ప్రైవేటు కంపెనీపై జేపీసీ కన్నెర్ర
న్యూఢిల్లీ: భూ సేకరణ బిల్లుపై ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ముందు ప్రైవేట్ కంపెనీ తరఫు ప్రతినిధి సొంత అభిప్రాయాలను వ్యక్తం చేయడాన్ని కమిటీలోని విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, భూమి అధికార్ ఆందోళన్, శ్రీ సమయ, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, పీఆర్‌ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ సంస్థల ప్రతినిధులను జేపీసీ ముందు మంగళవారం భూ బిల్లుపై తమ అభిప్రాయాలు, సూచనలు అందించేందుకు ఆహ్వానించారు. వారిలో ముంబైకి చెందిన శ్రీ సమయ అనే ప్రైవేటు సంస్థ ఎండీ బిల్లుకు అనుకూలంగా మాట్లాడుతుండగా కాంగ్రెస్, టీఎంసీ, బీజేడీ, లెఫ్ట్ తదితర విపక్ష సభ్యులు అడ్డుకున్నారు.
వ్యక్తిగత ప్రయోజనాల దృష్టితో వచ్చే ప్రైవేటు సంస్థలను, ప్రైవేటు వ్యక్తులను జేపీసీ ముందుకు అనుమతించకూడదని వాదించారు. శ్రీ సమయ కంపెనీ నిర్మాణ రంగంలో ఉందన్నారు. విశ్వసనీయ సంస్థల తరఫున వచ్చే ప్రతినిధుల సూచనలు స్వీకరించేందుకు సిద్ధమే కానీ, వ్యక్తిగత లబ్ధి కోసం వచ్చే వారిని అనుమతించడం సరికాదని జేపీసీ చైర్మన్ ఎస్‌ఎస్ అహ్లూవాలియాకు స్పష్టం చేశారు. మిగతా ప్రజాస్వామ్య, రైతు సంఘాల విషయంలో వారు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కాగా, యూపీఏ ప్రభుత్వం తీసుకువచ్చిన భూ సేకరణ చట్టంలో ఎన్డీయే సర్కారు తలపెట్టిన వివాదాస్పద సవరణలపై కేంద్రం వివరణ ఇవ్వాలని జేపీసీ ముందు మంగళవారం హాజరైన పలు స్వచ్చంధ సంస్థలు, రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. దానివల్ల భూ బిల్లుపై సామాన్యుల్లో నెలకొన్న అనుమానాలు, గందరగోళం తొలగిపోతాయన్నారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే తమ నివేదికను సభ ముందుంచాలని జేపీసీ భావిస్తోంది. అందుకని ఇకపై వారానికి రెండు రోజులు సమావేశం కావాలని నిర్ణయించింది. జూలై రెండు, లేదా మూడో వారంలో వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశముంది.