సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, కీలకమైన గ్రూప్-2 పరీక్ష నిర్వహణలో అధికారులు పలు పొరపాట్లకు తావిచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం ఆలస్యం వెలుగుచూసింది. పరీక్షా కేంద్రం కేటాయించకుండానే గ్రూప్-2 పరీక్ష కోసం అభ్యర్థులకు అధికారులు హాల్ టికెట్లు పంపించారు. దీంతో పలువురు అభ్యర్థులు చిత్తూరులోని పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి.. హాల్‌టికెట్లలో పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా లేకపోవడంతో వెనుదిరిగారు.
విజయనగరంలో 34 పరీక్షా కేంద్రాలు
విజయనగరం జిల్లా లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష కోసం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 13,145 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మొత్తం 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.
ఉదయం పది గంటలకు జరిగే ఈ పరీక్షకు 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టంచేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఫొటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలన్నారు. గ్రూప్-2 కోసం మొత్తం 2 లక్షల 95వేల 36 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకూ 2.30 లక్షలమందికి పైగా హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారు. మొత్తం 727 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది.
Comments
Please login to add a commentAdd a comment