ఏపీ గ్రూప్–2పై అపోహలకు తావులేదు
♦ పక్కపక్కనే ఉన్నా ఒకరికి వచ్చే ప్రశ్నపత్రం మరొకరికి రాదు
♦ 26న ఉదయం 10 గంటలకు స్క్రీనింగ్ టెస్ట్
♦ 9.45 దాటితే పరీక్షా కేంద్రంలోకి నో ఎంట్రీ
♦ ఏపీపీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 982 గ్రూప్–2 పోస్టుల భర్తీకి సంబంధించి ఈనెల 26న నిర్వహించనున్న ప్రిలిమ్స్(స్క్రీనింగ్ టెస్టు)కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ తెలిపారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 1,376 పరీక్షా కేంద్రాలు, తెలంగాణలోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 86 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. కొంతమంది కలసి ఒకేసారి ఆన్లైన్ దరఖాస్తు చేయడం వల్ల పక్కపక్కనే హాల్టిక్కెట్ల నంబర్లు వచ్చాయని, వారు మాస్‌కాపీయింగ్ చేసే అవకాశముందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.
నిమిషానికి 200, సెకనుకు 3 చొప్పున దరఖాస్తులు అప్లోడ్ అవుతాయని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సమయానికి వేల మంది దరఖాస్తు చేస్తుంటారని, అందువల్ల కలసి దరఖాస్తు చేసేవారికి పక్కపక్కనే హాల్‌టికెట్ల నంబర్లు వచ్చే అవకాశం లేదన్నారు. ఒకవేళ పక్కపక్కనే ఉన్నా కూడా.. వారిలో ఒకరికి వచ్చే ప్రశ్నపత్రం కోడ్ మరొకరికి రాదని చెప్పారు. ఏ, బీ, సీ, డీలుగా నాలుగు సెట్ల ప్రశ్నపత్రాలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ఓఎమ్మార్ సమాధాన పత్రాల్లో రోల్‌నంబర్, సెట్కోడ్ను తప్పుగా నమోదు చేస్తే ఆ పత్రాలను మూల్యాంకనం చేయకుండా తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. గురువారం ఏపీపీఎస్సీ బోర్డు సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
గ్రూప్–2 ప్రిలిమ్స్‌కు 6,57,010 మంది దరఖాస్తు చేశారని, వీరిలో 5 లక్షల మందికి పైగా తమ హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పారు. 26న ఉదయం 10 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, 9 గంటల నుంచి అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తామని తెలిపారు. 9.45 తర్వాత అభ్యర్థులను లోపలకు అనుమతించబోమని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాలను ముందుగానే చూసుకుంటే సకాలంలో పరీక్షకు హాజరుకావచ్చని వివరించారు. కాగా అన్ని పరీక్షా కేంద్రాల సమాచారాన్ని ఏపీపీఎస్సీ వెబ్సైట్లో పొందుపరిచారు. అభ్యర్థులకు ఏవైనా సమస్యలు ఏర్పడితే 040–24603493, 94, 95, 96 నంబర్లను సంప్రదించవచ్చు. అలాగే నమూనా ఓఎమ్మార్ షీట్లను వెబ్సైట్లో పొందుపరిచారు.
వచ్చేవారంలో 2011 గ్రూప్–1 రివైజ్డ్ మెరిట్ జాబితా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇంతకు ముందు నిర్వ హించిన 2011 గ్రూప్–1 మెయిన్స్‌కు సం బంధించి సవరించిన జాబితాను వచ్చే వారంలో విడుదల చేయనుంది. ఈమేరకు కమిషన్ కసరత్తు కొలిక్కి వచ్చిందని కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఉదయభాస్కర్, కార్యదర్శి సాయి తెలిపారు. ఈసారి న్యాయవివాదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. 2011 గ్రూప్–1కు సంబంధించి తొలినుంచి అనేక ఆటంకాలు ఎదురవుతూ వచ్చిన సంగతి తెలిసిందే.