
టీఓటీ పద్ధతిలో రూ.6,661 కోట్లకు అప్పగించిన ఎన్‌హెచ్‌ఏఐ
గతంలో ఓఆర్‌ఆర్‌ను ప్రైవేటుకు అప్పగించడంపై దుమారం
సాక్షి, హైదరాబాద్: నిధుల సమీకరణే లక్ష్యంగా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణలోని ఓ జాతీయ రహదారిని ప్రైవేటుపరం చేసింది. రోడ్డు మీద ఉన్న టోల్ బూత్‌ల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేయటం ద్వారా నిర్ధారిత కాలానికి టోల్ వసూలు అంచనా మేరకు లెక్కగట్టి మొత్తాన్ని ఒకేసారి వసూలు చేసుకునేందుకు ప్రారంభించిన టీఓటీ (టోలింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్ అండ్ ట్రాన్స్‌ఫర్) విధానంలో ఓ జాతీయ రహదారిని ప్రైవేటుకు అప్పగించింది. టెండర్ పద్ధతిలో ఆ రోడ్డు బాధ్యతను పొందిన సంస్థ గురువారం అర్ధరాత్రి నుంచి దానిపై టోల్ వసూలు ప్రారంభించింది.
20 ఏళ్ల కాలానికి...: హైదరాబాద్–నాగ్‌పూర్ (ఎన్‌హెచ్ 44) జాతీయ రహదారి ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహణలో ఉంది. 251 కి.మీ. నిడివి గల ఈ రోడ్డును తాజాగా టీఓటీ పద్ధతిలో ప్రైవేటు సంస్థకు అప్పగించింది. గత సెపె్టంబరులో టెండరు పిలవగా, నార్త్ తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ సంస్థ వచ్చే 20 ఏళ్లపాటు ఆ రోడ్డు నిర్వహణను పర్యవేక్షిస్తుంది. ఈ రోడ్డుపై ఆరు టోల్ ప్లాజాలుండగా, ఒకటి ఇప్పటికే ప్రైవేటు ఆ«దీనంలో ఉంది. మిగతా ఐదు టోల్‌బూత్‌లను ఎన్‌హెచ్‌ఏఐ ఇప్పుడు టీఓటీ పద్ధతిలో ప్రైవేటుకు అప్పగించింది.
వచ్చే 20 ఏళ్ల కాలానికి సంబంధించి ఒకేసారి టీఓటీ మొత్తంగా ఆ సంస్థ రూ.6,661 కోట్లను ఎన్‌హెచ్‌ఏఐకి ఈనెల 12న జమచేసింది. ఇక టోల్ వసూలు బాధ్యత ప్రైవేటు సంస్థ చేపడుతుంది. ఈ 20 ఏళ్లపాటు రోడ్డు నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఇదే తరహాలో ఔటర్ రింగురోడ్డు (ఓఆర్‌ఆర్)ను ప్రైవేటు సంస్థకు అప్పగించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆ నిర్ణయం పెద్ద వివాదాస్పదమైంది.
ప్రైవేటు సంస్థ చెల్లించిన మొత్తం కంటే టోల్ ఆదాయం చాలా ఎక్కువగా ఉంటుందని వైరి పక్షాలు నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. కాగా, ప్రైవేటు సంస్థలు కేంద్రం నిర్ధారించిన మేరకే టోల్ వసూలు చేయాల్సి ఉంటుందని, సొంతంగా టోల్ ధరలను సవరించుకునే అధికారం వాటికి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, చాలా సంస్థలు, ఆశించిన స్థాయిలో వాహన సంచారం లేనందున తమకు నష్టం వస్తోందనే సాకుతో టోల్ పెంచుకునేందుకు ప్రతిపాదిస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment