
హైదరాబాద్: దక్షిణ మధ్య బంగాళాఖాతాంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వచ్చే మూడు రోజుల పాటు తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు బీహార్ నుంచి ఈశాన్య జార్ఖండ్, చత్తీస్‌గఢ్ మీదుగా ఉత్తర తెలంగాణ వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. ఫలితంగా వచ్చే మూడు రోజులు వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ లో ఒక్కసారిగా మారిన వాతావరణం
హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. ఈరోజు(సోమవారం) హైదరాబాద్ తో పాటు మహబూర్ నగర్, మేడ్చల్, మల్కాజగిరి, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇక భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ములుగు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, రేపు(మంగళవారం) జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం. ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉంది.