
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏకకాలంలో పార్లమెంట్ దిగువ సభ, రాష్ట్రాల్లో శాసనసభకు ఎన్నికలు నిర్వహించడానికి ఉద్దేశించిన లోక్‌సభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లులపై అధ్యయనానికి ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) గడువును లోక్‌సభ మంగళవారం పొడిగించింది. ఈ కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్‌సభ తన అంగీకారం తెలిపింది. బీజేపీ పార్లమెంట్ సభ్యుడు, జేపీసీ ఛైర్మన్ అయిన పీపీ చౌదరి ప్రతిపాదించిన సంబంధిత తీర్మానానికి లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోద ముద్ర వేసింది. వర్షాకాల సమావేశాల చివరివారంలో తొలి రోజు వరకు కాలపరిమితిని పొడిగించింది. ఏకకాల ఎన్నికల నిర్వహణకు తీసుకొచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం గతంలో లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
అయితే ఈ బిల్లు రాజ్యాంగ మౌలిక స్వరూప, స్వభావాలను మార్చేలా ఉందని విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేయడంతో కేంద్రప్రభుత్వం ఆ బిల్లును పరిశీలన నిమిత్తం సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. ఇందుకోసం కొత్తగా 39 మంది ఎంపీలతో కమిటీని ఏర్పాటుచేయడం తెల్సిందే. లోక్‌సభ నుంచి 27, రాజ్యసభ నుంచి 12 మంది సభ్యులతో కమిటీ కొలువుతీరింది. అయితే రాజ్యసభ నుంచి కొత్త వ్యక్తి జేపీలో సభ్యునిగా ఉంటారని లోక్‌సభ ప్రధాన కార్యదర్శి మంగళవారం ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో జేపీసీలో ఒక ఖాళీ ఏర్పడింది.
వాస్తవానికి ఈ కమిటీ కాలపరిమితి ఈ సెషన్ చివరి వారం తొలిరోజుతో ముగుస్తుంది. అంటే ఏప్రిల్ నాలుగోతేదీతో ముగియనుంది. అయినప్పటికీ ఈ బిల్లుకు సంబంధించిన పని ఇంకా పూర్తికాలేదని, అందుకే కాలపరిమితి పెంచాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని అధికార వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ అంశంపై ఇప్పటికే పలువురు న్యాయనిపుణులతో సంప్రదింపుల ప్రక్రియ కొనసాగించింది. రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సంబంధిత వర్గాలతో ఇంకా సంప్రదింపులు జరపాల్సి ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ రంజన్ గొగోయ్, సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే, ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏపీ షా జేపీసీ కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలను వెల్లడించారు.