
చెరువులో మునిగి తండ్రి, కొడుకు మృతి
బల్దియా నిర్లక్ష్యమే కారణమని ఆరోపణలు
మృతుల కుటుంబంలో విషాద ఛాయలు
హైదరాబాద్: లంగర్‌హౌస్‌లోని చెరువులో గుర్రపు డెక్క తొలగించడానికి వెళ్లిన జీహెచ్‌ఎంసీ మలేరియా విభాగం కాంట్రాక్ట్ ఉద్యోగి షేక్ కరీం, తొమ్మిదో తరగతి చదువుతున్న ఆయన కుమారుడు సాహిల్ ప్రమాదవశాత్తు అందులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బుధవారం జరిగింది. కాగా.. బల్దియా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే తండ్రీ కొడుకులు చెరువులో మునిగి మృత్యువాత పడ్డారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. చాంద్రాయణ గుట్ట కందికల్ గేట్ ప్రాంతంలో నివసించే షేక్ కరీం (39) జీహెచ్‌ఎంసీ మలేరియా విభాగంలో కాంట్రాక్ట్ ఉద్యోగి. ఇతడికి ఈత బాగా రావడంతో చెరువుల శుద్ధి కోసం పంపించేవారు. ఇందులో భాగంగా మంగళవారం లంగర్‌హౌస్‌లోని జీహెచ్‌ఎంసీ చెరువులో కరీం గుర్రపు డెక్క తొలగించి వెళ్లాడు. బుధవారం సెలవు కావడంతో 9 వ తరగతి చదువుతున్న తన కుమారుడు సాహిల్‌ను అధికారుల అంగీకారంతో తనతో పాటు తీసుకువచ్చాడు. గుర్రపు డెక్క తీస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరూ చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు.
పతంగుల మాంజానే ప్రాణాలు తీశాయా?
లంగర్‌హౌస్ చెరువును ఎప్పటికప్పుడు శుద్ధి చేయకపోవడంతో గుర్రపు డెక్కతో పాటు చెరువులో చెత్త పేరుకుపోయింది. దీనికితోడు ఇటీవల పతంగులు చెరువు నిండా పడ్డాయి. పతంగుల మాంజా దారాలలో చిక్కుకొని తండ్రీ కొడుకులు మృతి చెందినట్లు అధికారులు చెబుతున్నారు.
కుమారుణ్ని కాపాడే ప్రయత్నంలో..
గుర్రపు డెక్క తొలగించడానికి చెరువులో దిగిన సమయంలో రెండు బండరాళ్ల వద్దకు కరీం తన కుమారుడు సాహిల్‌ను పంపించాడు. ఆ సమయంలో కాలుకు ఏదో తట్టుకుందని, తనతో కావట్లేదు.. తనను కాపాడాలని సాహిల్ అరిచాడు. ఇటువైపు ఉన్న తండ్రి వెంటనే అక్కడికి వెళ్లి కుమారుడిని ఎత్తే ప్రయత్నంలో ఇద్దరు మునిగిపోయారు.
అధికారులు పరార్..
కరీం, సాహిల్‌లు చెరువులో ఉన్న సమయంలో ఒడ్డున ఎంటమాలజిస్టు అధికారి రమేష్‌తో పాటు ఆరుగురు మలేరియా విభాగం సిబ్బంది ఉన్నారు. నీటిలో మునిగిపోతున్న కుమారుడు సాహిల్‌ను కరీం తన భుజాలపై ఎత్తుకుని సిబ్బందిని కాపాడాలని కోరాడు. ఆ సమయంలో అధికారులతో పాటు సిబ్బంది కాపాడే ప్రయత్నం చేయకుండా జరిగిన విషయాన్ని స్థానిక నాయకులకు, మరికొందరికి ఫోన్ ద్వారా తెలుపుతూ సహాయం కావాలని కోరారు. వెంటనే అక్కడ ఉన్న సిబ్బంది స్పందించి ఉంటే వారి ప్రాణాలు దక్కేవని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే.. జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి తాను బాధ్యతలు స్వీకరించిన వారం రోజుల్లో లంగర్‌హౌస్‌కు వచ్చి ఈ చెరువును దత్తత తీసుకొని అభివృద్ది చేస్తానన్నారు. అప్పుడు వచ్చి వెళ్లిన ఆమె మళ్లీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడం గమనార్హం.
వెంటనే స్పందించిన హైడ్రా కమిషనర్..
చెరువులో తండ్రీ కొడుకులు మునిగిపోవడంతో పోలీసులు, స్థానిక ఎమ్మెల్యే వెంటనే హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు ఫోన్ చేసి సహాయం కోరారు. స్పందించిన ఆయన వెంటనే సహాయం కోసం డీఆర్‌ఎఫ్ సిబ్బందిని ఘటనా స్థలానికి పంపారు. సహాయక సిబ్బందికి కూడా మాంజా దారాలు అడ్డు రావడంతో 3 గంటల పాటు శ్రమించి తండ్రీకొడుకుల మృతదేహాలను వెలికితీశారు. కాగా.. 14 ఏళ్ల బాలుడిని పనిలో ఎలా పెట్టుకుంటారని జీహెచ్‌ఎంసీపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లంగర్‌హౌస్ చెరువులో తండ్రి
కొడుకుల మృతికి జీహెచ్‌ఎంసీ కమిషనర్, జోనల్ కమిషనర్‌లే బాధ్యత వహించాలని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్
మండిపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఆయన సహాయక చర్యలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment