JPC
-
తెరపైకి ‘హమ్ అదానీ కె హై’.. మళ్లీ జేపీసీ డిమాండ్
ఢిల్లీ: అదానీ గ్రూప్ సంస్థ గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదు కావడంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆయన వ్యవహారాలపై దర్యాప్తునకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ను మరోసారి తెరపైకి తీసుకొచ్చింది.లంచం, మోసం చేశారనే అభియోగాలపై అదానీతో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు న్యూయార్క్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు వెల్లడించడం తెలిసిందే. ఈ ఆరోపణలతో స్టాక్‌మార్కెట్ సైతం కుదేలైంది. మరోపక్క.. రాజకీయంగానూ ఈ వ్యవహారం దుమారం రేపుతోంది.‘మోదాని’ స్కామ్స్‌పై జేపీసీ ఏర్పాటు చేయాలని 2023 జనవరి నుంచి డిమాండ్ చేస్తున్నాం. అయితే.. ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో కేసు నమోదైన నేపథ్యంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌కు బలం చేకూరుతోంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే.. The indictment of Gautam Adani and others by the Securities and Exchanges Commission (SEC) of the US vindicates the demand that the Indian National Congress has been making since Jan 2023 for a Joint Parliamentary Committee (JPC) investigation into the various Modani scams. The…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024न्यूयॉर्क के पूर्वी ज़िले के अमेरिकी अटॉर्नी कार्यालय द्वारा गौतम अडानी और उनसे जुड़े अन्य लोगों पर गंभीर आरोप लगाना उस मांग को सही ठहराता है जो भारतीय राष्ट्रीय कांग्रेस जनवरी 2023 से विभिन्न मोदानी घोटालों की संयुक्त संसदीय समिति (JPC) जांच के लिए कर रही है। कांग्रेस ने हम…— Jairam Ramesh (@Jairam_Ramesh) November 21, 2024 ‘హమ్ అదానీ కె హై’ సిరీస్‌లో ఇప్పటివరకు వందలాది ప్రశ్నలు సంధించామని, మోదీ, అదానీ బంధంపై వేసిన ప్రశ్నలకు ఇంతవరకు సమాధానం రాలేదని జైరాం రమేష్ విమర్శ గుప్పించారు.గతంలో.. అదానీ సంస్థ తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని, ఖాతాల్లో మోసాలు చేస్తోందంటూ అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధనా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన నివేదిక మార్కెట్ వర్గాల్లో తీవ్ర దుమారానికి దారితీసింది. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తీవ్రంగా ఖండించింది. అయినప్పటికీ ఈ మొత్తం వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ లేదంటే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఆ సమయంలో పార్లమెంట్ సమావేశాల్లోనూ డిమాండ్ చేశాయి.అదానీపై తాజా అభియోగాలివే..ఇదిలా ఉంటే.. అదానీ, దాని అనుబంధ సంస్థలు 20 ఏళ్లలో 2 బిలియన్ డాలర్ల లాభం పొందగల సౌరశక్తి సరఫరా ఒప్పందాలను పొందేందుకు భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్లు లంచాలు చెల్లించినట్లు ప్రాసిక్యూటర్లు ఆరోపిస్తున్నారు. ఆపై.. అమెరికా, అంతర్జాతీయ మదుపర్లకు తప్పుడు సమాచారం తెలియజేసి నిధులు సమీకరించేందుకు కంపెనీ ప్రయత్నించినట్లు వాళ్లు పేర్కొన్నారు. అలాగే..తద్వారా.. అదానీ గ్రీన్ ఎనర్జీలో అక్రమ మార్గాల ద్వారా.. ఆ కంపెనీ రుణ దాతలు, పెట్టుబడిదారుల నుంచి 3 బిలియన్ డాలర్లకు పైగా రుణాలు, బాండ్లను సేకరించిందని ఆరోపించారు. న్యూయార్క్ ప్రాసిక్యూటర్లు అభియోగాలు మోపారు. దీంతో గౌతమ్ అదానీ, ఆయన బంధువు సాగర్ అదానీ సహా మరో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇదే సమయంలో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్(SEC) మరో సివిల్ కేసు నమోదు చేసింది. యూఎస్ సెక్యూరిటీ చట్టాలను ఉల్లంఘించి అదానీ గ్రీన్ ఎనర్జీ అమెరికా ఇన్వెస్టర్ల నుంచి 175 మిలియన్ డాలర్లకు పైగా సమీకరించిందని అందులో ఆరోపించింది. దీనిపై దర్యాప్తు జరిపి జరిమానాతో పాటు కంపెనీపై ఆంక్షలు విధించాలని రెగ్యులేటర్ కోరింది. ఈ వార్తలపై అదానీ గ్రూప్ స్పందించాల్సి ఉంది. -
Budget Session: పార్లమెంట్లో మారని సీన్..ఉభయసభలు వాయిదా
సాక్షి, ఢిల్లీ: అదానీ కంపెనీల అవకతవకలపై చర్చ జరపాలని, జేపీసీ దర్యాప్తు డిమాండ్లతో విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వడం లేదు. విపక్షాల వాయిదా తీర్మాన నోటీసులు.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ల తిరస్కరణ.. ఆపై పార్లమెంట్లో నెలకొన్న గందరగోళంతో ఇరు సభలు కూడా సోమవారం కార్యకలాపాలు ప్రారంభించకుండానే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైనా రెండు సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదాపడ్డాయి. బడ్జెట్ సమావేశాల ఐదవ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అదానీ కంపెనీపై హిండన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు సభ ప్రారంభమైన కాసేపటికే నినాదాలతో గందరగోళం సృష్టించాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా విపక్షాలు అనుమతించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. సుమారు 16 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు.. శుక్రవారం ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై జేపీసీ దర్యాప్తు అనే ఏకపక్ష డిమాండ్‌ను ఉభయ సభల్లోనూ లెవనెత్తాలని నిర్ణయించుకున్నారు. ఆపై శుక్రవారం ఎలాంటి వ్యవహరాలు జరగకుండానే.. సోమవారానికి(ఇవాళ్టికి) పార్లమెంట్ సెషన్ వాయిదా పడింది. అయితే సోమవారం ప్రారంభమైన తర్వాత కూడా అదే సన్నివేశం నెలకొంది. కేంద్రం మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి ఒక ప్రాధాన్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోంది. -
రఫేల్ ఒప్పందంపై జేపీసీకి కేంద్రం నో
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ను రఫేల్ ప్రకంపనలు కుదిపేశాయి. ఈ ఒప్పందంపై చర్చ సందర్భంగా బుధవారం లోక్‌సభలో పాలక, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. రఫేల్ డీల్‌పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)చే విచారణ జరిపించాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం నిరాకరించింది. రఫేల్ ఒప్పందంపై కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ చేసిన ఆరోఫణలను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చుతూ ఈ ఒప్పందం జరిగిన తీరు పట్ల సుప్రీం కోర్టు సంతృప్తి వ్యక్తం చేసిందన్నారు. ఒప్పందంపై సర్వోన్నత న్యాయస్ధానం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయనందున దీనిపై జేపీసీ విచారణ అవసరం లేదన్నారు. జైట్లీ ప్రసంగానికి అడ్డుతగులుతూ విపక్ష సభ్యులు ఆయనపై కాగితాలను విసిరివేశారు. ప్రభుత్వం రఫేల్‌పై జేపీసీ విచారణ జరిపించాలని కోరుతూ నినాదాలతో హోరెత్తించారు. అవినీతిలో ఆరితేరిన కాంగ్రెస్ పార్టీ కట్టుకథలతో మోదీ సర్కార్‌కు సైతం ఆ మరకలు అంటించాలని ప్రయత్నిస్తోందని జైట్లీ ఈ సందర్భంగా విపక్షంపై విరుచుకుపడ్డారు. -
రఫేల్ ప్రకంపనలు : మోదీపై రాహుల్ ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : రఫేల్ ఒప్పందంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీచే విచారణ జరిపించాలని కాంగ్రెస చీఫ్ రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లోక్‌సభలో బుధవారం రఫేల్‌పై చర్చను ప్రారంభిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. రఫేల్‌పై విపక్షాల ప్రశ్నలను ఎదుర్కొనే ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీకి లేదని ఎద్దేవా చేశారు. రఫేల్‌పై తనను ఎవరూ ప్రశ్నించలేరని ప్రదాని చెప్పడం సరైంది కాదని, దీనిపై దేశ ప్రజలంతా ఆయనను ప్రశ్నిస్తున్నారన్నారు. రఫేల్ ఒప్పందానికి సంబంధించి రూ 1600 కోట్ల నూతన ధరపై రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసింది నిజం కాదా అని నిలదీశారు. ఐఏఎఫ్ అధికారులు 126 విమానాలు కావాలని డిమాండ్ చేయగా వాటి సంఖ్యను 36కు ఎందుకు కుదించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఏఎన్ఐకి ప్రధాని ఇచ్చిన ఇంటర్వ్యూ ముందుగా సిద్ధం చేసిందేనన్నారు. ఇంటర్వ్యూలో 90 నిమిషాలు మాట్లాడిన ప్రదాని రఫేల్‌పై మాత్రం ఇప్పటికీ బదులివ్వడం లేదని ఆరోపించారు. రఫేల్‌కు సంబంధించిన ఫైళ్లనీ తన పడక గదిలో ఉన్నాయని గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారని ఆ రాష్ట్రమంత్రి విశ్వజిత్ రాణే చెబుతున్న ఆడియో క్లిప్‌ను సభలో ప్రదర్శిందుకు అనుమతించాలని రాహుల్ కోరారు. దీనికి స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో సభ వాయిదా పడింది. జైట్లీ అభ్యంతరం.. రఫేల్ ఒప్పందంపై రాహుల్ వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తిప్పికొట్టారు. రఫేల్‌పై సుప్రీం కోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పును వెలువరించడంతో దిక్కుతోచని కాంగ్రెస్ ఆడియో టేప్‌ల అంశాన్ని తెరపైకి తెచ్చిందని ఆరోపించారు. గోవా మంత్రి చెబుతున్నట్టు రూపొందిన ఆడియో క్లిప్ నకిలీదని జైట్లీ అన్నారు.రఫేల్‌పై మోదీ సర్కార్‌పై బురద చల్లేందుకు ఈ టేప్‌ను కాంగ్రెస్ తయారుచేసిందని దుయ్యబట్టారు. -
రాఫేల్ కొనుగోలుపై జెపిసికి కాంగ్రెస్ డిమాండ్
-
‘నేను సీఎంగా కొనసాగడంలో అర్థం లేదు’
గువహటి : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడలేకపోతే తాను ముఖ్యమంత్రిగా కొనసాగడంలో అర్థంలేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ అన్నారు. పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయ సేకరణకోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ రాష్ట్ర పర్యటనపై ఆయన మీడియాతో మాట్లాడారు. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన హిందువులకు ఎలాంటి పత్రాలు లేకుండా భారత పౌరసత్వం ఇచ్చేందుకు భారత పౌరసత్వ చట్టం 1955ని సవరణ చేస్తూ భారత పౌరసత్వ బిల్లు 2016పై ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ ఆధ్వర్యంలోని 16 మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ నెల 7 నుంచి 9 వరకు అసోంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన మైనారిటీలకు (హిందువులు, సిక్కులు, బుద్దిస్టులు, జైనులు, పార్శిలు) ఏ విధమైన పత్రాలు లేకుండానే భారత పౌరసత్వ చట్ట (2016) సవరణ చేపట్టనున్నారు. దీనిపై రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్న క్రమంలో సోనోవాల్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ప్రయోజనం, ప్రజల భద్రత సరిగ్గా లేనప్పుడు తాను ఏ కారణం చేత ముఖ్యమంత్రి పదవిలో కొనసాగా’లని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు తాము కృషి చేస్తున్నామని తెలిపారు. వివిధ వర్గాల ప్రజలతో పాటు మేధావులతోను చర్చించి దీనిపై నిర్ణయం తీసుకుంటానని, ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసోం ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తాను నిర్ణయం తీసుకోబోనని, ప్రభుత్వంపై నమ్మకం ఉంచి రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతి కోసం అందరూ కృషి చేయాలన్నారు. కాగా బిల్లుకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ మానవహారాలు నిర్వహించారు. -
‘భూబిల్లు’ కమిటీ గడువు పొడిగింపు!
నేడు లోక్‌సభలో తీర్మానం న్యూఢిల్లీ: వివాదాస్పద భూబిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంట్ కమిటీ(జేపీసీ) నివేదిక సమర్పణకు మళ్లీ గడువు పొడిగించాలని కోరే అవకాశముంది. చాలా రాష్ట్రాలు భూసేకరణ పరిహారానికి సంబంధించి సమాచారం ఇవ్వనందున వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి వారం వరకు గడువు పొడిగించాలని కోరనుంది. కమిటీ గడువు వచ్చే బుధవారంతో ముగియనున్న నేపథ్యంలో కమిటీ చైర్మన్ ఎస్ఎస్ అహ్లూవాలియా(బీజేపీ) మంగళవారం గడువు పొడిగింపు కోరుతూ లోక్‌సభలో తీర్మానం ప్రవేశపెట్టే అవకాశముంది. దీనిపై కమిటీ సోమవారం సమావేశమైంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పలువురు కమిటీ సభ్యులు హాజరుకాలేదు. వానాకాల సమావేశాలు జూలై-ఆగస్టులో జరుగుతాయి. ఇప్పటికే కమిటీ గడువును ఐదుసార్లు పొడిగించారు. -
భూబిల్లుపై కొలిక్కిరాని జేపీసీ నివేదిక
శీతాకాల సమావేశాల వరకు గడువు పొడిగింపు న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వివాదాస్పద భూసేకరణ బిల్లు పార్లమెంటు ముందుకు రావడం మరింత ఆలస్యం కానుంది. బిల్లును అధ్యయనం చేస్తున్న సంయుక్త పార్లమెంటు కమిటీ (జేపీసీ) దీనిపై నివేదిక సమర్పించేందుకు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలి వారం వరకూ గడువు పొడిగించాలని నిర్ణయించింది. బిల్లులోని కొన్ని నిబంధనలపై అధ్యయనం చేసేందుకు మరింత సమయం కావాలంటూ సోమవారం జరిగిన భేటీలో జేపీసీలోని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు జేపీసీ చైర్మన్ ఎస్.ఎస్. అహ్లూవాలియాను కోరగా అందుకు ఆయన అంగీకరించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం...జేపీసీ నివేదిక జాప్యమయ్యేలా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోందంటూ బీజేపీ సభ్యులు ఆరోపించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేశ్ వాకౌట్ చేయగా అహ్లూవాలియా బుజ్జగించి తిరిగి రప్పించారు. గత పొడిగింపు ప్రకారం జేపీసీ మంగళవారం పార్లమెంటుకు ఏకాభిప్రాయ నివేదిక సమర్పించాల్సి ఉంది. జేపీసీ తాజా నిర్ణయం నేపథ్యంలో కేంద్రం నాలుగోసారి భూసేకరణ ఆర్డినెన్సును జారీ చేయాల్సి రానుంది. -
భూ బిల్లు కీలకాంశాలపై నేడు జేపీసీ భేటీ
న్యూఢిల్లీ: వివాదాస్పద భూ బిల్లుపై ఏకాభిప్రాయం సాధించేందుకుగానూ దీనిపై ఏర్పాటైన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) సోమవారం తుదిసారి భేటీ కానుంది. ఇందులో కీలకాంశాలపై చర్చించనుంది. వినియోగించని భూమిని ఐదేళ్ల తర్వాత అసలు యజమానికి అప్పగించే నిబంధనతో పాటు పలు కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం ఈ బిల్లును బీజేపీ ఎంపీ ఎస్ఎస్ అహ్లూవాలియా నేతృత్వంలోని 30 మంది సభ్యుల సంయుక్త పార్లమెంటరీ కమిటీ అధ్యయనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిపాదిత బిల్లులో రైతుల సమ్మతి, సామాజిక ప్రభావ అంచనా తదితర ఆరు అంశాలను చేర్చేందుకు ఇప్పటికే కమిటీ ఏకాభిప్రాయానికి రావడం తెలిసిందే. అయితే మరో మూడు అంశాలకు సంబంధించి ఏకాభిప్రాయం కోసం ఈ భేటీలో ప్రయత్నించనుంది. మంగళవారం కమిటీ తన నివేదికను పార్లమెంట్‌కు సమర్పించాల్సి ఉన్నందున కీలకాంశాలపై ఏకాభిప్రాయం సాధించి మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ బిల్లులో మార్పులకు సోమవారం ఆమోదముద్ర వేయనుంది. కాగా, లోక్‌పాల్ బిల్లుపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీకి మరో రెండు నెలల గడువు లభించింది. ఈ బిల్లుకు సంబంధించి కమిటీకి గడువును పొడిగించడం ఇది రెండోసారి. మరోపక్క.. జీఎస్టీ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాక బిల్లులో సవరణలు చేసేందుకు సిద్ధమని కేంద్ర హోం మంత్రి మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. -
బిహార్ ఎన్నికల తర్వాతే భూబిల్లు!
బిల్లుపై సిఫారసుల సమర్పణకు వారం గడువు పొడిగింపు కోరిన జేపీసీ న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లుపై సెప్టెంబర్‌లో జరగబోయే బిహార్ ఎన్నికల తర్వాతే కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ).. తన సిఫారసులను అందించటానికి మరో వారం రోజులు గడువు పొడిగించాలని కోరింది. బిల్లుపై జేపీసీలో ఏకాభిప్రాయం లేకపోవటం, మరోవైపు లలిత్‌గేట్ వివాదం సహా పలు అంశాలపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర దాడిని ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో.. రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భూసేకరణ బిల్లును తెస్తే విపక్షాల దాడికి మరో ఆయుధాన్ని అందించినట్లవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు చెప్తున్నారు. వర్షాకాల సమావేశాల్లో భూ బిల్లును ప్రవేశపెట్టకపోతే.. బిహార్ ఎన్నికల అనంతరం జరిగే శీతాకాల సమావేశాల్లో దానిని ప్రవేశపెడతారు. అయితే.. రాజ్యసభలో తనతో పాటు ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, జేడీయూ తదితర పార్టీలు భూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండటం, ఎగువ సభలో ప్రభుత్వానికి మెజారిటీ లేకపోవటం వంటి పరిస్థితులను బట్టి.. ఈ బిల్లును దాని వాస్తవ రూపంలో ఆమోదించుకోవాలంటే ఉభయసభల సంయుక్త సమావేశం నిర్వహించటం మినహా ప్రభుత్వానికి వేరే మార్గం లేదని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అలాగే.. 30 మంది సభ్యులున్న జేపీసీలో బీజేపీ ఎంపీలు కేవలం 11 మందే ఉన్నారని.. మెజారిటీ ఓటుతో బిల్లును అంగీకరించాలంటే అధికారపక్షానికి మరో ఐదు ఓట్లు అవసరమవుతాయని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విపక్షాల అసమ్మతి ప్రకటనలతో ఈ బిల్లు జేపీసీ నుంచి పార్లమెంటు ముందుకు వస్తుందని పేర్కొంటున్నాయి. భూ బిల్లుపై స్వదేశీ జాగర ణ్ మండిపాటు ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ బిల్లుపై ఆరెస్సెస్‌కు చెందిన మరో అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్(ఎస్జేఎం) కూడా మండిపడింది. అందులో ఆమోదయోగ్యంకాని అనేక సెక్షన్లు ఉన్నాయని విమర్శించింది. జీపీసీ ముందు ఎస్జేఎం జాతీయ కన్వీనర్ అశ్వనీ మహాజన్ నేతృత్వంలో ఆ సంఘం ప్రతినిధులు హాజరై అభిప్రాయాలు తెలిపారు. -
ప్రైవేటు కంపెనీపై జేపీసీ కన్నెర్ర
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందు ప్రైవేట్ కంపెనీ తరఫు ప్రతినిధి సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని కమిటీలోని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, భూమి అధికార్ ఆందోళన్, శ్రీ సమయ, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థల ప్రతినిధులను జేపీసీ ముందు మంగళవారం భూ బిల్లుపై తమ అభిప్రాయాలు, సూచనలు అందించేందుకు ఆహ్వానించారు. వారిలో ముంబైకి చెందిన శ్రీ సమయ అనే ప్రైవేటు సంస్థ ఎండీ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతుండగా కాంగ్రెస్, టీఎంసీ, బీజేడీ, లెఫ్ట్ తదితర విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. వ్యక్తిగత ప్రయోజనాల దృష్టితో వచ్చే ప్రైవేటు సంస్థలను, ప్రైవేటు వ్యక్తులను జేపీసీ ముందుకు అనుమతించకూడదని వాదించారు. శ్రీ సమయ కంపెనీ నిర్మాణ రంగంలో ఉందన్నారు. విశ్వసనీయ సంస్థల తరఫున వచ్చే ప్రతినిధుల సూచనలు స్వీకరించేందుకు సిద్ధమే కానీ, వ్యక్తిగత లబ్ధి కోసం వచ్చే వారిని అనుమతించడం సరికాదని జేపీసీ చైర్మన్ ఎస్ఎస్ అహ్లూవాలియాకు స్పష్టం చేశారు. మిగతా ప్రజాస్వామ్య, రైతు సంఘాల విషయంలో వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కాగా, యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టంలో ఎన్డీయే సర్కారు తలపెట్టిన వివాదాస్పద సవరణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని జేపీసీ ముందు మంగళవారం హాజరైన పలు స్వచ్చంధ సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. దానివల్ల భూ బిల్లుపై సామాన్యుల్లో నెలకొన్న అనుమానాలు, గందరగోళం తొలగిపోతాయన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే తమ నివేదికను సభ ముందుంచాలని జేపీసీ భావిస్తోంది. అందుకని ఇకపై వారానికి రెండు రోజులు సమావేశం కావాలని నిర్ణయించింది. జూలై రెండు, లేదా మూడో వారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది.