ప్రస్తుతం 14 లక్షల కి.మీ. దాటినా నడుపుతున్న ఆర్టీసీ
చిన్న మరమ్మతు వచ్చినా కంపెనీ ఇంజనీర్లతోనే రిపేర్లకు
ప్రతిసారీ రూ. మూడు, నాలుగు లక్షల్లో బిల్లులు
దీంతో వాటిని పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయం
లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులతో భర్తీ
ఇక కనుమరుగు కానున్న గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు
తాజాగా ఆర్టీసీ నుంచి 20 బస్సులు ఔట్.. త్వరలో మరో 40
సాక్షి, హైదరాబాద్: గరుడ ప్లస్ కేటగిరీ బస్సులు కనుమరుగుకానున్నాయి. ఆ పేరుతో ఆర్టీసీలో తిరుగుతున్న ఒక్కో వోల్వో బస్సుకు నెలకు సగటున రూ.లక్షకు పైగా నిర్వహణ ఖర్చు వస్తోంది. పైగా చిన్న రిపేరు చేయాల్సి వచ్చినా.. కంపెనీకి తరలించాల్సి రావటం, ఒక్కో పనికి రూ.3–4 లక్షల వరకు బిల్లు వస్తుండటంతో వాటిని వదిలించుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా 20 వరకు బస్సులను పక్కన పెట్టేసింది. త్వరలో మరికొన్నింటిని తుక్కు కింద మార్చబోతోంది. వాటి స్థానంలో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి కొంటున్న లహరి స్లీపర్, స్లీపర్ కమ్ సీటర్ బస్సులను నడపబోతోంది.
సామర్థ్యానికి మించి నడపటంతోనే..
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఆధునిక బస్సులు అందుబాటులోకి తెస్తుండటంతో ఆర్టీసీ కూడా ఆ శ్రేణి బస్సులను సమకూర్చటం అనివార్యమైంది. రెండు దశాబ్దాల క్రితం గరుడ పేరుతో బస్సులు ప్రారంభించారు. ఆకర్షణీయంగా ఉండేలా మెర్సిడస్ బెంజ్, ఇసుజు కంపెనీల బస్సులు నడిపారు. ఆ తర్వాత మల్టీ యాక్సెల్ బస్సులను గరుడ ప్లస్ పేరుతో ప్రవేశపెట్టారు. ఈ కేటగిరీలో వోల్వో, స్కానియా బస్సులు వాడారు. 2016–17లో కొత్త వోల్వో బస్సులు కొన్నారు. సాధారణంగా ఆ కంపెనీ బస్సులు ఏడెనిమిది లక్షల కిలోమీటర్ల వరకు తిప్పొచ్చని నిపుణులు చెబుతారు.
అంతకంటే ఎక్కువ తిప్పితే సమస్యలు ఏర్పడతాయి. ఒక్కో బస్సు ధర రూ.1.3 కోట్ల వరకు ఉండటంతో వెంటవెంటనే కొత్తవి సమకూర్చటం కుదరదు. అంత ధర పెట్టి కొని తక్కువ కిలోమీటర్లు తిప్పి తుక్కు కింద మార్చటానికి ఆర్టీసీ అధికారులకు మనస్కరించటం లేదు. దీంతో ఏకంగా 14 లక్షల నుంచి 15 లక్షల కి.మీ. వరకు తిప్పుతున్నారు. దీంతో ఆ బస్సుల్లో తీవ్ర సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా ఆర్టీసీ బస్సుల మరమ్మతులను సొంత సిబ్బందే చేస్తుంటారు. కానీ వోల్వో కంపెనీలో ఆయిల్ మార్చటం లాంటి చిన్నచిన్న పనులు తప్ప మిగతా సాంకేతిక సమస్యలన్నీ ఆ కంపెనీ ఇంజనీర్లే సరిదిద్దాల్సి ఉంటుంది.
సాంకేతిక సమస్య తలిత్తితే బస్సును నిలిపివేసి ఆ కంపెనీ నిపుణులకు కబురు పెట్టాల్సిందే. వారొచ్చి మరమ్మతు చేసి రూ.మూడు నాలుగు లక్షల బిల్లు వేసి వెళుతున్నారు. ఇది ఆర్టీసీ చేతి చమురు వదిలిస్తోంది. ఒక్కో బస్సుకు ప్రతినెలా రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో 14 లక్షల కి.మీ. దాటిన బస్సులను పక్కన పెట్టాలని తాజాగా నిర్ణయించి అమలు ప్రారంభించింది. ఆ కంపెనీ బస్సులు కొనటం ఆర్థికంగా ఇబ్బందిగా మారటంతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి సమకూర్చుకుంటున్న లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులను వాటి బదులు తిప్పుతోంది. ఇటీవలే 16 లహరి బస్సులను వాటికి చేర్చింది. త్వరలో 40 వోల్వో బస్సులను పక్కన పెట్టాలని నిర్ణయించింది. మిగతా వాటిని దశలవారీగా ఆపేయనుంది.
పోటీని తట్టుకోగలదా..?
ప్రస్తుతానికి బహుళజాతి కంపెనీ బస్సులు కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించింది. కానీ ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు బెంగళూరు, షిర్డీ, చెన్నై లాంటి దూర ప్రాంతాలకు బహుళజాతి కంపెనీలకు చెందిన ఆధునిక బస్సులు సమకూర్చుకుంటున్నాయి. ఆ కేటగిరీ బస్సులు ఆర్టీసీలో లేకపోవటం వెలితిగానే మారనుంది. ఇది ప్రయాణికుల ఆదరణపై ప్రభావం చూపే అవకాశముంది. అప్పటి పరిస్థితిని పరిశీలించి వాటిని కొనాలని ప్రభుత్వం నిర్ణయిస్తే తప్ప ఇప్పట్లో వాటిని కొనొద్దని ఆర్టీసీ నిర్ణయించటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment