దక్కన్..ఇదేం పని | Crop the release of chemicals into the drain | Sakshi
Sakshi News home page

దక్కన్..ఇదేం పని

Published Thu, Jan 28 2016 11:44 PM | Last Updated on Sun, Sep 3 2017 4:29 PM

Crop the release of chemicals into the drain

పంటకాలువల్లోకి రసాయనాలు విడుదల
భూగర్భ జలాలు  కలుషితమయ్యే ప్రమాదం
యాజమాన్యం పోకడపై స్థానికుల ఆందోళన

 
నక్కపల్లి/పాయకరావుపేట: పాయకరావుపేట మండలం కేశవరం దక్కన్ ఫైన్‌కెమికల్స్‌లో ఇటీవల దగ్ధమైన రసాయనాలను యాజమాన్యం  దూర ప్రాంతాలకు తరలించ కుండా పక్కనే ఉన్న పంట పొలాల్లోకి వదిలేసింది. దీని వల్ల భూగర్భజలాలు కలుషితమయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సరైన భద్రత చర్యలు తీసుకోకుండా తరచూ ప్రమాదాలకు నిలయమైన ఈ కంపెనీపై ఇప్పటికే పరిసర గ్రామాల్లోనివారు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తాజాగా కంపెనీలో షార్ట్ సర్క్యూట్‌తో రసాయనాలు నిల్వచేసే గోదాము దగ్ధమైంది. ఈ ఘటనలో ప్రమాదకరమైన రూ.కోట్ల విలువైన రసాయనాలు(పారాసిస్ అనే ద్రావణంగా తెలుస్తోంది.) ముడిసరకులు దగ్ధమయ్యాయి. అప్పట్లో అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేయడానికి నీటిని వెదజల్లడంతో రసాయనాలన్నీ కంపెనీ ఆవరణ అంతా ప్రవహించాయి. వీటిని శుద్ధిచేసి దూరప్రాంతాలకు తరలించాలని, ప్రమాదం జరిగిన వెంటనే కంపెనీని సందర్శించిన కాలుష్యనియంత్రణ మండలి అధికారులు యాజమాన్యాన్ని ఆదేశించారు. కెమికల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌లో ఉంచి శుద్ధి చేసి బయటకు వదలాల్సి ఉంది. అధికారులు కూడా ఇవే సూచనలు చేశారు.

దీనిని యాజమాన్యం పెడచెవినపెట్టింది. కంపెనీ నుంచి వచ్చే దుర్వాసన, విషవాయువులను పీల్చి అనారోగ్యం బారినపడుతున్నామని, కంపెనీ మూసేయాలని స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అయినా యాజమాన్యం గుణపాఠాలు నేర్వలేదు. ఆందోళనలు చల్లారకముందే పుండుమీద కారం చల్లినట్టుగా దగ్ధమైన రసాయనాలను పక్కనే ఉన్న పంటకాలువలోకి వదిలారు. అది కంపెనీ పక్కనే ఉన్న గజపతినగరం ఎస్సీ కాలనీ మీదుగా ఉప్పుటేరు నుంచి సముద్రంలోకి చేరుతోంది.  ఈలోగా రసాయనాలు భూమిలో ఇంకి భూగర్బ జలాలు కలుషిత మయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కాలువను ఆనుకుని ఉన్న పొలాలన్నీ ఖాళీగా ఉన్నాయి. వర్షాలుపడితే అపరాలు, తదితర పంటలు వేస్తారు. ఎస్సీకాలనీని ఆనుకుని కాలువ  ఉండటంతో రసాయనాలు భూమిలోకి ఇంకి బోర్లు, బావుల్లోనీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందన్న వాదన వ్యక్తమవుతోంది. అలాగే కాలువలో ప్రవహిస్తున్న రసాయనాలనుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేకపోతున్నామంటున్నారు. ఈ రసాయనాలు  సముద్రంలో కలవడంతో మత్య్ససంపద కూడా నాశనమయ్యే ప్రమాదం ఉంది. దీనిపై కాలుష్యనియంత్రణమండలి అధికారులుకు ఫిర్యాదుకు ఆయా గ్రామస్తులు సిద్ధపడుతున్నారు. శుద్ధిచేసినా, చేయకపోయినా దగ్ధమైన ప్రమాదకర రసాయనాలను కంపెనీ పరిసరప్రాంతాల్లో వదలడం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement