అదానీపై రిపోర్ట్‌కు కట్టుబడి ఉన్నాం హిండెన్‌బర్గ్
న్యూఢిల్లీ: దిగ్గజ కార్పొరేట్ సంస్థలపై సంచలన ఆరోపణలతో ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయిన అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్(Hindenburg) మూసివేతపై ఆ సంస్థ వ్యవస్థాపకుడు నేట్ ఆండర్సన్ మరోసారి పెదవి విప్పారు. ఎవరి బెదిరింపులకో లేదంటే కేసులకో భయపడి సంస్థను మూసేయలేదని, పని భారం కారణంగానే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు.
అదానీ(Adani) గ్రూప్‌తో సహా పలు సంస్థలపై తాము ఇచ్చిన రిపోర్టులన్నింటికీ కట్టుబడి ఉన్నామని కూడా పేర్కొన్నారు. అదానీపై పలు మీడియా రిపోర్టుల్లో లేవనెత్తిన ఆరోపణల ఫలితంగానే తాము ఆ గ్రూప్‌నకు సంబంధించి ‘కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణాన్ని’ వెలికితీశామని ఆయన చెప్పారు. కాగా, రిపోర్ట్‌లో పేర్కొన్న ఆరోపణలన్నింటినీ అదానీ గ్రూప్ తోసిపుచ్చిన సంగతి తెలిసిందే.
కొత్త బ్రాండ్ ఏర్పాటు చేస్తే సపోర్ట్ చేస్తా...
భారత్ వ్యతిరేక శక్తులైన ఓసీసీఆర్‌పీ, జార్జ్ సోరోస్ వంటి గ్రూపులతో హిండెన్‌బర్గ్‌కు లింకులు అంటగట్టేందుకు కొంతమంది చేసిన ప్రయత్నాలపై స్పందిస్తూ.. అదో ‘పనికిమాలిక కుట్ర’గా అభివర్ణించారు. అలాంటి తెలివితక్కువ కుట్ర సిద్ధాంతాలకు మరింత ఆజ్యం పోయకూడదనే.. తమ సంస్థ వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఫైనాన్షియల్ ఫోరెన్సిక్ రీసెర్చ్ సేవల సంస్థగా ఎనిమిదేళ్ల క్రితం ఆవిర్భవించిన హిండెన్‌బర్గ్... ప్రపంచవ్యాప్తంగా పలు దిగ్గజ సంస్థల్లోని లొసుగులపై అధ్యయనం చేసి విడుదల చేసిన నివేదికలు రాజకీయంగా, కార్పొరేట్ ప్రపంచంలో దుమారం సృష్టించడం తెలిసిందే.
కాగా, ట్రంప్ పగ్గాలు చేపట్టనున్న తరుణంలో సంస్థను మూసేస్తున్నట్లు ప్రకటించి ఆండర్సన్ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ట్రంప్ సర్కారుకు భయపడే ఆయన మూసివేత నిర్ణయం తీసుకున్నారన్న గుసగుసలు వినిపించాయి. కంపెనీ పగ్గాలు వేరెవరికైనా అప్పగించకుండా ఎందుకు మూసేయాల్సి వచి్చందన్న ప్రశ్న కు ‘ఆ బ్రాండ్ నుండి నన్ను ఎవరూ వేరు చేయలేరు. హిండెన్‌బర్గ్ అనే పేరు నాతో పెనవేసుకుపోయింది. ఎవరికైనా అమ్మేయడానికి అది సాఫ్ట్‌వేర్ అప్లికేషన్, సైకిళ్ల ఫ్యాక్టరీ కాదు. నా టీమ్ కొత్త బ్రాండ్‌ను ఏర్పాటు చేస్తానంటే తప్పకుండా మద్దతిస్తా. వారు ఆ పని చేస్తారనే అనుకుంటున్నా’ అని ఆండర్సన్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment