గుంటూరు : ప్రభుత్వ అలసత్వం.. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం ఖరీదు.. ఓ నిండు ప్రాణం.. రాష్ట్ర ప్రభుత్వం వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ నిర్మాణం చేపట్టిన చోట సోమవారం పశ్చిమ బెంగాల్ 24 పరగణాలకు చెందిన కార్మికుడు సామ్రాట్ రౌత్(20) దుర్మరణం పాలవడం పలు విమర్శలకు తావిస్తోంది. నిర్మాణాన్ని సత్వరం పూర్తి చేయాలనే ఆదుర్దాలో పనులను వేగిరం చేయడం, కార్మికులకు కనీస రక్షణ చర్యలు కల్పించకపోవడంతోనేప్రమాదం చోటు చేసుకుందని ప్రజా సంఘాలు, పలు రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్లు ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ఈ విషాదం చోటు చేసుకునేది కాదంటున్నాయి. (ప్రధాన వార్త మెయిన్‌లో)
కొరవడిన రక్షణ చర్యలు
తాత్కాలిక సచివాలయ నిర్మాణ జరుగుతున్న ప్రాంతం నల్లరేగడి నేల కావడం, పునాది 15 అడుగులు తవ్విన సమయంలో భారీ రిగ్ మట్టిలో కూరుకుపోయి ఓవైపునకు ఒరిగిందని, కార్మికుడు సామ్రాట్ దాని కింద పడి మృతి చెందాడని తోటి కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అధికారికంగా చేస్తున్నపనుల్లో కార్మికులకు పూర్తి రక్షణ చర్యలు చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని గాలికొదిలి కేవలం కాంట్రాక్టర్లపై భారం మోపి చోద్యం చూస్తోందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.
సచివాలయ పనులు నిర్వహించే చోట మిషన్ సక్రమంగా లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్లు చెబుతున్నారు. జేసీబీ, పొక్లెయిన్ వంటి యంత్రాలు అయితే పక్కకు ఒరిగినప్పటికీ నిలబడతాయని, అయితే ప్రస్తుతం ఉపయోగించిన భారీ రిగ్‌కు బుల్లెట్ రాడ్డులు లేకపోవడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. ఒక్కసారిగా మిషన్ ఒరిగిపోవడంతో ఏం చేయాలో తెలియని కంగారులో సామ్రాట్ రౌతు(20) అనే కార్మికుడు మృతి చెందాడంటున్నారు.
ప్రమాదం పొంచి ఉందన్నా.. వినరాయె..
తాత్కాలిక సచివాలయ పనులు చేపట్టేందుకు ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజి నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అయితే పునాదులు తవ్వే పనిని షాపూర్జీ పల్లోంజి సంస్థకు అప్పగించినప్పటికీ ఆ సంస్థ విజయవాడకు చెందిన మరొక సంస్థకు సబ్ లీజుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. నల్లరేగడి నేలలో రిగ్‌మిషన్ దిగబడుతుందని సైట్ ఇన్‌చార్జికి చెప్పినా పట్టించుకోలేదని కార్మికులు చెబుతున్నారు.
భవన నిర్మాణ కార్మికునిగా రిజిస్టర్ చేయని వైనం..
భవన నిర్మాణాలు జరిపే కార్మికులందరినీ భవన నిర్మాణ కార్మిక చట్టం కిందకు తీసుకొచ్చి రిజిస్ట్రర్ చేయించాలని ప్రభుత్వం చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వం అధికారికంగా నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయ నిర్మాణాల వద్ద పనిచేసే కార్మికులను సైతం ఈ చట్టం కింద నమోదు చేయకపోవడం గమనార్హం.
ప్రస్తుతం ప్రమాదంలో మృతిచెందిన సామ్రాట్ రౌతును సైతం భవన నిర్మాణ కార్మికునిగా రిజిస్ట్రరు చేయకపోవడంతో అతనికి వచ్చే నష్టపరిహారం పూర్తిగా తగ్గిపోయింది. చట్ట ప్రకారం ప్రమాదవశాత్తు మృతి చెందితే రూ. 5 లక్షల నష్ట పరిహారం అందాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రస్తుతం కేవలం రూ. 50 వేలు మాత్రమే వచ్చే వీలు ఉండటం శోచనీయం. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు, తప్పులను ఒకరిపై ఒకరు మోపుకుంటూ చేతులు దులుపేసుకునేందుకు యత్నించడం విచారకరం. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి అక్కడ పనిచేసే కార్మికులందరిని భవన నిర్మాణ కార్మికులుగా రిజిస్ట్రర్ చేయించడంతోపాటు, పూర్తి రక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ప్రమాదంలో మృతునికుటుంబానికి రూ. 20 లక్షలు పరిహారం చెల్లించాలని వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, తాడికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కత్తెర సురేష్‌కుమార్‌తో పాటు పలువురు ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.