Budget Session LIVE Updates: Oppn on Hindenburg Report - Sakshi
Sakshi News home page

హిడెన్‌బర్గ్‌ వ్యవహారం: కేంద్రంపై విపక్షాల ముప్పేట దాడి.. ఉభయసభలు శుక్రవారానికి వాయిదా

Published Thu, Feb 2 2023 11:28 AM | Last Updated on Fri, Feb 3 2023 4:20 AM

Oppn On Hindenburg Report: Budget Session LIVE Updates - Sakshi

ఢిల్లీలో విజయ్‌ చౌక్‌లో మీడియాతో మాట్లాడుతున్న ఖర్గే, విపక్ష పార్టీల నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ ఇచ్చిన నివేదిక గురువారం పార్లమెంట్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. మార్కెట్‌ విలువను భారీగా కోల్పోతున్న అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల పెట్టుబడుల అంశంపై తక్షణమే చర్చించాలంటూ విపక్షాలు చేపట్టిన ఆందోళనతో ఉభయ సభలు స్తంభించాయి. హిండెన్‌బర్గ్‌ నివేదికపై చర్చించాలని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ సహా 9 విపక్షాల ఎంపీలు వెల్‌లోకి వచ్చి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. దీంతో ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.  

9 పార్టీల వాయిదా తీర్మానాలు  
సభా కార్యకలాపాల ఆరంభానికి ముందే ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్ష నేతలు పార్లమెంట్‌ ప్రాంగణంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదానీ అంశంపై కేంద్రం సమాధానం ఇచ్చేదాకా సభా కార్యక్రమాలు అడ్డుకోవాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగానే ఉభయ సభల్లో 9 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభలో కాంగ్రెస్‌ తరఫున మాణిక్యం ఠాగూర్, బీఆర్‌ఎస్‌ తరపున నామా నాగేశ్వర్‌రావు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే వాయిదా తీర్మానం ఇచ్చారు.

ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్‌ ఓం బిర్లా.. జాంబియా నుంచి వచ్చిన పార్లమెంటరీ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ప్రశ్నోత్తరాలు చేపట్టాలని నిర్ణయించారు. అయితే, అదానీ అంశంపై చర్చించేందుకు రూల్‌ 267 కింద తామిచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చించాలని విపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలంటూ స్పీకర్‌ పదేపదే కోరినా వెనక్కి తగ్గలేదు. ఏకంగా వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలతో హోరెత్తించారు.

దీంతో సభను స్పీకర్‌ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమయ్యాక విపక్ష ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి జోక్యం చేసుకుంటూ సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో లోక్‌సభ శుక్రవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. సభను శుక్రవారానికి వాయిదా వేశారు.  

జేపీసీ లేక సీజేఐ నేతృత్వంలో కమిటీ  
అదానీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని, ఇందుకోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఉదయం ఉభయ సభలు వాయిదా పడిన వెంటనే మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని విపక్ష ఎంపీలు విజయ్‌చౌక్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘మార్కెట్‌ విలువ కోల్పోతున్న సంస్థల్లో ఎల్‌ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులతో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారు. దీనిపై చర్చించడానికి మేమిచ్చిన తీర్మానాన్ని సస్పెండ్‌ చేశారు. అదానీ అంశంపై పార్లమెంట్‌లో లోతుగా చర్చించాలి. అదానీపై విచారణ వివరాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు బయటపెట్టాలి’’ అని డిమాండ్‌ చేశారు.  

సమగ్ర విచారణతోనే..: నామా, కేకే  
అదానీ వ్యవహారంపై జేపీసీ లేక సీజేఐ కమిటీతో సమగ్ర విచారణ జరిపిస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని బీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కె.కేశవరావు పేర్కొన్నారు. ఎల్‌ఐసీ సహా బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న పేదల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు.  

జనం సొమ్మును లూటీ చేశారు  
ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ సహా పలు ప్రభుత్వ సంస్థలతో అదానీ గ్రూప్‌లో బలవంతంగా పెట్టుబడులు పెట్టించారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ ఆరోపించారు. తాజా సంక్షోభం వల్ల ఆయా సంస్థలు భారీగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. కోట్లాది మంది భారతీయులు పొదుపు చేసుకున్న సొమ్ము ప్రమాదంలో చిక్కుకుందని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అదానీ అంశంపై దర్యాప్తు జరిపించాలని విపక్షాలు కోరినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జైరామ్‌ రమేశ్‌ మండిపడ్డారు.

బ్యాంకుల్లో ప్రజలు దాచుకున్న డబ్బును అదానీ సంస్థల్లో పెట్టుబడి పెట్టారని, ఇప్పుడు వారంతా భయాందోళనకు గురవుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ చెప్పారు. జనం సొమ్మును అదానీ లూటీ చేశారని సీపీఎం నేత ఎలమారమ్‌ ధ్వజమెత్తారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. భారీ కుంభకోణం జరిగితే ప్రభుత్వం ఎందుకు నోరువిప్పడం లేదని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్‌ సింగ్‌ నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement