
సాక్షి, ఢిల్లీ: అదానీ కంపెనీల అవకతవకలపై చర్చ జరపాలని, జేపీసీ దర్యాప్తు డిమాండ్‌లతో విపక్షాలు పార్లమెంట్ కార్యకలాపాలను సజావుగా సాగనివ్వడం లేదు. విపక్షాల వాయిదా తీర్మాన నోటీసులు.. లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్‌ల తిరస్కరణ.. ఆపై పార్లమెంట్‌లో నెలకొన్న గందరగోళంతో ఇరు సభలు కూడా సోమవారం కార్యకలాపాలు ప్రారంభించకుండానే మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైనా రెండు సభల్లో విపక్షాలు ఆందోళనలు కొనసాగించాయి. దీంతో ఉభయసభలు మంగళవారం ఉదయం 11 గంటల వరకు వాయిదాపడ్డాయి.
బడ్జెట్ సమావేశాల ఐదవ రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అదానీ కంపెనీపై హిండన్‌బర్గ్ ఇచ్చిన నివేదికపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ( జేపీసీ)తో దర్యాప్తు జరిపించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు సభ ప్రారంభమైన కాసేపటికే నినాదాలతో గందరగోళం సృష్టించాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు కూడా విపక్షాలు అనుమతించకపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే..
సుమారు 16 ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులు.. శుక్రవారం ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సమావేశమై జేపీసీ దర్యాప్తు అనే ఏకపక్ష డిమాండ్‌ను ఉభయ సభల్లోనూ లెవనెత్తాలని నిర్ణయించుకున్నారు. ఆపై శుక్రవారం ఎలాంటి వ్యవహరాలు జరగకుండానే.. సోమవారానికి(ఇవాళ్టికి) పార్లమెంట్ సెషన్ వాయిదా పడింది.
అయితే సోమవారం ప్రారంభమైన తర్వాత కూడా అదే సన్నివేశం నెలకొంది. కేంద్రం మాత్రం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానానికి ఒక ప్రాధాన్యత ఉందనే విషయాన్ని గుర్తు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment