కాంగ్రెస్ తరఫున నామినీ జాబితాలో ఎంపిక
తెలుగు వారిలో జీఎం హరీశ్ బాలయోగి, బాలశౌరి వల్లభనేని, సీఎం రమేశ్ పేర్లు ఖరారు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు ఉద్దేశించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటవుతున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)లో కాంగ్రెస్ తరఫున ప్రియాంకా గాంధీ నామినేట్ అయ్యారు. కాంగ్రెస్ తరఫున నామినీల జాబితాలో ప్రియాంక గాంధీ వాద్రా, మనీశ్ తివారీ, సుఖ్‌దేవ్ భగత్ పేర్లను చేర్చారు. అర్హత ఉన్న పార్టీలన్నీ తమ తమ నామినీల పేర్లను లోక్‌సభ స్పీకర్‌కు అందజేశారు.
ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. మొత్తంగా లోక్‌సభ నుంచి 21 మంది, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. గురువారం ఈ 21 మంది లోక్‌సభ సభ్యుల పేర్లను స్పీకర్ అధికారికంగా ప్రకటించనున్నారు. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సంబంధిత తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీ తమ నివేదికను వచ్చే సెషన్ చివరివారం తొలి రోజున నివేదించాలని మేఘ్వాల్ ప్రతిపాదించనున్నారు.
బీజేపీ తరఫున మాజీ కేంద్ర మంత్రి పురుషోత్తంభాయ్ రూపాలా, భతృహరి మహతాబ్, అనిల్ బాలుని, సీఎం రమేశ్, బాన్సురీ స్వరాజ్, విష్ణు దయాళ్ రామ్, సంబిత్ పాత్రాల పేర్లు ఖరారైనట్లు సమాచారం. గతంలో న్యాయశాఖ సహాయ మంత్రిగా చేసిన పీపీ చౌదరి జేపీసీకి ఛైర్మన్‌గా ఉంటారని తెలుస్తోంది. అయితే అనురాగ్ ఠాకూర్ పేరు సైతం పరిశీలనలో ఉందని సమాచారం.
శివసేన తరఫున శ్రీకాంత్ షిండే, సమాజ్‌వాదీ పార్టీ తరఫున ధర్మేంద్ర యాదవ్, తృణమూల్ కాంగ్రెస్ తరఫున కళ్యాణ్ బెనర్జీ, డీఎంకే తరఫున టీఎం సెల్వగణపతి, టీడీపీ తరఫున జీఎం హరీశ్ బాలయోగి, ఎన్సీపీ(ఎస్పీ) తరఫున సుప్రియా సూలే, ఆర్‌ఎల్‌డీ తరఫున చందన్ చౌహాన్, జనసేన పార్టీ తరఫున బాలశౌరి వల్లభనేని కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. బీజేపీ సారథ్యలోని ఎన్‌డీఏ కూటమి తరఫున కమిటీలో 14 మంది సభ్యులు ఉండనున్నారు.
వీరిలో బీజేపీ నుంచి 10 మంది ఉంటారు. రాజ్యసభ నుంచి కాంగ్రెస్ తరఫున రణ్‌దీప్ సూర్జేవాలా, డీఎంకే తరఫున పి.విల్సన్, టీఎంసీ తరఫున సాకేత్ గోఖలే, జేడీ(యూ) తరఫున సంజయ్ ఝా, బీజేడీ తరఫున మానస్ రంజన్ మంగరాజ్‌ల పేర్లు దాదాపు ఖరారయ్యాయి. జమిలీ ఎన్నికల బిల్లులు రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment