Hall tickets issue
-
నేటి నుంచి ‘సచివాలయ’ రాత పరీక్షల హాల్ టికెట్లు
సాక్షి, అమరావతి: ‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ వెబ్ పోర్టర్లలోనే హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ శుక్రవారం సూచించారు. శనివారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆన్లైన్ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు మొత్తం 12.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి సెప్టెంబర్ 1, 3, 4, 6, 7, 8 తేదీల్లో ఉదయం, సాయంత్రం.. రెండు పూటలా రాతపరీక్షలు జరుగుతాయి. -
గ్రూప్-2 పరీక్ష : ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష మరికాసేపట్లో జరగనుంది. ఈ పరీక్ష నిర్వహణకు ఏపీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, కీలకమైన గ్రూప్-2 పరీక్ష నిర్వహణలో అధికారులు పలు పొరపాట్లకు తావిచ్చినట్టు తెలుస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లాలో ఏపీపీఎస్సీ అధికారుల నిర్వాకం ఆలస్యం వెలుగుచూసింది. పరీక్షా కేంద్రం కేటాయించకుండానే గ్రూప్-2 పరీక్ష కోసం అభ్యర్థులకు అధికారులు హాల్ టికెట్లు పంపించారు. దీంతో పలువురు అభ్యర్థులు చిత్తూరులోని పరీక్షా కేంద్రాల వద్దకు వచ్చి.. హాల్టికెట్లలో పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా లేకపోవడంతో వెనుదిరిగారు. విజయనగరంలో 34 పరీక్షా కేంద్రాలు విజయనగరం జిల్లా లో గ్రూప్ 2 ప్రిలిమినరీ పరీక్ష కోసం 34 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షకు 13,145 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు పటిష్ట ఏర్పాట్లు చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో మొత్తం 30 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం పది గంటలకు జరిగే ఈ పరీక్షకు 9 గంటల నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఉదయం 9.45 గంటల తర్వాత ఏ ఒక్కరినీ పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని ఏపీపీఎస్సీ కార్యదర్శి స్పష్టంచేశారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్‌తో పాటు ఫొటో ఐడెంటిటీ కార్డు తప్పనిసరిగా వెంట తీసుకుని రావాలన్నారు. గ్రూప్-2 కోసం మొత్తం 2 లక్షల 95వేల 36 మంది దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకూ 2.30 లక్షలమందికి పైగా హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. మొత్తం 727 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. -
ఓయూ డిగ్రీ పరీక్షల్లో గందరగోళం!
సాక్షి, హైదరాబాద్: ఓయూలో జరుగుతున్న డిగ్రీ పరీక్షల హాల్ టికెట్ల ప్రక్రియ ప్రహసనంగా మారింది. మంగళవారం నుంచి ఓయూ డిగ్రీ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరగనున్నాయి. అయితే సోమవారం వరకు హాల్‌టికెట్ల రాకపోవడంతో విద్యార్థులు కంగారు పడుతున్నారు. మరికొన్ని కాలేజీలు అసలు కాలేజీకి హాల్‌టికెట్లు వచ్చాయో లేదోనన్న విషయాన్ని ఇంతవరకూ విద్యార్థులకు తెలపకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఓయూ పరిధిలో ముఖ్యంగా హైదరాబాద్‌లో పలు కాలేజీల వద్ద విద్యార్థులు హాల్‌టికెట్ల కోసం పడిగాపులు కాయడం కనిపించింది. అసలేం జరిగింది? ముందస్తు ఎన్నికల నేపథ్యంలో షెడ్యూలు ప్రకారం జరగాల్సిన ఓయూ సెమిస్టర్ పరీక్షల నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. జరుగుతాయని ఒకసారి, జరగవని మరోసారి, రకరకాలుగా ప్రచారం జరిగింది. 23 వరకు వర్సిటీ నుంచి ఎలాంటి సందేశం రాకపోవడంతో కళాశాల యాజమాన్యాలు సైతం ఈ విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయాయి. అకస్మాత్తుగా ఈనెల 24న వర్సిటీ నుంచి విద్యార్థుల హాల్‌టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో విద్యార్థులకు కళాశాలలు హాల్‌టికెట్లు ఇవ్వలేకపోయాయి. కొన్ని కాలేజీలు మాత్రం హాల్‌టికెట్లు వచ్చిన విషయాన్ని ఎస్సెమ్మెస్ ద్వారా పంపించాయి. మరికొన్ని కాలేజీలు ఈ విషయాన్ని కనీసం తెలపలేదు. దీంతో సోమవారం కళాశాలకు రాని విద్యార్థులకు అసలు హాల్‌టికెట్లు వచ్చిన విషయమే తెలియలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు సెంటర్ల మార్పు.. డిగ్రీ కాలేజీల సెంటర్లు పెద్దగా మారవు. కానీ ఎన్ని కల కారణంగా కొన్ని కాలేజీలను ఎన్నికల స్ట్రాంగ్‌రూంలుగా వాడుతున్నారు. దీంతో కొన్ని కాలేజీల సెంటర్లు మారిపోయాయి. ఈ విషయంలో యూనివర్సిటీ నుంచి హాల్‌టికెట్లు వచ్చేదాకా తమకు తెలియదని, తాము మాత్రం ఏం చేయగలమని కాలేజీ యాజమాన్యాలు చేతులెత్తేస్తున్నాయి. బ్లాక్ పెన్‌తోనే రాయాలి.. ఈసారి నిర్వహించబోయే పరీక్షల్లో స్వల్ప మార్పులు జరిగాయి. అక్టోబర్ నుంచి ఓయూ పరిధిలో ఆన్లైన్ మూల్యాంకనం ప్రవేశపెట్టారు. మార్కుల్లో అవకతవకలు, మూల్యాంకనంలో పారదర్శకత పెంచేందుకు ఈ విధానం ప్రవేశపెట్టారు. ఆన్లైన్ మూల్యాంకనంలో ఆన్సర్షీట్ స్పష్టంగా కనిపించాలంటే విద్యార్థులంతా బ్లాక్‌పెన్‌తోనే పరీక్ష రాయాలి. ఇప్పుడు హాల్‌టికెట్లు అందకపోవడంతో చాలామంది విద్యార్థులకు ఈ విషయం తెలియకుండా పోయిందని పలు కాలేజీల లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 24న హాల్‌టికెట్లు వచ్చాయి. ఆదివారం సెలవు కావడంతో సోమవారం హడావుడిగా విద్యార్థులకు ఇచ్చారు. మంగళవారం ఉదయం త్వరగా వస్తే తీసుకోని వారందరికీ హాల్‌టికెట్లు ఇస్తామని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. -
హాల్ టికెట్లలో వింతలు
శాతవాహనయూనివర్సిటీ : కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థులు పీజీ పరీక్షల హాల్‌టికెట్లు చూసి నివ్వెరపోయారు. శాతవాహనయూనివర్సి టీ పరిధిలోని కళాశాలల్లో పీజీ రెండో సెమి స్టర్ పరీక్షలు 17 తేదీ నుంచి 29 వరకు జరగనున్నాయి. మొదటి రోజైన గురువారం ఫండమెంటల్ ఆఫ్ కంప్యూటర్ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించారు. పరీక్షల హాల్టికెట్లలో అందరికీ అభ్యర్థుల ఫొటోలు ముద్రణ కాగా.. పలువురు విద్యార్థులకు మాత్రం తమ ఫొటోలకు బదులు పూల చిత్రాలు, సినీతారల ఫొటోలు వచ్చాయి. దాదాపుగా 35 మంది విద్యార్థులకు ఇలాగే జరిగింది. అవి చూసి ఖంగుతిన్న విద్యార్థులు పూలచిత్రాల స్థానంలో వారి పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు అతికించి కళాశాల స్టాంప్ వేయించుకుని వచ్చారు. వీటిని చూసిన సెంటర్ సిబ్బంది లోనికి అనుమతించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. అనంతరం కేంద్రం నిర్వాహకులు శాతవాహనయూనివర్సిటీ అధికారులతో మాట్లాడి.. తప్పులు దొర్లిన విద్యార్థులతో అండర్ టేకింగ్ లెటర్ రాయించుకుని లోనికి అనుమతించారు. ఇదంతా పూర్తయ్యేసరికి గంట సమయం పట్టడంతో విద్యార్థులు గంట ఆలస్యంగా పరీక్షా కేంద్రంలోకి వెళ్లారు. మరో పరీక్షకు హాల్‌టికెట్లు ఇలాగే తీసుకొస్తే లోనికి అనుమతించమని.. ప్రిన్సిపాల్ స్టాంప్, సంతకంతో ఉంటేనే పంపిస్తామని నిర్వాహకులు సూచించడం గమనార్హం. సాధారణంగా కళాశాల నుంచి అభ్యర్థుల ఫొటోలు, వివరాలు యూనివర్సిటీకి అప్లోడ్ చేస్తారు. అనంతరం యూనివర్సిటీ అధికారులు వాటిని పరీక్షించి సరిగా ఉన్నాయా లేదా చూసి హాల్‌టికెట్లు జారీ చేస్తారు. ఇది కళాశాల తప్పిదమా.. యూనివర్సిటీ తప్పిదమా అని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. దీనికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని వివిధ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. గతంలో పరీక్షల విషయంలో ఎన్నో తప్పిదాలు దొర్లినప్పటికీ శాతవాహన పరీక్షల విభాగం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తప్పుమీద తప్పులు చేస్తూనే ఉందని.. నిర్లక్ష్యం వీడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు నష్టం జరగనివ్వం.. పీజీ విద్యార్థులకు హాల్‌టికెట్‌లో ఫొటోలకు బదులు వేరే చిత్రాలు వచ్చింది వాస్తవమే. వారి కళా శాల నుంచే అప్లోడ్ చేయడం, ఇతర టెక్నికల్ కా రణాలతో ఇది జరిగింది. పరీక్షా కేంద్రానికి యూ నివర్సిటీ నుంచి సమాచారమందించి విద్యార్థుల ను లోనికి అనుమతించాం. విద్యార్థులు ఆలస్యం గా వెళ్లినా నిర్ణీత సమయం అందించడంతో పరీక్ష పూర్తి చేసుకున్నారు. – డాక్టర్ వి.మహేశ్, ఎగ్జామినేషన్ కంట్రోలర్ -
హాల్ టికెట్లు ఆపొద్దు: సీబీఎస్ఈ
న్యూఢిల్లీ: వివిధ కారణాలు చూపుతూ విద్యార్థులకు హాల్ టికెట్లు నిరాకరిస్తుండటంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) స్పందించింది. ఇటువంటి ఘటనలు తమ దృష్టికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. అంతర్గత పరీక్షల్లో మార్కులు సరిగ్గా రాలేదనే కారణంగా హాల్ టికెట్లు ఇవ్వటం లేదనీ, ఫీజులు వసూలు చేస్తున్నారనీ విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పలు ఫిర్యాదులు రావటంతో సీబీఎస్ఈ ఈ మేరకు పాఠశాలలకు సర్క్యులర్ జారీ చేసింది. మార్చి 5వ తేదీ నుంచి పది, పన్నెండు తరగతుల విద్యార్థులకు సీబీఎస్ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. -
ఫీజు కట్టు హల్ టికెట్ పట్టు!
కర్నూలులోని గణేశ్‌నగర్‌కు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి కుమార్తెకు టెన్త్ చదువుతున్న సమయంలోనే ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాల వారు ఫస్టియర్ ఎంపీసీలో అడ్మిషన్ ఇచ్చారు. అప్పట్లో రూ.30 వేలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. అయితే పుస్తకాలు, పరీక్షల పేరుతో అదనంగా రూ.5 వేలు వసూలు చేశారు. ప్రస్తుతం హాల్‌టికెట్ కావాలంటే మరో రూ.5 వేలు చెల్లించాలని కళాశాల సిబ్బంది తెగేసి చెప్పారు. అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక వారు హాల్‌టికెట్ కోసం కళాశాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. ‘ఇంటర్ విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వకుండా ఫీజులు, హాజరు శాతం పేరుతో వేధింపులకు గురి చేస్తే కళాశాలల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటాం’ ఇదీ శుక్రవారం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో ఇంటర్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మీ ఆదేశాలు. అయితే ఈ ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. కర్నూలు సిటీ: ఫీజుల విషయంలో ఉన్నతాధికారుల ఆదేశాలను జూనియర్ కళాశాలల యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ప్రధానంగా ఫీజులు కడితేనే హాల్ టికెట్ ఇస్తామని చెబుతుండడంతో విద్యార్థులతోపాటు తల్లిందండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 28 నుంచి పరీక్షలు మొదలు కానున్నాయి. జిల్లావ్యాప్తంగా 76,078 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఇందుకోసం 115 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కళాశాలల చుట్టూ ప్రదక్షణలు ఫీజులు చెల్లించలేదని ఒక కళాశాల, హాజరుశాతం తక్కువగా ఉందని మరో కళాశాల, పోటీ పరీక్షల కోసం కోచింగ్ పేరుతో ఇంకొన్ని కళాశాలలు ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అడ్మిషన్ సమయంలో ఫీజులో రాయితీ ఇస్తామని చెప్పి తీరా పరీక్షల సమయం వచ్చే సరికి ఫీజు మొత్తం చెల్లించాల్సిందేనని పట్టుబడుతున్నారు.సెకండియర్ విద్యార్థులకు గతేడాది కంటే అదనంగా రూ.10 వేలు, నీట్, ఎంసెట్ కోచింగ్ పేరుతో రూ.10 నుంచి రూ.20 వేల వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారు. ఈ విషయంపై కొంత విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా ఇంటర్ బోర్డు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. ఒక వైపు హాల్‌టికెట్లు అందకపోవడం, మరో వైపు పరీక్షల గడువు సమీపించడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హాజరుశాతం పేరుతో అడ్డగోలుగా వసూళ్లు! జిల్లావ్యాప్తంగా మొత్తం 226 జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలలు 42, ఆదర్శ 32, ప్రైవేటు 87, కార్పొరేట్ 18, ఇతర యాజమాన్యాల పరిధి 47 కళాశాలలున్నాయి. ప్రధానంగా ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో హాజరు శాతాన్ని బట్టి అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. 60 శాతం ఉంటే రూ.5 వేలు, 75 శాతం కంటే తక్కువగా ఉంటే రూ.2 వేల నుంచి రూ.3 వేల దాకా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మా దృష్టికి రాలేదు. జిల్లాలో ప్రైవేటు, కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. ప్రభుత్వ కళాశాలల్లో బోర్డు నిబంధనల ప్రకారం 75 శాతం హాజరు ఉంటేనే హాల్ టికెట్లు ఇస్తారు. ఆర్ట్స్ విద్యార్థులకు మాత్రం తక్కువగా ఉన్నా రూ.వెయ్యి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. – వై.పరమేశ్వరరెడ్డి, ఆర్ఐఓ -
టెట్ హాల్‌టికెట్ల జారీలో నిర్లక్ష్యం
ఒంగోలు: టీచర్స్ ఎలిజబిలిటీ టెస్టు (టెట్) హాల్ టికెట్ల జారీలో నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. దీని అనంతరం డీఎస్సీలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ఉన్న విద్యార్థులకు ఈ వ్యవహారం పిడుగుపాటుగా మారింది. స్థానికంగా కొప్పోలు రోడ్డులోని ఇందిరమ్మ కాలనీ 6వ లైనులో నివాసం ఉంటున్న ఎస్.సాయి పద్మిని టెట్ పరీక్షకు దరఖాస్తుచేసుకోగా ఇటీవల హాల్ టికెట్ నంబర్ 1710714314404 జారీ అయింది. అయితే ఆమెకు పరీక్ష కేంద్రం గుంటూరు జిల్లా నరసరావుపేటలోని చిలకలూరి పేట రోడ్డులో కేశనపల్లిలో ఉన్న కృష్ణచైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్‌ను కేటాయించారు. దీంతో ఆ సెంటర్‌ను విచారించుకునేందుకు కుటుంబ సభ్యులు అక్కడకు వెళ్లారు. తీరా ఎంత విచారించినా ఆ పేరుతో ఎటువంటి పరీక్ష కేంద్రం అక్కడ లేదు. దీంతో తమ కుమార్తె ఎలా పరీక్ష రాయాలో ఎలో రాయాలో తెలియక ఆందోళనతో బు«ధవారం రాత్రి మీడియాను ఆశ్రయించారు. పలువురు విద్యార్థులకు కూడా ఇలానే తప్పులు దొర్లాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అంతా ఆందోళన చెందుతున్నారు. అధికారులు జోక్యం చేసుకోవాలి: విద్యార్థిని తల్లి జ్యోతి టెట్ పరీక్ష రాయడం ద్వారా నాలుగేళ్లలోపు జరిగే టీచర్ పరీక్షలకు అర్హత ఉంటుంది. అయితే పరీక్ష కేంద్రం అడ్రెసే లేకపోతే పరీక్ష ఎలా రాయాలి? మేము ఇప్పటికే సెంటర్‌కోసం అనేక విధాలుగా తిరిగాం. కృష్ణ చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో మాత్రమే ఉంది. కానీ నరసరావుపేట , గుంటూరు జిల్లా అని హాల్‌టిక్కెట్‌లో ఇచ్చారు. తక్షణమే సెంటర్‌కు సంబంధించి స్పష్టత తెలియజేయాలి. -
19 నుంచి ఏపీ ఎంసెట్ హాల్‌టికెట్ల జారీ
కన్వీనర్ సీహెచ్ సాయిబాబు వెల్లడి సాక్షి, అమరావతి/బాలాజీచెరువు (కాకినాడ): ఏపీ ఎంసెట్–2017 హాల్‌టికెట్ల జారీ ఈ నెల 19 నుంచి ప్రారంభమవుతుందని సెట్ కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎంసెట్ ఈసారి పూర్తిగా ఆన్లైన్లో నిర్వహిస్తు న్నామని, ఇంజనీరింగ్ పరీక్షను ఏప్రిల్ 24, 25, 26వ తేదీల్లో, అగ్రికల్చర్ పరీక్షను ఏప్రిల్ 28న ఉదయం 10 నుంచి 1 గంట వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుందన్నారు. ఉర్దూ మాధ్యమం పరీక్ష రాయాలనుకొనేవారు కర్నూలులో మాత్రమే పరీక్షకు హాజరు కావాలి. ఏపీ ఎంసెట్‌కు రూ.వెయ్యి అపరాధ రుసుముతో ఈ నెల 10, రూ.5 వేల అపరాధ రుసుముతో ఈ నెల 17, రూ.10 వేల అపరాధ రుసుముతో ఈ నెల 22 వరకు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించుకోవచ్చునని చెప్పారు. ఏపీలో పలు నగరాలతో పాటు హైదరాబాద్‌లోని నాచారం, మౌలాలి, హయత్‌నగర్‌లలో 140 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. వివరాలకు 0884–2340535, 0884–2356255 నంబర్లలో onlineapeamcet2017@ gmail. com ద్వారా సంప్రదించవచ్చు.