గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా పడదు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయే గ్రూప్2 మెయిన్స్‌ను వాయిదా వేయాలంటూ గత కొంతకాలంగా విన్నపాలు అందుతున్నాయని, అయితే ఆ విన్నపాల్లో సహేతుక కారణం ఒక్కటీ లేదని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్‌భాస్కర్ పేర్కొన్నారు. గ్రూప్–2 మెయిన్స్‌కు తగినంత సమయం ఇవ్వలేదని, ఈ పరీక్షలను 3 నెలలు వాయిదా వేయాలని అభ్యర్థులు పలువురు కోరుతున్న విషయం తెలిసిందే. వాయిదా వేయడానికి ఏపీపీఎస్సీ సుముఖంగా లేకపోవడంతో గత కొద్ది రోజులుగా వారంతా ఆందోళనలు చేపడుతున్నారు. ఈ ఆందోళనల గురించి, అభ్యర్థులు లేవనెత్తుతున్న పలు అంశాల గురించి ‘సాక్షి’ ఏపీపీఎస్సీ చైర్మన్‌ను ప్రశ్నించింది.
గ్రూప్2 మెయిన్స్ వాయిదా వేయడం వల్ల ఇప్పటికే వెలువరించిన నోటిఫికేషన్ల పరీక్షలకు ఆటంకం కలుగుతుందని, వచ్చే ఏడాదికి కూడా క్యాలెండర్‌ను విడుదల చేసినందున దానిపై కూడా ప్రభావం పడుతుందని ఆయన చెప్పారు. గత ఏడాదిలో దాదాపు 32 నోటిఫికేషన్లు ఇచ్చామని, వాటికి సంబంధించిన పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్ నాటికి పూర్తిచేసి వచ్చే ఏడాదికి నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
ఇప్పుడు 3 నెలల పాటు వాయిదా కోరుతున్నారని, అలా చేస్తే ఏదో ఒక నోటిఫికేషన్‌కు ఆటంకంగా మారుతుందన్నారు. ఇదే సమయంలో యూపీఎస్‌సీ, తెలంగాణతో సçహా ఇతర రాష్ట్రాలు ఏవైనా నోటిఫికేషన్లు ఇచ్చి ఉంటే వాయిదా వల్ల అదికూడా అభ్యర్థులకు నష్టం కలిగిస్తుందని చెప్పారు. గ్రూప్2 నోటిఫికేషన్ ఆరు నెలల క్రితం ఇచ్చామని, అప్పుడే ప్రిలిమ్స్, మెయిన్స్ ఏయే తేదీల్లో ఉంటుందో వివరించామని చైర్మన్ చెప్పారు. ఇదిలా ఉండగా ఈనెల 7వ తేదీన గ్రూప్1 పరీక్షలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిచేశామని చైర్మన్ తెలిపారు.