
మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిరసన
ఎల్‌బీ కళాశాలలో ఘటన
రామన్నపేట: నగరంలోని ములుగు రోడ్డు సమీపంలోని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అదే కళాశాలలోని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ శుక్రవారం కళాశాల భవనం ఎదుట నిరసన తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కళాశాలలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్‌రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల సమస్యలు తీర్చాలని అడిగినందుకు తనకు కళాశాల యాజమాన్యం నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో, కళాశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారని తెలిపారు.
ఏడు సంవత్సరాలుగా కళాశాలలో ఫిలాసఫీ సబ్జెక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ కింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపాల్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపాల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కళాశాలలో అధ్యాపకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపాల్‌కి భయపడి ఎవరూ బయటికి చెప్పుకోవడంలేదని వివరించారు. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలపై ఉస్మానియా గ్యాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.