గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20, 21 తేదీలలో నిర్వహించాల్సిన ఈ పరీక్షను.. తీవ్ర ఆందోళన కారణంగా జూలై 15, 16 తేదీలకు వాయిదా వేశారు. మొత్తం 985 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే.. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్ పరీక్షకు మధ్య కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఉండటంతో అది ఏమాత్రం సరిపోదని విద్యార్థులు గట్టిగా పట్టుబట్టారు. దానికి తోడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించి ప్రభుత్వానికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నందువల్ల పరీక్షను వాయిదా వేయడమే మంచిదని అందులో ఆయన సూచించారు. దానికి తోడు ఏపీపీఎస్సీ కూడా తమ వెబ్‌సైట్‌లో పరీక్ష నిర్వహించాలా, వాయిదా వేయాలా అన్న అంశంపై ఒక పోల్ నిర్వహించింది. అందులోనూ పరీక్షను వాయిదా వేయాలనే ఎక్కువమంది కోరినట్లు తెలిసింది.
ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 49 వేల మంది అభ్యర్థులు కూడా పరీక్ష వాయిదా వేయాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాతి పరిస్థితుల మీద తగిన మెటీరియల్ తమకు అందుబాటులో లేదని, ఇప్పుడిప్పుడే తెలుగు అకాడమీ పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి తమకు ప్రిపేర్ అయ్యేందుకు గడువు సరిపోదని చెప్పారు. ఇక వైఎస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో అయితే దాదాపుగా కార్యదర్శిని దిగ్బంధించారు కూడా. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇంతకుముందు గ్రూప్-3 మెయిన్స్ పరీక్ష జూలై 17న నిర్వహించాలని షెడ్యూలు నిర్ణయించారు. కానీ ఇప్పుడు గ్రూప్-2 మెయిన్స్ అయిన మర్నాడే అంటే అభ్యర్థులు ఇబ్బంది పడతారని దాన్ని కూడా నెలాఖరుకు.. అంటే జూలై 30వ తేదీకి వాయిదా వేశారు.