appsc exams
-
ఆంధ్రప్రదేశ్: డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభవార్త...
ఆంధ్రప్రదేశ్‌లో డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులకు శుభ వార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది! దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. గత కొద్ది రోజులుగా వరుస నోటిఫికేషన్లతో ప్రభుత్వ ఉద్యోగార్థుల్లో ఆశలు నింపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కీలక నోటిఫికేషన్‌తో ముందుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పలు శాఖల్లో ఇంజనీరింగ్ విభాగాల్లో.. అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్‌ల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. చదవండి: ఆర్ఆర్సీ– ఎన్సీఆర్లో భారీగా అప్రెంటిస్ ఖాళీలు మొత్తం పోస్టులు 190 ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు. ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది. అర్హతలు ► ఏపీ సబార్డినేట్ సర్వీస్ పరిధిలోని ఈ ఏఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునేందుకు డిప్లొమా, బీఈ/బీటెక్ అభ్యర్థులు అర్హులు. ► దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌ను అనుసరించి ఆయా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1,2021 నాటికి 18–42ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనలకు అనుగుణంగా గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. చదవండి: ఇండియన్ నేవీలో భారీగా ఉద్యోగాలు ఎంపిక విధానం రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా అసిస్టెంట్ ఇంజనీర్(ఏఈ) పోస్టులను భర్తీ చేస్తారు. రాత పరీక్షలో పొందిన మార్కులు, దరఖాస్తు చేసుకున్న పోస్ట్‌లు, అందుబాటులో ఉన్న ఖాళీలు, రిజర్వేషన్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని.. తుది విజేతల జాబితా విడుదల చేసి.. నియామకాలు ఖరారు చేస్తారు. రాత పరీక్ష ఇలా రాత పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌గా నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. ప్రశ్నపత్రం పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలోనే ఉంటుంది. పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 150 150ని 2 సివిల్/మెకానికల్ 150 150 150ని 3 ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/ సివిల్ 150 150 150ని ► పేపర్–3 పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో ఎన్విరాన్మెంట్/సివిల్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే (పోస్ట్ కోడ్–3) నిర్వహిస్తారు. ► పేపర్ 2 అన్ని శాఖల్లోని సివిల్/మెకానికల్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఉమ్మడిగా ఉంటుంది. ఈ ప్రశ్న పత్రం డిప్లొమా స్థాయిలో ఉంటుంది. ► నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా అమలు చేయనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి 1/3 మార్కులను తగ్గిస్తారు. విజయానికి మార్గం ఇదిగో పేపర్–1 ఇలా ► పేపర్–1 జనరల్ స్టడీస్‌లో.. జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ; ఏపీ, ఇండియా హిస్టరీ; పాలిటీ, గవర్నెన్స్; ఏపీలో అమలవుతున్న ఈ–గవర్నెన్స్ విధానాలు; ఆర్థికాభివృద్ధి అంశాలు, ఏపీలో ఆర్థికాభివృద్ధికి చేపడుతున్న చర్యలు; డిజాస్టర్ మేనేజ్మెంట్; ఏపీ, ఇండియా ఫిజికల్ జాగ్రఫీ అంశాలపై దృష్టి పెట్టాలి. ► అదేవిధంగా లాజికల్ రీజనింగ్‌కు సంబంధించి వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్, అర్థమెటిక్, డేటా ఇంటర్ప్రిటేషన్లను ప్రాక్టీస్ చేయాలి. ► డేటా అనాలిసిస్ విషయంలో డేటా విశదీకరణ, విశ్లేషణ, డేటా రూపకల్పన తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి. పేపర్–2లో ఉమ్మడిగా సివిల్, మెకానికల్ ఏఈ పోస్ట్‌లకు ఉమ్మడిగా నిర్వహించే పేపర్ ఇది. ఇందులో విజయానికి అభ్యర్థులు సాలిడ్ మెకానిక్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్‌లోని ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి. డిప్లొమా స్థాయిలో ప్రశ్నలు ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ అంశాలకు సంబంధించి డిప్లొమా లేదా బీటెక్ పుస్తకాలను చదవడం మేలు చేస్తుంది. అదే విధంగా ఏపీపీఎస్సీ గతంలో నిర్వహించిన ఏఈ ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. పేపర్–3లో రాణించాలంటే ► పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో.. ఎన్విరాన్మెంట్ ఏఈ పోస్ట్‌లకు మాత్రమే నిర్వహించే ఈ పేపర్లో ఎన్విరాన్మెంటల్/సివిల్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. వాటర్ సప్లయి ఇంజనీరింగ్, వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, వాయు, శబ్ద కాలుష్యం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్, వాటర్ రిసోర్సెస్ ఇంజనీరింగ్, సర్వేయింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ ఇంజనీరింగ్, ట్రాన్స్‌పోర్టేషన్ ఇంజనీరింగ్, సాలిడ్ మెకానిక్స్ అండ్ అనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చర్స్,డిజైన్ ఆఫ్ స్ట్రక్చర్స్,బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాక్టీస్ విభాగాల్లోని ముఖ్యాంశాలపై దృష్టి పెట్టాలి. ► ప్రధానంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించి పర్యావరణ పరిరక్షణ కోసం దేశంలో అమలవుతున్న విధానాలు,చేపడుతున్న చర్యలు,పర్యావరణ పరిరక్షణ చట్టాలపై అవగాహన పెంచుకోవాలి. సిలబస్ క్షుణ్నంగా అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న పోస్ట్‌లు, వాటికి సంబంధించి రాత పరీక్షలో పేర్కొన్న సిలబస్‌ను క్షుణ్నంగా పరిశీలించాలి. దాని ఆధారంగా తాము కొత్తగా చదవాల్సిన అంశాలతోపాటు, ఇప్పటికే అవగాహన ఉన్న టాపిక్స్‌పై స్పష్టత లభిస్తుంది. ఫలితంగా ప్రిపరేషన్లో ఏ అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలో ముందే నిర్ణయించుకోవాలి. దానికి అనుగుణంగా సమయ పాలనతో ముందుకు సాగాలి. అకడమిక్ పుస్తకాలు ► సిలబస్‌పై అవగాహన ఏర్పరచుకున్నాక..ఆయా అంశాలకు సంబంధించి బీటెక్ లేదా డిప్లొమా స్థాయిలోని అకడమిక్ పుస్తకాల ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్లో అప్లికేషన్ అప్రోచ్‌ను అనుసరించాలి. దీనివల్ల ప్రాక్టికల్ థింకింగ్ అలవడి, ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇవ్వగలిగే నేర్పు లభిస్తుంది. ► మోడల్ పేపర్లు, మాక్ టెస్ట్‌లు రాయడం పరీక్షలో మెరుగైన ప్రతిభ చూపేందుకు దోహదం చేస్తుంది. అదే విధంగా ఆయా బ్రాంచ్‌లకు సంబంధించి ఈసెట్, పీజీఈసెట్ తదితర ఇంజనీరింగ్ సెట్ల ప్రశ్న పత్రాలను సాధన చేయడం కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ► పేపర్–2లోని ప్రశ్నలు డిప్లొమా స్థాయిలోనే ఉంటాయని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. కాని అభ్యర్థులు బీటెక్ స్థాయిలోని అంశాలపైనా దృష్టిపెడితే విజయావకాశాలు మరింత మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. -
ఏపీపీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వివిధ పరీక్షల తేదీల్లో మార్పులు చేసింది. పరిపాలన కారణాల వల్ల పరీక్ష తేదీలను మార్చినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ఏకే మౌర్య శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మారిన పరీక్షల వివరాలు... పరీక్ష పేరు మారిన తేదీ అసిస్టెంట్ బీసీ/సోషల్/ట్రైబల్ వెల్ఫేర్ నవంబర్ 4, నవంబర్ 5 జిల్లా సైనిక వెల్ఫేర్ ఆఫీసర్లు నవంబర్ 5, నవంబర్ 6 ఏపీ మైనింగ్ సర్వీస్ రాయల్టీ ఇన్స్పెక్టర్స్ నవంబర్ 5 హైడ్రాలజీ టెక్నికల్ అసిస్టెంట్లు నవంబర్ 26 ఏపీ సైనిక్ వెల్ఫేర్ ఆర్గనైజర్లు నవంబర్ 26 -
గ్రూప్-2 పరీక్ష : ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, కీలకమైన గ్రూప్-2 పరీక్ష నిర్వహణలో అధికారులు పలు పొరపాట్లకు తావిచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం ఆలస్యం వెలుగుచూసింది. పరీక్షా కేంద్రం కేటాయించకుండానే గ్రూప్-2 పరీక్ష కోసం అభ్యర్థులకు అధికారులు హాల్ టికెట్లు పంపించారు. దీంతో పలువురు అభ్యర్థులు చిత్తూరులోని పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి.. హాల్టికెట్లలో పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా లేకపోవడంతో వెనుదిరిగారు. విజయనగరంలో 34 పరీక్షా కేంద్రాలు విజయనగరం జిల్లా లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష కోసం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 13,145 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మొత్తం 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు జరిగే ఈ పరీక్షకు 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టంచేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఫొటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలన్నారు. గ్రూప్-2 కోసం మొత్తం 2 లక్షల 95వేల 36 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకూ 2.30 లక్షలమందికి పైగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తం 727 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. -
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా
-
గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల వాయిదా
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20, 21 తేదీలలో నిర్వహించాల్సిన ఈ పరీక్షను.. తీవ్ర ఆందోళన కారణంగా జూలై 15, 16 తేదీలకు వాయిదా వేశారు. మొత్తం 985 పోస్టులకు సంబంధించి ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే.. ప్రిలిమ్స్‌కు, మెయిన్స్ పరీక్షకు మధ్య కేవలం 45 రోజుల గడువు మాత్రమే ఉండటంతో అది ఏమాత్రం సరిపోదని విద్యార్థులు గట్టిగా పట్టుబట్టారు. దానికి తోడు ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా దీనిపై స్పందించి ప్రభుత్వానికి లేఖ రాశారు. విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నందువల్ల పరీక్షను వాయిదా వేయడమే మంచిదని అందులో ఆయన సూచించారు. దానికి తోడు ఏపీపీఎస్సీ కూడా తమ వెబ్సైట్లో పరీక్ష నిర్వహించాలా, వాయిదా వేయాలా అన్న అంశంపై ఒక పోల్ నిర్వహించింది. అందులోనూ పరీక్షను వాయిదా వేయాలనే ఎక్కువమంది కోరినట్లు తెలిసింది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు క్వాలిఫై అయిన 49 వేల మంది అభ్యర్థులు కూడా పరీక్ష వాయిదా వేయాల్సిందేనని చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాతి పరిస్థితుల మీద తగిన మెటీరియల్ తమకు అందుబాటులో లేదని, ఇప్పుడిప్పుడే తెలుగు అకాడమీ పుస్తకాలు వస్తున్నాయి కాబట్టి తమకు ప్రిపేర్ అయ్యేందుకు గడువు సరిపోదని చెప్పారు. ఇక వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో అయితే దాదాపుగా కార్యదర్శిని దిగ్బంధించారు కూడా. దాంతో దిగొచ్చిన ప్రభుత్వం.. గ్రూప్-2 మెయిన్స్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. జూలై 15, 16 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే.. ఇంతకుముందు గ్రూప్-3 మెయిన్స్ పరీక్ష జూలై 17న నిర్వహించాలని షెడ్యూలు నిర్ణయించారు. కానీ ఇప్పుడు గ్రూప్-2 మెయిన్స్ అయిన మర్నాడే అంటే అభ్యర్థులు ఇబ్బంది పడతారని దాన్ని కూడా నెలాఖరుకు.. అంటే జూలై 30వ తేదీకి వాయిదా వేశారు. -
ఏపీపీఎస్సీ పరీక్ష గందరగోళం
కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు ఒకే నంబరుపై రెండు, మూడు హాల్‌టికెట్లు జారీ నామినల్ రోల్లో 99 మంది నంబర్లు గల్లంతు అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పరీక్ష గందరగోళంగా మారింది. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అసౌకర్యాల మధ్యే అభ్యర్థులు పరీక్ష రాయాల్సి. మరోవైపు అధికారుల తప్పిదం వల్ల 99 మంది అభ్యర్థుల నంబర్లు నామినల్ రోల్స్‌లో గల్లంతయ్యాయి. ఒకే నంబరుపై రెండు, నాలుగు హాల్‌టికెట్లు వచ్చాయి. నామినల్ రోల్స్‌లో నంబర్లు లేనివారు ఆందోళనకు గురయ్యారు. దీంతో స్థానిక అధికారులు ఏపీపీఎస్సీ అధికారుల ఆదేశాలతో మాట్లాడి నామినల్ రోల్లో నంబర్లు లేని అభ్యర్థులకు వేరుగా పరీక్ష రాయించారు. 12 కేంద్రాల్లో జరిగిన ఏఈఈ రాతపరీక్షకు 4,086 మంది అభ్యర్థులకు గానూ 3,083 మంది హాజరయ్యారు. అనంతపురంలోని చైతన్య జూనియర్ కళాశాలలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బెంచీలు లేకపోవడంతో అట్టను ఒడిలో పెట్టుకుని పరీక్ష రాశారు. కొందరు కుర్చి, స్టూల్‌పై ఉంచుకుని పరీక్ష రాశారు. పరీక్ష రాసేందుకు అనువైన వాతావరణ కల్పించకపోవడంపై అధికారులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, డీఆర్ఓ మల్లీశ్వరిదేవి సందర్శించారు. ఒకే నంబరుపై హాల్‌టికెట్లు ఒకే నంబరుపై ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులకు హాల్‌టికెట్లు జారీ అయ్యాయి. 612100312 నంబరుపై ఇద్దరికి, 6122011625 నంబరుపైన నలుగురికి హాల్‌టికెట్లు వచ్చాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఒకే హాల్ టికెట్ నంబర్ మరోకరిరావడంతో 99 మంది పేర్లు నామినల్ రోల్స్‌లో పేర్లు గల్లంతయ్యాయి. ఈ సందర్భంగా డీఆర్ఓ మల్లీశ్వరి దేవి మాట్లాడుతూ, ఏపీపీఎస్సీ సూచన మేరకు 99 మంది ఓఎంఆర్ షీట్లను, అభ్యర్థుల వివరాలను ప్రత్యేకంగా ఒక కవర్లో సీల్ చేసి పంపిస్తున్నామని తెలిపారు. -
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు శుభవార్త
విజయవాడ: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే నిరుద్యోగుల గరిష్ట వయో పరిమితిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచింది. అర్హత వయస్సును 42ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం శనివారం జీవో జారీ చేసింది. అన్ని ఉద్యోగాల ప్రవేశ పరీక్షలకు (ఏపీపీఎస్సీ, ఇతర నియామక సంస్థల నోటిఫికేషన్లు) ఈ వయో పరిమితి పెంపు ఉత్తర్వులు వర్తించనున్నాయి. దీని ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు.. ప్రస్తుతం ఉన్న వయోపరిమితిని 34 నుంచి 42 ఏళ్లకు పెంచారు. 2017 సెప్టెంబర్ 30వ తేదీ వరకు భర్తీ చేసే ఉద్యోగాలకు మాత్రమే ఈ పరిమితి వర్తించనుంది. -
ఎపీపీఎస్సీ కార్యాలయం ఎదుట ఆందోళన
హైదరాబాద్: జీవో 150ని వెంటనే రద్దు చేయాలని, గ్రూప్స్ పరీక్షలు పాత పద్దతి ప్రకారమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ.. గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట గురువారం గ్రూప్స్ అభ్యర్థులు జీవోను రద్దు చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొనడానికి పలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. ఏపీపీఎస్సీ కార్యాలయం ప్రధాన గేటు ఎదుట నిరసనకు దిగిన అభ్యర్థులు ఒక దశలో కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లడానికి యత్నించడంతో.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.