
దేశవ్యాప్తంగా బ్యాంకుల బంద్‌కు సంబంధించి ముఖ్యమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. తమ డిమాండ్లపై ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) నుంచి సంతృప్తికరమైన హామీలు రావడంతో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెను విరమించాలని బ్యాంకింగ్ యూనియన్ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) నిర్ణయించింది.
యూఎఫ్‌బీయూ అనేది దేశవ్యాప్తంగా తొమ్మిది యూనియన్లకు చెందిన బ్యాంకు ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. యూఎఫ్‌బీయూ తొలుత మార్చి 24, 25 తేదీల్లో అంటే వచ్చే సోమ, మంగళ వారాలలో దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. శుక్రవారం అన్ని పార్టీలను సంప్రదింపుల సమావేశానికి పిలిచిన తర్వాత సమ్మెను వాయిదా వేయాలని చీఫ్ లేబర్ కమిషనర్ నిర్ణయించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.
వార్తా ఏజెన్సీ నివేదిక ప్రకారం.. ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఐబీఏ కార్మికులు లేవనెత్తిన డిమాండ్లపై చర్చిస్తామని యూనియన్‌కు హామీ ఇచ్చాయి. దీంతో వచ్చే వారం ప్రారంభంలో చేపట్టాలని నిర్ణయించిన సమ్మెను యూనియన్ విరమించినట్లు తెలుస్తోంది.
పనితీరు సమీక్షలు, పనితీరు సంబంధిత ప్రోత్సాహకాలపై ఇటీవల డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (డీఎఫ్ఎస్) మార్గదర్శకాలను ఉపసంహరించుకోవాలని యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఇటువంటి చర్యలు ఉద్యోగ భద్రతకు ముప్పును సృష్టిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. డీఎఫ్ఎస్ పేర్కొన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల "మైక్రో మేనేజ్మెంట్"ను కూడా యూఎఫ్‌బీయూ వ్యతిరేకిస్తోంది.
ఉద్యోగుల డిమాండ్లు..
ఐబీఏ వద్ద ఉన్న పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని, గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడం ద్వారా ఈ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పథకంతో అనుసంధానం, ఆదాయపు పన్ను మినహాయింపు వంటివి కూడా ప్రధాన డిమాండ్లలో ఉన్నాయి.
ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐబీఓసీ), నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ (ఎన్సీబీఈ), ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ (ఏఐబీఓఏ) వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు యూఎఫ్‌బీయూలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment