ఆరు ఎమర్జెన్సీ డోర్లతో లగ్జరీ బస్సు!
సాక్షి ప్రతినిధి, బెంగళూరు: వోల్వో బస్సుల్లో వరుస దుర్ఘటనలు మన మది నుంచి ఇంకా చెరిగిపోలేదు. ఆ బస్సుల్లో భద్రతా చర్యలు సరిగ్గా లేవని, అత్యవసర ద్వారం ఒకటే ఉందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో లారీలు, బస్సులు, కోచ్‌ల ఉత్పత్తి రంగంలోని స్కానియా కమర్షియల్ వెహికల్స్ సంస్థ.. కొత్త హంగులు, సరికొత్త భద్రతా ఏర్పాట్లతో అత్యాధునిక బస్సు ‘స్కానియా మెట్రో లింక్’ను గురువారం ఇక్కడి కంఠీరవ స్టేడియంలో ఆవిష్కరించింది. ఈ బస్సు వేగం 85 కిలోమీటర్లకు మించదు.
విమానాల్లో మాదిరిగానే ఈ బస్సులోనూ బ్లాక్ బాక్స్ ఉంటుంది. ఓవర్ లోడింగ్, మండే స్వభావం కలిగిన వస్తువులను అనుమతించదు. అలాగే ఆరు అత్యవసర ద్వారాలు ఉండటం ఈ బస్సు ప్రత్యేకత. ఇందులో 12 హ్యామర్లు అందుబాటులో ఉంటాయి. చిన్న పిల్లలు కూడా వీటిని ఉపయోగించవచ్చు. ప్రయాణికుడు బస్సు ఎక్కి కూర్చోగానే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో ప్రదర్శన ఉంటుంది. డ్రైవర్ కంటి కదలికలను తెలుసుకోవడానికి వీలుగా అతని క్యాబిన్‌లో కెమెరా ఏర్పాటు ఉంది.