మూత తెరిచినా మునగం Prevention of accidents with grills and LED lights on manholes: Telangana | Sakshi
Sakshi News home page

మూత తెరిచినా మునగం

Published Tue, Jul 2 2024 6:15 AM | Last Updated on Tue, Jul 2 2024 6:18 AM

Prevention of accidents with grills and LED lights on manholes: Telangana

మ్యాన్‌హోళ్లపై గ్రిల్స్, ఎల్‌ఈడీ లైట్లతో ప్రమాదాల నివారణ

ప్రస్తుతం కాస్త వానకే నగరంలోని రోడ్లన్నీ జలమయం

ఆ నీళ్లు వెళ్లి పోయేందుకు మ్యాన్‌హోల్స్‌ మూతలు తీస్తున్న కొందరు

వాటిలో పడి ప్రాణాలు పోగొట్టు కుంటున్నవారు ఎందరో..

మ్యాన్‌హోల్స్‌పై గ్రిల్స్, ప్రమాద సూచికలు పెడుతున్న అధికారులు 

వానాకాలం మొదలైపోయినా ఇంకా కొనసాగుతున్న పనులు 

జపాన్‌ తరహాలో మ్యాన్‌హోల్స్‌ మూతలపై ఎల్‌ఈడీ లైట్లు పెట్టాలంటున్న నిపుణులు 

రక్షణ చర్యలు త్వరగా పూర్తికాకుంటే ప్రమాదాలు తప్పవనే హెచ్చరికలు

వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్‌ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్‌ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.

ఎందుకంటే..
అక్కడ మ్యాన్‌హోల్‌ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్‌ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్‌ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.

కానీ మ్యాన్‌హోల్స్‌ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్‌ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్‌ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్‌ మూతలపై ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్‌ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్‌ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.

150కి పైగానే వాటర్‌ ల్యాగింగ్‌ పాయింట్స్‌
మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్‌బీనగర్, చాదర్‌ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్‌ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్‌ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్‌ ఓపెనింగ్స్‌ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.

జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్‌ఈడీ లైట్లు 
జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్‌ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్‌ డిజైన్లతో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్‌ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్‌ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్‌ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్‌ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్‌ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్‌ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.

జలమండలి రక్షణ చర్యలు
వరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్‌ ఫ్లో, మ్యాన్‌హోల్స్‌ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్‌ ల్యాగింగ్‌ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్‌ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.

కొన్ని వాటర్‌ ల్యాగింగ్‌ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్‌ మ్యాన్‌ హోల్స్‌ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్‌ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్‌ చేసి, ఎరుపు రంగు పెయింట్‌ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్‌ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్‌ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.

రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలు
వర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్‌ టీమ్‌ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్‌ యంత్రాలతో మ్యాన్‌హోల్స్‌ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్‌)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్‌Œ నుంచి సీవర్‌ ఇన్‌స్పెక్టర్‌ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్‌ ల్యాగింగ్‌ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్‌ చేస్తారు.

మ్యాన్‌హోల్స్‌ తెరిస్తే క్రిమినల్‌ కేసులు
వాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్‌ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్‌ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్‌ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్‌ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది.  

నాలాలపై నిర్లక్ష్యంతో.. 
మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్‌ (శ్లాబ్‌ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్‌ వాల్‌ కట్టాలి. లేదా ఫెన్సింగ్‌ వేయాలి. కానీ గ్రేటర్‌ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్‌ లేదు. పెద్ద ఓపెన్‌ నాలాలకు రిటైనింగ్‌ వాల్‌/ ఫెన్సింగ్‌ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్‌ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్‌ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.

మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు 
వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. డీప్‌ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్‌ ల్యాగింగ్‌ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్‌ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్‌ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.

డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి 
డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.

సిటీలో సీవరేజీ నెట్‌వర్క్, మ్యాన్‌ హోల్‌ల లెక్క ఇదీ..
జీహెచ్‌ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్‌వర్క్‌:    5,767 కి.మీ
శివారు మున్సిపాలిటీల పరిధిలో :    4,200 కి.మీ 
మొత్తం మ్యాన్‌హోల్స్‌:    6,34,919 
డీప్‌ మ్యాన్‌హోల్స్‌:    63,221 
వీటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో..:    26,798 
శివారు మున్సిపాలిటీల పరిధిలో..:    36,423   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement