
'టీ-బిల్లు వస్తే 294 మంది వ్యతిరేకిస్తారు'
విజయవాడ: రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తే 294 మంది ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తారని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్బాబు తెలిపారు.ఈ సందర్భంగా గురువారం మీడియాతో మాట్లాడిన అశోక్బాబు రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలంతా విభజనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు. ఇదే అంశంపై వైఎస్సార్ సీపీ, ఎంఐఎం. టీఆర్ఎస్ పార్టీలను కలుస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన ప్రక్రియను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మానవహారాలు నిర్వహిస్తామన్నారు. ఇంద్రకీలాద్రి చుట్టూ 9 కి.మీ మేర మానహారం నిర్వహిస్తామన్నారు. తమ భవిష్య కార్యాచరణను 9వ తేదీనే ప్రకటించి ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళతామన్నారు.
గతంలో తాము కలవలేకపోయిన జాతీయ పార్టీల నేతలను పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ వెళ్లి కలవనున్నట్టు, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించాలని కోరనున్నట్టు అశోక్ బాబు స్పష్టం చేశారు.