ప్రభుత్వానికి టైమ్ టేబుల్ పంపిన పాఠశాల విద్యా శాఖ
ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు 100 రోజుల యాక్షన్ ప్లాన్
ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లోనూ ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశం
సెలవు రోజులను మినహాయించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను మార్చి 15వ తేదీ నుంచి నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ భావిస్తోంది. మార్చి నెలాఖరుకల్లా పరీక్షల ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్‌ను ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు తెలిసింది. ఇతర పరీక్షల షెడ్యూళ్లు కూడా పరిగణనలోకి తీసుకుని.. పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.
మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకని పాఠశాల విద్యా శాఖ 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను విడుదల చేసింది. టైమ్ టేబుల్‌తో కూడిన ప్రణాళికను పాఠశాల విద్య డైరెక్టర్ విజయ్ రామరాజు సోమవారం రాష్ట్రంలోని అన్ని మెనేజ్‌మెంట్లలోని ఉన్నత పాఠశాలలకు పంపించారు.
ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆరు సెషన్లలో తరగతులు నిర్వహించాలని.. ఈనెల ఒకటో తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ప్రత్యేక ప్రణాళిక అమలు చేయాలని ఆదేశించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోయేలా స్లిప్ టెస్టులు నిర్వహించాలని.. చదువులో వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు.
ఆదివారాలతో పాటు సెలవు దినాల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని స్పష్టం చేశారు. శిక్షణ అనంతరం విద్యార్థులను ఇంటికి పంపే వరకు ఉపాధ్యాయులు పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 7న జరిగే పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో దీనిపై చర్చించాలని.. ఉపాధ్యాయులు సెలవు రోజుల్లో పనిచేసినందుకు ప్రత్యేక సీసీఎల్ మంజూరు చేస్తామని చెప్పారు. మెరిట్ విద్యార్థులకు అదనపు అభ్యాసాలు ఇవ్వాలని.. అభ్యసన ప్రణాళికలను తల్లిదండ్రులకు కూడా వివరించాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు.
సెలవు రోజులను మినహాయించాలి..
పదో తరగతి యాక్షన్ ప్లాన్ షెడ్యూల్‌లో సెలవు రోజులను మినహాయించాలని విద్యా శాఖను ఏపీటీఎఫ్ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ కోరారు. ఇంకా సిలబస్ పూర్తి కానందున కార్యాచరణ ప్రణాళికను సమ్మేటివ్–1 పరీక్షల అనంతరం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించాలని.. సగటు విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రతి సబ్జెక్టుకూ ముఖ్య ప్రశ్నలను రూపొందించి పుస్తకాలు అందించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment