Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి | Womens Reservation Bill 2023: Sonia Gandhi declares support to womens reservation bill | Sakshi
Sakshi News home page

Womens Reservation Bill 2023: తక్షణమే అమలు చేయండి

Published Thu, Sep 21 2023 5:47 AM | Last Updated on Thu, Sep 21 2023 5:47 AM

Womens Reservation Bill 2023: Sonia Gandhi declares support to womens reservation bill - Sakshi

న్యూఢిల్లీ: లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ మోదీ సర్కారు పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లుకు కాంగ్రెస్‌ పూర్తిగా మద్దతిస్తుందని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. అయితే జన గణన, డీ లిమిటేషన్‌ వంటివాటితో నిమిత్తం లేకుండా బిల్లును తక్షణం అమల్లోకి తేవాలని డిమాండ్‌ చేశారు. అలాగే మూడో వంతు రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీలతో పాటు ఓబీసీ మహిళలకు కూడా వర్తింపజేయాలన్నారు. బుధవారం లోక్‌సభలో మహిళా బిల్లుపై చర్చను విపక్షాల తరఫున ఆమె ప్రారంభించారు. రిజర్వేషన్ల అమలులో ఏ మాత్రం ఆలస్యం చేసినా అది భారత మహిళల పట్ల దారుణ అన్యాయమే అవుతుందని అన్నారు. ‘కుల గణన జరిపి తీరాల్సిందే. ఇది కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన డిమాండ్‌. ఇందుకోసం తక్షణం కేంద్రం చర్యలు చేపట్టాలి‘ అని పునరుద్ఘాటించారు. రాజకీయాలతో పాటు వ్యక్తిగతాన్నీ, భావోద్వేగాలను కూడా రంగరిస్తూ సాగిన ప్రసంగంలో సోనియా ఏమన్నారంటే...

‘దేశాభివృద్ధిలో మహిళల పాత్రను సముచితంగా గుర్తుంచుకునేందుకు, కృతజ్ఞతలు తెలిపేందుకు ఇది సరైన సమయం. అందుకే, నారీ శక్తి విధాన్‌ అధినియమ్‌కు కాంగ్రెస్‌ పార్టీ పరిపూర్ణంగా మద్దతిస్తుంది. దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. ఆ దారిలో ఉన్న అడ్డంకులను తలగించాలి‘.

వంటింటి నుంచి అంతరిక్షం దాకా...
‘మసిబారిన వంటిళ్ల నుంచి ధగధగా వెలిగిపోతున్న స్టేడియాల దాకా, అంతరిక్ష సీమల దాకా భారత మహిళలది సుదీర్ఘ ప్రయాణం. అటు పిల్లలను కని, పెంచి, ఇటు ఇల్లు నడిపి, మరోవైపు ఉద్యోగాలూ చేస్తూ అంతులేని సహనానికి మారుపేరుగా నిలిచింది మహిళ. అలాంటి మహిళల కష్టాన్ని, గౌరవాన్ని, త్యాగాలను సముచితంగా గుర్తించినప్పుడు మాత్రమే మానవతకు సంబంధించిన పరీక్షలో మనం గట్టెక్కినట్టు‘.  

స్వాతంత్య్ర పోరులోనూ నారీ శక్తి
‘దేశ స్వాతంత్య్ర సంగ్రామంలోనూ, అనంతరం ఆధునిక భారత నిర్మాణంలో కూడా భారత మహిళలు పురుషులతో భుజం కలిపి సాగారు. కుటుంబ బాధ్యతల్లో మునిగి సమాజం, దేశం పట్ల తమ బాధ్యతలను ఎన్నడూ విస్మరించలేదు. సరోజినీ నాయుడు, సుచేతా కృపాలనీ, అరుణా అసఫ్‌ అలీ, విజయలక్ష్మీ పండిట్, రాజ్‌ కుమార్‌ అమృత్‌ కౌర్, ఇంకా ఎందరెందరో మహిళామణులు మనకు గర్వకారణంగా నిలిచారు. గాం«దీ, నెహ్రూ, పటేల్, అంబేడ్కర్‌ తదితరుల ఆకాంక్షలు నెరవేర్చడంలో తమ వంతు పాత్ర పోషించారు‘.

రాజీవ్‌ కల.. అప్పుడే సాకారం
‘చట్ట సభల్లో మహిళలకు సముచిత ప్రాతి నిధ్యం దక్కాలన్న దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ కల సగమే నెరవేరింది. బిల్లు ఆమోదం పొందినప్పుడే అది పూర్తిగా సాకారవుతుంది. నేనో ప్రశ్న అడగాలనుకుంటున్నా. భారత మహిళలు తమ రాజకీయ బాధ్యతలను తలకెత్తుకునేందుకు 13 ఏళ్లుగా వేచిచూస్తున్నారు. ఇప్పుడు కూడా వారిని ఇంకా ఆరేళ్లు, ఎనిమిదేళ్లు... ఇలా ఇంకా ఆగమంటూనే ఉన్నారు. భారత మహిళల పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనదేనా?‘  

మహిళా శక్తికి ప్రతీక ఇందిర...
ఇక దివంగత ప్రధాని ఇందిరా గాంధీ వ్యక్తిత్వం భారత మహిళల శక్తి సామర్థ్యాలను తిరుగులేని ప్రతీకగా ఇప్పటికీ నిలిచి ఉంది. వ్యక్తిగతంగా నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన సందర్భం. మహిళలకు స్థానిక సంస్థల్లో మూడో వంతు రిజర్వేషన్లు కలి్పస్తూ నా జీవిత భాగస్వామి, దివంగత ప్రధాని రాజీవ్‌ గాంధీ తొలిసారిగా రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు. కానీ రాజ్యసభలో ఆ బిల్లును కేవలం ఏడు ఓట్లతో ఓడించారు. అనంతరం పీవీ నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం దాన్ని పాస్‌ చేయించింది. ఫలితంగా నేడు 15 లక్షలకు పైగా మహిళలు దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ప్రతినిధులుగా రాణిస్తున్నారు‘.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement