ఏపీపీఎస్‌సీ పరీక్ష గందరగోళం
కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కరువు
ఒకే నంబరుపై రెండు, మూడు హాల్‌టికెట్లు జారీ
నామినల్ రోల్‌లో 99 మంది నంబర్లు గల్లంతు
అనంతపురం అర్బన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు ఆదివారం నిర్వహించిన పరీక్ష గందరగోళంగా మారింది. కేంద్రాల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోవడంతో అసౌకర్యాల మధ్యే అభ్యర్థులు పరీక్ష రాయాల్సి. మరోవైపు అధికారుల తప్పిదం వల్ల 99 మంది అభ్యర్థుల నంబర్లు నామినల్ రోల్స్‌లో గల్లంతయ్యాయి. ఒకే నంబరుపై రెండు, నాలుగు హాల్‌టికెట్లు వచ్చాయి. నామినల్ రోల్స్‌లో నంబర్లు లేనివారు ఆందోళనకు గురయ్యారు.
దీంతో స్థానిక అధికారులు ఏపీపీఎస్‌సీ అధికారుల ఆదేశాలతో మాట్లాడి నామినల్ రోల్‌లో నంబర్లు లేని అభ్యర్థులకు వేరుగా పరీక్ష రాయించారు. 12 కేంద్రాల్లో జరిగిన ఏఈఈ రాతపరీక్షకు 4,086 మంది అభ్యర్థులకు గానూ 3,083 మంది హాజరయ్యారు. అనంతపురంలోని చైతన్య జూనియర్ కళాశాలలో పరీక్ష రాసేందుకు అభ్యర్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. బెంచీలు లేకపోవడంతో అట్టను ఒడిలో పెట్టుకుని పరీక్ష రాశారు. కొందరు కుర్చి, స్టూల్‌పై ఉంచుకుని పరీక్ష రాశారు. పరీక్ష రాసేందుకు అనువైన వాతావరణ కల్పించకపోవడంపై అధికారులతో అభ్యర్థులు వాగ్వాదానికి దిగారు. పరీక్ష కేంద్రాలను జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం, డీఆర్‌ఓ మల్లీశ్వరిదేవి సందర్శించారు.
ఒకే నంబరుపై హాల్‌టికెట్లు
ఒకే నంబరుపై ఇద్దరు నుంచి నలుగురు అభ్యర్థులకు హాల్‌టికెట్‌లు జారీ అయ్యాయి. 612100312 నంబరుపై ఇద్దరికి, 6122011625 నంబరుపైన నలుగురికి హాల్‌టికెట్లు వచ్చాయి. ఇలా జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల ఒకే హాల్ టికెట్ నంబర్ మరోకరిరావడంతో 99 మంది పేర్లు నామినల్ రోల్స్‌లో పేర్లు గల్లంతయ్యాయి. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మల్లీశ్వరి దేవి మాట్లాడుతూ, ఏపీపీఎస్‌సీ సూచన మేరకు 99 మంది ఓఎంఆర్ షీట్లను, అభ్యర్థుల వివరాలను ప్రత్యేకంగా ఒక కవర్లో సీల్ చేసి పంపిస్తున్నామని తెలిపారు.