state assembly
-
తమిళనాడు పిటిషన్‌పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీస్
న్యూఢిల్లీ: రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల ఆమోదంలో గవర్నర్ తాత్సారం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం వేసిన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు స్పందన కోరింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జే/బీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఈ మేరకు నోటీసు జారీ చేసింది. రాజ్యాంగ బద్ధమైన ఒక అధికారం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందని, రాష్ట్ర ప్రభుత్వ విధులను అడ్డుకుంటోందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్లో ఆరోపించింది. జోక్యం చేసుకోవాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన 12 బిల్లులు గవర్నర్ ఆర్ఎన్ రవి వద్ద పెండింగ్‌లో ఉన్నాయని విచారణ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20న చేపడతామని తెలిపింది. -
Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి
న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే... ‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్ అధినియమ్‌కు కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘. వంటింటి నుంచి అంతరిక్షం దాకా... ‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘. స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి ‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్ కుమార్ అమృత్ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘. రాజీవ్ కల.. అప్పుడే సాకారం ‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘ మహిళా శక్తికి ప్రతీక ఇందిర... ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పాస్ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘. -
అసెంబ్లీలో చిత్ర విచిత్ర పరిస్థితులు
భువనేశ్వర్ : రాష్ట్ర శాసనసభలో చిత్ర విచిత్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార పక్షం బిజూ జనతా దళ్ ప్రగల్భాలు బట్టబయలవుతున్నాయి. న్యాయసమ్మతమైన శీర్షికలతో ప్రతిపక్షాలు సభలో ప్రస్తావించినా సభా కార్యక్రమాలకు పరోక్షంగా గండి కొట్టిస్తున్నందున ఇటీవల వరుసగా 3 రోజులపాటు అమూల్యమైన సభా కార్యక్రమాలకు నిరవధికంగా గండిపడిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ వివాదానికి తెరదించి తదుపరి సభా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగించేందుకు సభలో సభ్యుల గైర్హాజరు మరో ప్రధాన సమస్యగా నిలుస్తోంది. ప్రభుత్వం తప్పిదాలే కారణం రాజ్యాంగబద్ధమైన కార్యాచరణలో ప్రభుత్వం తప్పటడుగు వేసి ప్రతిపక్షాల్ని ప్రేరేపించి సభా కార్యక్రమాలకు గండి కొట్టిస్తున్న విషయాన్ని తాజా సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఏదోలా ప్రతిపక్షాలను బుజ్జగించి సభలో శాంతియుత వాతావరణం పునరుద్ధరించే సమయానికి అధికార పక్షం సభ్యులు సభా కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. దీంతో సభలో కనీస సభ్యుల హాజరు కొరవడుతోంది. బడ్జెట్ సమావేశంలో అత్యంత కీలకమైన బిల్లుల ఆమోదానికి ఈ పరిస్థితులు ప్రతికూలంగా నిలుస్తున్నాయి. ఇటువంటి దయనీయ పరిస్థితి గురువారం ఎదురైంది. లోకాయుక్త నియామకం జాప్యంపట్ల చెలరేగిన వివాదం అఖిల పక్ష సమావేశం తీర్మానం తర్వాత సభా కార్యక్రమాల నిర్వహణకు అనుకూలత ఏర్పడింది. ఈ సమయంలో అధికార పక్షం సభ్యులు సభలో అదృశ్యమయ్యారు. సభా కార్యక్రమాలు ప్రారంభమయ్యే సమయానికి సభలో నామమాత్రంగా 9 మంది సభ్యులు మాత్రమే దర్శనమిచ్చారు. మిగిలిన సభ్యులు అంతా సభా ప్రాంగణంలోకి విచ్చేసి హాజరు కావలసిందిగా స్పీకర్ అభ్యర్థించాల్సిన దయనీయ పరిస్థితులు తాండవించడం విచారకరం. సభా కార్యక్రమాలకు గంటమోగినా సభ్యుల జాడ కనబడకపోవడంతో అయోమయ పరిస్థితి నెలకొంది. గంట మోగిన ఒక నిమిషం తర్వాత సభలో సభ్యుల సంఖ్య మెల్లగా 10కి చేరుకుంది. మరో 2 నిమిషాల తర్వాత సభ్యుల హాజరు క్రమంగా 14 మంది వరకు పుంజుకుంది. సాయంత్రం 6.37 గంటల ప్రాంతంలో బడ్జెట్ వంటి కీలకమైన అంశంపై సభలో చర్చ సాగుతుండగా కోరం కొరత కనిపించడం విచారకరం. ప్రతిపక్షాల పెదవి విరుపు సభ్యుల గైర్హాజరు పట్ల ప్రతిపక్ష కాంగ్రెస్ పెదవి విరిచింది. సభలో బిల్లుల వ్యవహారాన్ని నిరవధికంగా నిర్వహించేందుకు కోరం లేకపోవడం విడ్డూరం. ఇటువంటి దయనీయ పరిస్థితుల నివారణపట్ల స్పీకర్ స్పందించాల్సి ఉందని కాంగ్రెస్ అభ్యర్థి, ఆలీ నియోజక వర్గం సభ్యుడు దేవేంద్ర శర్మ అభ్యర్థించారు. బడ్జెట్ సమావేశాల్లో మంత్రుల గైర్హాజరుపట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి మౌనంగా వాకౌట్ చేశారు. -
అర్హతల్లేనివారు పనిచేస్తున్నారు: ఆర్కే
సాక్షి, హైదరాబాద్: కనీస విద్యార్హతలు లేని వ్యక్తులు రాష్ట్ర శాసనసభలో ఉద్యోగులుగా పనిచేస్తున్నారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆరోపించారు. అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగుల విద్యార్హతల సమాచారం కోరుతూ ఆయన మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్‌ను సచివాలయంలో కలసి లేఖ సమర్పించారు. అసెంబ్లీలో పనిచేస్తున్న ఉద్యోగుల విద్యార్హతలపై సమాచారాన్ని అందించాలని ఆర్టీఐ(సమాచార హక్కు చట్టం) ద్వారా పది నెలల క్రితం కోరినా ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో సీఎస్‌తోపాటు గవర్నర్ నరసింహన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ అంశంపై హైకోర్టులో రిట్ పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. -
వెనిగళ్ల శ్రీకాంత్ ఎక్కడ?
► కాల్‌మనీ కేసులో కీలక నిందితుడు ఆరు నెలలుగా పరారీలోనే ► అధికార పార్టీ నేతల సహకారంతో అజ్ఙాతంలో ► శ్రీకాంత్ వద్ద అధికార పార్టీ నేతల పెట్టుబడులు ► తరచూ నగరానికి వస్తున్న శ్రీకాంత్! ► రాజకీయ ఒత్తిళ్లతో పట్టించుకోని పోలీసులు ► ఆరు నెలలు గడిచినా పురోగతి లేని కేసు సాక్షి, విజయవాడ : రాష్ట్రాన్ని కుదిపేసిన కాల్‌మనీ, సెక్స్‌రాకెట్ కేసు ప్రకంపనలు మళ్లీ నగరంలో మొదలయ్యాయి. కేసులో కీలక సూత్రధారి, ఏ-6 నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ మినహా మిగిలిన వారందరూ అరెస్టయ్యారు. కాల్‌మనీ వ్యవహారం వెలుగులోకి వచ్చి ఆరు నెలలు గడిచిపోయినా కీలక నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు కనీసం దృష్టి సారించకపోవటం గమన్హారం. ఈ క్రమంలో శ్రీకాంత్ పరారీలోనే ఉంటూ పాత వ్యవహారాలను చక్కబెట్టే పనుల్లో బిజీగా మారినట్లు సమాచారం. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ కోట్ల రూపాయలకు ఎదగడం వెనుక కాల్‌మనీ దందాలు, దాడులతో పాటు అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సహకారం, భారీ పెట్టుబడులు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఘటన... గత ఏడాది డిసెంబర్ 10న కాల్‌మనీ ముఠా ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మొగల్రాజపురానికి చెందిన ఓ బాధిత మహిళ నేరుగా నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేయటంతో వీరి గుట్టు బట్టబయలైంది. 11న యలమంచలి రాము కార్యాలయంపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు చేసిన క్రమంలో 25 వరకు సీడీలు (మహిళల్ని లోబర్చుకున్న వీడియోలు), 3 బస్తాల డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్ల బయటపడ్డాయి. దీంతో 12 మందిపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేశారు. దశలవారీగా నిందితుల అరెస్టులు జరిగాయి. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించటమే కాదు.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాష్ట్ర శాసనసభను కుదిపేసింది. ఆరో నిందితుడుగా ఉన్న వెనిగళ్ల శ్రీకాంత్ తనకు స్నేహితుడు మాత్రమేనని, అతని లావాదేవీలతో సంబంధం లేదని పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మీడియా సమావేశం పెట్టి మరీ వివరణ ఇచ్చుకోవటంతో పాటు అసెంబ్లీలోనూ దీనిపై వివరణ ఇచ్చుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో కమిషనరేట్ పోలీసులు కేసును పూర్తిస్థాయిలో ఛేదించామనే రీతిలో హడావుడి చేశారు. ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసి 1181 కాల్‌మనీ ఫిర్యాదులు తీసుకొని వాటిలో 1104 సెటిల్ చేసినట్లు ప్రకటించారు. అయితే ఇప్పటివరకు కీలక కేసులో నిందితుడిని మాత్రం గుర్తించి అరెస్టు చేయకపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది. కాపాడుతున్నది అధికార పార్టీ నేతలే! సిండికేట్ టీమ్‌లో సభ్యులందరూ ఒక్కో ప్రజాప్రతినిధి వద్ద పరపతి బాగా పెంచుకొని హవా సాగించారు. శ్రీకాంత్ కొంత దూకుడుగా ఉండి కాల్‌మనీ వ్యవహారాల్లో అనేక మందిపై దాడులు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ల కిత్రం రూ.20 లక్షల పెట్టుబడితో కాల్‌మనీ వ్యాపారం మొదలుపెట్టిన శ్రీకాంత్ అంచెలంచెలుగా ఎదిగాడు. దీని వెనుక అధికార పార్టీ నేతల పూర్తి సహకారం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా నగరానికి చెందిన ప్రజాప్రతినిధి, నగర సమీపంలోని నియోజకవర్గానికి చెందిన ఒక అధికార పార్టీ ప్రజాప్రతినిధి పెట్టుబడులు అతని వద్ద పెట్టినట్లు సమాచారం. వారి నగదు వ్యవహారం సెటిల్ అయ్యే వరకు శ్రీకాంత్‌ను దొరకకుండా కాపాడుతున్నారనే ఆరోపణ ఉంది. కాల్‌మనీ ముఠాకు రావాల్సిన బకాయిలు కూడా వసూలు చేసేందుకే అతన్ని పోలీసులు అరెస్టు చేయకుండా ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం. ఈ క్రమంలో పరారీలో ఉన్న శ్రీకాంత్ తరచూ విజయవాడ నగరానికి వస్తున్నట్లు తెలిసింది. గత వారంలో విజయవాడలో జరిగిన ఒక ఫంక్షన్‌కు కూడా శ్రీకాంత్ హాజరైనట్లు నిఘా వర్గాల కథనం. వివాదాలివీ... శ్రీకాంత్ పరారీ వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధుల హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులో 12 మంది నిందితులకు గాను శ్రీకాంత్ మినహా మిగిలిన వారంతా అరెస్టయ్యారు. ఘటన జరి గిన రోజు నుంచే శ్రీకాంత్ పరారీలో ఉన్నాడు. పోరంకి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌పై పటమట పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు ఉంది. గతంలో పటమట ప్రాంతానికి చెందిన ఒక డాక్టర్‌తో స్నేహంగా ఉంటూ చివరకు అతని తమ్ముడిపైనే దాడి చేశాడు. దీనిపై పంచాయితీ పోలీస్‌స్టేషన్‌కు చేరడంతో ఉయ్యూరుకు చెందిన ఒక అధికార పార్టీ నేత, హైదరాబాద్‌లో హత్యకు గురైన రౌడీషీటర్ ద్వారా వివాదాన్ని సెటిల్ చేయించుకున్నాడు. దీంతో శ్రీకాంత్ అప్పట్లో ఒక టీడీపీ నేతకు అనుచరునిగా మారిపోయాడు. కాలక్రమంలో సదరు నేత ప్రజాప్రతినిధి కావటంతో శ్రీకాంత్ ఆగడాలు మొదలయ్యాయి. వెంటనే సిండికేట్ టీమ్‌లో కీలక వ్యక్తిగా మారాడు. ఈ క్రమంలోనే తాము బిల్డింగ్ అద్దెకు తీసుకున్న భవన యజమానిపై దాడి చేశాడు. -
సభ సాగింది10 నిమిషాలే!
- తొలుత ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన స్పీకర్ మధుసూదనాచారి - మాఫీ, జీహెచ్ఎంసీ కార్మికుల తొలగింపుపై చర్చించాలని విపక్షాల పట్టు - మంత్రి తుమ్మల సమాధానం చెబుతున్నా ఆగని విపక్షాల ఆందోళన - స్పీకర్ పోడియం వద్దకు వచ్చి నినాదాలు.. గందరగోళం - సోమవారానికి సభను వాయిదా వేసిన స్పీకర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ గురువారం ప్రారంభమైన పది నిమిషాల్లోనే అర్ధంతరంగా వాయిదా పడింది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటు టీడీపీ, బీజేపీ, వామపక్షాలు వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టుబడుతూ ప్రశ్నోత్తరాలకు అడ్డుపడడం, పోడియం వద్ద సభ్యుల ఆందోళనతో సభలో గందరగోళం ఏర్పడడంతో ఎలాంటి చర్చ లేకుండానే స్పీకర్ మధుసూదనాచారి సభను సోమవారానికి వాయిదా వేశారు. గురువారం ఉదయం పది గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. వెంటనే రైతుల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని... జీహెచ్ఎంసీలో తొలగింపునకు గురైన 1,200 మంది పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సభ్యులు నినాదాలు ప్రారంభించారు. రైతుల రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని టి.జీవన్‌రెడ్డి సహా కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. రైతుల ఆత్మహత్యలపై చర్చ సందర్భంగా ప్రభుత్వం సరైన సమాధానం ఇవ్వలేదని మండిపడ్డారు. వీరికి టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు జతకలిశారు. ఈ సమయంలో విపక్షాల నిరసనను పట్టించుకోకుండా స్పీకర్ మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలకు అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అంగన్వాడీ సమస్యలపై అడిగిన ప్రశ్నను తొలుత లేవనెత్తారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు లేచి దీనికి సమాధానమిస్తున్నా... కాంగ్రెస్ సభ్యులు నిరసన కొనసాగించారు. నినాదాలు చేస్తూనే పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌తో వాదనకు దిగారు. రైతులకు వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా రుణమాఫీ చేయాలని, ఈ మేరకు ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని వారితోపాటు టీడీపీ, బీజేపీ, వామపక్షాల సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో స్పీకర్ మధుసూదనాచారి అనూహ్యంగా సభను సోమవారం(5వ తేదీ) నాటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక జీహెచ్ఎంసీలో తొలగించిన 1,200 మంది పారిశుద్ధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ బీజేపీ.. ఎర్రబెల్లి దయాకర్‌రావు అరెస్టు, టీఆర్ఎస్ ప్రొటోకాల్ పాటించడం లేదన్న అంశాలపై టీడీపీ.. వరంగల్ ఎన్‌కౌంటర్‌పై వామపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ అంతకుముందే తిరస్కరించారు. అంగన్వాడీ పోస్టులు భర్తీ: తుమ్మల అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలపై టీఆర్ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అడిగిన ప్రశ్నకు స్త్రీ,శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సమాధానమిచ్చారు. గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘ఆరోగ్యలక్ష్మి’ పథకం ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 30,700 అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని అందిస్తున్నామన్నారు. ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, అంగన్వాడీ కేంద్రాల కోసం వెయ్యి భవనాలు నిర్మించనున్నామని తెలిపారు. -
ముగిసిన ‘మండలి’ పోలింగ్
మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 38% వరంగల్-ఖమ్మం- నల్లగొండలో 58% పోలింగ్ ఈ నెల 25న ఓట్ల లెక్కింపు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనమండలి రెండు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఆదివారం జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఎక్కడా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గంలో 38 శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గంలో 31 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు దేవీప్రసాద్, రామచందర్‌రావులు విస్తృతంగా ప్రచారం చేశారు. ఉద్యోగులు ఓటర్లుగా అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనా... ఇది గతంలో (27.16 శాతం) కంటే 10.84 శాతం ఎక్కువ . ఈ నియోజకవర్గంలో 2,96,318 మంది ఓటర్లు ఉండగా వీరిలో 1,12,600 మందిఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా చూసినప్పుడు మహబూబ్‌నగర్‌లో 55 శాతం, రంగారెడ్డిలో 34 శాతం, హైదరాబాద్‌లో 29 శాతం పోలింగ్ నమోదైంది. ఇక, వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గంలో పోలింగ్ శాతం కొంత ఫర్వాలేదనిపించింది. ఈ నియోజకవర్గంలో 53 శాతం పోలింగ్ నమోదైంది. 22 మంది అభ్యర్థులు ఇక్కడ బరిలో ఉన్నారు. కాగా, 2,81,138 మంది ఓటర్లకు గాను 1,49,003 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. కాగా, వరంగల్‌లో 51.36 శాతం, ఖమ్మంలో 50.01 శాతం, నల్లగొండలో అత్యధికంగా 58 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు 25న జరగనుంది. హైదరాబాదు, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జరిగిన పట్టభద్రుల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల ప్రత్యేక క మిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఆదివారం చాదర్‌ఘాట్‌లోని విక్టరీ ప్లేగ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఎన్నికల పోలింగ్ వివరాలను ప్రకటించారు. ఎన్నికల కోసం మూడు జిల్లాల్లో 435 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 38 శాతం పోలింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 68,721 ఓట్లు ఉండగా 36,482 ఓట్లు వినియోగించుకున్నారని వివరించారు. రంగారెడ్డి జిల్లాలో 1,37,261 ఓట్లు ఉండగా 50,816 ఓట్లు, హైదరాబాదులో 90,336 ఓట్లు ఉండగా 26,142 ఓట్లను తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. మహబూబ్‌నగర్‌లో 55 శాతం, రంగారెడ్డిలో 34 శాతం, హైదరాబాదులో 29 శాతం ఓట్లు నమోదైనట్లు పేర్కొన్నారు. 2009లో పట్టభద్రుల స్థానానికి మొత్తం మీద మూడు జిల్లాల్లో 27 శాతం నమోదు కాగా ఈ సారి ఓటర్ల శాతాన్ని భేరీజు వేసుకుంటే 11 శాతం పెరిగినట్లు వెల్లడించారు. ఈ నెల 25న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని తెలియజేశారు. మొత్తం 28 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని ఒక్కో టేబుల్‌కు ముగ్గురు కౌంటింగ్ సూపరింటెండెంట్లు, ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లు పనిచేస్తారని చెప్పారు. పెరిగిన పోలింగ్ శాతాన్ని దృష్టిలో ఉంచుకుని టేబుల్స్, సిబ్బందిని పెంచినట్లు తెలిపారు. ఎన్నికల కౌంటింగ్ ఒకే రోజులో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి 23న ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఎన్నికల్లో ఈవీఎం మిషన్లు లేకపోవడం చేత కొంత ఆలస్యం కావచ్చని, ఆలస్యమైనా ఒకే రోజులో ఫలితాలు విడుదల చేస్తామని వెల్లడించారు. ఎన్నికల కౌంటింగ్‌లో ఏ అభ్యర్థికైనా 58 శాతం ఓట్లు మించకుంటే వారిని ఎలిమినేట్ చేయడం జరుగుతుందన్నారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు హైదరాబాద్ ఇస్సామియా బజార్‌లోని విక్టరీ ఇండోర్ స్టేడియంలో జరగనుంది. లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. వరంగల్-ఖమ్మం-నల్లగొండ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాలలో జరుగుతుంది. ఓట్ల లెక్కింపునకు ఇక్కడ 20 టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. దొంగ ఓటు వేసేందుకు యత్నించిన ఉపాధ్యాయుడి అరెస్ట్ దొంగఓటు వేసేందుకు యత్నించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఐఎస్‌సదన్ డివిజన్లోని జి.పద్మావతి మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌నంబర్ 379లో జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్ గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న మధుసూదన్‌గౌడ్ పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటువేయడానికి యత్నిస్తుండగా, అక్కడే ఉన్న టీఆర్ఎస్ నాయకుడు అడ్డుకున్నారు. స్థానికేతరుడైన మీరు ఇక్కడ ఓటు ఎలా వేస్తారని ప్రశ్నించారు. ఎలాంటి గుర్తింపు కార్డు లేకుండా ఓటు వేయరాదని పేర్కొంటూ.. ఇదే విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో పోలీసులు మధుసూదన్‌గౌడ్‌ను అదుపులోకి తీసుకుని 171 కేసు నమోదు చేశారు. -
రభసలోనే ప్రకటన
* రాజధానిపై ప్రజాస్వామ్య బద్ధ చర్చ కోసం ప్రతిపక్ష నిరసనలతో అట్టుడికిన అసెంబ్లీ * జగనోక్రసీ, ఫ్యాక్షనిజం అంటూ విపక్షంపై అధికార పక్షం ఎదురు దాడి * ప్రకటనకు ముందే చర్చ చేపట్టాలని విపక్షం వాయిదా తీర్మానం.. స్పీకర్ తిరస్కరణ * ప్రభుత్వం నోటీసు ఇచ్చినందున తర్వాతే చర్చించవచ్చన్న స్పీకర్ * ప్రకటన చేశాక చర్చలో అర్థమేముంటుందని ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి నిరసన * 1953లో రాజధాని నగరంపై ఐదు రోజుల చర్చ జరిగిందని గుర్తుచేసిన వైనం * జగన్, వైఎస్ విభజనకు కారణమయ్యారంటూ టీడీపీ సభ్యుల అసంబద్ధ ఆరోపణలు * పరుష పదజాలంతో విపక్షంపై దాడి.. జగన్‌ను దూషిస్తూ బాబును పొగుడుతూ ప్రసంగాలు * గందరగోళంలోనే ‘ముహూర్తం’ పేరుతో రాష్ట్ర రాజధానిపై ప్రకటన చేసిన సీఎం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై గురువారం రాష్ట్ర శాసనసభ అట్టుడికింది. రాజధాని ప్రాంతాన్ని ప్రకటించే ముందే ప్రజాస్వామ్యయుతంగా చర్చ జరగాలన్న ప్రతిపక్షంపై ప్రభుత్వం ఎదురుదాడే అస్త్రంగా ప్రయోగించింది. ముందుగా చర్చించటానికి ససేమిరా నిరాకరించింది. ప్రకటన తర్వాతే చర్చ అంటూ ప్రతిపక్ష వినతిని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ఇదెక్కడి పద్ధతి అని ప్రశ్నించిన విపక్షంపై.. రాష్ట్ర విభజనకు కారకులు మీరేనంటూ అర్థంలేని అసంబద్ధ ఆరోపణలతో విరుచుకుపడింది. ఇది ప్రజాస్వామ్య పద్ధతేనా అని ప్రతిపక్ష నేత ఆశ్చర్యం వ్యక్తం చేస్తే.. ఆయన అసెంబ్లీలో జగనోక్రసీ నడిపిస్తున్నారని, ఫ్యాక్షనిజాన్ని నడుపుతున్నారంటూ అధికారపక్షం అడ్డగోలు విమర్శలకు తెరతీసింది. దీనిపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు తీవ్ర నిరసన తెలుపుతూ.. ముందుగా చర్చ జరగాలని నినాదాలు చేస్తుంటే.. అధికార టీడీపీ సభ్యులు వారిపై ఆరోపణలు, ప్రతినినాదాలు చేయటంతో సభ హోరెత్తింది. నినాదాలు, అరుపులు, కేకలతో దద్దరిల్లింది. ఈ గందరగోళంతో రెండు సార్లు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షం నిరసనల హోరు మధ్యే సీఎం చంద్రబాబు ముహూర్తం ప్రకారం ఉదయం 11:11 గంటలకు రాజధాని ప్రాంతంపై ప్రకటన చేసి పంతం నెగ్గించుకున్నారు. చర్చకోసం వాయిదా తీర్మానం తిరస్కరణ... గురువారం ఉదయం సభ ప్రారంభంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు జి.శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపడుతున్నట్టు ప్రకటిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబును మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ ఒక్కుదుటున లేచి వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తే ఎలాగని స్పీకర్‌ను అడిగారు. దీనిపై ముఖ్యమంత్రి మరికొద్దిసేపట్లో ప్రకటన ఇవ్వబోతున్నారని, ఇక చర్చ అవసరం లేదని స్పీకర్ బదులిచ్చారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్తూ పోడియంలోకి వెళ్లారు. రాజధానిపై తొలుత చర్చ చేపట్టాలని, ఆ తర్వాత ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దీనికి స్పీకర్ బదులిస్తూ.. ప్రకటన ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత చేసేదేమీ లేదని, ఏమైనా అభ్యంతరాలుంటే అప్పుడు చెప్పాలని పేర్కొన్నారు. యనమల క్షమాపణ చెప్పాలి... వైఎస్సార్ సీపీ శాసనసభ పక్ష ఉప నేత జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. ‘‘యనమల ఇజాలు (వాదాలు) మాట్లాడుతున్నారు. గతంలో నన్ను రెండుసార్లు అవమానపర్చేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు సాక్షాత్తు ప్రతిపక్ష నేత జగన్‌ను అవమానపర్చేలా మాట్లాడుతున్నారు. ఈ ఇజాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మీ మేధో సంపత్తి నుంచేనా? మేమూ ప్రజామోదంతోనే వచ్చాం. మీలాగా దొడ్డిదోవన వచ్చి, నాయకుని ప్రాపకంతో మంత్రి పదవులు అనుభవించడం లేదు. యనమల వ్యాఖ్యలను మీ (స్పీకర్) విజ్ఞతకే వదిలేస్తున్నా. ఆయన క్షమాపణ చెప్పాలి. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలిగించాలి’’ అని విజ్ఞప్తి చేశారు. రికార్డులను పరిశీలించి అగౌరవపర్చే వ్యాఖ్యలుంటే తొలగిస్తామని స్పీకర్ హామీ ఇచ్చారు. ఈ గొడవ మధ్యనే మంత్రులు అచ్చెన్నాయుడు, బొజ్జల గోపాలకృష్ణ మాట్లాడుతూ జ్యోతుల నెహ్రూ వ్యాఖ్యల్ని ఖండించారు. యనమల దొడ్డిదారిన రాలేదని, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని పేర్కొన్నారు. ప్రజల ఆలోచనలను తెలుసుకుని మెలగాలంటూ జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. పరిస్థితి అదుపుతప్పడంతో స్పీకర్ కోడెల ఉదయం 9.35 గంటల సమయంలో సభను తొలివాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైనా అదే హోరు... శాసనసభ 40 నిమిషాల తర్వాత 10.20 గంటలకు తిరిగి ప్రారంభమైన తర్వాత ప్రతిపక్షం చర్చకు పట్టుబట్టింది. స్పీకర్ పోడియం ముందు ప్ల కార్డులతో నిరసన తెలిపింది. సభ్యుల నినాదాలు, ప్రతినినాదాల మధ్యనే అధికార టీడీపీ సభ్యులు గొల్లపల్లి, గోరంట్ల, తెనాలి శ్రావణకుమార్, కాలువ శ్రీనివాసులు, పితాని సత్యనారాయణ, మంత్రులు పి.సుజాత, పల్లె రఘునాథరెడ్డి తదితరులు మాట్లాడారు. విపక్షాన్ని, ప్రతిపక్ష నేత జగన్‌ను విమర్శిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. చట్టసభలో ధర్నాలు, బైఠాయింపులు, ప్లకార్డులతో నిరసనలు చేసి ప్రజాస్వామ్యాన్ని భ్రష్టుపట్టిస్తున్నారంటూ నిందారోపణలకు దిగారు. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా?: జగన్ ఈ సందర్భంలో ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్ స్పందిస్తూ ‘‘రాష్ట్ర రాజధాని అనేది ప్రాధాన్యతాంశం. మొదట చర్చ, ఆ తర్వాత ఓటింగ్, ఆపైన ప్రకటన వెలువడాలి. ఇది సంప్రదాయం. దీన్ని పక్కనబెట్టి ‘ముహూర్తం టైం అయిపోతోంది.. ప్రకటన చేస్తాం.. ఆ తర్వాత చర్చిస్తాం..’ అంటే సరిపోతుందా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? అన్న అనుమానం వస్తోంది. ఇది అన్యాయం’’ అని నిరసన తెలిపారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి మాట్లాడుతూ 1953లో రాజధాని లేదని, ఏదో ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తమ నాయకుడు ప్రకటన చేస్తారని, ఆ తర్వాత చర్చించుకోండన్నారు. దీనికి వైఎస్సార్ సీపీ సభ్యుడు శ్రీకాంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చర్చ, ఓటింగ్ తర్వాతే ప్రకటన చేయాలని పదేపదే కోరినప్పటికీ సభావ్యవహారాల మంత్రి యనమల మాత్రం.. ప్రతిపక్షం నిబంధనలకు అనుగుణంగా తీర్మానం కూడా ఇవ్వలేదని, ప్రకటన చేయడం ప్రభుత్వ హక్కని పేర్కొన్నారు. అప్పటికి సమయం 11.11 గంటలైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిపై ప్రకటన చేసేందుకు లేవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. మంత్రుల ఎదురుదాడి.. ఓ పక్క ఈ వివాదం నడుస్తుండగానే మంత్రులు రావెల కిషోర్, అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై పరుషపదజాలంతో విరుచుకుపడ్డారు. ప్రజాస్వామ్య నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతున్నారని, అడ్డగోలు విభజనకు కారణమయ్యారని, అనైక్యతను పెంచేందుకు ప్రయత్నిస్తున్నారని లేనిపోని ఆరోపణలకు దిగారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత ఎన్ని గంటల చర్చకైనా తాము సిద్ధమని, ఎన్ని సూచనలు, సలహాలు ఇచ్చినా స్వీకరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర విభజనకు జగన్, ఆయన తండ్రి కారకులంటూ.. అందుకు క్షమాపణలు చెప్పాలని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఈ దశలో స్పీకర్‌కు, విపక్ష సభ్యులకు మధ్య వాగ్వాదం నడిచింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత జ్యోతుల నెహ్రూను మాట్లాడాలని స్పీకర్ కోరినప్పటికీ ఆయన తిరస్కరిస్తూ తాము ప్రకటనకు ముందు చర్చకు పట్టుబడుతున్నామని, అదే తమ డిమాండ్ అని స్పష్టంచేశారు. ఇలా దాదాపు 15 నిమిషాల పాటు సభలో గందరగోళం చెలరేగింది. అప్పటి పరిస్థితులు వేరు: స్పీకర్ అప్పటి (1953 నాటి) పరిస్థితులు వేరని, ఇప్పటి పరిస్థితులు వేరని, రూల్ నంబర్ 338 కింద ముఖ్యమంత్రి లేదా మంత్రి ప్రకటన చేసే అధికారం ఉందని స్పీకర్ పేర్కొన్నారు. ఆ తర్వాత కావాలనుకుంటే ప్రతిపక్షం వివరణ కోరవచ్చన్నారు. అనంతరం సభావ్యవహారాల శాఖ మంత్రి యనమల మాట్లాడుతూ ప్రతిపక్ష నేత అయినా, ముఖ్యమంత్రి అయినా నిబంధనలను పాటించేలా విధివిధానాలున్నాయని, సభలో ప్రజస్వామ్యం ఉందే గానీ జగనోక్రసీ (జగన్వాదం) లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ప్రకటన చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ స్పీకర్‌కు నోటీసు ఇచ్చామని, దానిపై చర్చ జరుగుతుందని చెప్పారు. విధివిధానాలు తెలుసుకోకుండా ప్రతిపక్ష సభ్యులు అల్లరి చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. యనమల వ్యాఖ్యలకు ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా యనమల మాట్లాడలేదని, ప్రకటన చేసేందుకు ప్రభుత్వానికి విశేషాధికారం ఉందని స్పీకర్ అనడంతో మళ్లీ గొడవ జరిగింది. ఈ దశలో యనమల తిరిగి మాట్లాడుతూ తిరస్కరించిన వాయిదా తీర్మానంపై మాట్లాడేదేమీ ఉండదని, ప్రభుత్వం ప్రకటన ఇచ్చేదాక ఓపిక పట్టి ఆ తర్వాత చెప్పదల్చుకున్నది చెప్పాలని పేర్కొన్నారు. -
‘పోలవరం’పై ఒడిశా అసెంబ్లీలో బీజేడీ ఆందోళన
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ 4 జిల్లాల్లో బంద్ భువనేశ్వర్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతోందని ఆరోపిస్తూ ఒడిశాలో అధికార బిజూ జనతాదళ్(బీజేడీ) సోమవారం రాష్ట్ర శాసనసభలో ఆందోళనకు దిగింది. సభ ప్రారంభమైన వెంటనే అధికార పార్టీ ఎమ్మెల్యేలు పోలవరం ప్రాజెక్టుకు, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. తీవ్ర గందరగోళం నేపథ్యంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకూ వాయిదా వేశారు. అయితే.. అధికార పార్టీయే స్వయంగా సభా కార్యక్రమాలను అడ్డుకోవటాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ ఖండించింది. అసెంబ్లీలో తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగకుండా అడ్డుకోవటానికే అధికార బీజేడీ పోలవరం ప్రాజెక్టు పేరుతో సభను అడ్డుకుందని విపక్ష నేత నరసింగ్మిశ్రా ధ్వజమెత్తారు. మరోవైపు.. పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ బీజేడీ సోమవారం కోరాపుట్, మల్కనగిరి, రాయగడ, నబరంగ్‌పూర్ జిల్లాల్లో 12 గంటల బంద్ నిర్వహించింది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. -
ఓటరు నమోదుకు ఆఖరి అవకాశం..
సాక్షి, హైదరాబాద్: లోక్‌సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో.. ఓటర్లుగా నమోదు చేసుకొనేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడారు. ఆయన మాటల్లోనే.. రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో 9వ తేదీ (ఆదివారం)న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్ల జాబితాలతో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. జాబితాలో పేరు ఉందో లేదో చూసుకుని.. పేరు లేకపోతే అక్కడికక్కడే ఓటరుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చు. నామినేషన్ల దాఖలు చివరి తేదీ వరకు ఓటర్‌గా నమోదుకు అవకాశం ఉంటుంది. ఓటర్ జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ‘వీఓటీఈ’ అని టైప్ చేసి గుర్తింపు కార్డు నంబర్‌తో 9246280027 నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపితే కొద్ది సేపట్లోనే పేరు ఉందో లేదో జవాబు వస్తుంది. పోలింగ్‌కు వారం రోజుల ముందు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ స్లిప్‌లను పంపిణీ చేస్తారు. రెండు దఫాలు ఈ పంపిణీ జరుగుతుంది. అయినా స్లిప్‌లు అందనివారికి పోలింగ్ రోజు పోలింగ్ కేంద్రం వద్ద ఇస్తారు. -
‘ఫోర్స్ వన్’ ఆవిర్భావం
ముంబయి: పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. పొత్తులు ఊపందుకుంటున్నాయి. 17 చిన్నచిన్న పార్టీలు కలిసి ‘ఫోర్స్ వన్’గా అవతరించాయి. ‘ఫోర్స్ వన్’ కన్వీనర్, అవామీ వికాస్ పార్టీ అధ్యక్షుడు మంగళవారం దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కొత్త ఫ్రంట్ ప్రధాన రాజకీయ పార్టీలతో ఎట్టి పరిస్థితిలో కలువదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, నేషనల్ కాంగ్రెస్, కాషాయరంగు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతామని ధీమా వ్యక్తం చేశారు. ముంబయి రిటైర్డ్ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ఈ 17 పార్టీలు కలిసి కామన్ మినిమమ్ ప్రోగాం(సీఎంపీ)ని రూపొందించుకున్నట్లు తెలిపారు. సీఎంపీతో ఎన్నికల్లోకి వెళ్తున్నట్లు చెప్పారు. ఆమ్ ఆద్మీ పార్టీతో కలుస్తారా అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులు ఇస్తూ తమ సీఎంపీని అంగీకరిస్తే ఆలోచిస్తామని చెప్పారు. లేకుంటే ప్రత్యామ్నాయంను ఎంచుకుంటామని తెలిపారు.సీఎంపీ అంశాలను ఆయన వెల్లడించారు. విదేశీ పెట్టుబడులను భారత్‌లోకి ప్రత్యక్షంగా అనుమతించరాదు, మత వ్యతిరేక బిల్లును ఆమోదించాలి, సచార్ కమిటీ నివేదికను అమలు చేయాలి, మహారాష్ట్రలో మహ్మద్ ఉర్ రెహ్మాన్ కమిటీ నివేదికను పూర్తిస్థాయిలో అమలు పర్చాలి, ఆర్ఎస్ఎస్, సనాతన సంస్థ, వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌లను నిషేధించాలి, దాదర్‌లోని బీఆర్ అంబేద్కర్ మెమోరియల్‌కు అడ్డంకులను తొలగించాలి, దళితులు, ముస్లిం, ఇతర మైనార్టీల హక్కులను పరిరక్షించాలి వంటి అంశాలను సీఎంపీలో పొందుపర్చినట్లు ఆయన వివరించారు. 48 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకవేళ తమ భావజాలంతో ఎవరైనా కలిసి వస్తే వారిని ఆహ్వానిస్తామని తెలిపారు. అదేవిధంగా శాసనసభ ఎన్నికల్లోనూ అదేవిధంగా పోటీ చేస్తామని తెలిపారు. -
బిల్లుకు అసెంబ్లీ ఆమోదం అక్కర్లేదు
తెలంగాణ ఏర్పాటుకు యూపీఏ కట్టుబడి ఉందని ఏఐసీసీ ఆధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం ఏమాత్రం అవసరం లేదని, ఈ విషయంలో పార్లమెంటుకు సర్వాధికారాలు ఉన్నాయని ఆయన చెప్పారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టేందుకు యూపీఏ ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో జరిగినదంతా తాము ముందునుంచి ఊహించినదేనని సింఘ్వీ అన్నారు. ఇదే సమయంలో ఆయన బీజేపీ వైఖరిపై కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. పార్లమెంటు సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టే తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు పలుకుతుందా లేదా అన్నది అనుమానమేనని ఆయన అన్నారు. ఇక తెలంగాణ బిల్లు విషయంలో, ఇది నైతికతకు సంబంధించిన అంశం కాదని, తాము రాజ్యాంగ పద్ధతుల ప్రకారం నడుచుకుంటామని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన సొంత వైఖరి అవలంబిస్తున్నారని అన్నారు. అంతేతప్ప.. కిరణ్ కుమార్ రెడ్డి వైఖరి గురించి, ఆయన అధిష్ఠానాన్ని ధిక్కరించడం గురించి మాత్రం సింఘ్వీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తెలంగాణపై బీజేపీ మొసలికన్నీరు కారుస్తోందని, ఆ పార్టీ నిజ స్వరూపమేంటో పార్లమెంట్లో తెలుస్తుందని వ్యాఖ్యానించారు. -
అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షో
-
అసెంబ్లీలో అక్బర్ వన్ మ్యాన్ షో
శాసన సభ్యుడంటే ఎలా ఉండాలో తెలుసా.. ఎలా ప్రిపేర్ కావాలో తెలుసా.. తెలుసుకోవాలంటే సోమవారం నాటి శాసన సభ సమావేశాలను ఒక్కసారి చూడాల్సిందే. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది తానేనని, తాను చేసిన అభివృద్ధిని ఎవరైనా కాదనగలరా అంటూ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్న ఒక్క మాటకు, మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు. తిరుగులేని లెక్కలతో, ఎవరూ కాదనలేని చారిత్రక సత్యాలతో సభ మొత్తాన్ని గుండుసూది పడినా వినిపించేంత నిశ్శబ్దంలో ముంచెత్తారు. దేశంలోని మొట్టమొదటి విద్యుత్ బోర్డు ఎక్కడ పెట్టారో తెలుసా.. హైదరాబాద్‌లో!! భారత కోకిల సరోజినీ నాయుడు లండన్‌లో చదువుకోడానికి స్కాలర్షిప్ ఇచ్చింది ఎవరో తెలుసా.. నిజాం! మీరందరూ కూర్చున్న ఈ అసెంబ్లీ భవనాన్ని నిర్మించింది ఎవరో తెలుసా.. నిజాం!! హైదరాబాద్ జాగీర్ స్కూల్.. అదే ఇప్పటి హైదరాబాద్ పబ్లిక్ స్కూలును కట్టించింది కూడా ఆ నిజామే. అదే స్కూల్లో సభా నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి, నేను, మా అన్న, జగన్ మోహన్ రెడ్డి, పల్లంరాజు.. అందరం చదువుకున్నాం. హైదరాబాద్‌లో ఎప్పుడెప్పుడు ఏయే ఫ్యాక్టరీలు, పాఠశాలలు, గ్రంథాలయాలు వచ్చాయో తెలుసా.. అంటూ మొత్తం సంవత్సరాల వారీగా లెక్కలు, పేర్లు ఏకబిగిన అరగంటపాటు చదివిన మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సోమవారం నాడు అసెంబ్లీలో వన్ మ్యాన్ షో నడిపించారు. ముందుగా ప్రిపేర్ అయ్యి ఉంటే, లెక్కలన్నీ దగ్గర పెట్టుకుంటే, దానికి తోడు తగిన వాగ్ధాటి ఉంటే సభను ఎలా తన అదుపులోకి తెచ్చుకోవచ్చన్న దానికి అక్బరుద్దీన్ ఒవైసీ చక్కటి ఉదాహరణగా నిలిచారు. నిజాం కాలం నుంచి రాష్ట్రం ఏర్పడే వరకు హైదరాబాద్ నగరంలో ఉన్న మొత్తం ఫ్యాక్టరీలు, విద్యాలయాలు, గ్రంథాలయాలు, చెరువులు.. ఇలా మొత్తం వేటివేటిని ఎప్పుడెప్పుడు ఏర్పాటుచేశారో సంవత్సరాలతో సహా లెక్కలు మొత్తం చదివి వినిపించారు. ఈ చారిత్రక సత్యాలను ఎవరైనా కాదనగలరా అంటూ నిలదీశారు. ఒక్కరు సమాధానం చెబితే ఒట్టు!! హైదరబాద్ నగర అభివృద్ధి మొత్తం తనహయాంలోనే జరిగిందని చెప్పుకొన్న విపక్షనేత చంద్రబాబు నాయుడుకు ఈ దెబ్బకు దిమ్మతిరిగిపోయింది. సభ సజావుగా నడవకుండా ఉండేందుకు తన ఎమ్మెల్యేలతో గొడవ చేయించారు తప్ప, అక్బర్ ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా ఆయన గానీ, ఆయన సహచరులుగానీ సమాధానం మాత్రం ఇవ్వలేకపోయారు. హైదరాబాద్ నగరంలో అప్పటికే అభివృద్ధి ఉంది కాబట్టే దేశం నలుమూలల నుంచి అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు, ఇతర వ్యవహారాలు చేసుకుంటున్నారని అక్బరుద్దీన్ చెప్పిన మాటలను ఎవరూ కాదనలేకపోయారు. -
`తెలంగాణ బిల్లు అడ్డుకునే హక్కు లేదు`
వరంగల్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ప్రస్తుత కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్రలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో అసెంబ్లీలో తెలంగాణ బిల్లు చర్చపై అభిప్రాయం చెప్పే హక్కు మాత్రమే ఉందని, అడ్డుకునే హక్కులేదని తెలంగాణ రాజకీయ జేఏసీ నేత ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. శుక్రవారం వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేసిన పీడీఎస్‌యూ రాష్ట్ర మహాసభలలో కోదండరాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో చర్చ సందర్భంగా చెప్పిన అభిప్రాయాలను కేంద్ర పరగణలోకి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. -
`ఆయన అనుమతితోనే సమైక్య పోరాటం`
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు రాష్ట్ర అసెంబ్లీలో చర్చకు రానున్న కీలక తరుణంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల నేతల్లో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. దీంతో ఇరుప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంత టీడీపీ ఎంపీలు తమ పార్టీ అధినేత టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుమతితోనే సమైక్యం కోసం పోరాడుతున్నామని తెలిపారు. తెలంగాణకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకిస్తూ తాము రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తామని చెప్పారు. కాగా, 2008లో తెలంగాణపై ఇచ్చిన లేఖకు కాలం చెల్లిందంటూ సీమాంధ్ర టీడీపీ ఎంపీలు విమర్శించారు. -
'టీ-బిల్లు వస్తే 294 మంది వ్యతిరేకిస్తారు'
విజయవాడ: రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే 294 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన అశోక్‌బాబు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఇదే అంశంపై వైఎస్సార్ సీపీ, ఎంఐఎం. టీఆర్ఎస్ పార్టీలను కలుస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహిస్తామన్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ 9 కి.మీ మేర మానహారం నిర్వహిస్తామన్నారు. తమ భవిష్య కార్యాచరణను 9వ తేదీనే ప్రకటించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు. గతంలో తాము కలవలేకపోయిన జాతీయ పార్టీల నేతలను పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లి కలవనున్నట్టు, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కోరనున్నట్టు అశోక్ బాబు స్పష్టం చేశారు.