న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నేృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విపక్షాలు లేవనెత్తిన పలు అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ముఖ్యంగా లోక్‌సభలో సంభాల్ అంశంపై మాట్లాడేందుకు సమాజ్‌వాదీ పార్టీకి, బంగ్లాదేశ్ పరిస్థితులపై మాట్లాడేందుకు తృణమూల్ కాంగ్రెస్‌కు అనుమతించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మొత్తానికి పార్లమెంటు సమావేశాలు సజావుగా నడిపేందుకు అన్ని రాజకీయ పార్టీలు అంగీకరించినట్లు సమాచారం.
ఈ క్రమంలోనే వచ్చే వారం రాజ్యాంగంపై చర్చించేందుకు అధికార, ప్రతిపక్ష లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అంగీకరించారు. రాజ్యాంగం ఆమోదం పొంది 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో డిసెంబర్ 13, 14 తేదీల్లో లోక్‌సభలో,16, 17 తేదీల్లో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ జరుగనుంది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు పార్లమెంట్ వెలుపల విలేకరులతో చెప్పారు. ‘పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం మంచిది కాదు. రేపటి నుంచి పార్లమెంట్ సజావుగా జరిగేలా మనమందరం చేసుకున్న ఒప్పందాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతిపక్ష నేతలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని రిజిజు పేర్కొన్నారు.
అయితే అన్ని అంశాలపై చర్చ జరగాలని విపక్షాలు కోరుతున్నాయి. నిరుద్యోగం, రైతుల సమస్యలు, సంబాల్ హింస, పెరుగుతున్న ధరలు తదితర అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆదాని అంశంపై బిజినెస్ అడ్వైజర్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరాయి.
కాగా గతవారం (నవంబర్25) ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో వాయిదాలపర్వం కొనసాగుతోంది. విపక్షాల డిమాండ్లతో రోజూ సభ ప్రారంభం కావడం, వాయిదా పడటం పరిపాటిగా మారింది. అదానీ అవినీతి వ్యవహారం, సంభాల్ హింస, మణిపూర్ అంశం వంటి విషయాలపై చర్చించాలని విపక్షాలు నిరసనలు చేస్తుండటంతో ఉభయసభలు వాయిదా పడుతూనే ఉన్నాయి. ఇవాళ కూడా ఉభయ సభలు మంగళవారానికి వాయిదా పడ్డాయి. డిసెంబరు 20 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment