మూడోసారి
సాక్షి, విజయవాడ :
కృష్ణా పుష్కరాల కోసం నిర్మిస్తున్న ఘాట్ల పనులను పూర్తిచేయడానికి ముచ్చటగా మూడోసారి గడువు ఇచ్చారు. తొలుత జూలై 25 తేదీ లోపు పనులు పూర్తిచేయాలని కలెక్టర్ బాబు.ఏ ఆదేశిం చారు. ఆ తరువాత నెలాఖరు లోపు పూర్తిచేయాలని గడువు ఇచ్చారు. ఈ రెండు గడువుల్లోనూ పనులు పూర్తికాలేదు. ఇప్పటి వరకు విజయవాడ నగరంలో ముఖ్యమైన ఘాట్ ఒక్కటి కూడా సిద్ధం కాలేదు. దీంతో కాంట్రాక్టర్లు, ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్ ఈ నెల 5వ తేదీలోగా ఘాట్ల నిర్మాణం పూర్తవ్వాలంటూ కాంట్రాక్టర్లకు, ఇంజినీర్లకు అల్టిమేటం ఇచ్చారు. అయితే 10వ తేదీ నాటికి ఘాట్ల నిర్మాణం పూర్తవడం కూడా కష్టమేనని ఇంజినీర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ముంచుకొస్తున్న ముహూర్తం
ఈ నెల 12వ తేదీ నుంచి పుష్కరాలు ప్రారంభంకానున్నాయి. బుధవారాన్ని కూడా లెక్కలోకి తీసుకుంటే పుష్కరాల ప్రారంభానికి 9 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అయితే ఇప్పటి వరకు ఒక్క ఘాట్ కూడా పూర్తి కాలేదు. కలెక్టర్ ఒత్తిడి భరించలేక కృష్ణవేణి ఘాట్‌లో మెట్ల నిర్మాణం పూర్తి చేసి టైల్స్ అంటించిన కాంట్రాక్టర్, ఇంజినీర్లు మభ్యపెడుతున్నారు. ఆ పక్కనే ఉన్న పద్మావతి ఘాట్ పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది. ఈ ఘాట్‌లో మరో రెండు లక్షల అడుగుల మేర టైల్స్ అంటించాల్సి ఉందని ఇంజినీర్లే చెబుతున్నారు. ఈ రెండు ఘాట్లలోనూ నదిలో సిమెంట్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. ఘాట్లకు వెళ్లేందుకు రహదారులు నిర్మించాల్సి ఉంది. విద్యుదీకరణ పనులు కూడా జరగాలి. ఘాట్లలో రెయిలింగ్‌లు ఏర్పాటు చేయలేదు.
పోలవరం కాలువ చందమేనా..
పోలవరం కుడికాలువకు రామిలేరు అండర్ టెన్నల్ వద్ద పడిన గండి ఇరిగేషన్ వర్గాల్లో చర్చనీ యాశంగా మారింది. ఒకవైపు రాత్రిపూట గండి పెట్టారని ప్రభుత్వం ప్రచారం చేస్తున్నా.. పనులు హడావుడిగా చేయడం వల్లే ఈ ఘటన జరిగిందని ఇంజినీరింగ్ వర్గాలు నమ్ముతున్నాయి. ప్రస్తుతం పుష్కర ఘాట్ల వద్ద జరుగుతున్న పనులను.. కుడికాల్వ వద్ద జరిగిన పనులతో పోల్చుకుంటున్నారు. ఇక్కడ నాణ్యత ఎంత మేరకు ఉందో చెప్పడం కష్టమని వ్యాఖానిస్తున్నారు. ఏౖ§ð నా పొరపాటు జరిగితే తాము ఇబ్బంది పడతామని ఇంజినీర్లు భయపడుతున్నారు. ముఖ్యంగా ప్రకాశం బ్యారేజీ ఎగువన ఉన్న ఘాట్లలో పనులు ఇంకా ఒక కొలిక్కి రాలేదు. రాత్రీ పగలు చేసినా పుష్కరాల నాటికి పూర్తయ్యే పరిస్థితులు కనపడటం లేదని, పదో తేదీ వరకూ చేసి పనులు ఆపేస్తామని ఇంజినీర్లు పేర్కొంటున్నారు.
మట్టిదిబ్బలు... ఇసుక కుప్పలు....
ఒక్క ఘాట్ కూడా చూడముచ్చటగా లేదు. ప్రతి ఘాట్ ముందు, పక్కన మట్టి దిబ్బలు, ఇసుక కప్పలు దర్శనమిస్తున్నాయి. పొక్లెయినర్లతో ఇప్పటికీ తవ్వకాలు సాగుతున్నాయి. రెడిమిక్స్ మిషన్‌న్లు పగలు, రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాయి. జరుగుతున్న పని జరుగుతూనే ఉన్నా చేయాల్సిన పని చాంతా ండంత కనపడుతోందని పలువురు వ్యాఖానిస్తున్నారు. కీలకమైన పవిత్ర సంగమం, దుర్గాఘాట్ వంటి ఘాట్లలో పనులు ఇంకా సగానికి పైగా ఉన్నట్లు కనపడుతున్నాయి. ఎప్పటికీ పూర్తవుతాయనేది ఇంజినీర్ల నుంచి స్పష్టమైన సమాచారం రావడం లేదు.