గ్రూప్‌–2 మెయిన్స్‌.. పేపర్‌–1 సులభం.. పేపర్‌–2 కొంచెం కఠినం | APPSC Group 2 Mains: Paper 2 Toughest Exam | Sakshi
Sakshi News home page

గ్రూప్‌–2 మెయిన్స్‌.. పేపర్‌–1 సులభం.. పేపర్‌–2 కొంచెం కఠినం

Published Mon, Feb 24 2025 3:39 AM | Last Updated on Mon, Feb 24 2025 3:39 AM

APPSC Group 2 Mains: Paper 2 Toughest Exam

పేపర్‌–1లో కోర్, ప్రామాణిక అంశాలు

పేపర్‌–2లో సమకాలీన అంశాలకు ప్రాధాన్యం 

పేపర్‌–1లో 115, పేపర్‌–2లో 110 కటాఫ్‌ అంచనా

సాక్షి, ఎడ్యుకేషన్‌: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఆదివారం నిర్వహించిన గ్రూప్‌–2 మెయిన్స్‌ పరీక్షలో పేపర్‌–1 సులభంగా ఉందని, పేపర్‌–2 ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని సబ్జెక్ట్‌ నిపుణులు చెబుతున్నారు. సిలబస్‌కు అనుగుణంగా ప్రిపరేషన్‌ సాగించినవారు, ప్రామాణిక మెటీరియల్‌తో సిద్ధమైనవారు సులువుగా సమాధానాలు గుర్తించేలా ప్రశ్నపత్రం ఉందంటున్నారు.

పేపర్‌–2లో ఎకానమీ, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాల నుంచి ఎక్కువ శాతం ఇటీవల పరిణామాలపై ప్రశ్నలు అడిగారని చెబుతున్నారు. అయితే రెండు పేపర్లలోనూ అసెర్షన్‌ అండ్‌ రీజన్, స్టేట్‌మెంట్‌ ఆధారిత ప్రశ్నల సంఖ్య ఎక్కువ ఉండటంతో అన్నింటికి సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదని అభ్యర్థులు పేర్కొంటున్నారు.   

పేపర్‌–1 కోర్‌ అంశాల నుంచే.. 
పేపర్‌–1లో రెండు సెక్షన్లలోనూ ప్రశ్నలు కోర్‌ అంశాల నుంచే ఉన్నాయి. సెక్షన్‌–ఎగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక, సాంస్కృతిక చరిత్ర విభాగం నుంచి 75 ప్రశ్నలు ఇచ్చారు. ఇందులో ఎక్కువ శాతం.. కవులు, శాసనాలు, ఆయా రాజ్య వంశాల కళలు, చారిత్రక కట్టడాలు, సాంస్కృతిక ఉద్యమాల నుంచే అడిగారు. చోళులు, చాళుక్యులు, కాకతీయులు గురించి ప్రశ్నలు ఉన్నాయి. అదే విధంగా నిజాం రాజుల గురించిన ప్రశ్నలు కూడా ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా ఆంధ్ర ప్రాంతంలో బ్రిటిష్‌ పాలనకు సంబంధించిన అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడిగారు.  

పేపర్‌–1 సెక్షన్‌ 2..   రాజ్యాంగానికి ప్రాధాన్యత 
పేపర్‌–1లోని సెక్షన్‌–2లో రాజ్యాంగ అధికరణలు, ప్రకరణలకు సంబంధించిన ప్రశ్నలకు ఎక్కువ ప్రాధాన్యం లభించింది. అయితే ఈ విభాగంలో డైరెక్ట్‌ కొశ్చన్స్‌ దాదాపు 50 వరకు ఉండడం అభ్యర్థులకు ఉపశమనం కలిగించే అంశమని సబ్జెక్టు నిపుణులు చెబుతున్నారు. కాగా అసెర్షన్‌ అండ్‌ రీజన్‌ విధానంలో అడిగిన 15 ప్రశ్నలకు విశ్లేషణాత్మక అధ్యయనం చేసినవారే సమాధానాలు ఇవ్వగలరని పేర్కొంటున్నారు. 10 ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉన్నాయని అభ్యర్థులు చెబుతున్నారు.

రాజ్యాంగంలోని అంశాలు, వాటిని ఏ దేశాల నుంచి సంగ్రహించారు?  ఏ ఆర్టికల్‌ను ‘రాజ్యాంగానికి హృదయం, ఆత్మ’ అని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వరి్ణంచారు? భారత రాజ్యాంగంలో తొలుత ఎన్ని షెడ్యూళ్లు ఉన్నాయి? ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక విధులను రాజ్యాంగంలో జోడించారు? 73వ రాజ్యాంగ సవరణ చట్టానికి సంబంధించి సరైన అంశం? ఆర్టికల్‌ 365కు సంబంధించిన ప్రశ్న, సెక్యులర్‌ అనే పదాన్ని ఏ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగ ప్రవేశికలో చేర్చారు? వంటి కోర్‌ పాలిటీ ప్రశ్నలు అడిగారు.

అదేవిధంగా రాజ్యాంగ బద్ధ సంస్థలైన కాగ్, ఎన్నికల సంఘం, యూనియన్‌ పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్, న్యాయ వ్యవస్థ, రాజ్యాంగాన్ని ఆమోదించిన తేదీ? భారత ప్రభుత్వ చట్టం, లోక్‌పాల్, లోకాయుక్త చట్టం–2013 అమల్లోకి వచ్చిన సంవత్సరం? 74వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ? వంటి ప్రశ్నలు, అశోక్‌మెహతా, రాజమన్నార్‌ కమిటీలపై ప్రశ్నలు కోర్‌ సిలబస్‌ నుంచే ఉన్నాయని సబ్జెక్ట్‌ నిపుణులు చెబుతున్నారు. పేపర్‌–1కు సంబంధించి సిలబస్‌ను పూర్తిగా చదివిన వారికి 150 మార్కులకు గాను 110కి పైగా మా­ర్కులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

పేపర్‌–2.. ఎకానమీ, ఎస్‌ అండ్‌ టీ.. 
ఇక.. రెండో పేపర్‌లో ఎకానమీ విభాగంలో ఎక్కువ శాతం ప్రశ్నలు సమకాలీన అంశాల నుంచే వచ్చాయి. కోర్‌ అంశాల నుంచి 15 వరకు మాత్రమే ప్రశ్నలు ఉన్నాయి. ఆయా విభాగాలకు సంబంధించి తాజా గణాంకాలు, పాలసీలు (రైతు భరోసా కేంద్రాలు, జల్‌ జీవన్‌ మిషన్, గోకుల్‌ మిషన్, పూర్వోదయ తదితర పథకాలు) గురించి ప్రశ్నలు అడిగారు. అయితే వీటిలో ఎక్కువ శాతం ప్రశ్నలు అసెర్షన్‌ అండ్‌ రీజన్, మ్యాచింగ్‌ టైప్‌ విధానంలో ఉండడంతో అభ్యర్థులకు సమాధానాలు గుర్తించడానికి సమయం సరిపోలేదు. కోర్‌ అంశాలపైనే దృష్టి సారించినవారు కొంత ఇబ్బంది పడ్డారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పేపర్‌–2లోని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ నుంచి ఎక్కువగా పర్యావరణ కాలుష్యం, కాలుష్య కారకాలు, వ్యర్థాలు, వ్యాధులు, వ్యవసాయం, సేంద్రియ ఎరువులు, పక్షులు, అంతర్జాతీయ ఒప్పందాల నుంచి ప్రశ్నలు అడిగారు. అదే విధంగా పథకాలు (ఆయుష్మాన్‌ భారత్, ఆరోగ్య మిత్ర, స్వచ్ఛ్‌ భారత్‌ అభియాన్‌ తదితర) నుంచి ప్రశ్నలు వచ్చాయి. టెక్నాలజీకి సంబంధించి డిజిటల్‌ అరెస్ట్, పవన శక్తి ఉత్పాదనలో భారత్‌ స్థానం, బ్రహ్మోస్‌ క్షిపణి సంబంధిత ప్రశ్నలు వచ్చాయి.

ఈ విభాగంలోనూ ఎక్కువగా మ్యాచింగ్‌ టైప్‌ కొశ్చన్స్, అసెర్షన్‌ అండ్‌ రీజన్‌ కొశ్చన్స్‌ ఉన్నాయి. తాజా పరిణామాలు (ఇటీవల ప్రయోగాలు)పై ఎక్కువ ప్రశ్నలు లేకపోవడం గమనార్హం. ఈ విభాగంలో ప్రశ్నలకు.. కోర్‌ సబ్జెక్ట్‌ను పూర్తిగా ఆకళింపు చేసుకున్న వారే సరైన సమాధానాలు ఇవ్వగలిగి ఉంటారని సబ్జెక్ట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. మొత్తంగా గ్రూప్‌–2 మెయిన్స్‌ పేపర్‌–2లో.. పూర్తి స్థాయిలో ప్రిపరేషన్‌ సాగించిన అభ్యర్థులు 110–120 మార్కులు పొందే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

కోర్‌ టాపిక్స్‌ నుంచే.. 
గ్రూప్‌–2 మెయిన్స్‌ పేపర్‌–1 ఎంతో సులభంగా ఉంది. ప్రిలిమ్స్‌తో పోల్చితే దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రశ్నలు అడిగారు. అభ్యర్థులు అసెర్షన్‌ అండ్‌ రీజన్‌ కొశ్చన్స్‌ విషయంలో కొంత తికమక పడటం సహజం. మొత్తంగా చూస్తే ఓ మోస్తరు ప్రిపరేషన్‌ సాగించిన వారు 115 మార్కులు, సిలబస్‌పై బాగా పట్టు సాధించినవారు అంతకంటే ఎక్కువ మార్కులు పొందే అవకాశం ఉంది. పేపర్‌–2లో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో కోర్‌ టాపిక్స్‌కు ప్రాధాన్యం కనిపించింది. రెండు పేపర్లలోనూ ఎక్కువగా అసెర్షన్‌ అండ్‌ రీజన్, కాంబినేషన్‌ టైప్‌ కొశ్చన్స్‌ ఉన్నాయి. ప్రామాణిక మెటీరియల్‌ చదివిన వారు సమాధానాలు ఇచ్చే విధంగానే ప్రశ్నలు ఉన్నాయి. 
– కృష్ణప్రదీప్, డైరెక్టర్, ట్వంటీఫస్ట్‌ సెంచరీ ఐఏఎస్‌ అకాడమీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement