సాక్షి, న్యూఢిల్లీ: అదానీ గ్రూప్‌పై వచ్చిన ఆరోపణలు, తద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్ల పతనం కారణంగా తలెత్తిన పరిస్థితులపై పార్లమెంట్‌లో వెంటనే చర్చ ప్రారంభించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఏకతాటిపైకి వచ్చిన విపక్ష సభ్యుల ఆందోళనతో శుక్రవారం లోక్‌సభ, రాజ్యసభ స్తంభించాయి. మిగతా సభా కార్యకలాపాలను పక్కనపెట్టి హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చించాల్సిందేనంటూ ప్రతిపక్షాలన్నీ పట్టుబట్టడంతో వరుసగా రెండోరోజు కూడా ఎలాంటి చర్చలు లేకుండానే ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.
శుక్రవారం సమావేశాలకు ముందే తీసుకున్న సంయుక్త నిర్ణయం 15 పార్టీలు వాయిదా తీర్మానాలిచ్చాయి. లోక్‌సభ ఆరంభమై ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన వెంటనే విపక్ష ఎంపీలు హిండెన్‌బర్గ్ నివేదికపై చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారు. బిగ్గరగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకురావడంతో స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. సభ పునఃప్రారంభమైన తర్వాత విపక్ష ఎంపీలు ఆందోళన కొనసాగించారు. దీంతో సభ సోమవారానికి వాయిదా పడింది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో సభను సోమవారానికి వాయిదా వేశారు.
విచారణ జరిపించాల్సిందే...
అదానీ గ్రూప్ పట్ల వచ్చిన ఆరోపణలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) లేదా సుప్రీంకోర్టు నియమించిన ప్యానెల్‌తో విచారణ జరిపించాలని విపక్షాలు పునరుద్ఘాటించాయి. అత్యంత కీలకమైన ఈ అంశంపై చర్చకు అంగీకరించకపోవడం ఏమిటని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
చర్చించే దాకా పట్టు!
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో మోదీ సర్కారుపై దాడిని మరింత తీవ్రతరం చేయాలని విపక్షాలు నిర్ణయించాయి. ఇందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు రాజ్యసభలో విపక్ష నేత, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్లో 16 ప్రతిపక్ష పార్టీలు శుక్రవారం ఉదయం సమావేశమయ్యాయి. ఈ భేటీలో కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ, ఆప్, బీఆర్‌ఎస్, శివసేన, ఆర్జేడీ, జేడీ(యూ), సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (జోస్ మణి), కేరళ కాంగ్రెస్ (థామస్), ఆరెస్పీ ఇందులో ఉన్నాయి. అదానీ గ్రూప్ స్టాక్ మార్కెట్ అవకతవకలపై సభలో చర్చ జరిగేదాకా పట్టుబట్టాల్సిందేనని పార్టీలన్నీ ఏకగ్రీవంగా నిర్ణయించాయి.
దాంతోపాటు అదానీ గ్రూప్ అవకతవకలపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సంయుక్త పార్లమెంటరీ సంఘంతో దర్యాప్తుకు కేంద్రం అంగీకరించేదాకా ఉభయ సభల్లోనూ ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశాయి. అదానీ అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరగాల్సిందే. అప్పుడు మాత్రమే వాటిలో ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ పెట్టుబడులకు భద్రత’’ అని భేటీ అనంతరం కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ మీడియాతో అన్నారు. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రధాని మోదీయే వాటిపై ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. అదానీ గ్రూప్ పెద్ద ఎత్తున ఆర్థిక, అకౌంటింగ్ అవకతవకలకు పాల్పడిందంటూ న్యూయార్క్‌కు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణల దెబ్బకు గ్రూప్ విలువ చూస్తుండగానే ఏకంగా 100 బిలియన్ డాలర్ల మేరకు పడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment