safety measures
-
మూత తెరిచినా మునగం
వానాకాలం మొదలైంది.. కాస్త గట్టి వర్షం పడటంతో రోడ్లపై నీళ్లు నిలిచాయి.. ఆ నీరు వేగంగా పోయేందుకు కొన్నిచోట్ల మ్యాన్‌హోల్స్ తెరిచారు.. ఆ నీళ్లలోంచే, ఆ మ్యాన్‌హోల్స్ దగ్గరి నుంచే జనం అటూఇటూ నడిచి వెళ్లారు.. కానీ ఎవరికీ ఏ ప్రమాదమూ జరగలేదు.ఎందుకంటే..అక్కడ మ్యాన్‌హోల్ ఉందని స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవేళ పట్టుజారినా అందులో పడిపోకుండా గ్రిల్స్ అడ్డంగా ఉన్నాయి. కాసేపటికి నీరంతా వెళ్లిపోయింది. మ్యాన్‌హోల్‌పై పెట్టేసిన మూత ఎల్ఈడీలతో వెలుగుతోంది. ప్రభుత్వం చేపట్టిన రక్షణ చర్యలన్నీ పూర్తయితే.. నిపుణుల సూచనలన్నీ అమల్లోకి వస్తే.. జరిగేది ఇదే.కానీ మ్యాన్‌హోల్స్ వద్ద రక్షణ చర్యలు ఇంకా పూర్తవలేదు.. వానల తీవ్రత పెరుగుతున్నా పనుల వేగం పెరగడం లేదనే విమర్శలు వస్తున్నాయి. డీప్ మ్యాన్‌హోల్స్‌కు గ్రిల్స్ ఏర్పాటును వేగవంతం చేయాలని.. జపాన్‌లో అనుసరిస్తున్న తరహాలో మ్యాన్‌హోల్స్ మూతలపై ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి అమలైతే.. ‘మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి’వంటి ఘటనలు ఇకపై వినకుండా ఉంటామని అంటున్నారు.సాక్షి, హైదరాబాద్: వానాకాలం ప్రారంభమైంది. కాస్త గట్టిగా చినుకులు పడినప్పుడల్లా.. డ్రైనేజీ, నాలాలు ఉప్పొంగడం.. రోడ్లపై, కాలనీల్లో నీళ్లు చేరడం మొదలైంది. జీహెచ్ఎంసీ, జల మండలి ఎన్ని చర్యలు తీసుకున్నా.. రోడ్ల మీది చెత్త డ్రైనేజీల్లో చేరి పూడుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఇబ్బందిగా మారుతోంది. అలాంటి సమయాల్లో మ్యాన్‌హోల్స్ మూతలు తెరిచి, నీరు పోయేలా చేస్తుండటం ప్రమాదకరంగా మారుతోంది. కొన్నిసార్లు అయితే.. ఎక్కడ మ్యాన్‌హోల్స్ ఉన్నాయి? ఎక్కడ రోడ్డు ఉందనేది తెలియని పరిస్థితి ఉంటోంది. ఏదో పనిమీద బయటికి వెళ్లినవారు, ఉద్యోగులు, స్కూళ్లు, కాలేజీల విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇంటిబాట పట్టాల్సిన దుస్థితి. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్‌లో పడి జనం మృత్యువాతపడిన ఘటనలూ ఎన్నో.150కి పైగానే వాటర్ ల్యాగింగ్ పాయింట్స్మహానగరం పరిధిలో వాన నీరు నిలిచిపోయే సుమారు 150కుపైగా పాయింట్లుæ ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో 50 వరకు ప్రమాదకర ప్రాంతాలు ఉన్నట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. ప్రధానంగా ఎల్బీనగర్, చాదర్ ఘాట్, సింగరేణి కాలనీ, బాలాపూర్, మల్లేపల్లి, మైత్రీవనం, పంజగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ఛే నంబర్, మెట్టుగూడ, వీఎస్టీ, ముషీరాబాద్, బాలానగర్, మూసాపేట, బోరబండ, మియాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రాంతాలు ఎక్కువ. ఇలాంటి చోట్ల నిలిచిన నీళ్లు త్వరగా వెళ్లిపోయేందుకు మ్యాన్‌హోల్స్ మూతలు తీస్తుండటం.. ప్రమాదాలకు దారి తీస్తోంది. మరికొన్ని చోట్ల వాహనాల రాకపోకలతో మ్యాన్‌హోల్స్ ఓపెనింగ్స్ దెబ్బతిన్నాయి, మూతలు పగిలిపోయాయి. అలాంటి చోట వాననీరు నిలిచి.. పాదచారులు ప్రమాదాల బారినపడుతున్నారు. వాహనాలు కూడా వాటిలో పడి దెబ్బతింటున్నాయి.జపాన్‌లో మ్యాన్‌హోల్స్‌కు ఎల్ఈడీ లైట్లు జపాన్‌లోని టోక్యో సిటీలో మ్యాన్‌హోల్స్ మూతలపై ప్రత్యేకంగా కార్టూన్ డిజైన్లతో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు. సౌర విద్యుత్ సాయంతో రీచార్జి అయ్యే ఈ లైట్లు.. రోజూ సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు వెలుగుతూ ఉంటాయి. ఆయా ప్రాంతాల్లో మ్యాన్‌హోల్స్ ఉన్నాయని సులువుగా గుర్తించి, జాగ్రత్త పడేందుకు వీటితో చాన్స్ ఉంటుంది. అంతేగాకుండా రకరకాల డిజైన్లు, రంగులతో కార్టూన్ క్యారెక్టర్లు కనిపిస్తూ అందంగా కూడా ఉంటున్నాయి. ఇలా మన దగ్గర కూడా మ్యాన్‌హోల్స్‌పై ఎల్ఈడీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారు. రాత్రిపూట మ్యాన్‌హోల్స్ సులువుగా కనబడితే.. ప్రమాదాలు తప్పుతాయని అంటున్నారు.జలమండలి రక్షణ చర్యలువరదల ముంపుతో ఢిల్లీ, ముంబై లాంటి పరిస్థితి హైదరాబాద్‌లో ఏర్పడకుండా జలమండలి ముందస్తు చర్యలు చేపట్టింది. సీవరేజీ ఓవర్ ఫ్లో, మ్యాన్‌హోల్స్ నిర్వహణపై సీరియస్‌గా దృష్టిపెట్టింది. నగరవ్యాప్తంగా వాటర్ ల్యాగింగ్ పాయింట్లు, లోతైన మ్యాన్‌హోల్స్‌ను గుర్తించింది. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ బిగించడంతోపాటు అత్యంత ప్రమాదకరమైనవని తెలిపేలా.. మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తోంది.కొన్ని వాటర్ ల్యాగింగ్ పాయింట్ల వద్ద ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు చేపట్టింది. నగరవ్యాప్తంగా 63వేలకుపైగా డీప్ మ్యాన్ హోల్స్ ఉండగా.. ఇప్పటివరకు 25 వేల వరకు మ్యాన్‌హోల్స్‌పై సేఫ్టీ గ్రిల్స్ బిగించినట్టు అధికారులు చెప్తున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న వాటిని కవర్స్‌తో సీల్ చేసి, ఎరుపు రంగు పెయింట్ వేస్తున్నామని.. ఎప్పటికప్పుడు మ్యాన్‌హోల్స్ నుంచి పూడిక, వ్యర్థాలను తోడేసేందుకు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచినట్టు వివరిస్తున్నారు. ఇప్పటికే వానాకాలం మొదలైన నేపథ్యంలో.. ఈ రక్షణ చర్యలను మరింత వేగవంతం చేయాల్సి ఉందని నగర ప్రజలు కోరుతున్నారు.రంగంలోకి ఈఆర్టీ, ఎస్పీటీలువర్షాల నేపథ్యంలో ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ఈఆరీ్ట), సేఫ్టీ ప్రొటోకాల్ టీమ్ (ఎస్పీటీ)లను జలమండలి రంగంలోకి దింపింది. క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి రక్షణ పరికరాలతోపాటు వాహనాలను కేటాయించింది. వాననీరు నిలిచిన చోట వాహనాల్లో ఉండే జనరేటర్లు, మోటార్లతో నీటిని తోడేస్తారు. ఎయిర్‌టెక్ యంత్రాలతో మ్యాన్‌హోల్స్ నుంచి తీసిన వ్యర్థాల (సిల్ట్)ను ఎప్పటికప్పుడు తొలగిస్తారు. మరోవైపు మ్యాన్‌హోళ్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి ప్రతి సెక్షన్Œ నుంచి సీవర్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో బృందాలను ఏర్పాటు చేశారు. వారు రోజూ ఉదయాన్నే తమ పరిధిలోని ప్రాంతాలకు వెళ్లి పరిస్థితి పర్యవేక్షిస్తారు. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తారు.మ్యాన్‌హోల్స్ తెరిస్తే క్రిమినల్ కేసులువాన పడుతున్న సమయంలో, నీళ్లు నిలిచినప్పుడు.. అధికారుల అనుమతి లేకుండా మ్యాన్‌హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి స్పష్టం చేసింది. ఇష్టమొచి్చనట్టు తెరిచిపెడితే క్రిమినల్ కేసులు పెట్టాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఎక్కడైనా మ్యాన్‌హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనించినా.. జలమండలి నంబర్ 155313కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వవచ్చని సూచించింది. నాలాలపై నిర్లక్ష్యంతో.. మహానగర పరిధిలోని పలుచోట్ల నాలాలు ప్రమాదకరంగా మారాయి. నిబంధనల ప్రకారం.. రెండు మీటర్ల కన్నా తక్కువ వెడల్పున్న నాలాలను క్యాపింగ్ (శ్లాబ్ లేదా ఇతర పద్ధతుల్లో పూర్తిగా కప్పి ఉంచడం) చేయాలి. రెండు మీటర్ల కన్నా వెడల్పున్న నాలాలకు రిటైనింగ్ వాల్ కట్టాలి. లేదా ఫెన్సింగ్ వేయాలి. కానీ గ్రేటర్ సిటీ పరిధిలో సగానికిపైగా చిన్న నాలాలకు క్యాపింగ్ లేదు. పెద్ద ఓపెన్ నాలాలకు రిటైనింగ్ వాల్/ ఫెన్సింగ్ లేకుండా పోయాయి. గతంలో వేసిన క్యాపింగ్, ఫెన్సింగ్ భారీ వర్షాలతో దెబ్బతిన్నాయి. దీనితో వాన పడినప్పుడు నాలాల్లో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. గత ఐదేళ్లలో సుమారు 15 మందికిపైగా నాలాల్లో పడి చనిపోవడం గమనార్హం. వానాకాలం మొదలైన నేపథ్యంలో యుద్ధ ప్రాతిపదికన క్యాపింగ్, ఫెన్సింగ్ వేయడం.. బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సామాజిక వేత్తలు కోరుతున్నారు.మ్యాన్‌హోల్స్‌కు రక్షణ కవచాలు వర్షాకాలంలో మ్యాన్‌హోల్స్‌తో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాం. మ్యాన్‌హోల్స్‌కు సేఫ్టీ గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నాం. డీప్ మ్యాన్‌హోల్స్‌కు ఎరుపు రంగు వేసి అత్యంత ప్రమాదకరమైనవని తెలిసేలా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. వాటర్ ల్యాగింగ్ పాయింట్లను గుర్తించి ఎప్పటికప్పుడు క్లియర్ చేసేలా చర్యలు చేపట్టాం. వర్షం పడే సమయంలో కింది స్థాయి సిబ్బంది నుంచి మేనేజర్ వరకు వారి పరిధిలోని ఫీల్డ్‌లో ఉండేలా ఆదేశాలు జారీ చేశాం.డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి డ్రైనేజీలు, నాలాలు క్లీన్‌గా ఉంచాలి. వాటిలో పూడికను ఎప్పటికప్పుడు తొలగించాలి. వాన నీరు సైతం సాఫీగా వెళ్లే విధంగా మార్గం ఉండాలి. వాటిలో పూడిక పేరుకుపోవడంతో వర్షం పడినప్పుడు నీరు వెళ్లక రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మురుగు నీటి వ్యవస్ధను పర్యవేక్షించే యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలి. నిరంతరం పూడికతీత పనులు కొనసాగించాలి. వర్షాకాలంలో ప్రత్యేకంగా దృష్టి సారించాలి.సిటీలో సీవరేజీ నెట్వర్క్, మ్యాన్ హోల్‌ల లెక్క ఇదీ..జీహెచ్ఎంసీ పరిధిలో సీవరేజీ నెట్వర్క్: 5,767 కి.మీశివారు మున్సిపాలిటీల పరిధిలో : 4,200 కి.మీ మొత్తం మ్యాన్‌హోల్స్: 6,34,919 డీప్ మ్యాన్‌హోల్స్: 63,221 వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో..: 26,798 శివారు మున్సిపాలిటీల పరిధిలో..: 36,423 -
రైల్వే ప్రమాదాల నివారణపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం
ఢిల్లీ: ఒడిశా రైల్వే ప్రమాదం తర్వాత రైల్వేలో తీసుకున్న భద్రతా ప్రమాణాలపై కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రైల్వేలు అమలు చేయడానికి ప్రతిపాదించిన రక్షణ చర్యల గురించి తెలియజేయాలని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం అటార్నీ జనరల్‌ను కోరింది. ఆటోమెటిక్ రక్షణ వ్యవస్థ 'కవాచ్'ను పాన్-ఇండియా ప్రాతిపదికన ప్రవేశపెడితే ఎదురయ్యే ఆర్థికపరమైన చిక్కుల గురించి కూడా ధర్మాసనం ప్రశ్నించింది. రైల్వేలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి నిర్దిష్ట ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టింది. రైల్వేలో 'కవచ్' వ్యవస్థను తక్షణమే అమలు చేయడానికి మార్గదర్శకాలను జారీ చేయాలని పిటిషనర్ కోరారు. ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (కవాచ్)ను దేశమంతటా ఇప్పటికీ అమలు చేయలేదని న్యాయస్థానానికి తెలిపారు. ఒడిశాలోని బాలాసోర్‌లో గత కొద్ది నెలల క్రితం రెండు ప్యాసింజర్ రైళ్లు, ఒక గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 293 మంది మరణించారు. 1,000 మందికి పైగా గాయపడ్డారు. ఇటీవలి కాలంలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఇది ప్రధానమైంది. ఇదీ చదవండి: మణిపూర్‌లో భద్రతా దళాలపై ముష్కరుల దాడి -
హైదరాబాద్ నుంచి విద్యార్థుల స్వస్థలాలకు చేర్చేందుకు స్పెషల్ బస్సులు
-
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
Diwali 2022: టపాసులు కాల్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సాక్షి,హైదరాబాద్: దీపావళి అంటేనే వెలుగుల పండుగ.. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే.. బంధువుల రాకపోకలు... అతిథి మర్యాదలు... టపాసుల మోతలు ఇలా దీపావళి పండుగ అంతా సందడిగానే ఉంటుంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఆనందోత్సవాల మధ్య జరుపుకునే పండుగ ఇది. అలాంటి దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంతే ఉంటుందని ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు హెచ్చరిస్తున్నారు. లక్ష్మీదేవి ఆరాధన.. దీపావళి రోజు ప్రతి ఇంట్లో లక్ష్మీదేవి పూజను నిర్వహిస్తారు. ఇంట్లో ఉన్న బంగారం, నగదును అమ్మవారి చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. చీకట్లను పారద్రోలే విధంగా దీపాలను వెలిగించి పూజ చేస్తారు. దీపారాధన అనేది ఈ పండుగలో ప్రత్యేకమైనది. ఇంట్లో దీపాలు వెలిగిస్తే సకల శుభాలు కలుగుతాయని అందరి నమ్మకం. లక్ష్మీదేవి దీప జ్యోతిగా సంపద దైవంగా భావిస్తుండటంతో అందరు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు. మార్కెట్లో రకరకాల డిజైన్లు.. మార్కెట్లో వివిధ రకాల డిజైన్లతో కూడిన ప్రమిదలు లభిస్తున్నాయి. స్టీల్, ప్లాస్టిక్, మట్టికి సంబంధించి దీపాలు, ప్రమిదలు వివిధ డిజైన్లలో మార్కెట్లో దండిగా లభిస్తున్నాయి. వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలకు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి. అదేవిధంగా ఈ పండుగకు కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో తక్కువ రేటు ఉండటంతో చాలామంది ఆన్లైన్ ద్వారా తెíప్పించుకుంటున్నారు. మరికొందరు దుకాణాలకు నేరుగా వెళ్లి తెచ్చుకుంటున్నారు. దీంతో మార్కెట్లు సందడిగా మారాయి. జాగ్రత్తలు తప్పనిసరి.. దీపావళి పండుగలో ఆనందం ఎంత ఉంటుందో ప్రమాదం కూడా అంటే ఉంటుంది. బాణా సంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అగ్నిమాపకశాఖ, పోలీసులు, వైధ్యాధికారులు చెబుతున్నారు. అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. ► టపాసులను ఆరుబయటనే కాల్చాలి. ఇంట్లో కాల్చొద్దు. ► ఆస్పత్రులు, పెట్రోల్ బంకులు ఉన్న ప్రాంతాల్లో టపాసులు పేల్చొద్దు. ► టపాసులు కాల్చే ముందు విధిగా పాదరక్షలు ధరించాలి, అందుబాటులో నీళ్లు ఉంచుకోవాలి. గాయాలు అయితే వెంటనే సమీపంలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. ► టపాసులు కాల్చేటప్పుడు చిన్నారులను ఒంటరిగా వదిలిపెటొద్దు. పెద్దల సమక్షంలోనే పిల్లలు టపాసులు కాల్చాలి. సరిగ్గా కాలని బాణసంచాపై నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు. ► టీషర్టులు, జీన్స్లాంటి దుస్తులు కాకుండా వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి, కళ్లకు హాని కలగకుండా అద్దాలు వాడాలి. ► అగ్నిమాపక శాఖ వద్ద లైసెన్సులు పొందిన దుకాణాల్లోనే బాణసంచా కొనుగోలు చేయాలి. ► పర్యావరణ హితమైన పదార్థాలతో తయారు చేసిన గ్రీన్ కాకర్స్ ఉపయోగిస్తే మంచిది. అప్రమత్తంగా ఉండాలి టపాసుల కాల్చేటప్పుడు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. తగిన జాగ్రత్తలో బాణా సంచా కాల్చాలి. టపాసులు విక్రయించే వారు విధిగా అనుమతులు తీసుకోవాలి. దుకాణాల వద్ద ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా చర్యలు చేపట్టాలి. – రమేష్‌గౌడ్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్, షాద్‌నగర్ అగ్నిమాపక కేంద్రం -
సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, బ్లాక్‌మెయిలింగ్.. మిమ్మల్ని మీరే ఇలా కాపాడుకోండి!
Cyber Crime Prevention Tips In Telugu: నేటి ప్రపంచంలో ఇంటర్నెట్ రోజువారీ అవసరం. తెలిసినా, తెలియకపోయినా ప్రజలు ఏ వ్యక్తితోనైనా క్షణాల్లో మాట్లాడే సౌలభ్యం వచ్చేసింది. దీంతో వేధింపులకు సంబంధించి ఆడ–మగ తేడా లేకుండా ఆన్లైన్ దుర్వినియోగం చేయడమూ పెరిగింది. అయితే, వీటిలో మహిళలు అనుభవించే హింస మాత్రం తరచూ లైంగిక లేదా స్త్రీ వ్యతిరేకపరమైన వేధింపులు ఉంటున్నాయి. మహిళలను వేధించే సమస్యల్లో గృహహింస, యాసిడ్ దాడి, ఈవ్ టీజింగ్, వరకట్నం, లైంగిక దాడులు, హ్యూమన్ ట్రాఫికింగ్, భ్రూణహత్యలు.. ఇలా ఇప్పటికే ఎన్నో ఉన్నాయి. వీటికితోడు కోవిడ్–19 మహమ్మారి సామాజిక, ఆర్థిక ఒత్తిడిని బలపరిచింది. ఈ రకమైన హింస విస్తృతమైన లింగ ఆధారిత వివక్షకు దారి తీస్తోంది. దీంతో ఈ హింస ఉధృతితో మహిళలపై సైబర్ నేరాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వీటిలో తరచూ వినిపించేవి సైబర్ స్టాకింగ్, మార్ఫింగ్, అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించే, బాధించే సందేశాలు, బ్లాక్‌మెయిలింగ్ ... వంటి నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. స్టాకింగ్ డిజిటల్ ప్రపంచం ఎక్కువగా మాట్లాడే వాటిలో సైబర్ స్టాకింగ్ ఒకటి. దీంట్లో మహిళలు, పిల్లలనే లక్ష్యంగా చేసుకుని వేధింపులు ఉంటాయి. ఇది ఆన్లైన్ ముప్పు అని చెప్పవచ్చు. అవతలి వ్యక్తితో మనకు ప్రత్యక్ష సంబంధం ఉండదు. కానీ ఈ రోజుల్లో ఆఫ్‌లైన్ స్టాకింగ్ కంటే సైబర్ స్టాకింగ్ నేరాలు ఎక్కువయ్యాయి. ఎందుకంటే నేరస్థుడిని కనుక్కోవడం అంత సులభం కాదు. దీంట్లో అధికంగా టీనేజర్లు బాధితులవుతున్నారు. మహిళలపై ట్రోల్‌ల సంఖ్య పెరిగింది. కరోనా కాలం ఆన్లైన్ హింస, లైంగిక వేధింపుల గురించి ఒక కొత్త ఆందోళనలను లేవనెత్తింది. కోవిడ్ –19 తర్వాత ప్రపంచం ఆన్లైన్ వైపు వేగంగా కదులుతున్నందున, స్త్రీవాద దృక్పథం మారాల్సి ఉంది. పరువు నష్టం తమ తమ అభిప్రాయాలు, ఆలోచనలు, భావాలను వ్యక్తీకరించడానికి ప్రజలకు ఒక వేదిక ఇంటర్నెట్. దీని ద్వారా కలిగించే పరువు నష్టం మరో వ్యక్తి ప్రతిష్టకు కలిగే గాయం. ఇది ఇంటర్నెట్ సహాయంతో ఏ వ్యక్తికైనా వ్యతిరేకంగా పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించడాన్ని సూచిస్తుంది. ఇప్పటికే సైబర్ పరువు నష్టంపై అనేక కేసులు ఉన్నాయి. ఇది ఎక్కువగా ఫేస్బుక్, గూగుల్ లేదా ఏదైనా ఇతర సోషల్ నెట్వర్కింగ్ లేదా మెయిల్ వెబ్సైట్ లో ఒకరి ఐడీ హ్యాక్ చేయడం ద్వారా ఉంటుంది. అలాగే, ఒక వ్యక్తి తాలూకు పూర్తి సమాచారంతో మరో నకిలీ ఖాతాను సృష్టించడం ద్వారా కూడా జరుగుతుంది. ఫొటో మార్ఫింగ్ మార్ఫింగ్ అనేది అసలు ఫొటోలను మార్పిడి చేయడం. హ్యాకర్ మీ ఫొటోలను ఉపయోగించి, దానిని మార్ఫ్ చేసి, దుర్వినియోగం చేయడం సులభం. మార్ఫింగ్ చేయకుండా మీరు ఎవ్వరినీ ఆపలేరు. మీ ఫొటోలు పబ్లిక్‌గా ఉంటే, వ్యక్తులు వాటిని సులభంగా యాక్సెస్ చేయవచ్చు. వాటిని మార్ఫ్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు. తమ లైంగిక ఊహలను సంతృప్తి పరుచుకోవడానికి పోర్న్ సైట్లలో వాటిని ఉపయోగిస్తుంటారు. ఎవరైనా మీ ఫోటో తీసి వాటిని అలా ఉపయోగించినా మీకు ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇ–మెయిల్ స్పూఫింగ్ ఒకదాని నుంచి పంపించినట్టు ఇ–మెయిల్‌ను సూచిస్తుంది. కానీ అది మరొక దగ్గర నుండి పంపించినదై ఉంటుంది. ఈ సాంకేతికతను ఉపయోగించే ఇ–మెయిల్స్ తరచూ కొన్ని మెసేజ్‌లు, పంక్తులు, లోగోలను కలిగి ఉంటాయి. ఇ–మెయిల్ స్పూఫింగ్ అనేది ఫిషింగ్, స్పామ్ ప్రచారాలలో ఉపయోగించే ఒక ముఖ్యమైన వ్యూహం. అంటే లాటరీ వచ్చిందనో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్.. అనో వీటిని ప్రధానంగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటప్పుడు అవి సరైన మెయిల్స్ అని గుర్తించినప్పుడే వాటిని ఓపెన్ చేయడం మంచిది. సైబర్ సేఫ్టీ పాయింట్స్ ►పాస్‌వర్డ్‌లను షేర్ చేయద్దు బ్యాంక్ ఖాతా అయితే ఎవరికి వారు తమ పాస్‌వర్డ్‌ను గుర్తుంచుకుంటారు. లేదా ఎవరికీ చెప్పకుండా ఒక చోట రాసి పెట్టుకుంటారు. అలాగే, మీ డిజిటల్ పాస్‌వర్డ్‌ను ఎంత నమ్మకమున్న స్నేహితుడు లేదా భాగస్వామితోనైనా షేర్ చేయకూడదు. దీనికి సంబంధిం చిన భయం మంచిదే. స్నేహితులు ఉద్దేశపూర్వకంగా మీకు హాని కలిగించకపోయినా, వారు అనుకోకుండా ఎవరికైనా మీ పాస్‌వర్డ్‌ను చెప్పవచ్చు. కొన్నిసార్లు మీ పాస్వర్డ్ మారకముందే సంబంధాలు మారిపోతుంటాయి. మీ విచక్షణను ఉపయోగించండి, ఆ పాస్‌వర్డ్‌లను ప్రైవేట్‌గా, సంక్లిష్టంగా ఉంచండి. ►మీ వెబ్‌క్యామ్‌ని కనెక్ట్ చేసి ఉంచద్దు మీ వెబ్ కెమెరాను ఆన్ చేసి, మీకు తెలియకుండానే మీ కదలికలను చాకచక్యంగా రికార్డ్ చేయగల అనేక యాప్‌లు ప్రస్తుతం ఉన్నాయి. ఉపయోగంలో లేనప్పుడు మీ కెమెరా లెన్స్‌ను మూసి ఉంచండి లేదా పూర్తిగా ఏదైనా కవర్‌తో కప్పి ఉంచండి. ►అవసరానికి మించి షేర్ చేయద్దు సంబంధాలలో మంచి, చెడు రెండూ ఉంటాయి. అత్యుత్తమ వ్యక్తులు కూడా ఒకోసారి మరోవైపుకు మారచ్చు. అందుకే మీరు షేర్ చేసిన మీ సన్నిహిత సందేశాలు, ఫొటోలు, సమాచారం వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కనుక ఏదైనా షేర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆన్ లైన్ పరిచయస్తులను ఒంటరిగా కలవవద్దు ఆన్లైన్ వ్యక్తులను బయట కలిసే ముందు మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారో మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ తెలియజేయండి. మీరు రద్దీగా ఉండే అంటే కాఫీ షాప్ లేదా మాల్లో సదరు వ్యక్తిని కలుసుకోవడానికి నిర్ణయించుకోవడం శ్రేయస్కరం. అవసరమైనంత వరకే.. అనుమానం లేని మహిళలతో స్నేహం చేయడానికి సోషల్ మీడియా సైట్లను బ్రౌజ్ చేస్తున్న వారిలో చెడ్డవారు అనేకం ఉన్నారు. అందుకని.. మీ ఆచూకీ, జీవనశైలి గురించిన వివరాలను పోస్ట్ చేయడంలో జాగ్రత్తగా ఉండండి. స్టాకర్లు ఒక సాధారణ ఫోటోగ్రాఫ్ లేదా స్టేటస్ అప్డేట్తో మిమ్మల్ని చేరుకోవడానికి మార్గాలను కనుక్కోగలరు. మీ కెమెరాలో జియోట్యాగింగ్ని స్విచాఫ్ చేయండి. అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ ఈ ప్రక్రియ కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. కానీ మిమ్మల్ని సురక్షితంగా ఉంచడానికి సిస్టమ్ అప్డేట్ చాలా ముఖ్యమైనది. ఇది భద్రతా అప్డేట్లు, ప్యాచ్‌లు తాజా బెదిరింపులను దూరంగా ఉంచుతుంది. యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో పరికరాలు భద్రం భద్రతా వ్యవస్థ లేకుండా మొబైల్ ఫోన్ లేదా టాబ్లెట్ కలిగి ఉండటం అనేది తలుపులు తెరిచి ఇంట్లో కూర్చున్నట్లే. ఆండ్రాయిడ్, మ్యాక్ పరికరాలకు రెండూ హానికరమైన సాఫ్ట్వేర్ దాడికి ఉపకరణాలు. ఇవి మీ జీవితాన్ని తమ చేతుల్లోకి తీసుకోగలవు కాబట్టి మీ అన్ని పరికరాలలో ‘నార్టన్ సెక్యూరిటీ’ వంటి భద్రతా వ్యవస్థను ఇన్స్టాల్ చేయండి. ఫైన్ ప్రింట్ ఏదైనా సేవ, రహస్యానికి సంబంధించిన సమాచారం, సేవా నిబంధనలను అర్థం చేసుకోండి. కొన్ని వెబ్సైట్లు మీ సమాచారాన్ని ఎవరికైనా ఇచ్చేయవచ్చు. లేదా అమ్మచ్చు, అద్దెకు తీసుకోవచ్చు. ఇది పెద్ద సమస్యగా మీకే తిరిగి రావచ్చు, మీరు నిబంధనలు షరతులకు అంగీకరించినందున చట్టం మిమ్మల్ని రక్షించలేకపోవచ్చు. ‘ఉచితం’ అంటూ ఏదీ లేదు ఫ్రీ గేమ్‌లు, ఆఫర్లు, డీల్‌లు మొదలైనవిగా కుప్పలు తెప్పలుగా వస్తుంటాయి. అవి వైరస్లు, స్పైవేర్, హానికరమైన సాఫ్ట్వేర్లతో చిక్కుకుపోయి ఉండవచ్చు. ఇవి మీ పరికరంలోకి ప్రవేశించి, మీ మొత్తం డేటాను పొందగలవు. వద్దనుకున్న వారు బ్లాక్ అవసరం లేని వ్యక్తులను జాబితా నుండి అన్ ఫ్రెండ్ చేయండి లేదా బ్లాక్ చేయండి. మీ స్నేహితుల జాబితాలో ఎవరు ఉండాలో మీరు ఎంచుకోవచ్చు. భద్రత విషయానికి వస్తే ఆనఖలైన్, ఆఫ్‌లైన్ రెండింటిలోనూ సరైన జ్ఞానం, రక్షణ మొదటి వరుసలో ఉండాలి. మీ రక్షణలో మీ ప్రవృత్తులే కీలక పాత్ర పోషిస్తాయని గ్రహించండి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ చదవండి: Cyber Crime Prevention Tips: టెక్ట్స్ మెసేజ్‌తో వల.. ఆపై..! వాట్సాప్ స్కామ్.. చా(చీ)టింగ్! Cyber Crime Prevention Tips: నకిలీలలు.... ముద్ర కాని ముద్ర.. నిర్లక్ష్యం చేశారో ఇక అంతే సంగతులు! -
CM YS Jagan: అమర్నాథ్ యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలి
సాక్షి, అమరావతి/కైకలూరు: అమర్నాథ్లో కుండపోత వాన, అకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన వారి భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికులకు ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. సీఎం ఆదేశాల నేపథ్యంలో సీఎంవో అధికారులు ఢిల్లీలోని ఏపీ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్‌ప్రకాష్‌తో మాట్లాడారు. అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాంశు కౌశిక్‌ను వెంటనే శ్రీనగర్‌కు పంపిస్తున్నారు. ఆయన అధికారులతో సమన్వయం చేసుకుని యాత్రికుల భద్రతకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. కైకలూరు యాత్రికులు క్షేమం.. ఏలూరు జిల్లా కైకలూరు నుంచి యాత్రకు వెళ్లిన 10 మంది శుక్రవారం అక్కడ ఆకస్మిక వరదల్లో చిక్కుకున్నారు. ప్రసార మాధ్యమాల్లో వరదల వార్తలను చూస్తున్న వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1న కైకలూరు నుంచి బట్టు సీతారామయ్య, రెడ్డి, సింహాచలం, కోడూరు సుబ్బారావు, రాజు తదితరులు 10 మంది ఏజెంటు ద్వారా అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. శుక్రవారం సాయంత్రం బోలేనాథ్ గుహ వద్ద వరద ముంచుకొచ్చింది. దీనిపై అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సింహాచలం కుమారుడు నాని మాట్లాడుతూ టీవీల్లో ప్రమాదవార్తను తెలుసుకుని తన తండ్రికి ఫోన్ చేసినట్లు చెప్పారు. తాము కొండ పైభాగంలో ఉన్నామని, ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ ద్వారా కిందికి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారని తెలిపారు. అందరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారని చెప్పారు. -
తెలంగాణలో వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: మొన్న అహ్మదాబాద్‌లో ఒక ఆస్పత్రిలో అగ్ని ప్రమాద సంఘటన.. నిన్న విజయవాడలో కరోనా బాధితులు ఐసోలేషన్ చికిత్స పొందుతున్న హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అలర్ట్ అయింది. ఆయా హోటళ్లతో పాటు అన్ని కరోనా ఆస్పత్రుల్లోనూ అగ్నిప్రమాద నివారణ నిబంధనలపై తక్షణమే తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీచేసింది. తాజా అగ్ని ప్రమాదాల సంఘటన నేపథ్యంలో అన్ని ఆస్పత్రులు/కోవిడ్ కేర్ సెంటర్లు (హోటళ్లు) అగ్ని ప్రమాద నివారణకు భద్రతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించినట్లు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. భద్రతా నిబంధనల ఉల్లంఘన జరిగితే తీవ్రంగా పరిగణిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన అన్ని ఆస్పత్రులు, కోవిడ్ కేర్ సెంటర్ల (హోటళ్ల)కు ఆదేశాలు ఇస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా హోటళ్లు ఏ మేరకు అగ్ని ప్రమాదాల నివారణకు భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారన్న దానిపైనా వైద్య, ఆరోగ్య శాఖ తనిఖీలు చేయాలని యోచిస్తుంది. (తెలంగాణలో 80వేలు దాటిన కరోనా కేసులు) త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లలో ఏర్పాట్లు... రాష్ట్రంలో కోవిడ్ కేంద్రాలుగా 36 హోటళ్లు అనుమతి పొందినా, మరో 50–60 హోటళ్లలో ఇష్టానుసారంగా కరోనా రోగులను ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్లు వైద్య వర్గాలు గుర్తించినట్లు తెలిసింది. ఇందులో కొన్ని కనీసం ప్రమాణాలు కూడా పాటించడం లేదని బాధితులు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న పలువురు రోగులు ఇంట్లో అందరితో కలసి ఉండకుండా హోటల్ గదిలో సెల్ఫ్ ఐసోలేషన్ అయ్యేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో పలు త్రీస్టార్, ఫైవ్‌స్టార్ హోటళ్లు క్వారంటైన్ కేంద్రాలుగా మారుతున్నాయి. ఆయా హోటళ్లలో సుమారు మూడువేల మంది వరకు కోవిడ్ రోగులు ఉన్నట్లు సమాచారం. అగ్ని ప్రమాదాల నివారణకు వైద్య ఆరోగ్యశాఖ సూచనలు ►ఆస్పత్రులు, హోటళ్లలో అగ్నిప్రమాద నివారణ కోసం జనరేటర్ అందుబాటులో ఉంచాలి. అగ్నిప్రమాదం జరిగితే విద్యుత్ సౌకర్యాన్ని నిలిపివేసి జనరేటర్‌ను ఆన్ చేస్తారు. ►హోటల్ లేదా ఆస్పత్రి బిల్డింగ్‌పై పెద్ద నీటి తొట్టిని ఏర్పాటు చేయాలి. ►ప్రతీ ఫ్లోర్‌కు నీటిని అందించేందుకు వీలుగా పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ►అగ్నిప్రమాదంలో చేపట్టాల్సిన చర్యలపై అప్పుడప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించాలి. ►ఆయా భవనాలకు రెండు వైపులా మెట్లుండాలి. అగ్ని ప్రమాదం జరిగితే రోగులు, ఇతరులు బయటకు రావడానికి వీలుగా ఉండాలి. -
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సురక్షితమే
కరోనా వైరస్‌తో దేశం మొత్తం లాక్డౌన్లోకి వెళ్లడంతో రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లి ఇష్టమైన ఆహారాన్ని తినలేకపోతేన్నామనే భావన ప్రజల్లో ఆందోళన కలిగిస్తుంది. రెండువారాలు దిగ్భంధంలో గడిపిన తరువాత కూడా పరిస్థితిలో ఏ మార్పు రాకపోవడంతో లాక్డౌన్ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ బారీన పడకుండా ఉండాలంటే మనమంతా ఇంట్లోనే ఉంటూ, పరిశుభ్రంగా ఉండడమే ఉత్తమమైన మార్గం అని గ్రహించాము. అంతేగాక ప్రస్తుత పరిస్థితులకు తగినట్లుగా మా రోజువారీ దినచర్యలను మార్చుకున్నాము.వీటిలో ఇంట్లోకి తీసుకువచ్చే బయటి వస్తువులతో పాటు, ఫుడ్ డెలివరీ విషయంలో కూడా అదనపు జాగ్రత్త వహించడం కూడా ఒకటి. ఈ అసాధారణమైన పరిస్థితులలో బయటి నుంచి తీసుకువచ్చే వస్తువుల ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా వాటిని శుభ్రం చేయడంలో జాగ్రత్త వహించాలి. పలు ఆరోగ్య సంస్థలు నిరంతరం చేతులు కడుక్కోవాలని ప్రజలకు సూచించినప్పటికీ, ఫుడ్ డెలివవరీలను ఏ విధంగా నిర్వహించాలనే దానిపై సమాచారం అందుబాటులో లేదు. ఫుడ్ డెలివరీ నిర్వహణ విషయంలో అనేక సందేహాలు ఉండడంతో అది అంత సురక్షితం కాదేమోనని ఫుడ్ ఆర్డర్ చేయడానికి ప్రజలు భయపడుతున్నారు. కానీ ఫుడ్ ఆర్డర్ చేయడం సురక్షితం అని మీకు తెలియడానికి ఎటువంటి భద్రతా చర్యలను అనుసరిస్తున్నామనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాం. అంతేగాక అన్ని సమయాల్లో సూక్ష్మక్రిములు సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న సూపర్ మార్కెట్‌కు వెళ్లడం కంటే ఆహారాన్ని మీ ఇంటికే తెప్పించుకోవడం సురక్షితం అని గ్రహించండి. అయితే శానిటరీ టెక్నిక్లను ఉపయోగించి మీ ప్యాకేజీలను అన్ ప్యాకేజ్ చేయడం కూడా అంతే ముఖ్యం. రెస్టారెంట్లు, హోమ్ డెలివరీ విభాగాలు పలు ఆరోగ్య సూత్రాలను అనుసరిస్తూ తమ వినియోగదారులు సురక్షితంగా ఉండడం కోసం ముందడుగు వేశాయి. పరిశుభ్రమైన ఆహారం తయారీ, తాజాగా వండిన భోజనం, చెఫ్‌లు పాటించవలసిన ఆరోగ్య విధానాలు, కాంటాక్ట్ డెలివరీ, డోర్ డెలివరీ ఎగ్జిక్యూటివ్‌లు జాగ్రత్త వహించేలా రెస్టారెంట్ యజమానులు చర్యలు తీసుకుంటారు. కాబట్టి వీటిలో కలుషితానికి తక్కువ ఆస్కారం ఉందని మీకు హామీ ఇస్తున్నాం. వైరస్ సోకకుండా మీ ప్యాకేజీలను సరైన పద్దతిలో ఎలా అన్ ప్యాకేజీ చేయాలనేది చూడండి ►మీరు మీ ఫుడ్ ప్యాకేజీలను తీసుకున్నపుడు మీకు, డెలివరీ సిబ్బందితో ఎటువంటి కాంటాక్ట్ ఉండదని నిర్ధారించుకోండి. ►ప్యాకేజీని తీసుకునేటపుడు చేతికి తప్పనిసరిగా గ్లౌజులు ధరించండి. ►మీరు ప్యాకేజీని టేబుల్‌పై ఉంచే ముందు క్రిమి సంహారక మందుతో ఆ ప్రదేశాన్నిశుభ్రంచేయండి. ►ప్యాకేజీని కూడా అదే వస్త్రంతో శుభ్రం చేయండి. ►ఇప్పుడు ప్యాకేజీలోని పదార్థాన్ని శుభ్రం చేసిన పాత్రలోకి మార్చి, ప్యాకేజీని చెత్తకుండీలో పడేయండి. ►తరువాత ఆ చేతులతో మీముఖాన్ని తాకకుండా 20 సెకన్ల పాటు కడుక్కోవాలి. ►ముందు జాగ్రత్తగా ఆహారాన్ని మీ చేతులతో కాకుండా ఇంటిలోని వస్తువులను ఉపయోగించి తినడం మంచిది. ►పలు ఫుడ్ స్టాండర్డ్ ఏజెన్సీలు తాజాగా వండిన, వేడి వేడి ఆహారాన్ని తినడం మంచిదని ప్రజలకు సూచించాయి ►మీ ఆహారాన్ని సుమారు 12 నిమిషాలు వేడిచేసుకోవడం మంచిది. -
కరోనా వచ్చిందిలా!
సాక్షి, హైదరాబాద్ : కరోనా వైరస్ కోరలు చాస్తూ విశ్వరూపం చూపిస్తోంది. మూడు నెలల క్రితం చైనాలోని వుహాన్‌లో పుట్టిన ఈ మహమ్మారి ఇప్పుడు మననూ గడగడలాడిస్తోంది. మార్చి 2న రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ కరోనా వైరస్... మూడు వారాల్లోనే రాష్ట్రాన్ని స్తంభింపజేసింది. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ వైరస్.. వారితో సన్నిహితంగా ఉన్న వారికి సోకడం ఆందోళన కలిగిస్తోంది. కోవిడ్ పాజిటివ్ కేసుగా నమోదైన తొలి వ్యక్తి కోలుకుని ఇంటికి చేరడం శుభసూచకమైతే.. ఆ తర్వాత క్రమేణా పెరుగుతున్న కేసుల సంఖ్య యావత్ తెలంగాణనూ కలవరపరుస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 33 పాజిటివ్ కేసులు తేలగా... గత మూడు రోజుల్లోనే 14 నమోదు కావడంతో వైరస్ విస్తృతిపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ సరిహద్దులు మూసివేసినా.. రాష్ట్రాన్ని అష్టదిగ్భందం చేసినా.. 31వ తేదీ వరకు లాక్డౌన్ ప్రకటించినా.. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దుబాయ్ వయా బెంగళూర్.. మన రాష్ట్రంలో కరోనా వైరస్ తొలి పాజిటివ్ కేసు మార్చి 2న నమోదైంది. దేశవ్యాప్తంగా ఆ రోజున రెండు కేసులు తేలగా.. అందులో రాష్ట్రంలోని కేసు ఒకటి. బెంగళూర్‌లో పనిచేసే హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వృత్తిపని మీద దుబాయ్‌కు వెళ్లారు. మూడు రోజుల తరువాత బెంగళూర్‌కు వచ్చి అక్కడి నుంచి బస్సులో హైదరాబాద్‌కు చేరుకున్నారు. 3 రోజుల తర్వాత గాంధీలో చేరిన ఆయనకు కోవిడ్ ఉన్నట్లు తేలింది. ఈ కేసుతో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం.. వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి చేరుకున్న పౌరులకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే థర్మల్ స్క్రీనింగ్ చేసింది. జ్వరం, దగ్గు, తుమ్ములాంటి లక్షణాలుంటే తక్షణమే గాంధీలో చేర్చింది. ఒకవేళ ఎలాంటి లక్షణాలు కనిపించకున్నా.. 14 రోజులు క్వారంటైన్ (స్వీయ నిర్బంధం)కు వెళ్లాలని స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వ క్యారంటైన్ నుంచి కొందరు పారిపోగా.. మరికొందరు ఇంట్లో ఉంటామని చెప్పి స్వేచ్ఛగా తిరిగారు. మరోవైపు ఇండోనేసియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన మత ప్రచారకులు రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి ఆజ్యం పోశారు. మొత్తం 10 మంది బృందం సభ్యులకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. దీనికితోడు యూరోప్, దుబాయ్, గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన పౌరులు కూడా ఈ వైరస్ బారిన పడటంతో కేసుల సంఖ్య ప్రమాదకర స్థాయిలోకి చేరింది. ఈ పరిణామాలను అంచనా వేసిన కేంద్ర సర్కారు.. మార్చి రెండో వారంలో చైనా, హంకాంగ్, సింగపూర్, ఖతర్, ఒమన్, కువైట్, సౌదీ అరేబియా, దక్షిణ కొరియా, ఇటలీ దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసింది. యూరోప్, దుబాయ్‌లో కరోనా విజృంభించడంతో ఆ దేశాలకు కూడా గత 18 నుంచి విమానాల రాకపోకలను నిలిపివేసింది. అయినా ప్రపంచవ్యాప్తంగా వైరస్ విస్తృతి పెరగడంతో అంతర్జాతీయ సరిహద్దులు మూసేయాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 22 నుంచి అన్ని దేశాల నుంచి విమాన రాకపోకలను నిలిపివేసింది. ఈ క్రమంలోనే 2 రోజుల క్రితం జనతా కర్ఫ్యూ నిర్వహించిన ప్రభుత్వం.. ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రాన్ని లాక్డౌన్ చేస్తున్నట్లు ప్రకటించింది. చరిత్రలో మునుపెన్నడూలేని విధంగా అన్నింటిని మూసివేసిన కేంద్ర సర్కారు.. తాజాగా దేశీయ విమాన సేవలను కూడా రద్దు చేసింది. -
ఉద్యోగుల కోసం జియో అవగాహన కార్యక్రమాలు
సాక్షి, హైదరాబాద్ : 49వ జాతీయ భద్రతా దినోత్సవాన్ని పురస్కరించుకొని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని తమ సంస్థ కేంద్రాల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టింది. తమ సంస్థ ఉద్యోగులు, కాంట్రాక్టర్ల భాగస్వామ్యంతో 2020 మార్చి 4 నుంచి 10 వరకు వారం రోజులపాటు జియో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టింది. ఏడాదిపాటు నిబద్ధత, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన జీవనవిధానంతో ఉద్యోగులు పని చేయడానికి దోహదపడేలా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. జాతీయ భద్రతా ఉత్సవాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని వర్క్ సైట్లలో భద్రతా అవగాహన కార్యకలాపాలకు సంబంధించిన పోటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్మాణ సామాగ్రిని, యంత్రాలను, సామాగ్రి పట్ల సురక్షితంగా వ్యవహరించడంపై ప్రత్యేక ప్రదర్శనతోపాటు, మాక్ డ్రిల్ శిక్షణ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భద్రత అవగాహనపై పలువురు సంస్థ ఉన్నతాధికారులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా భద్రతను నిరంతరం గుర్తు చేసే బ్యాడ్జీలు ధరించి, బ్యానర్, పోస్టర్లను ప్రదర్శించారు. అదేవిధంగా జెండాను అవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. -
బోట్లలో భద్రత ప్రశ్నార్థకం
సాక్షి,విజయవాడ: పర్యాటక శాఖ ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేస్తున్నారు. బోట్లల్లో పరిమితికి మించి ఎక్కించడం.. లైఫ్ జాకెట్లు లేకుండా నదిలోకి తీసుకెళ్లడం చేస్తున్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా భవానీ ద్వీపానికి సందర్శకుల తాకిడి బుధవారం బాగా పెరిగింది. పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో నడిచే బోట్లు కిటకిటలాడాయి. సందర్శకుల భద్రతను నీళ్లకు వదిలేశారు. లైఫ్ జాకెట్లు లేకుండా... కృష్ణానదిలో పడవ మునిగి 22 మంది చనిపోయిన ఘటన కళ్ల ముందు ఇంకా కదలాడుతూనే ఉంది.. అయినప్పటికీ పర్యాటక శాఖ పాఠం నేర్వలేదు. నదిలో ప్రయాణించే బోట్లలో ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు వేసుకోవాలనే నిబంధన ఉంది. లైఫ్ జాకెట్ వేసుకోని వారిని బోట్లలోకి అనుమతించకూడదు. నిర్ణీత సభ్యుల కంటే ఎక్కువమంది బోటులోకి ఎక్కించ కూడదు. అయితే పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో నిర్ణీత సంఖ్య కంటే ఎక్కువ మందిని బోటులోకి ఎక్కించారు. 50 మంది ఎక్కాల్సిన బోటులోకి 75 మందిని అనుమతించారు.ప్రయాణికులకు కావాల్సిన లైఫ్ జాకెట్లను అందుబాటులో ఉంచలేదు. రక్షణ చర్యలు తీసుకోవాల్సిన అధికారులు అక్కడ లేరు. కిందిస్థాయి సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రైవేటు బోట్లదీ అదే తీరు.. ప్రైవేటు బోట్లు నిబంధనలకు నీళ్లు వదలి యథేచ్ఛగా నదిలో విహారం చేశాయి. జలవనరులశాఖ, పర్యాటక సంస్థ, రెవెన్యూ అధికారులుగానీ, పోలీసులుగానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. -
తల్లికి కడుపు కోత..!
మార్కాపురం : పుట్టబోయే బిడ్డ ఎలా ఉంటుందోనని ఆశతో ధర్మాస్పత్రికి వెళ్లిన మహిళకు కడపుకోత మిగులుతోంది. ప్రసవాన్ని సాధారణంగా కాకుండా సిజేరియన్ చేస్తూ కాసులు వసూలు చేస్తుండటంతో పేద మహిళలు తీవ్ర ఆవేదనలో మునిగిపోతున్నారు. ఇలాంటి బాధాకర ఘటనలు మార్కాపురం ఏరియా వైద్యశాలలో జరుగుతున్నా పర్యవేక్షించి చర్యలు తీసుకొనే అధికారులు కనిపించడంలేదు. సమర్థించుకుంటున్న వైద్యులుపండంటి బిడ్డను కనాలని నెలలు నిండి నొప్పులు రాగానే వైద్యశాలకు వెళ్తే సాధారణ కాన్పు చేయాల్సిన వైద్యులు కాసుల కోసం చేయి చాస్తున్నారు. ఇటీవల కాలంలో కాన్పుల కోసం వైద్యశాలకు వెళ్లిన వారంతా సిజేరియన్ ఆపరేషన్లు చేయించుకుని బయటకు వస్తున్నారు. నిబంధనలను పక్కన పెట్టి కొంత మంది వైద్యులు ఆపరేషన్లకు అందమైన భాష్యం చెబుతున్నారు. తల్లీబిడ్డల క్షేమం కోసమే తాము ఆపరేషన్లు చేస్తున్నామంటూ సమర్థించుకుంటున్నారు. పశ్చిమ ప్రకాశానికి ఏకైక వంద పడకల వైద్యశాల ఇక్కడే ఉంది. గిద్దలూరు నుంచి పుల్లలచెరువు వరకు ఉన్న 12 మండలాల నుంచి ప్రతి రోజూ కాన్పుల కోసం వస్తుంటారు. నిలిచిన నిధులు ఏరియా వైద్యశాలకు వెళ్తే ఉచితంగా ఆపరేషన్ చేయాలి. ఇందు కోసం ప్రభుత్వం జననీ సురక్షా యోజన పథకం కింద ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు డ్యూటీలో ఉన్న డాక్టర్‌కు ఆపరేషన్లు చేసినందుకు వెయ్యి రూపాయలు చెల్లిస్తుంది. సాయంత్రం 4 నుంచి ఉదయం 9గంటల వరకు ఆపరేషన్లు చేసినట్లయితే రూ. 1500 చెల్లిస్తుంది. కాగా గత 4 నెలల నుంచి ప్రభుత్వ నిధులను నిలిపి వేసింది. దీనితో ఆపరేషన్లు చేసే డాక్టర్లకు ఫీజులు రావటం లేదు. సిజేరియన్‌కు నిబంధనలు ఇవే.. మొదటి కాన్పు అయితే నొప్పులు రాగానే వైద్యశాలలో 24 నుంచి 36 గంటల వరకు వేచి చూడాలి. రెండో కాన్పు అయితే 12 గంటల వరకు చూడవచ్చు. మూడో కాన్పు అయితే 6 గంటల వరకు వేచి చూడాలి. తల్లీబిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమిస్తే సిజేరియన్ చేయవచ్చు. ఇప్పుడేం జరుగుతోంది? ఏరియా వైద్యశాలలో ఆపరేషన్లు చేసే విషయంలో మత్తు డాక్టర్ లేకపోవటంతో వేరే డాక్టర్‌ను తీసుకొస్తున్నారు. అయితే అతను ఎవరో కాదు.. వైద్యశాలలోనే మరో విభాగంలో పని చేసే డాక్టరే. తనకు సంబంధం లేని డ్యూటీ చేయాలంటే డబ్బులు ఇవ్వాలని రోగి బంధువుల నుంచి 2 నుంచి 3 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ఇక్కడికి చీరాల ఏరియా వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా పలువురు అడ్డుకుంటున్నట్లు తెలిసింది. సదరు డాక్టర్ ఈ ప్రాంతంకు చెందిన వ్యక్తే కావటంతో ఇక్కడ పనిచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొత్తం మీద ఏరియా వైద్యశాలలో కాన్పు కావాలంటేæ మత్తు డాక్టర్, సర్జరీ చేసే డాక్టర్, వైద్య సిబ్బందికి కలిపి రూ. 5 నుంచి రూ. 6వేల వరకు వసూలు చేస్తున్నారు. ఆపరేషన్లు చేస్తే భవిష్యత్‌లో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణ కాన్పు అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఇలా చేయడంపై అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు నెలల నుంచి ఏరియా వైద్యశాలలో సాధారణ కాన్పుల కంటే సర్జరీలే ఎక్కువగా జరిగాయి. అత్యవసరమైతేనే సర్జరీలు: మార్కాపురం ఏరియా వైద్యశాలకు కాన్పు కోసం వస్తే అత్యవసర పరిస్థితుల్లోనే సిజేరియన్ చేస్తున్నాం. తల్లీబిడ్డల్లో ఎవరికి ప్రమాదమైనా సిజేరియన్‌కు ప్రాధాన్యత ఇస్తాం. లేకపోతే మామూలు కాన్పులే చేస్తున్నాం. వైద్యశాలలో మత్తు డాక్టర్ లేకపోవటంతో బయటి నుంచి పిలిపిస్తున్నాం. మత్తు డాక్టర్‌ను నియమించాలని వైద్య విధాన పరిషత్ కమిషనర్‌ను, జిల్లా కో ఆర్డినేటర్‌ను కోరాం. -డాక్టర్ ఆంజనేయులు, ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్, -
రక్తం మరిగిన రాళ్లు..
♦ చీమకుర్తిలో మరణ మృదంగం మోగిస్తున్న గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీలు ♦ నిర్లక్ష్యంగా యాజమాన్యాలు.. స్పందించని అధికారులు ప్రకాశం: గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల యాజమాన్యాల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం.. వాటిలో పనిచేస్తున్న కూలీల పాలిట శాపంగా మారింది. క్వారీలు, ఫ్యాక్టరీల్లో భద్రతా ప్రమాణాలు లేకపోవడంతో పాటు అధికారులు తనిఖీలు చేయకపోవడంతో నిత్యం ప్రమాదాలకు గురవుతూ కార్మికులు మృత్యువాతపడుతున్నారు. గ్రానైట్ రవాణా సమయంలో కూడా రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతో మంది మరణిస్తున్నారు. వీటికితోడు గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో అనుమానాస్పదస్థితిలో కూడా అనేక మంది కూలీలు చనిపోతుండటం విశేషం. ఇటీవలే ముగ్గురు మృతి... ఇటీవల జరిగిన ప్రమాదాల్లో ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న ముగ్గురు కూలీలు మృతిచెందారు. ఈ నెల 21న హంస మినరల్స్ అండ్ ఎక్స్‌పోర్ట్‌లో గ్రానైట్ స్లాబులను కంటైనర్‌కు లోడుచేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి బీహార్‌కు చెందిన బసంత్ సాహిన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు మర్రిచెట్లపాలెంలో బీహార్‌కు చెందిన నీరజ్కుమార్సింగ్ అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతిచెందాడు. అదే గ్రామంలోని మరో గ్రానైట్ ఫ్యాక్టరీలో మిషన్ స్విచ్ ఆన్‌చేసే సమయంలో కరెంట్ షాక్ కొట్టి పొదిలి మండలం ఉప్పలపాడుకు చెందిన ఇనగంటి నాగరాజు మరణించాడు. ఇలాంటి ప్రమాదాలు చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీల్లో నిత్యం జరుగుతూనే ఉన్నాయి. సరాసరిన వారానికి ఒకరిద్దరు, నెలకు నలుగురైదుగురు, ఏడాదికి 60 మందికిపైగా మృత్యువాతపడుతున్నారు. రోడ్డు ప్రమాదాలూ అధికమే... ఒంగోలు – కర్నూలు రోడ్డుపై చీమకుర్తి–ఒంగోలు మధ్య నిత్యం గ్రానైట్ రవాణాతో తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి కూలీలతో పాటు ప్రయాణికులు మృతిచెందుతున్నారు. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థాని కులు బిక్కుబిక్కుమంటూ రాకపోకలు సాగిస్తున్నారు. చీమకుర్తిలో కొత్తగా వేసిన బైపాస్ రోడ్డును ఇంకా ప్రారంభించలేదు. కానీ, దానిపై వారం రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్ర మాదంలో ఒకేసారి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. బూనూరి రమాదేవి, ఉప్పుచర్ల వెంకటేశ్వర్లు, దేవరపల్లి ఆదినారాయణమ్మలు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ఈ ఘటన మరవకముందే రెండురోజుల క్రితం కర్నూలు రోడ్డులోని రామతీర్థం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పల్లామల్లికి చెందిన కేసర వీరారెడ్డి మృతిచెందాడు. ఆయనతో పాటు బైకుపై వచ్చి ప్రమాదానికి గురైన గురువులు తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో మృత్యువుతో పోరా డుతున్నాడు. ఇలా చెప్పుకుంటూపోతే.. చీమకుర్తి పరిధిలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్య కొండవీటి చాంతాడంత ఉంది. నేరుగా ప్రమాదాల్లో మృతిచెందిన వారి సంఖ్యే ఇలా ఉంటే.. మృతికి కారణం అంతుబట్టకుండా అనుమానాస్పదస్థితిలో మృతి చెందుతున్న వారూ అధికంగానే ఉంటున్నారు. సాగర్ కాలు వల్లో శవమై తేలడం, నిరుపయోగంగా ఉన్న గ్రానైట్ గుంతల్లో చనిపోయి పడి ఉండటం, కాలువ కట్టలు, రామతీర్థం పరిసరాల్లో ఉండే కొండలు, లోయల్లో మృతదేహాలై కనిపించడం ఇక్కడ సర్వసాధారణంగా మారింది. మూడొంతుల మంది ఇతర రాష్ట్రాల వారే... పొట్టచేతబట్టుకుని పిడికెడు మెతుకుల కోసం రామతీర్థం, చీమకుర్తి, బూదవాడ, మర్రిచెట్లపాలెం పరిసరాల్లో ఉండే గ్రానైట్ క్వారీలు, ఫ్యాక్టరీల్లో పనిచేసేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు అధికంగా వస్తుంటారు. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో మృతిచెందుతున్న వారు కూడా ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులే. వాటిలో సహజంగా జరిగే ప్రమాదాలు కొన్నయితే.. ఉద్దేశపూర్వకంగా జరిగే ప్రమాదాలు మరికొన్ని. ఉద్దేశపూర్వకంగా జరిగిన వాటిని కూడా సహజ ప్రమాదాలుగా చిత్రీకరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీహార్, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చే కార్మికులే ఇక్కడి ప్రమాదాల్లో ఎక్కువగా మృత్యువాతపడుతున్నారు. వారి తరఫున ప్రశ్నించేవారు లేకపోవడంతో గుట్టుచప్పుడు కాకుండా బాధిత కుటుంబానికి ఎంతోకొంత నగదు ముట్టజెప్పి సెటిల్మెంట్లు చేస్తున్నట్లు సమాచారం. -
తనిఖీలకు జాగిలాలూ సై..
కృష్ణా పుష్కరాల్లో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ధరణికోట, ధ్యానబుద్ధ, అమరేశ్వర ఘాట్‌ల్లో జాగిలాలు, మెటల్ డిటెక్టర్లతో నిర్విరామంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. – అమరావతి (పట్నంబజారు) -
నిలువెత్తు నిర్లక్ష్యం
గుంటూరు : ప్రభుత్వ అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు.. ఓ నిండు ప్రాణం.. రాష్ట్ర ప్రభుత్వం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టిన చోట సోమవారం పశ్చిమ బెంగాల్ 24 పరగణాలకు చెందిన కార్మికుడు సామ్రాట్ రౌత్(20) దుర్మరణం పాలవడం పలు విమర్శలకు తావిస్తోంది. నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలనే ఆదుర్దాలో పనులను వేగిరం చేయడం, కార్మికులకు కనీస రక్షణ చర్యలు కల్పించకపోవడంతోనేప్రమాదం చోటు చేసుకుందని ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఈ విషాదం చోటు చేసుకునేది కాదంటున్నాయి. (ప్రధాన వార్త మెయిన్‌లో) కొరవడిన రక్షణ చర్యలు తాత్కాలిక సచివాలయ నిర్మాణ జరుగుతున్న ప్రాంతం నల్లరేగడి నేల కావడం, పునాది 15 అడుగులు తవ్విన సమయంలో భారీ రిగ్ మట్టిలో కూరుకుపోయి ఓవైపునకు ఒరిగిందని, కార్మికుడు సామ్రాట్ దాని కింద పడి మృతి చెందాడని తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నపనుల్లో కార్మికులకు పూర్తి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని గాలికొదిలి కేవలం కాంట్రాక్టర్లపై భారం మోపి చోద్యం చూస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సచివాలయ పనులు నిర్వహించే చోట మిషన్ సక్రమంగా లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జేసీబీ, పొక్లెయిన్ వంటి యంత్రాలు అయితే పక్కకు ఒరిగినప్పటికీ నిలబడతాయని, అయితే ప్రస్తుతం ఉపయోగించిన భారీ రిగ్‌కు బుల్లెట్ రాడ్డులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. ఒక్కసారిగా మిషన్ ఒరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని కంగారులో సామ్రాట్ రౌతు(20) అనే కార్మికుడు మృతి చెందాడంటున్నారు. ప్రమాదం పొంచి ఉందన్నా.. వినరాయె.. తాత్కాలిక సచివాలయ పనులు చేపట్టేందుకు ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే పునాదులు తవ్వే పనిని షాపూర్జీ పల్లోంజి సంస్థకు అప్పగించినప్పటికీ ఆ సంస్థ విజయవాడకు చెందిన మరొక సంస్థకు సబ్ లీజుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నల్లరేగడి నేలలో రిగ్మిషన్ దిగబడుతుందని సైట్ ఇన్చార్జికి చెప్పినా పట్టించుకోలేదని కార్మికులు చెబుతున్నారు. భవన నిర్మాణ కార్మికునిగా రిజిస్టర్ చేయని వైనం.. భవన నిర్మాణాలు జరిపే కార్మికులందరినీ భవన నిర్మాణ కార్మిక చట్టం కిందకు తీసుకొచ్చి రిజిస్ట్రర్ చేయించాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారికంగా నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణాల వద్ద పనిచేసే కార్మికులను సైతం ఈ చట్టం కింద నమోదు చేయకపోవడం గమనార్హం. ప్రస్తుతం ప్రమాదంలో మృతిచెందిన సామ్రాట్ రౌతును సైతం భవన నిర్మాణ కార్మికునిగా రిజిస్ట్రరు చేయకపోవడంతో అతనికి వచ్చే నష్టపరిహారం పూర్తిగా తగ్గిపోయింది. చట్ట ప్రకారం ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 5 లక్షల నష్ట పరిహారం అందాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం కేవలం రూ. 50 వేలు మాత్రమే వచ్చే వీలు ఉండటం శోచనీయం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, తప్పులను ఒకరిపై ఒకరు మోపుకుంటూ చేతులు దులుపేసుకునేందుకు యత్నించడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అక్కడ పనిచేసే కార్మికులందరిని భవన నిర్మాణ కార్మికులుగా రిజిస్ట్రర్ చేయించడంతోపాటు, పూర్తి రక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదంలో మృతునికుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం చెల్లించాలని వైఎస్సార్కాంగ్రెస్పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జి కత్తెర సురేష్‌కుమార్‌తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. -
ఆరని మంటలు
ప్రతి ఏటా దగ్ధమవుతున్న అడవి వేడెక్కుతున్న ఏజెన్సీ వాతావరణం పక్షి, జంతు, వృక్ష జాతుల మనుగడకు ముప్పు రక్షణ చర్యలు చేపట్టని అటవీ శాఖ కొత్తగూడ :అటవీ గ్రామాలనగానే వేసవి కాలంలో చల్లగా ఉంటాయనుకుంటారు.. కానీ. ఇక్కడ అందుకు భిన్నంగా కార్చిచ్చు కారణంగా ఏజెన్సీ వాతావరణం మొత్తం వేడెక్కుతోంది. గ్రీష్మ రుతువు రావడంతో అడవిలో చెట్ల ఆకులు రాలుతారుు. రాలిన ఆకులు.. ఎండి ఎక్కడ కొంచెం నిప్పు రవ్వలు పడినా అడవి మొత్తం కాలుకుంటూ పోతుంది. ఈ మంటల్లో అడవిలో ఉండే చిన్న వృక్ష, పక్షు, జంతు జాతులు ఆహుతి అవుతుం టాయి. మంటల నుంచి తప్పించుకునే క్రమంలో వన్య ప్రాణులు వేటగాళ్లకు చిక్కి కొన్ని, జనావాసాల్లోకి వచ్చి మరి కొన్ని మృత్యువాత పడుతుంటాయి. ఏజెన్సీలో అడవి కాలడానికి వివిధ రకాల కారణాలు ఉన్నా.. ఎక్కువగా తునికాకు ప్రూనింగ్‌కు బదులుగా దగ్ధం చేస్తున్నారని చెబు తారు. గత ఏడాది పూనుగొండ్లలో ఐదు, ఇటీవల చింతగట్టు తండాలో రెండు ఇళ్లు కాలాయి. రాత్రయిందంటే గుట్టల్లో మండే మంటలు.. దీపాల వరుసలా కనిపిస్తుంటాయి. చేపట్టాల్సిన చర్యలు.. కార్చిచ్చు నుంచి అడవిని కాపాడేందుకు అటవీ శాఖ సిబ్బం ది చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఫైర్‌లైన్స్(కాలిబాటలు) వేయడం ద్వారా మంటలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి విస్తరించకుండా కట్టడి చేయడం, అడవిలో ఎండిన ఆకులను ఒక చోటకు ఊడ్చి కాల్చడం, వేసవి మూ డు నెలలకు స్థానికులచే ఫైర్ వాచర్లను నియమించడం లాంటి చర్యలు చేపట్టాలి. అవేమీ చేయకపోవడంతో ఏటా అగ్నికి ఆహుతవుుతూనే ఉంటుంది. ఫైర్ వాచర్ల నియా మకం, దహనాలను అడ్డుకోవడానికి, సహజంగా వచ్చిన మంటలు ఏటా ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తుంది. ఇక వాచర్లను నియమించినా అధికారులు వారితో ఇతర పనులు చేయించుకుంటున్నట్లు సమా చారం. ఈ విషయమై కొత్తగూడ ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు మాట్లాడుతూ అడవి కాలకుం డా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రెండు ప్రాంతాల్లో ఫైర్ వాచర్లను నియమించామన్నారు. -
దక్కన్..ఇదేం పని
• పంటకాలువల్లోకి రసాయనాలు విడుదల • భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం • యాజమాన్యం పోకడపై స్థానికుల ఆందోళన నక్కపల్లి/పాయకరావుపేట: పాయకరావుపేట మండలం కేశవరం దక్కన్ ఫైన్‌కెమికల్స్‌లో ఇటీవల దగ్ధమైన రసాయనాలను యాజమాన్యం దూర ప్రాంతాలకు తరలించ కుండా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వదిలేసింది. దీని వల్ల భూగర్భజలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరైన భద్రత చర్యలు తీసుకోకుండా తరచూ ప్రమాదాలకు నిలయమైన ఈ కంపెనీపై ఇప్పటికే పరిసర గ్రామాల్లోనివారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో రసాయనాలు నిల్వచేసే గోదాము దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రమాదకరమైన రూ.కోట్ల విలువైన రసాయనాలు(పారాసిస్ అనే ద్రావణంగా తెలుస్తోంది.) ముడిసరకులు దగ్ధమయ్యాయి. అప్పట్లో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడానికి నీటిని వెదజల్లడంతో రసాయనాలన్నీ కంపెనీ ఆవరణ అంతా ప్రవహించాయి. వీటిని శుద్ధిచేసి దూరప్రాంతాలకు తరలించాలని, ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీని సందర్శించిన కాలుష్యనియంత్రణ మండలి అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించారు. కెమికల్ ట్రీట్మెంట్ ప్లాంట్‌లో ఉంచి శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉంది. అధికారులు కూడా ఇవే సూచనలు చేశారు. దీనిని యాజమాన్యం పెడచెవినపెట్టింది. కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన, విషవాయువులను పీల్చి అనారోగ్యం బారినపడుతున్నామని, కంపెనీ మూసేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినా యాజమాన్యం గుణపాఠాలు నేర్వలేదు. ఆందోళనలు చల్లారకముందే పుండుమీద కారం చల్లినట్టుగా దగ్ధమైన రసాయనాలను పక్కనే ఉన్న పంటకాలువలోకి వదిలారు. అది కంపెనీ పక్కనే ఉన్న గజపతినగరం ఎస్సీ కాలనీ మీదుగా ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి చేరుతోంది. ఈలోగా రసాయనాలు భూమిలో ఇంకి భూగర్బ జలాలు కలుషిత మయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాలువను ఆనుకుని ఉన్న పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వర్షాలుపడితే అపరాలు, తదితర పంటలు వేస్తారు. ఎస్సీకాలనీని ఆనుకుని కాలువ ఉండటంతో రసాయనాలు భూమిలోకి ఇంకి బోర్లు, బావుల్లోనీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. అలాగే కాలువలో ప్రవహిస్తున్న రసాయనాలనుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటున్నారు. ఈ రసాయనాలు సముద్రంలో కలవడంతో మత్య్ససంపద కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై కాలుష్యనియంత్రణమండలి అధికారులుకు ఫిర్యాదుకు ఆయా గ్రామస్తులు సిద్ధపడుతున్నారు. శుద్ధిచేసినా, చేయకపోయినా దగ్ధమైన ప్రమాదకర రసాయనాలను కంపెనీ పరిసరప్రాంతాల్లో వదలడం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు. -
ఆరు ఎమర్జెన్సీ డోర్లతో లగ్జరీ బస్సు!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: వోల్వో బస్సుల్లో వరుస దుర్ఘటనలు మన మది నుంచి ఇంకా చెరిగిపోలేదు. ఆ బస్సుల్లో భద్రతా చర్యలు సరిగ్గా లేవని, అత్యవసర ద్వారం ఒకటే ఉందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లారీలు, బస్సులు, కోచ్‌ల ఉత్పత్తి రంగంలోని స్కానియా కమర్షియల్ వెహికల్స్ సంస్థ.. కొత్త హంగులు, సరికొత్త భద్రతా ఏర్పాట్లతో అత్యాధునిక బస్సు ‘స్కానియా మెట్రో లింక్’ను గురువారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో ఆవిష్కరించింది. ఈ బస్సు వేగం 85 కిలోమీటర్లకు మించదు. విమానాల్లో మాదిరిగానే ఈ బస్సులోనూ బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఓవర్ లోడింగ్, మండే స్వభావం కలిగిన వస్తువులను అనుమతించదు. అలాగే ఆరు అత్యవసర ద్వారాలు ఉండటం ఈ బస్సు ప్రత్యేకత. ఇందులో 12 హ్యామర్లు అందుబాటులో ఉంటాయి. చిన్న పిల్లలు కూడా వీటిని ఉపయోగించవచ్చు. ప్రయాణికుడు బస్సు ఎక్కి కూర్చోగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో ప్రదర్శన ఉంటుంది. డ్రైవర్ కంటి కదలికలను తెలుసుకోవడానికి వీలుగా అతని క్యాబిన్లో కెమెరా ఏర్పాటు ఉంది. -
సార్వత్రిక భేరి
సాక్షి, విజయవాడ : మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇక సార్వత్రిక ఎన్నికల సమరం మొదలుకానుంది. శనివారం అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. అనంతరం నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని బందరు, విజయవాడ పార్లమెంట్, 16 అసెంబ్లీ స్థానాలకు రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలను ఏర్పాటుచేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యాలయాన్ని గొల్లపూడిలో ఏర్పాటు చేయడం విమర్శలకు తావిస్తోంది. అసలు నియోజకవర్గానికి సంబంధం లేకుండా మైలవరం నియోజకవర్గంలో ఈ ఎన్నికల కార్యాలయాన్ని ఏర్పాటుచేశారు. ఎన్నికల ప్రక్రియ ఇలా.. శనివారం నుంచి 19 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 13, 14, 18 తేదీలు సెలవురోజులు. 21న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. మే ఏడున ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మే 16న ఓట్ల లెక్కింపు ఉంటుంది. జిల్లాలో దాదాపు 32,77,113 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. మరో 54,961 మంది కొత్తగా నమోదు చేసుకున్నారు. పట్టణ ప్రాంతాల్లో 1088, గ్రామీణ ప్రాంతాల్లో 2459 పోలింగ్ కేంద్రాలు.. మొత్తం 3547 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. జిల్లాలో 1433 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి అక్కడ వెబ్‌కాస్టింగ్‌తో పాటు ఇతర భద్రత చర్యలు తీసుకోనున్నారు. అత్యధికంగా ఖర్చుపెట్టే నియోజకవర్గాలుగా పెనమలూరు, గన్నవరం, మైలవరం, విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్ నియోజకవర్గాలను గుర్తించి అక్కడ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎన్నికల విధులకు 22,938 మంది సిబ్బందిని, 700 మైక్రోఅబ్జర్వర్స్ను, 323 మంది సెక్టార్ ఆఫీసర్లను నియమించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఆయా పార్టీలు తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించేందుకు తుది కసరత్తు చేస్తున్నాయి.ఇప్పటికే సీపీఎం ఏడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, తెలుగుదేశం ఐదు స్థానాలకు ప్రకటించింది. మిగిలిన పార్టీలు ఒకటి రెండు రోజుల్లో తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రిటర్నింగ్ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి శనివారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రకియ మొదలుకానుంది. ఎన్నికల కమిషన్ నియమావళిని అనుసరించి విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలుచేయనున్నారు. జిల్లాలోని 11 నియోజకవర్గాలు, మచిలీపట్నం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల వద్ద కూడా 144 సెక్షన్ అమలుతోపాటు ఎన్నిలక కమిషన్ ఆదేశాలను పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ఎస్పీ ప్రభాకరరావు సాక్షికి తెలిపారు.