam) వాయిదా పడింది అంటూ వస్తున్న కథనాలను ఇంతకుముందు బోర్డు కొట్టిపారేసింది. యధావిథిగా రేపు(23 ఫిబ్రవరి) పరీక్ష జరుగుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ విజ్ఞప్తిని బోర్డు పరిగణనలోకి తీసుకుంటుందా? ఏం జరగనుందా? అనే ఉత్కంఠ నెలకొంది.చట్టరీత్యా చర్యలు తప్పవుపలు సామాజిక మాధ్యమాల ద్వారా గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా అని సర్కులేట్ అవుతున్న వార్త అవాస్తవం. ఏపీపీఎస్సీ నుండి అందిన సమాచారం మేరకు గ్రూప్ -2 పరీక్షలు యథావిధిగా జరుగుతాయి. తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే చట్ట రీత్యా చర్యలు తీసుకుంటాం.:::తిరుపతి జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ -
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఎట్టకేలకు గ్రూప్-2 మెయిన్స్ షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ ప్రకటించింది. జూలై నాటికే పూర్తి కావాల్సిన గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది జనవరి 5న నిర్వహించనున్నారు. గత ప్రభుత్వ హయాంలో గత ఏడాది డిసెంబర్లో 899 పోస్టులతో గ్రూప్-2 నోటిఫికేషన్ జారీ చేసింది. ఫిబ్రవరిలో గ్రూప్-2 ప్రిలిమినరీ పరీక్షలు జరిగాయి. జూలై నాటికి గ్రూప్ -2 మెయిన్స్ పూర్తి చేసేవిధంగా నాటి ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్ నిర్ణయించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏపీపీఎస్సీ చైర్మన్ గౌతం సవాంగ్చే బలవంతపు రాజీనామా చేయించారు. నాలుగు నెలలగా చైర్మన్ లేకపోవడంతో గ్రూప్-1 , గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త చైర్మన్‌గా అనూరాధ బాధ్యతలు స్వీకరించడంతో గ్రూప్-2 మెయిన్స్‌కి ఏపిపిఎస్సీ షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పటికే గ్రూప్ -2 ప్రిలిమినరీ పరీక్షలో 92,250 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. వాయిదా పడిన గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్‌పైనా నిరుద్యోగుల్లో ఉత్కంఠ నెలకొంది. -
AP: గ్రూప్–2 మెయిన్స్‌లో ఇక రెండు పేపర్లే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 పోస్టులకు నిర్వహించే పరీక్ష విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పటివరకు గ్రూప్–2 మెయిన్స్‌ను మూడు పేపర్లలో నిర్వహిస్తుండగా వాటిని రెండుకు కుదించింది. ఈ మేరకు శుక్రవారం జీవో 6ను విడుదల చేసింది. పరీక్ష విధానం, సిలబస్‌పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. వీటిని ఆమోదిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్టును 150 మార్కులకు నిర్వహించేవారు. మెయిన్స్‌లో పేపర్–1 జనరల్ స్టడీస్ ఉండేది. అలాగే మరో రెండు పేపర్లుండేవి. పేపర్‌కు 150 చొప్పున 450 మార్కులకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించేవారు. ఈసారి నుంచి ఈ విధానంలో మార్పులు చేశారు. గతంలో మెయిన్స్‌లో పేపర్–1గా ఉన్న జనరల్ స్టడీస్‌ను రద్దు చేసి దాన్ని స్క్రీనింగ్ టెస్టుకు మార్చారు. దీన్ని గతంలో మాదిరిగానే 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇక మెయిన్స్‌ను రెండు పేపర్లకు తగ్గిస్తారు. ఒక్కో పేపర్‌కు 150 చొప్పున 300 మార్కులు ఉంటాయి. ఈ క్రమంలో మెయిన్స్ సిలబస్ అంశాల్లోనూ మార్పులు చేశారు. కొత్త విధానం ప్రకారం.. గ్రూప్–2 పరీక్ష, సిలబస్ మార్పులు ఇలా.. స్క్రీనింగ్ టెస్ట్: జనరల్ స్టడీస్ –మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు మెయిన్ పరీక్షలు పేపర్–1: (150మార్కులు) 1. సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీ సామాజిక చరిత్ర, సాంస్కృతోద్యమాలు) 2. జనరల్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెయిన్ పరీక్షలు పేపర్–2: (150మార్కులు) 1. ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ 2. సైన్స్ అండ్ టెక్నాలజీ -
గ్రూపు–2 అభ్యర్థుల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రూప్–2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. అభ్యర్థుల జాబితాను కమిషన్ నోటీస్ బోర్డులో ఉంచడంతో పాటు వైబ్సైట్లో కూడా పొందుపరిచినట్టు కమిషన్ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో పాటు 1:2 రేషియోలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 858 మంది అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఎంపిక చేసింది. మొత్తం 446 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. -
‘నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు’
-
‘నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాలు’
విశాఖపట్నం: నెలలోపు గ్రూప్-2 మెయిన్స్ ఫలితాల విడుదల చేస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్‌భాస్కర్ తెలిపారు. ఈ రోజు రాత్రి మూడు పేపర్లకు సంబంధించిన కీ విడుదల చేస్తామన్నారు. వెబ్సైట్ ద్వారా అభ్యంతరాలను స్వీకరించి నిపుణుల కమిటీకి పంపిస్తామని చెప్పారు. అనంతరం రివైజ్డ్ కీ విడుదల చేస్తామన్నారు. రివైజ్డ్ కీ విడుదల చేసిన మూడు రోజుల తర్వాత తుది కీ వెల్లడిస్తామని అన్నారు. గీతం యూనివర్సిటీ ఘటనలో సీసీ టీవీ ఫుటేజీ ద్వారా 41 మంది అభ్యర్థులను గుర్తించామని, వారిపై నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటామని ఉదయ్‌భాస్కర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 173 సెంటర్లలో 45,287 మంది గ్రూప్-2 మెయిన్స్‌కు హాజరయ్యారని వెల్లడించారు. -
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా
-
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20, 21 తేదీలలో నిర్వహించాల్సిన ఈ పరీక్షను.. తీవ్ర ఆందోళన కారణంగా జూలై 15, 16 తేదీలకు వాయిదా వేశారు. మొత్తం 985 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే.. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్ పరీక్షకు మధ్య కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఉండటంతో అది ఏమాత్రం సరిపోదని విద్యార్థులు గట్టిగా పట్టుబట్టారు. దానికి తోడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించి ప్రభుత్వానికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నందువల్ల పరీక్షను వాయిదా వేయడమే మంచిదని అందులో ఆయన సూచించారు. దానికి తోడు ఏపీపీఎస్సీ కూడా తమ వెబ్సైట్లో పరీక్ష నిర్వహించాలా, వాయిదా వేయాలా అన్న అంశంపై ఒక పోల్ నిర్వహించింది. అందులోనూ పరీక్షను వాయిదా వేయాలనే ఎక్కువమంది కోరినట్లు తెలిసింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 49 వేల మంది అభ్యర్థులు కూడా పరీక్ష వాయిదా వేయాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాతి పరిస్థితుల మీద తగిన మెటీరియల్ తమకు అందుబాటులో లేదని, ఇప్పుడిప్పుడే తెలుగు అకాడమీ పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి తమకు ప్రిపేర్ అయ్యేందుకు గడువు సరిపోదని చెప్పారు. ఇక వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో అయితే దాదాపుగా కార్యదర్శిని దిగ్బంధించారు కూడా. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇంతకుముందు గ్రూప్-3 మెయిన్స్ పరీక్ష జూలై 17న నిర్వహించాలని షెడ్యూలు నిర్ణయించారు. కానీ ఇప్పుడు గ్రూప్-2 మెయిన్స్ అయిన మర్నాడే అంటే అభ్యర్థులు ఇబ్బంది పడతారని దాన్ని కూడా నెలాఖరుకు.. అంటే జూలై 30వ తేదీకి వాయిదా వేశారు. -
గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడదు
-
గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్2 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ గత కొంతకాలంగా విన్నపాలు అందుతున్నాయని, అయితే ఆ విన్నపాల్లో సహేతుక కారణం ఒక్కటీ లేదని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ పేర్కొన్నారు. గ్రూప్–2 మెయిన్స్‌కు తగినంత సమయం ఇవ్వలేదని, ఈ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు పలువురు కోరుతున్న విషయం తెలిసిందే. వాయిదా వేయడానికి ఏపీపీఎస్సీ సుముఖంగా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా వారంతా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనల గురించి, అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అంశాల గురించి ‘సాక్షి’ ఏపీపీఎస్సీ చైర్మన్‌ను ప్రశ్నించింది. గ్రూప్2 మెయిన్స్ వాయిదా వేయడం వల్ల ఇప్పటికే వెలువరించిన నోటిఫికేషన్ల పరీక్షలకు ఆటంకం కలుగుతుందని, వచ్చే ఏడాదికి కూడా క్యాలెండర్‌ను విడుదల చేసినందున దానిపై కూడా ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. గత ఏడాదిలో దాదాపు 32 నోటిఫికేషన్లు ఇచ్చామని, వాటికి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తిచేసి వచ్చే ఏడాదికి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇప్పుడు 3 నెలల పాటు వాయిదా కోరుతున్నారని, అలా చేస్తే ఏదో ఒక నోటిఫికేషన్‌కు ఆటంకంగా మారుతుందన్నారు. ఇదే సమయంలో యూపీఎస్సీ, తెలంగాణతో సçహా ఇతర రాష్ట్రాలు ఏవైనా నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే వాయిదా వల్ల అదికూడా అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. గ్రూప్2 నోటిఫికేషన్ ఆరు నెలల క్రితం ఇచ్చామని, అప్పుడే ప్రిలిమ్స్, మెయిన్స్ ఏయే తేదీల్లో ఉంటుందో వివరించామని చైర్మన్ చెప్పారు. ఇదిలా ఉండగా ఈనెల 7వ తేదీన గ్రూప్1 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశామని చైర్మన్ తెలిపారు.