
ఈనెల 30లోగా ఫీజు చెల్లింపునకు అవకాశం
అపరాధ రుసుముతో మే 5 వరకు గడువు
మే 19 నుంచి 24 వరకు పరీక్షలు
మే 28 వరకు రెగ్యులర్ టెన్త్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
హెచ్ఎంల లాగిన్ల నుంచి మాత్రమే ఫీజుల చెల్లింపులకు అనుమతి
రెగ్యులర్ టెన్త్, ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఒకేసారి పరీక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలతోపాటే ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మే 19 నుంచి 24 వరకు ఓపెన్ టెన్త్, ఇంటర్మీడియెట్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసింది.
ఇటీవల విడుదల చేసిన ఫలితాల ప్రకారం పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు సప్లిమెంటరీలో భాగంగా అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో ఈ నెల 26వ తేదీ(నేటి) నుంచి 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని కోరింది. ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను మే 26 నుంచి 30వరకు నిర్వహించనుంది.
పరీక్ష ఫీజు ఇలా..
పదో తరగతిలో సబ్జెక్టుకు రూ.100, ఇంటర్మీడియెట్ థియరీ పరీక్షకు రూ.150, ప్రాక్టికల్ పరీక్షకు రూ.100 చొప్పున నిర్ణీత వ్యవధిలో పరీక్ష ఫీజుగా చెల్లించాలని సూచించింది. ఓపెన్ ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులు కాని అభ్యర్థులు పాసైన సబ్జెక్టులో మాత్రమే బెటర్మెంట్ కోసం థియరీకి రూ.250, ప్రాక్టికల్‌కు రూ.100, అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులై ఇంప్రూవ్మెంట్ కోరుకునే అభ్యర్థులు పదో తరగతిలో రూ.200, ఇంటర్మీడియెట్ థియరీకి రూ.300, ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాలని కోరింది.
ఈనెల 30 నుంచి మే 2 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.25, మే4 వరకు ప్రతి సబ్జెక్టుకు రూ.50 అపరాధ రుసుంతో, మే 5న తత్కాల్ రుసుముతో పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు విధించింది. తత్కాల్ రుసుము పదో తరగతికి అయితే రూ.500, ఇంటర్మీడియెట్‌కు రూ.1000గా పేర్కొంది. www.apopenschool.ap.gov.in వెబ్సైట్ ద్వారా సప్లిమెంటరీ పరీక్ష ఫీజులను చెల్లించాలని సార్వత్రిక విద్యా పీఠం డైరెక్టర్ ఆర్.నరసింహారావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
మే 18 వరకు ఫీజు చెల్లింపునకు గడువు
పదో తరగతి రెగ్యులర్ ఫలితాల్లో విఫలమైన విద్యార్థులకు మే 19 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది. ఇప్పటికే పాఠశాలల హెచ్ఎంలు ఆన్లైన్లో ఈనెల 30లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది. మే 1నుంచి 18 వరకు రూ.50 అపరాధ రుసుముతో ఫీజు చెల్లించేందుకు గడువు ఇచ్చింది. స్కూల్ లాగిన్ల నుంచి మాత్రమే చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. మే 19 నుంచి 28వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనుంది.