విశ్లేషణ
స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను తెంచుకోవడం ద్వారా స్పీకర్ స్థానానికి విఠల్‌భాయ్ పటేల్ ఆరోగ్యకరమైన ప్రారంభాన్ని ఇచ్చారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి. మావలంకర్ ‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ... నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’ అన్నారు. 1956లో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎం.ఏ. అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత బలహీనపడటం మొదలైంది. ఇక ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభల్లోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.
స్పీకర్ అన్ని ఆచరణాత్మక ప్రయోజనాల కోసం నిష్పక్షపాతంగా ఉంటారు. అన్ని అంశా లను నిర్ణయించే ముఖ్యమైన న్యాయపరమైన విధులను స్పీకర్‌కు సభ వదిలివేయవచ్చు.
– సర్ ఐవర్ జెన్నింగ్స్,పార్లమెంట్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 1957
18వ లోక్‌సభ మొదటి సెషన్ జూన్ 24న సమావేశమైనప్పుడు, బీజేపీ మెజారిటీని కలిగి ఉన్న 16వ, 17వ లోక్‌సభలలో రాజకీయ పార్టీలు విడిచిపెట్టిన చోట నుండే పక్షపాతం తిరిగి ప్రారంభమైంది. సహజంగానే, లోక్‌సభ స్పీకర్‌కు పోటీ, ‘ఎన్నిక’, సభ తదుపరి కార్యకలాపాల నిర్వహణ వంటివి ‘నిష్పక్షపాతానికి’ చాలా దూరంగా ఉన్నాయి. బ్రిటిష్ పార్లమెంట్ గురించిన తన విశిష్ట అధ్యయనంలో సర్ జెన్నింగ్స్ ఇలాంటి స్థితి గురించి వివరంగా నమోదు చేశారు.
వాస్తవానికి, రాజ్యాంగానికి తగిన గౌరవం ఇవ్వకపోగా, దాని సంప్రదాయాన్ని కూడా పక్కనపెట్టి, పార్లమెంటును తన కట్టడిలోనే పనిచేసేలా చూస్తామని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ నొక్కి చెప్పింది. లోక్‌సభ, శాసనసభలలో రాజ్యాంగం అమలైనప్పటినుండి కొత్తగా ఎన్నికైన ఎంపీల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి, సభలోని అత్యంత సీనియర్ సభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే వెస్ట్‌మినిస్టర్ నమూనాకి చెందిన పురాతన సంప్రదాయానికి ఈసారి తిలోదకాలు ఇచ్చేశారు. సంప్రదాయం ప్రకారమైతే ఆ పదవిని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీకి కేటాయించాల్సి ఉండింది. కానీ ఈసారి పార్లమెంటులో బీజేపీకి చెందిన రెండో సీనియర్ సభ్యునికి ప్రొటెం స్పీకర్ పీఠం దక్కింది.
సహజంగానే, ‘మా ఎంపికను అంగీకరించడమే ఏకాభిప్రాయం’ అనే రాజకీయ ప్రకటనలో, ఏకాభిప్రాయం కోసం ఏదైనా ప్రతిపక్ష సూచనను ఆశించే, ఆమోదించే అవకాశమే లేదు. ఈ ఏడాది లోక్‌సభలో మోదీ నేతృత్వంలోని బీజేపీ సంపూర్ణ మెజారిటీని ప్రజలు లాక్కుని ఆ పార్టీ బలాన్ని 303 సీట్ల నుంచి 240కి తగ్గించారు. ఎన్నికలకు ముందు ఎన్ డీఏ ఏర్పర్చుకున్న కొత్త మిత్రుల దన్నుతో 293 మంది ఎంపీలతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ 99 సీట్లతోనూ, విస్తృత ప్రాతిపదికన ‘ఇండియా’ కూటమి 234 సీట్లతోనూ తిరిగి రావడం వల్ల, తమను తాము నొక్కి చెప్పు కోగల ప్రతిపక్షంతో, ట్రెజరీ బెంచ్‌లను సర్దుబాటు చేసే కథను పూర్తి చేశాయి. ప్రతిపక్ష నేత కార్యాలయం రాహుల్ గాంధీని ముందుకు నడిపింది.
ఏది ఏమైనప్పటికీ, స్పీకర్ పదవికి పోటీని మొదట ప్రతిపాదించినప్పటికీ, భారతదేశం ఎక్కువగా అనుసరించే వెస్ట్‌మిన్ స్టర్ సంప్ర దాయం ప్రకారం ప్రతిపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవిని కేటాయి స్తారని ఆశించిన ఇండియా కూటమి... ఎన్డీఏ ఎంపిక మేరకు (మోదీ ఎంపిక అని భావించాలి) మునుపటి స్పీకర్ ఓం బిర్లాకు మద్దతు ఇచ్చింది. కానీ ప్రతిపక్షాలకు ఈ ప్రత్యేక పదవిని నిరాకరించడానికి, పదేళ్లపాటు ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచారు. దీనిపై ఇప్పటికీ మౌనం కొనసాగించడం అరిష్టదాయకం అనే చెప్పాలి.
హౌస్ ఎక్స్–అఫీషియో ఛైర్మన్ అయిన భారత ఉపరాష్ట్రపతిని ఒక వ్యవస్థ ఎన్నుకున్నప్పుడు రాజ్యసభ ప్రిసైడింగ్ అధికారి ఎవరనే ప్రశ్న పరిష్కరించబడుతుంది. దీనిని తప్పనిసరి చేసే ఆర్టికల్ 89, సభ్యుల నుండి డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికను కూడా తప్పనిసరి చేస్తుంది. ప్రతిపక్షా లకు ఈ పదవిని కల్పించేందుకు రాజ్యాంగపరమైన నిబంధన కానీ, సంప్రదాయం కానీ లేవు. అయితే, 1952 నుండి అనేక సందర్భాల్లో ప్రతిపక్ష ఎంపీ ఈ పదవిని అలంకరించారు.
‘ఒకసారి స్పీకర్‌ను నియమించిన తర్వాత, ఆయన తన పార్టీ స్వభావానికి దూరంగా ఉంటాడనీ, అలాగే తనను నియమించిన వారిని సమర్థించకుండా ఉంటాడనీ’ బ్రిటన్ సంప్రదాయాలు స్పష్టంగా సూచిస్తున్నాయి.
స్వరాజ్ పార్టీతో తన సంబంధాలను విఠల్‌భాయ్ పటేల్ తెంచుకున్నప్పుడు, 1926లో తన పార్టీ శాసనసభ్యులతోపాటు వాకవుట్ చేయడానికి నిరాకరించినప్పుడు వెస్ట్ మినిస్టర్ వ్యవస్థ సంప్రదాయా లకు కట్టుబడి భారతదేశం ఆరోగ్యకరమైన అభ్యాసాన్ని ప్రారంభించింది. విఠల్‌భాయ్ పటేల్ 1927లో కూడా ఈ సంప్రదాయాన్ని అనుసరించారు. 1946లో సెంట్రల్ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికైనప్పుడు, జి.వి.మావలంకర్ ఇలా అన్నారు: ‘‘కాంగ్రెస్‌వాడిని అయినప్పటికీ, నిష్పక్షపాతంగా వ్యవహరించడం, పార్టీకి చెందిన అన్ని అంశాలకు అతీతంగా ఉండటం నా కర్తవ్యం’’. 1956 మార్చిలో స్పీకర్ పదవిని చేపట్టడం కోసం, ఎంఏ అయ్యంగార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
సర్దార్ హుకుమ్ సింగ్ (1962 నుండి 1967 వరకు లోక్‌సభ స్పీకర్) కూడా తనకు తానుగా ఆరోపణలకు దూరంగా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ స్పీకర్ పదవికి ఎన్నిక కావడానికి, అధికారంలో ఉన్న లేదా మెజారిటీ పార్టీపై ఆధారపడటం వల్ల పాలక పార్టీల ఆజ్ఞలకు అతడు/ఆమె కట్టుబడాల్సి ఉంటుందనే విషయాన్ని ఆయన గమనించారు. అందుకే 1970ల నాటికి లోక్‌సభ స్పీకర్ నిష్పాక్షికత కాస్త బలహీనపడటంలో ఆశ్చర్యం లేదు. సోమనాథ్ ఛటర్జీ (2004–09) తన నిష్పాక్షికతతో స్పీకర్ కార్యాలయాన్ని ఉన్నతీకరించగా, బలి రామ్ భగత్, బలరామ్ జాఖడ్ వంటి కొందరు స్పీకర్ బాధ్యతలు ముగిసిన తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గంలో చేరి పనిచేశారు.
ప్రధానమంత్రి, ప్రతిపక్ష నేత ఇద్దరూ స్పీకర్ కుర్చీ వద్దకు ఓం బిర్లాను తీసుకువెళ్లినప్పుడు, ఆయన మోదీ ముందు వంగి కరచాలనం చేయడం, తరువాతి ప్రతిపక్ష నేత వద్ద నిటారుగా నిలబడటం ద్వారా తన విధేయత ఎవరి పట్ల ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. జూన్ 27న శశి థరూర్ ‘జై సంవిధాన్’ అని చెప్పడం ద్వారా ఎంపీగా తన ప్రమాణ స్వీకారం ముగించినప్పుడు ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని కీర్తిస్తూ ప్రమాణం చేయ డానికి అభ్యంతరం ఎందుకు అని దీపేందర్ హుడా అడిగినప్పుడు, బిర్లా ఆయన్ని ఆక్షేపించి కూర్చోవాల్సిందిగా కోరారు. ఇది స్పష్టంగానే నిశ్చితమైన పక్షపాతానికి సంకేతం.
స్పష్టంగా ప్రధానమంత్రి సూచనల మేరకు, 1975 నాటి ఎమర్జెన్సీని ఖండిస్తూ బిర్లా చేసిన తీర్మానం, ఆయన పార్టీ విధేయతకు తిరుగులేని సంకేతం. లోక్‌సభకు సంబంధించిన రూల్స్ అండ్ ప్రొసీజర్‌లోని రూల్ 380 కింద ప్రధాని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌పై రాహుల్ గాంధీ చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలను కూడా ఆయన తొలగించారు. కొన్ని వివాదాస్పద బిల్లులను అడ్డంకులు లేకుండా ఆమోదించడం కోసం 17వ లోక్‌సభలో 100 మంది ప్రతిపక్ష ఎంపీలను బహిష్కరించిన ఈ వ్యక్తి, అధికార పక్షానికి తన విధేయ తను ప్రదర్శించారు.
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ కూడా ద్వంద్వ పాత్రను పోషిస్తూ, గత పార్లమెంటులో బిల్లులను ఆమోదించడం కోసం 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. ప్రతిపక్ష ఎంపీలకు మాట్లాడటానికి సమ యం నిరాకరించడం, వారు ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని అడ్డు కోవడం ద్వారా ధన్‌ఖడ్ రాజ్యసభ కార్యకలాపాలను నిర్వహించడంలో పక్షపాత వైఖరిని కొనసాగిస్తున్నారు.
పార్లమెంటులోని ప్రిసైడింగ్ అధికారులిద్దరూ తమ పార్టీ ఆదేశాల మేరకు భారత పార్లమెంటరీ సంప్రదాయాలను తుంగలో తొక్కడం ద్వారా, వెస్ట్ మినిస్టర్ సంప్రదాయాలకు కళంకం తెస్తున్నారు.
అజయ్ కె మెహ్రా
వ్యాసకర్త రాజకీయ శాస్త్రవేత్త
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment