హైవేలపై బ్లాక్‌స్పాట్లను ముందుగానే గుర్తించే యాప్..
691 కిలోమీటర్ల మేర రోడ్ల అధ్యయనం
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రదేశాల గుర్తింపు
రాష్ట్ర ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ట్రిపుల్ ఐటీ హెచ్ అధ్యయనం
ప్రమాదాల నివారణ సూచిస్తూ ఎన్‌హెచ్‌ఏఐకి నివేదిక
3 ప్రధాన రహదారులపై ఐరాస్తే ప్రయోగం
200 ఆర్టీసీ బస్సుల్లో ఏడీఏఎస్ పరికరాలు అమర్చి పరిశోధన
20 చొప్పున గ్రే స్పాట్లు ఒక్కో రహదారిపై ఉన్నట్టు గుర్తింపు
నిత్యం జరిగే రోడ్డు ప్రమాదాల్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని ప్రమాదాలకు మానవ తప్పిదాలు కారణమవుతుండగా, మరికొన్ని చోట్ల రోడ్ల నిర్మాణంలోని లోపాలు కారణంగా నిలుస్తున్నాయి. ఈ రెండో సమస్యకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)తో పరిష్కారం కనిపెట్టారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలోని ఐఎన్‌ఏఐ కేంద్రం ఆవిష్కరించిన ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐరాస్తే) ఈ సమస్యకు దారి చూపింది. తెలంగాణ ప్రభుత్వం, ఇంటెల్ సహకారంతో ఐరాస్తేను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. -సాక్షి, హైదరాబాద్
ఒక రహదారిపై ప్రమాదాలు జరిగే అవకాశం 80 నుంచి 90 శాతం ఉన్న ప్రదేశాన్ని గ్రే స్పాట్‌గా గుర్తిస్తారు. అయితే, వరుసగా మూడేళ్లపాటు అదేచోట ప్రమాదాలు జరిగి పది మందికంటే ఎక్కువ చనిపోతే, ఆ ప్రదేశాన్ని బ్లాక్ స్పాట్ జాబితాలో చేర్చుతారు. ఇలాంటి ప్రదేశాలను గ్రే స్పాట్ల స్థాయిలోనే తెలుసుకోగలిగితే ప్రమాదాలు జరగకుండా, ప్రాణాలు పోకుండా కాపాడవచ్చు. సరిగ్గా ఈ పనే చేస్తుంది ఐరాస్తే. ఒక ప్రాంతాన్ని బ్లాక్ స్పాట్‌గా గుర్తించేందుకు మూడేళ్లు ఆగాల్సిన పనిలేకుండా ఏఐ సహకారంతో ముందుగానే గుర్తిస్తుంది.
మూడు రహదారులపై అధ్యయనం..
ఐరాస్తేను రాష్ట్రంలోని మూడు ప్రధాన రహదారులపై ప్రయోగించి చూశారు. 2023, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు టీఎస్‌ఆర్టీసీకి చెందిన 200 బస్సుల్లో అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ఏడీఏఎస్) పరికరాలు, 10 డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్ (డీఎంఎస్) యూనిట్లను ఏర్పాటు చేసి పరీక్షించారు. మొత్తం 691 కిలోమీటర్ల మేర రోడ్లను అధ్యయనం చేశారు. 2022 నుంచి 2024 వరకు 5,606 ఎఫ్‌ఐఆర్‌లు, రోడ్డు ప్రమాద రికార్డులతో సహా క్రాష్ నివేదికలు, ఏడీఏఎస్ హెచ్చరికలు, బ్లాక్ స్పాట్‌లపై నిర్వహించిన భద్రతా ఆడిట్‌ట్లను పరిశీలించి ఒక్కో రహదారిపై 20 చొప్పున గ్రే స్పాట్లను ఐ రాస్తే గుర్తించింది. 15 గ్రే స్పాట్‌ల్లో పరిష్కార చర్యలను సూచిస్తూ జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు నివేదికలు సమర్పించారు.
బారియర్స్‌తో సరిదిద్దవచ్చు..
కొన్ని గ్రే స్పాట్లకు స్వల్ప పరిష్కారాలు సరిపోతాయి. బారియర్స్, సైన్‌బోర్డులు, టీ–ఇంటర్ సెక్షన్ హెచ్చరిక సంకేతాలతో వాటిని సరిదిద్దవచ్చు. మరికొన్నింటికి ఆకృతి మార్పులు అవసరం. ఇప్పటివరకు మూడు గ్రే స్పాట్స్ సరిదిద్దే చర్యలకు ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లను ఆహ్వనించింది. మిగిలిన ప్రదేశాలలో పని జరుగుతోంది. – పృథ్వీ, ఐ–రాస్తే ఆపరేషన్స్ మేనేజర్
600 మందికి ఏబీసీలో శిక్షణ
ప్రమాదాలు జరిగినప్పుడు తొలి స్పందన కోసం ఐరాస్తే 600 మంది స్థానికులకు యాక్టివ్ బ్లీడింగ్ కంట్రోల్ (ఏబీసీ)లో శిక్షణ ఇచ్చింది. వీరు 8 నెలల్లో 10 మంది ప్రాణాలు కాపాడారు. ఈ ఇంటిగ్రేటెడ్ నివారణ విధానం బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నప్పుడు వాటిని అంచనా వేయగలదు. ఈ ప్రాజెక్టు విస్తరణకు రాజస్థాన్, జమ్ముకశీ్మర్ ప్రభుత్వాలతో చర్చలు జరుపుతున్నాం. – గోవింద్ కృష్ణన్, ఐ–రాస్తే ప్రోగ్రామ్ మేనేజర్, ట్రిపుల్ హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment