Groundwater
-
భూగర్భంలో జలరాశులు అపారం
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ 2024లో భూగర్భజలాలు అపారంగా పెరిగాయి. నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురవడంతో వర్షపు నీరు భారీగా భూమిలోకి ఇంకి భూగర్భజలంగా మారింది. దేశంలో 2024లో 12,656.20 టీఎంసీలు(446.9 బిలియన్ క్యూబిక్ మీటర్లు) మేర భూగర్భజలాలు పెరిగాయని కేంద్ర భూగర్భజల మండలి(సీజీడబ్ల్యూబీ) అంచనా వేసింది. ఇందులో 11,503.30 టీఎంసీలను ఉపయోగించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. అందులో 60 శాతం జలాలను వినియోగించుకున్నారని లెక్కగట్టింది. రాష్ట్రంలో 2024లో 787.30 టీఎంసీల మేర భూగర్భజలాలు పెరిగితే.. అందులో 223.17 టీఎంసీలను ఉపయోగించుకున్నారని అంచనా వేసింది. దేశవ్యాప్తంగా 2024లో భూగర్భజలాల పరిస్థితి అధ్యయనం చేసిన సీజీడబ్ల్యూబీ ఇటీవల కేంద్ర జల్ శక్తి శాఖకు నివేదిక ఇచ్చింది. సీజీడబ్ల్యూబీ నివేదికలో ప్రధానాంశాలు ఇవీ... ⇒ దేశంలో తొలి సారిగా 1980లో భూగర్భజలాల పరిస్థితిపై అధ్యయనం జరిగింది. ఆ తర్వాత 1995, 2004, 2009, 2011, 2013, 2017, 2020లలో భూగర్భజలాల పరిస్థితిపై సీజీడబ్ల్యూబీ అధ్యయనం చేసింది. 2022 నుంచి ఏటా భూగర్భజలాల పరిస్థితిపై అంచనా వేస్తోంది. ⇒ దేశంలో కురిసే వర్షం వల్ల వచ్చే నీటిలో 61 శాతం భూమిలోకి ఇంకి, భూగర్భజలాలుగా మారుతున్నాయి. ⇒ 2023తో పోల్చితే 2024లో భూగర్భజలాల పరిమాణం కాస్త తగ్గింది. 2023లో భూగర్భజలాల పరిమాణం 12,717.95 టీఎంసీలు ఉంటే... అది 2024లో 12,656.20 టీఎంసీలకు తగ్గింది. ఇక భూగర్భజలాల వినియోగం 2023తో పోల్చితే 2024లో పెరిగింది. భూగర్భం నుంచి 2023లో 6,834.75 టీఎంసీలను... 2024లో 6,956.52 టీఎంసీలను వినియోగించుకున్నారు. ⇒ దేశంలో భూగర్భజలాలను పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, డయ్యూ డామన్, గుజరాత్‌లలో భారీ ఎత్తున తోడేసి ఉపయోగించుకుంటున్నారు. -
భూగర్భజలం పుష్కలం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ భూగర్భ జలాల లభ్యత పెరిగింది. ప్రస్తుత నీటి సంవత్సరంలో భూగర్భ జలమట్టం 4.19 మీటర్లు పెరిగింది. భూగర్భ జలమట్టం పెరిగిన జిల్లాల్లో శ్రీసత్యసాయి జిల్లా (12.69 మీటర్లు) మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ప్రకాశం జిల్లా (8.52 మీటర్లు), మూడో స్థానంలో పల్నాడు జిల్లా (7.97 మీటర్లు) ఉన్నాయి. అంబేడ్కర్ కోనసీమ జిల్లా(1.16 మీటర్లు), శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా (1.31 మీటర్లు), పార్వతీపురం మన్యం జిల్లా(1.52 మీటర్లు)లో అత్యల్పంగా పెరిగాయి. 26 జిల్లాల్లో భూగర్భ జలాలు పుష్కలంగా పెరగడంతో బోరు బావుల కింద రబీలో పంట సాగుకు, వేసవిలో తాగు నీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెబుతున్నాయి. సగటున 7.6 మీటర్లలో భూగర్భ జలాల లభ్యత నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై.. మే 31తో ముగుస్తుంది. గత నీటి సంవత్సరం ముగిసేటప్పటికి అంటే 2024 మే 31కి రాష్ట్రంలో భూగర్భ జలాలు 11.79 మీటర్లలో లభ్యమయ్యేవి. గత ఐదేళ్ల తరహాలోనే ఈ ఏడాదీ నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సమృద్ధిగా వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో ఈ ఏడాది ఇప్పటికి 858 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఇప్పటిదాకా 950.57 మిల్లీమీటర్లు కురిసింది. అంటే సాధారణ వర్షపాతం కంటే 10.79 శాతం ఎక్కువ. దాంతో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రస్తుతం భూగర్భ జలమట్టం సగటున 7.6 మీటర్లకు చేరుకుంది. అంటే.. ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటికే 4.19 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి.బాపట్ల జిల్లా గరిష్టం.. తూర్పు గోదావరిలో కనిష్టం భూగర్భ జలాల లభ్యతలో బాపట్ల జిల్లా (2.63 మీటర్లతో) ప్రథమ స్థానంలో ఉంది. అంబేడ్కర్ కోనసీమ జిల్లా (2.64 మీటర్లు) రెండో స్థానంలో, గుంటూరు జిల్లా (3.39 మీటర్లు) మూడో స్థానంలో నిలిచాయి. భూగర్భ జలాల లభ్యత కనిష్టంగా ఉన్న జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా (21.66 మీటర్లతో) ప్రథమ స్థానంలో నిలవగా.. ఏలూరు జిల్లా(17.59 మీటర్లు) రెండో స్థానంలో, అన్నమయ్య జిల్లా(13.67 మీటర్లు) మూడో స్థానంలో నిలిచింది. -
జీవ మనుగడకు జలం కీలకం
భూగర్భ జలాలు క్షీణించే దిశగా భారత్ వేగంగా పురోగ మిస్తుందని ఐక్యరాజ్యసమితి నివేదిక హెచ్చరించింది.‘ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ 2023’ నివేదిక ప్రకారం, ప్రపంచంలోని 31 ప్రధాన జలాశయాల్లో 27 తిరిగి నింపగలిగే స్థాయి కంటే వేగంగా క్షీణిస్తున్నాయి. భారత దేశం భూగర్భజలాలు క్షీణ దశకు చేరుకున్నాయని ‘యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ హ్యూమన్ సెక్యూరిటీ’ (యూఎన్ఐ ఈహెచ్ఎస్) ప్రచురించిన కొత్త నివేదిక కూడా హెచ్చరించింది. ఇంటర్ కనెక్టెడ్ డిజాస్టర్ రిస్క్ రిపోర్ట్ –2023 నివేదిక ఆరు పర్యావరణ పాయింట్లను పరిశీలిస్తుంది. అవి 1. వేగ వంతమయిన విలుప్తాలు 2. భూగర్భ జలాల క్షీణత. 3. పర్వత హిమానీనదం. 4 ద్రవీభవనం. 5. అంతరిక్ష శిథి లాలు 6. భరించలేని వేడి– బీమా చేయలేని భవిష్యత్తు. నివేదిక ప్రకారం పంజాబ్‌లోని 78 శాతం బావులను అతిగా ఉపయోగించినట్లు పరిగణిస్తున్నారు. మొత్తం వాయవ్య ప్రాంతంలో 2025 నాటికి భూగర్భజలాల లభ్యత బాగా తగ్గిపోతుందని నివేదిక అంచనావేసింది. ‘జలాశ యాలు’ అని పిలువబడే భూగర్భ జలాశయాలలో నిల్వ చేయబడిన ముఖ్యమయిన వనరు మంచినీరు. ఈ జలాశ యాలు 200 కోట్లకు పైగా ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తాయి. ఇందులో దాదాపు 70 శాతం వ్యవసాయం కోసం ఉపయోగిస్తారు. భూగర్భజలాలు వేలాది సంవత్సరాలుగా ‘పునరుత్పాదక వనరుగా’ ఉంటున్నాయి అని నివేదిక పేర్కొంది. కానీ ఇప్పటికే ఉన్న బావుల్లో నీటిని అందించగల స్థాయికంటే నిల్వలు కిందికి పడిపోతే విపత్తులు ప్రారంభమైనట్లే. వ్యవసాయానికి నీరు అందక ఆహార కొరత ఏర్పడుతుంది. భూగర్భ జలాల క్షీణత అత్యంత తీవ్రంగా ఉన్న ప్రాంతాలలో భారతదేశం, ఈశాన్య చైనా, పశ్చిమ యునైటెడ్ స్టేట్స్, మెక్సికో, ఇరాక్, సౌదీ అరేబియా, ఉత్తర ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కువ నీరు అవసరమైన వరి, గోధుమలను పండించడం వల్ల జలవనరులు తొందరగా అడుగంటుతున్నాయని నివేదిక తెలిపింది. గోదుమ, వరి పంటలకు భారత్ అధికంగా భూగర్భ జలాలను వినియో గిస్తోంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాలు దేశంబియ్యం సరఫరాలో 60 శాతం, గోధుమల ఉత్పత్తిలో 85 శాతం ఉత్పత్తి చేస్తున్నాయి. అందుకే పంజాబ్‌లో 78 శాతం బావులు అతిగా వాడకానికి గురవుతున్నాయనేది నివేదిక సారాంశం. ‘2023 అంచనా నివేదిక’ ప్రకారం దేశం మొత్తం వార్షిక భూగర్భ జలాల రీచార్జ్ 4,49,087 బిలియన్ క్యూబిక్ మీట ర్లుగా ఉంది. ఇది మునుపటి సంవత్సరంతో పోలిస్తే 11.48 బిలియన్ క్యూబిక్ మీటర్ల పెరుగుదలను సూచిస్తుంది. దేశం మొత్తం వార్షిక భూగర్భజలాల వెలికితీత 241.34 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా ఉంది. భూగర్భ జలాలు అడుగంటిపోతే తాగునీటి సమస్య మరింత పెరుగుతుంది. ఇప్పటికే ప్రపంచంలోని 220 కోట్ల మంది ప్రజలు సురక్షితమయిన నీరు అందుబాటులోలేకుండా జీవిస్తున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి ప్రతీ ఒక్కరికీ పరిశుభ్రమయిన నీటిని అందజేయాలని ఐక్యరాజ్య సమితి లక్ష్యం నిర్దేశిస్తోంది. భూగోళం మీద ఉన్న నీటిలో 97 శాతం ఉప్పు నీరే. తాగడానికి ఉపయోగపడే జలాలు కేవలం 1 శాతం మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అందులో 0.86 శాతం చెరువులు, 0.02 శాతం నదులలో, మిగతా 0.12 శాతం భూగర్భజలాల రూపంలో ఉంది. ఈ వనరులే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 760 కోట్ల మందికి పైగా ఆహారాన్నీ, ఇతర అవసరాలనూ తీరుస్తున్నాయి. ‘2050 నాటికి ఈ భూమ్మీద తాగడానికి పుష్కలమయిన జలంఉండనే వుండదు. జనం స్నానాలు చేయడం మానేసి శరీరా నికి లేపనాలు పూసుకోవలసి ఉంటుంది. సరిహద్దులో వుండాల్సిన సైన్యం నీటి వనరుల చుట్టూ కాపలాకాస్తుంది...’ అంటూ దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉంటుందోఅంచనా వేయవచ్చు! – ప్రొ‘‘ గనబోయిన మచ్చేందర్, జియాలజీ విభాగ అధిపతి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం, నల్లగొండ -
జల భద్రతతోనే సుస్థిర సాగు
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: గోదావరి మిగులు జలాలను కృష్ణా, పెన్నా బేసిన్లకు మళ్లించడం, యాజమాన్య పద్ధతుల ద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం, భూగర్భజలాలను పరిరక్షించడం ద్వారా రాష్ట్రానికి జలభద్రత చేకూర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని జలవనరుల శాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ (ఈఎన్సీ) సి.నారాయణరెడ్డి చెప్పారు. విశాఖపట్నంలో జరుగుతున్న ఐసీఐడీ (ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్) సిల్వర్ జూబ్లీ కాంగ్రెస్‌లో రాష్ట్రంలో జలవనరుల వినియోగం, సుస్థిర సాగునీటి నిర్వహణకు చేపట్టిన చర్యలపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రతినిధులకు వివరించారు. సదస్సులో ఆయన ఏం చెప్పారంటే.. ♦ రాష్ట్రంలో ఐదు పెద్ద నదులు, 35 చిన్న నదులు ఉన్నాయి. సాగుకు యోగ్యంగా 2 కోట్ల ఎకరాలున్నాయి. ఇప్పటిదాకా 1.067 కోట్ల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఉంది. ఇందులో సాగునీటి ప్రాజెక్టుల కింద 90 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ♦ రాష్ట్రంలో ఏడాదికి సగటున 967 మి.వీు.ల వర్షపాతం కురుస్తుంది. దీని పరిమాణం 1,811 టీఎంసీలు. ఇందులో 54.8 శాతం అంటే 617.34 టీఎంసీలు భూమిలోకి ఇంకుతాయి. 510.03 టీఎంసీలు ఉపరితలంలో ప్రవహిస్తాయి. మొత్తం ప్రాజెక్టుల నీటి నిల్వ సామర్థ్యం 983.39 టీఎంసీలు. ♦ జలయజ్ఞం కింద 54 ప్రాజెక్టులు చేపట్టాం. ఇందులో 14 పూర్తిగా, రెండు పాక్షికంగా పూర్తయ్యాయి. వీటి ద్వారా కొత్తగా 49.8 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. 33.3 లక్షల ఎకరాలు స్థిరీకరిస్తాం. 1.17 కోట్ల మందికి తాగునీరు అందుతుంది. ♦ పోలవరం ప్రాజెక్టు ద్వారా 322.73 టీఎంసీలను వినియోగించుకుంటాం. 960 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి అందుబాటులోకి వస్తుంది. ♦ దేశంలో మొదటిసారిగా 1863–70 సంవత్సరాలలో కేసీ (కర్నూల్–కడప) కెనాల్ ద్వారా తుంగభద్ర–పెన్నా నదులను అనుసంధానం చేశారు. గోదావరి నుంచి ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే.. కృష్ణాతో పాటు పెన్నా బేసిన్లో వర్షాభావం వల్ల ఏటా 100 నుంచి 500 టీఎంసీల కొరత ఏర్పడుతోంది. ♦ గోదావరి జలాలను కృష్ణా, పెన్నా నదులకు మళ్లించే పనులను దశలవారీగా చేపడతాం. శ్రీశైలం రిజర్వాయర్ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు. రాయలసీమకు గ్రావిటీపై నీళ్లందించాలంటే.. గోదావరి జలాలను ఆ ఎత్తుకు ఎత్తిపోయాలి. తక్కువ ఖర్చుతో కృష్ణా, పెన్నా బేసిన్లకు నీటిని తరలించే విధానాలను సూచించాలని కోరుతున్నాం. ♦ రాష్ట్రంలో 1,254 ఫిజియోవీుటర్లను ఏర్పాటు చేసి.. 15 లక్షల బోరుబావులను జియోట్యాగింగ్ చేసి భూగర్భజలాల వినియోగాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసి, పరిరక్షిస్తున్నాం. 2017తో పోలిస్తే 2022 నాటికి భూగర్భజలమట్టం 5.65 మీటర్లకు పెరిగింది. దేశంలో భూగర్భజలాల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది. ♦ నీటి వృథాకు అడ్డుకట్ట వేయడం కోసం పైప్డ్ ఇరిగేషన్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ♦ 33.34 లక్షల ఎకరాల్లో డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా నీళ్లందిస్తున్నాం. దీనివల్ల 11.90 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతున్నారు. 201.3 టీఎంసీలు ఆదా అవుతున్నాయి. ♦ చిన్ననీటివనరులను మరమ్మతు చేయడం, ఆధునీకరించడం ద్వారా వాటి నిల్వ సామర్థ్యాన్ని 84.5 టీఎంసీలకు పెంచి.. 6.9 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నాం. -
భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగులు
సాక్షి, అమరావతి: ప్రస్తుత నీటి సంవత్సరంలో రాష్ట్రంలో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. నీటి సంవత్సరం జూన్ 1తో ప్రారంభమై మరుసటి ఏడాది మే 31తో ముగుస్తుంది. ప్రస్తుత అంటే 2022–23 నీటి సంవత్సరం మరో మూడురోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలో ప్రస్తుత నీటి సంవత్సరంలో నైరుతి, ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల సగటున 967 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 1,046.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలు సమృద్ధిగా కురవడం.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జలసంరక్షణ చర్యల వల్ల రికార్డు స్థాయిలో వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకింది. భూగర్భజలాలు 961.42 టీఎంసీలయ్యాయి. ఇందులో సాగు, తాగు, గృహ తదితర అవసరాలకు 913.35 టీఎంసీలు వినియోగించుకోవడానికి వీలుందని భూగర్భజలవనరుల అధికారులు లెక్కగట్టారు. కానీ నీటి సంవత్సరం ముగింపు దశకు చేరుకునేటప్పటికి అంటే ఆదివారానికి కేవలం 263.13 టీఎంసీల భూగర్భజలాలను మాత్రమే ప్రజలు వినియోగించుకున్నారు. దీంతో భూగర్భజలాల్లో 650.22 టీఎంసీలు మిగిలాయి. జలసంరక్షణ చర్యల ద్వారా వర్షపు నీటిని ఒడిసి పట్టి భూగర్భంలోకి ఇంకేలా చేసి, భూగర్భజలాలను పెంచడంతోపాటు వాటిని పొదుపుగా వినియోగించుకోవడం ద్వారా భూగర్భజలాల పరిరక్షణలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని అధికారవర్గాలు తెలిపాయి. రబీలోనే భారీగా తోడివేత అక్టోబర్ ఆఖరుకు వర్షాకాలం ముగిసిన తరువాత నవంబర్‌లో రాష్ట్రంలో భూగర్భజలాలు సగటున 6.13 మీటర్లలో లభ్యమయ్యేవి. రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ బోరుబావులను భూగర్భజలవనరుల శాఖ జియోట్యాగింగ్ చేసింది. వాటికి అదనంగా మరో లక్షకుపైగా వ్యవసాయ బోరుబావులు ఉంటాయని అంచనా. భూగర్భజలమట్టాన్ని 1,806 పిజియోమీటర్ల ద్వారా భూగర్భజలవనరుల శాఖ అధికారులు ఎప్పటికప్పుడు లెక్కిస్తూ పర్యవేక్షిస్తున్నారు. రబీలో, వేసవిలో సాగు, తాగు, గృహ అవసరాల కోసం బోరుబావుల నుంచి భారీ ఎత్తున ప్రజలు నీటిని తోడేశారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 3.95 మీటర్ల మేర భూగర్భజలాలను తోడేయగా, నెల్లూరు జిల్లాలో అత్యల్పంగా 0.37 మీటర్ల మేర భూగర్భజలాలను వినియోగించుకున్నారు. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 2.79, శ్రీసత్యసాయి జిల్లాలో 3.29 మీటర్ల మేర రబీలో భూగర్భజలాలను వినియోగించుకున్నారు. నవంబర్ నుంచి మే వరకు సగటున 2.54 మీటర్ల మేర భూగర్భజలాలను వాడుకోవడంతో భూగర్భజలమట్టం 8.67 మీటర్లకు పడిపోయింది. బాపట్లలో కనిష్ఠం.. ఏలూరులో గరిష్ఠం.. నీటి సంవత్సరం ముగిసేటప్పటికి రాష్ట్రంలో సగటున 8.67 మీటర్లలో భూగర్భజలాలు లభ్యమవుతున్నాయి. బాపట్ల జిల్లాలో కనిష్ఠంగా 3.59 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండగా.. ఏలూరు జిల్లాలో గరిష్ఠంగా 20.95 మీటర్ల లోతుకు వెళ్తేగానీ భూగర్భజలాలు దొరకని పరిస్థితి. వర్షాభావ ప్రాంతాలైన అనంతపురం జిల్లాలో 7.84, శ్రీసత్యసాయి జిల్లాలో 8.35 మీటర్లలోనే భూగర్భజలాలు లభ్యమవుతుండటం గమనార్హం. జూన్ 1 నుంచి కొత్త నీటి సంవత్సరం 2023–24 ప్రారంభమవుతుంది. గతేడాదిలానే ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న వాతావరణశాఖ అంచనాల నేపథ్యంలో.. భూగర్భజలాలు పుష్కలంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్‌లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది. ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు.. వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► క్లోరైడ్ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. ► లెడ్ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ► ఇక ఫ్లోరైడ్‌తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్ మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్ 4,01,022 శాంపిల్స్‌కు.. పశ్చిమ బెంగాల్లో 3,82,846 శాంపిల్స్‌కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్‌లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్‌లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్‌లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
World Water Day,: ‘సాగు’ మారకుంటే∙ నదులు ఎడారే
కోల్‌కతా: మన పంటల సాగు పద్ధతులు తక్షణమే మారకపోతే దేశంలోని నదులు ఈ శతాబ్దంలోనే ఎండిపోయి ఎడారిగా మారడం ఖాయమని పశ్చిమ బెంగాల్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ కల్యాణ్ రుద్ర హెచ్చరించారు. భూగర్భ జలాలు ఎప్పటికీ అంతరించిపోవని చాలామంది భావిస్తున్నారని, అందులోని ఎంతమాత్రం నిజం లేదని తేల్చిచెప్పారు. భూగర్భ జలాలు పడిపోవడం అనేది నదుల మనుగడను దెబ్బతీస్తుందని పేర్కొన్నారు. పంటల సాగు పద్ధతులను వెంటనే మార్చుకోవాలని, లేకపోతే గంగానదితో సహా ఇతర నదులు ఎండిపోతాయని వెల్లడించారు. తద్వారా మన నాగరికత ఉనికి సైతం ప్రమాదంలో పడుతుందన్నారు. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా భారత్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యక్రమంలో కల్యాణ్ రుద్ర మాట్లాడారు. మనదేశంలో పంటల సాగు కోసం భూగర్భ జలాలను విచ్చలవిడిగా తోడేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విధానంలో మార్పు రావాలన్నారు. చెరువులు, కుంటలు విస్తృతంగా తవ్వుకోవాలని, వాననీటిని, ఉపరితల జలాలను సంరక్షించుకోవాలని సూచించారు. భూగర్భ జలాలపై ఆధారపడడం మానుకోవాలని చెప్పారు. డ్యామ్‌లు, కాలువల నిర్మాణం అధిక వ్యయంతో కూడుకున్న వ్యవహారమని వివరించారు. -
పాతాళగంగ ఉప్పొం'గంగ'
గురజాల డివిజన్లోని బొల్లాపల్లి, వెల్దుర్తి తదితర మండలాల్లో గత ఏడాది మేనెలలో భూగర్భ జలాలు భారీగా అడుగంటాయి. గతేడాది జనవరి, మే నెలల్లో డివిజన్ సరాసరి భూగర్భ జల మట్టాలు వరుసగా 11.10, 13.27 మీటర్లుగా నమోదయ్యాయి. అనంతరం జూన్ నుంచి సమృద్ధిగా వానలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గత ఆరునెలల కాలంలో సాధారణంగా 666.68 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 808.93 మిల్లీమీటర్ల వాన కురిసింది. ఇది సాధారణం కన్నా 21.33 శాతం అధికం. ప్రస్తుతం గురజాల డివిజన్లో భూగర్భ జలాలు 7.58 మీటర్లకు ఎగబాకాయి. అంటే మేనెలతో పోలిస్తే 5.69 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి ’’. సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో పాతాళ గంగ పైపైకి ఎగబాకుతోంది. చుక్క నీరు కూడా లేక ఎండిన పోయిన బోర్లు నిండైన నీటి ధారతో ఉప్పొంగుతున్నాయి. ఈ ఏడాది విస్తారంగా వర్షాలు పడడం, కృష్ణానదికి వరుసగా వరదలు రావడంతో జిల్లాలోని నాలుగు డివిజన్లలోనూ భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయి. కరువుసీమ పల్నాడులోనూ జలసిరులు ఉబికివస్తున్నాయి. ఫలితంగా సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. గత మే నెలతో పోలిస్తే.. జిల్లాలో గత ఏడాది మే నెలతో పోలిస్తే 2.89 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. గత మే నెలలో జిల్లాలో సరాసరి భూగర్భ నీటిమట్టం 8.07 మీటర్లుగా నమోదైంది. ప్రస్తుతం 5.18 మీటర్లకు భూగర్భ జలాలు ఎగబాకాయి. ప్రస్తుతం న్యూజెండ్ల మండలం చింతలచెరువు గ్రామంలో 0.31 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. గురజాల డివిజన్లోని వెల్దుర్తి గ్రామంలో 46.24 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోయింది. జిల్లాలో 57 మండలాలు ఉండగా, 34 మండలాల్లో 0 నుంచి 3 మీటర్లలోపు, 18 మండలాల్లో 3 నుంచి 8మీటర్లలోపు, రెండు మండలాల్లో 8 నుంచి 15 మీటర్లలోపు, మూడు మండలాల్లో 15 మీటర్ల కన్నా ఎక్కువ లోతులో నీరు అందుబాటులో ఉంది. నీటికి కటకటలాడే బొల్లాపల్లి, వెల్దుర్తి మండలాల్లోనూ భూగర్భ జలాలు బాగా వృద్ధి చెందడం విశేషం. ఈ మండలాల్లో ఏప్రిల్ వరకు బోర్లలో నీరు వచ్చే అవకాశం పుష్కలంగా ఉండటంతో రైతులు పంటల సాగు చేపట్టారు. కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో మాత్రం ఒక మీటరు లోతులోపే భూగర్భజలాలు లభ్యమవుతుండడం గమనార్హం. గురజాల మండలం చర్లగుడిపాడులో ఓ వ్యవసాయ బోరు నుంచి మోటారు పెట్టకముందే నీరు బయటకు వస్తున్న దృశ్యం (ఫైల్) భూగర్భంలోకి 30.02 టీఎంసీలు గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు సగటు సాధారణ వర్షపాతం 746.08 మిల్లీమీటర్లుగా నమోదుకాగా, 820.31 మిల్లీమీటర్ల వాన కురిసింది. అంటే 9.94 శాతం అధిక సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గురజాల డివిజన్లో 21.33 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాల వల్ల 333.57 టీఎంసీల నీరు జిల్లా భూమిపైకి చేరగా, అందులో 30.02 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. ప్రభుత్వ చర్యల వల్లే మార్పు ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్లే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇంకుడు గుంతలు, చెరువుల పూడిక తీత పనులు అధికమొత్తంలో చేపట్టడం సత్ఫలితాలనిస్తోందని పేర్కొంటున్నారు. ప్రజలు మరింత చైతన్యంతో వ్యవహరించి ఇంకుడు గుంతలు ఎక్కువగా తవ్వితే.. ఇంకా మంచి ఫలితాలు వస్తాయని, జిల్లాలో నీటికి కొదవ ఉండదని అధికారులు సూచిస్తున్నారు. నీటి మట్టాలు పెరిగాయి గతంలో వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డాం. తాగడానికి గుక్కెడు మంచినీరు దొరకని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో బోర్లలోనూ నీటి మట్టం పెరిగింది. తాగు, సాగునీటి సమస్య తీరింది. బోరు నుంచి ప్రస్తుతం సమృద్ధిగా నీరువస్తోంది. ఐదెకరాల్లో మిరప, శనగ పంట సాగుచేశా. ఇప్పుడు సంతోషంగా పంటలు పండించుకుంటున్నాం. – తవనం వెంగళరెడ్డి, రైతు, రెమిడిచర్ల గ్రామం, బొల్లాపల్లి మండలం పొదుపుగా వాడుకోవాలి వర్షాలు అధికంగా నమోదు కావడంతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. సాధారణ వర్షపాతం కన్నా 9.94 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి. గత ఆరు నెలల కాలంలో 30 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకింది. జిల్లాలో 34 మండలాల్లో 3 మీటర్ల కన్నా లోపే భూగర్భ జలాలు లభిస్తున్నాయి. రైతులు జలాలను పొదుపుగా వాడుకోవాలి. – బి నాగరాజు, ఇన్చార్జ్ డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, గుంటూరు -
బొట్టు బొట్టుకూ లెక్క
సాక్షి, అమరావతి: వరదను ఒడిసి పట్టి.. పొదుపుగా వాడుకోవడం ద్వారా జలవనరులను సంరక్షించుకోవడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోంది. వర్షపాతం, అంతర్రాష్ట్ర నదుల ద్వారా వచ్చే ప్రవాహాన్ని.. ఆవిరి, కడలిలో కలుస్తున్న జలాలు, సాగు, గృహ, తాగు, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకుంటున్న నీరు.. ప్రాజెక్టుల్లో, చెరువుల్లో, భూగర్భంలో లభ్యతగా ఉన్న నీటి లెక్కలను రోజూ లెక్కిస్తోంది. తద్వారా నీటి వృథాకు అడ్డుకట్ట వేసి.. జలవనరులను సమర్థవంతంగా పరిరక్షిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ (ఆంధ్రప్రదేశ్ వాటర్ రీసోర్సెస్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్)ను ఏర్పాటుచేసింది. అంతేకాదు.. జలసంరక్షణలో అత్యుత్తమంగా పనిచేస్తున్నందుకు ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. నీటి లెక్కలు ఇలా.. ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1తో ప్రారంభమై మార్చి 31తో ముగుస్తుంది. కానీ, నీటి సంవత్సరం ఏటా జూన్ 1న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. నీటి లెక్కలను కూడా జూన్ 1 నుంచి లెక్కిస్తారు. అది ఎలాగంటే.. ► రాష్ట్రంలో రోజూ కురిసే వర్షాన్ని రెయిన్ గేజ్‌ల ద్వారా కొలుస్తున్నారు. ► అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ప్రవేశించే నీటిని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) హైడ్రలాజికల్ అబ్జర్వేషన్ సెంటర్లలో ఏర్పాటుచేసిన గేజ్‌ల ద్వారా లెక్కిస్తుంది. ఇదే రీతిలో కడలిలో కలిసే జలాలను లెక్కిస్తుంది. ► ఆవిరయ్యే నీటిని ఎవాపరీమీటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లెక్కిస్తుంది. ► ప్రాజెక్టుల కింద ఆయకట్టుకు విడుదల చేసే నీటిని.. తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం వాడుకునే నీటిని టెలీమీటర్ల ద్వారా గణిస్తారు. ► ఫీజియోమీటర్ల ద్వారా భూగర్భంలో ఇంకే నీటిని లెక్కిస్తుంది. ..ఇలా రాష్ట్రంలో రెయిన్ గేజ్‌ల నుంచి ఫీజియోమీటర్ల వరకూ అన్నింటినీ ఏపీడబ్ల్యూఆర్‌ఐఎంఎస్‌తో అనుసంధానం చేసింది. జూన్ 1 నుంచి మే 31 వరకూ రోజూ నీటి రాక, పోకను లెక్కించి.. లభ్యతగా ఉన్న నీటి వివరాలను వెల్లడిస్తుంది. 7,994.32 టీఎంసీల ప్రవాహం.. రాష్ట్రంలో ఈ ఏడాది సగటున 855 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుందని అంచనా వేశారు. కానీ, ఇప్పటికే 977.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీని ద్వారా 5,476.39 టీఎంసీల ప్రవాహం వచ్చింది. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార తదితర అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి ఇప్పటివరకూ 2,517.93 టీఎంసీల ప్రవాహం వచ్చింది. అంటే.. ఆదివారం నాటికి రాష్ట్రంలోకి మొత్తం 7,994.32 టీఎంసీల ప్రవాహం వచ్చింది. ఇందులో ఆదివారం నాటికి ఆవిరి రూపంలో 2,829.9 టీఎంసీలు ఖర్చయ్యాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ, గొట్టా బ్యారేజీ, నారాయణపురం ఆనకట్ట ద్వారా గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి జలాలు 2,780.6 టీఎంసీలు కడలిలో కలిశాయి. అంటే.. అంతర్రాష్ట్ర నదుల ద్వారా రాష్ట్రంలోకి వచ్చిన ప్రవాహం కంటే 262.23 టీఎంసీలు అధికంగా సముద్రంలో కలిసినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు.. సాగు, తాగు, గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ఇప్పటిదాకా 780.15 టీఎంసీలే వాడుకోవడం గమనార్హం. -
చిరపుంజిలా మారిన సీమ
సాక్షి, విశాఖపట్నం: కరువు సీమలో ఈ ఏడాది కుంభవృష్టి కురిసింది. రాయలసీమలోని మూడు జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు పడగా 10 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతంతో పోలిస్తే రాష్ట్రంలో 2.66 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. సకాలంలో నైరుతి రుతుపవనాల రాక, ఈశాన్య రుతుపవనాలు కూడా అదే రీతిలో జోరందుకోవడంతో వరుసగా మూడో ఏడాది కూడా వర్షాలు పుష్కలంగా కురిశాయి. వీటికి తోడు అల్పపీడనాలు, వాయుగుండం, తుపాన్లతో కుండపోత వానలు పడ్డాయి. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 950 మిల్లీమీటర్లు కాగా ఈ ఏడాది 2.66 శాతం అధికంగా 975.29 మి.మీ. వర్షాలు కురిశాయి. సగటు వర్షపాతంతో పోలిస్తే రాయలసీమలోని మూడు జిల్లాలు అత్యధిక వర్షపాతంతో మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. అనంతపురం జిల్లాలో సగటు వర్షపాతం కంటే 36.36 శాతం అత్యధికంగా వర్షాలు కురవగా వైఎస్సార్ కడప జిల్లాలో 33.81 శాతం, చిత్తూరులో 27.17 శాతం అధికంగా వర్షాలు పడ్డాయి. కడపలో 150 ఏళ్లలో తొలిసారి.. ప్రధాన నగరాల వారీగా చూస్తే కడపలో రికార్డు స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదైంది. కడపలో 150 ఏళ్లలో తొలిసారిగా ఏకంగా 1,764 మి.మీ. వర్షపాతం నమోదైంది. 1,663 మి.మీ.తో విజయవాడ రెండోస్థానంలో ఉంది. విజయనగరంలో 1,476, కాకినాడలో 1,433, విశాఖపట్నంలో 1,421, రాజమండ్రిలో 1,412, తిరుపతిలో 1,395, గుంటూరులో 1,121, నెల్లూరులో 1,061, అమరావతిలో 951 మి.మీ. వర్షపాతం నమోదైంది. కర్నూలు నగరంలో అత్యల్పంగా 538 మి.మీ. వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ నివేదికలు వెల్లడించాయి. రాష్ట్రమంతటా పుష్కలంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. ప్రతి ప్రాంతంలో నీటివనరులు నిండుకుండల్లా తొణికిసలాడుతుండటం శుభపరిణామమని పేర్కొంటున్నారు. -
మండు వేసవిలోనూ మంచినీరు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెరువుల నిండా సమృద్ధిగా నీరు ఉండటం, భూగర్భ జలాల అందుబాటుతో తాగునీటి ఇబ్బందులు తగ్గుముఖం పట్టాయి. భూగర్భ జలాలు పైపైకి ఉబికి రావడంతో రెండేళ్ల క్రితం వరకు పనిచేయని బోర్లు సైతం నిండు వేసవిలోనూ నీటి ధారలు కురిపిస్తున్నాయి. 2019 ఏప్రిల్ మొదటి వారంలో 3,422 గ్రామాల్లో తాగునీటి ఇబ్బందులు తలెత్తగా ప్రస్తుత వేసవిలో 285 గ్రామాల్లోనే సమస్య కనిపిస్తోందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు ఎప్పటికప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.08 లక్షల మంచి నీటి బోర్లు.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రక్షిత మంచినీటి పథకాలకు తోడు రాష్ట్రవ్యాప్తంగా 2,08,094 మంచినీటి బోర్లు ఉన్నాయి. రెండేళ్ల క్రితం వరకు వేసవి వస్తే 60–70 వేల వరకు బోర్లు పనిచేసేవే కాదు. ఇప్పుడు 5–6 వేలు మినహా మిగిలిన అన్ని బోర్లు పనిచేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో 26,007 బోర్లు ఉంటే.. రెండేళ్ల క్రితం వరకు వేసవి సీజన్లో 10 వేల బోర్లు పనిచేసేవి కావు. 8 మీటర్ల లోతులోనే భూగర్భ జలాలు ప్రకాశం జిల్లాలో గతంలో 16.09 మీటర్ల లోతున అందుబాటులో ఉన్న భూగర్భ జలాలు ఈ ఏడాది ఏప్రిల్ 10 నాటికి 8 మీటర్ల లోతులోనే ఉన్నాయని అధికారులు గ్రామీణ నీటి సరఫరా శాఖకు నివేదించారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో 17.22 మీటర్ల లోతున ఉండే భూగర్భ జలాలు ఇప్పుడు సరాసరిన 7 మీటర్ల లోతుకే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు ప్రభుత్వం వేసవిలో ముందు జాగ్రత్తగా మార్చి నెలాఖరులోనే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని తాగునీటి చెరువులను నీటితో నింపింది. నీటి ఇబ్బందులు తప్పాయి రెండేళ్ల క్రితం వరకు మా గ్రామంలో నీళ్ల కోసం ఇబ్బంది పడేవాళ్లం. ట్యాంకర్ నీళ్ల కోసం పనులన్నీ మానుకొని ఇళ్లకాడ వేచి చూసేవాళ్లం. ట్యాంకర్ రాకుంటే పొలాలకు పోయి నీళ్లు తెచ్చుకునేవాళ్లం. మా ఊరిలో చెక్‌డ్యామ్ కట్టడంతో ఇప్పుడు చెరువు నిండా నీళ్లున్నాయి. రక్షిత మంచినీటి పథకం ద్వారా ప్రతి ఇంటికీ కొళాయిల ద్వారా నీళ్లు అందిస్తున్నారు. వేసవిలోనూ బోర్లలో సమృద్ధిగా నీరు లభిస్తోంది. – కుమారుల చెన్నక్రిష్ణమ్మ, బాదినేనిపల్లె, కొమరోలు మండలం, ప్రకాశం జిల్లా -
అమ్మో ఆర్సెనిక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాలపై ఆర్సెనిక్ పంజా విసురుతోంది. భూగర్భ జలాలను అధికంగా తోడేస్తుండటంవల్ల కొన్ని ప్రాంతాల్లో జలమట్టం ప్రమాదకర స్థాయికి పడిపోయింది. ఆ ప్రాంతాల్లో భూగర్భ జలాల్లో విషపూరితమైన ఆర్సెనిక్ మూలాలు కన్పిస్తున్నాయి. బీఐఎస్ (బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్) ప్రమాణాల ప్రకారం లీటర్ నీటిలో 0.01 మిల్లీ గ్రాముల్లోపే ఆర్సెనిక్ మూలాలు ఉండొచ్చు. కానీ.. గుంటూరు జిల్లాలోని రెండుచోట్ల.. నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్కోచోట, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో రెండుచోట్ల భూగర్భ జలాల్లో బీఐఎస్ ప్రమాణాల కంటే అధికంగా ఆర్సినిక్ మూలాలున్నాయని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) గుర్తించింది. ఈ నీటిని తాగినా, ఆ నీటితో సాగుచేసిన పంటల ఉత్పత్తులను తిన్నా మనుషులు, పశువుల జీర్ణ, శ్వాసకోస వ్యవస్థ అతలాకుతలమవుతుందని.. బోన్‌మ్యారో (ఎముక మజ్జ), చర్మ క్యాన్సర్ బారినపడే అవకాశం ఉంటుందని వైద్య, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో అధికం 1980లో పశ్చిమ బెంగాల్‌లోని భాగీరథి నదీ తీరంలో సీడబ్ల్యూసీ నిర్వహించిన అధ్యయనంలో ఆర్సెనిక్ మూలాలు తొలిసారి బయటపడ్డాయి. దాంతో దేశవ్యాప్తంగా సీడబ్ల్యూసీ వీటిపై క్రమం తప్పకుండా అధ్యయనం చేస్తోంది. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో 20 రాష్ట్రాల్లోని 222 ప్రాంతాల్లో ఆర్సెనిక్ ప్రభావం అధికంగా ఉన్నట్లు తేలింది. లీటర్ నీటిలో 0.01 నుంచి 0.05 మిల్లీగ్రాముల వరకూ ఆర్సెనిక్ విషమూలాలు ఉన్నాయని సీడబ్ల్యూసీ వెల్లడించింది. పశి్చమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, అసోం, గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు వెల్లడైంది. బోరు బావుల నీటితో అధ్యయనం ఇక ఏపీలో 13 జిల్లాల్లోని వివిధ ప్రాంతాల్లో బోరు బావుల నుంచి నీటిని సేకరించిన సీడబ్ల్యూసీ.. వాటిలో ఆర్సెనిక్ మూలాలపై లోతుగా అధ్యయనం చేసింది. ఆ అధ్యయనంలో వెల్లడైన అంశాలివీ.. ► గుంటూరు రూరల్ మండలం ఎటుకూరులో బోరు బావుల నుంచి సేకరించిన నీటిలో ఒక లీటర్లో 0.01 మిల్లీ గ్రాములు ఉన్నట్లు తేలింది. చేబ్రోలు మండలం వడ్డమూడిలో 0.02 మిల్లీ గ్రాములున్నట్లు వెల్లడైంది. ► అలాగే, నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరాటంపాడులో 0.03 ఉన్నట్లు గుర్తించారు. ► కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రత్న గ్రామంలో 0.02 మీల్లీ గ్రాములు ఉంది. ► ఇక తెలంగాణాలోని పది ఉమ్మడి జిల్లాల్లోనూ సీడబ్ల్యూసీ విస్తృతంగా అధ్యయనం చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చివ్వేముల మండలం కుడాకుడా, సూర్యాపేటలలో సేకరించిన బోరు బావుల నీటిలో లీటర్లో 0.01, 0.02 మిల్లీగ్రాముల ఆర్సినిక్ ఉన్నట్లు గుర్తించారు. ఉపరితల జలాలే సురక్షితం కాగా, ఆర్సెనిక్ మూలాలు బహిర్గతమైన ప్రాంతాల్లో భూగర్భ జలాలను తాగడానికి, పంటల సాగుకు వినియోగించవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీడబ్ల్యూసీ సూచించింది. ఆ ప్రాంతాల్లో పంటల సాగుకు ఉపరితల, నదీ జలాలను సరఫరా చేయాలని కోరింది. భూగర్భ జలాలను పెంపొందించే చర్యలను చేపట్టడం ద్వారా జలమట్టాన్ని పెంచవచ్చునని.. తద్వారా ఆర్సెనిక్ ప్రభావాన్ని తగ్గించవచ్చునని తెలిపింది. -
దేశంలో విషతుల్యంగా భూగర్భ జలాలు
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం భూభాగంలోని 20 శాతం భూగర్భజలాలు ప్రమాదకర స్థాయిలో ఆర్సెనిక్ కలిగి ఉండి, విషతుల్యంగా మారాయని, నీటిలోని ఈ విషతుల్యమైన పదార్థం దేశవ్యాప్తంగా 25 కోట్ల మంది ప్రజలపై ప్రభావం చూపిస్తుందని ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సర్వే లో వెల్లడయ్యింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఆర్సెనిక్ నమూనాలు ప్రస్తుత సర్వేలో తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు గతంలో ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు జరిపిన అధ్యయనాలు సైతం వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఆర్సెనిక్ స్థాయిని అంచనా వేసేందుకు మరింత విస్తృతమైన పరిశోధనల అవసరాన్ని సైన్స్ ఆఫ్ ది టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధన నొక్కి చెపుతోంది. రక్షిత నీటినే తాగుతున్నామా? దేశవ్యాప్తంగా ప్రజలు తాగుతోన్న నీటిలో అత్యధికంగా 80 శాతం భూగర్భ జలాలే. అత్యధిక జనాభా తాగునీటి కోసం ఆధారపడిన భూగర్భ జలాలు సురక్షితమైనవేనా? అనే విషయంలో అనేక అధ్యయనాలు గతం నుంచి జరుగుతున్నాయి. దేశంలోని 20 శాతం భూభాగంలోని భూగర్భ జలాలు అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్తో నిండి వున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఆర్సెనిక్ అత్యంత విషపూరితమైనది. తాగు నీరు, ఆహారం ద్వారా ఆర్సెనిక్‌ని తీసుకోవడం వల్ల దీర్ఘకాలంలో క్యాన్సర్‌లాంటి ప్రాణాంతక వ్యాధులకు గురికావడం, లేదా తీవ్రమైన చర్మసంబంధిత సమస్యలు ఉత్పన్నం అవుతాయి. నదీపరివాహక ప్రాంతాల్లో ఎక్కువ.. గంగా–సింధు, బ్రహ్మపుత్రా నదీ పరివాహక ప్రాంతాల్లోనూ, భారతదేశంలోని కొన్ని ద్వీపకల్ప ప్రాంతాల్లోని భూగర్భ జలాల్లో ఈ అత్యంత విషతుల్యమైన ఆర్సెనిక్ అత్యధిక స్థాయిలో ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ‘‘దేశంలోని 250 మిలియన్ల మంది ప్రజలు భూగర్భ జలాల్లో నిక్షిప్తమైన ఉన్న విషతుల్య పదార్థం ఆర్సెనిక్ ప్రభావానికి గురవుతున్నట్టు అంచనా వేశాం’’అని పశ్చిమబెంగాల్లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఖరగ్‌పూర్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ అభిజిత్ ముఖర్జీ చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిలో.. అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పద్ధతిని ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. జియోలాజికల్, హైడ్రోజియోలాజిక్, ఆంతోపోజెనిక్ ప్రమాణాలను బట్టి లీటరు భూగర్భజలంలో పది మైక్రోగ్రాముల ఆర్సెనిక్ ఉండొచ్చు. అయితే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఆ స్థాయిని మించి భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ఉన్నట్టు ఈ అధ్యయనం తేల్చింది. భూగర్భజలాల్లో తీవ్రస్థాయిలో ఉన్న ఆర్సెనిక్ పరిణామాన్ని అంచనా వేయడానికి తీసుకున్న శాంపిల్స్ ఇంకా సరైన స్థాయిలో లేవని సహ రచయిత సౌమ్యాజిత్ సర్కార్, మధుమిత చక్రవర్తి సహా అధ్యయనవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత అధ్యయనం ఆర్సెనిక్ తీవ్రతని చాలా తక్కువగానే అంచనా వేసినట్టు వారు అభిప్రాయపడుతున్నారు. సురక్షిత తాగునీరే లక్ష్యం.. ఈ అధ్యయనంలో రాండమ్ ఫారెస్ట్ అనే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగించామని, ఇది భూగర్భ జలాల్లోని ఆర్సెనిక్ ని అంచనావేయడంలో సమర్థంగా పనిచేస్తుందని గత పరిశోధనల్లో వెల్లడయ్యింది అని ముఖర్జీ తెలిపారు. ప్రభుత్వ జల్‌జీవన్ మిషన్‌లోని, 27 లక్షల క్షేత్రస్థాయి ప్రమాణాల ఆధారంగా ఆర్సెనిక్‌ని అంచనావేశారని, ఈ అధ్యయనం ఫలితాలు సురక్షిత మంచినీటిని ఇంటింటికీ అందిచేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నట్టు తెలిపారు. ఆర్సెనిక్ ప్రభావం భారత్‌పై అధికం ఆర్సెనిక్ కారణంగా తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో భారతదేశం ఒకటని అధ్యయనవేత్తలు తేల్చి చెప్పారు. పశ్చిమబెంగాల్, అస్సాం, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లోని భూగర్భ జలాల్లో విష తుల్యమైన ఆర్సెనిక్ ప్రమాదకర స్థాయిలో ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. భారత దేశంలో 80 శాతం తాగునీరు భూగర్భజలాలపై ఆధారపడినదే. దేశంలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ తాగునీటి కోసం భూగర్భ జలాలపై ఆధారపడి జీవిస్తోన్న 9 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఆర్సెనిక్ వల్ల ప్రమాదంలో పడినట్టు గతంలో జరిపిన అధ్యయనాల్లో వెల్లడయ్యింది. దేశవ్యాప్తంగా భూగర్భ జలాల్లో ఆర్సెనిక్ ప్రభావాన్ని అంచనా వేసేందుకు అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనాల్లో ఎక్కువ భాగం స్థానికంగా, క్షేత్రస్థాయి లో జరిగినవే. ఇందులో అత్యధికంగా గంగా పరీవాహక ప్రాంతాల్లో జరిగాయి. అయితే ఇవేవీ దేశంలోని ఇతర ప్రాంతాలకు వర్తించవు. -
పట్టణాల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో జల, వాయు కాలుష్య నివారణకు పురపాలక శాఖ ఉపక్రమిస్తోంది. పట్టణ స్థానిక సంస్థల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ (మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణ) ప్లాంట్లు పెద్ద సంఖ్యలో నెలకొల్పాలని నిర్ణయించింది. ఈ వ్యర్థాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉండటంతో దేశంలో జల, వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వ స్వచ్ఛ్ భారత్ మిషన్ నివేదించింది. మరుగుదొడ్డి, సెప్టిక్ ట్యాంక్‌కు సమీపంలోని నీటి వనరుకు మధ్య కనీసం 20 అడుగుల దూరం ఉండాలి. అయితే ప్రస్తుతం సగటున 4 అడుగుల దూరం మాత్రమే ఉంటోందని నివేదిక పేర్కొంది. దాంతో భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని వెల్లడించింది. నిర్దేశిత సమయంలో సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా జల, వాయు కాలుష్యాలు పెరుగుతూ ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. భవిష్యత్ అవసరాలు పరిగణనలోకి.. బహిరంగ మల విసర్జనను అరికట్టడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఏర్పాటు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. మరోవైపు మన రాష్ట్రంలో ‘అందరికీ ఇళ్లు’పథకం కింద ‘వైఎస్సార్ జగనన్న కాలనీలు’పేరిట 30 లక్షల ఇళ్లతో దాదాపు 17వేల ఊళ్లు కొత్తగా నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యుక్తమైంది. ఆయా కాలనీల్లో ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మరుగుదొడ్డి నిర్మించేలా డిజైన్‌ను ఖరారు చేశారు. ఇంత పెద్ద సంఖ్యలో కొత్తగా మరుగుదొడ్లు నిర్మించనుండటంతో మరుగుదొడ్ల వ్యర్థాల నిర్వహణకు సరైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం మరింతగా పెరగనుంది. ఈ సమస్యకు పరిష్కారంగా సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటుకు పురపాలక శాఖ కార్యాచరణ రూపొందించింది. భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ ద్వారా మూడు దశల్లో సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నెలకొల్పాలని నిర్ణయించారు. మేలో తొలిదశ ప్రారంభం ► సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను నగర, పట్టణ శివారులోని సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు తరలిస్తారు. అక్కడ వ్యర్థాలను తగిన రీతిలో నిర్వహించిన తరువాత ఎరువు తయారవుతుంది. వాటిని నర్సరీలు, పొలాలకు సరఫరా చేస్తారు. మిగిలిన వ్యర్థాలను కాలుష్య కారకం కాని రీతిలో డిస్పోజ్ చేస్తారు. ► మొదటి దశ సెప్టేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల నిర్మాణాన్ని వచ్చే మేలో మొదలు పెట్టి వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని స్వచ్ఛ్ ఏపీ కార్పొరేషన్ భావిస్తోంది. ఆ తర్వాత రెండు, మూడు దశల పనులు చేపడతారు. తొలుత 32 పట్టణ స్థానిక సంస్థల్లో.. ► మొదటి దశలో అమృత్ పథకం అమలు అవుతున్న 32 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. రెండో దశలో లక్ష నుంచి 5 లక్షల జనాభా ఉన్న మున్సిపాలిటీలు, మూడో దశలో లక్షలోపు జనాభా ఉన్న మున్సిపాలిటీలలో వీటిని ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా మొత్తం 110 పట్టణ స్థానిక సంస్థల్లో వీటిని నెలకొల్పుతారు. ► నగరం, పట్టణం శివారులో ఈ ప్లాంట్లను నెలకొల్పుతారు. అందుకు ఆయా మున్సిపాలిటీలు భూమిని కేటాయిస్తాయి. జనాభా ప్రాతిపదికన ప్లాంట్ల సామర్థ్యాన్ని నిర్ణయించి ఏర్పాటు చేస్తారు. ► ఒక్కో ట్రీట్మెంట్ ప్లాంట్‌కు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు వ్యయం అవుతుందని భావిస్తున్నారు. వాటితోపాటు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను కొనుగోలు చేస్తారు. ► మరుగుదొడ్ల అవుట్ లెట్లను ఎక్కడా వీధి కాలువలలోకి విడిచిపెట్టకుండా కచ్చితంగా నియంత్రిస్తారు. ► పట్టణాల్లో ప్రతి ఇంటి సెప్టిక్ ట్యాంక్ కనీసం మూడేళ్లకు ఓసారి శుభ్రం చేయాలన్నది లక్ష్యం. ► అందుకోసం ఒక్కో మున్సిపాలిటీకి 5 నుంచి 25 వరకు సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసే వాహనాలతో కూడిన యూనిట్లను సమకూరుస్తారు. -
మూడో పంట పండింది
జనగామ: వరి సాగు ఏడాదికి ఎన్నిసార్లు సాగు చేస్తారని అడిగితే ఎవరైనా రెండు సార్లు అంటూ సమాధానం చెబుతారు. కానీ జనగామ జిల్లా రైతులు మాత్రం మూడుసార్లు సాగు చేస్తామని అంటారు. ఏటా రబీ, వానాకాలం సాగు మధ్యలో కత్తెర పంటను సాగుతో అదనపు ఆదాయం సాధిస్తారు. మూడో పంట (కత్తెర) సాగుకు అనుకూలమైన నేలలు ఉండటంతో రైతులకు కలసి వస్తుంది. ఏప్రిల్ చివరి వారం నుంచి సాగు పనులు మొదలుపెట్టి, ఆగస్టు మొదటి వారంలో కోతలను ప్రారంభిస్తారు. ఈసారి గోదావరి జలాల పరుగులతో పాటు జోరుగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరగడంతో జిల్లాలో సుమారు 30 వేల ఎకరాలకు పైగా కత్తెర పంట సాగు చేయగా, 54 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని అంచనా. కొనుగోళ్లు ప్రారంభం కత్తెర పంటకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్న జనగామ జిల్లాలో ఆగస్టు 24వ తేదీ నుంచి కొనుగోళ్లు ప్రారంభమయ్యా యి. ఎకరాకు 30 బస్తాలకుపైగా దిగుబడి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఇప్పటి వరకు పది వేల బస్తాలకు పైగా ధాన్యం కొనుగోలు చేసినట్లు అంచనా. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కొనుగోళ్లకు అనుమతులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యా పారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటా ధాన్యానికి రూ.1,220 నుంచి రూ.1440 వరకు ధర లభిస్తోంది. -
సమర్థవంతంగా వినియోగించుకోవాలి
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పుల కారణంగా అనేక దేశాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయని, ఉపరితల, భూగర్భ జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (బార్క్) శాస్త్రవేత్త ఉదయ్ కుమార్ సిన్హా సూచిం చారు. బుధవారం జలసౌధలో నీటి వనరుల అభివృద్ధి, నిర్వహణలో ‘ఐసోటోప్’ల వినియోగంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సిన్హా మాట్లాడుతూ నీరు భూమి మీద దొరికే విలువైన వనరన్నారు. రాబోయే కాలంలో నీటి సంక్షోభం తీవ్రంగా ఉండబోతున్నదని, పారిశ్రామికీకరణతో భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నివారణా చర్యలు సూచించడానికి బార్క్ దేశవ్యాప్తంగా ‘ఐసోటోప్’టెక్నాలజీని వినియోగి స్తోందన్నారు. దీని ద్వారా భూగర్భ జలాల రీచార్జి మూలాలను అన్వేషించవచ్చునని, నీటి ఊటలను, ఉపరితల, భూగర్భ జలాల మధ్య అంతర్గత మార్గాలను తెలుసుకోవచ్చని వివరించారు. వాటి కాలుష్య కారకాలను గుర్తించడంతోపాటుగా కాలువలు, సొరంగాలు, జలాశయాలు, డ్యాములు సంభవించే సీపేజ్ను తెలుసుకోవచ్చునని, జలాశయాల్లోకి, చెరువుల్లోకి వచ్చే పూడిక మట్టి పరిమాణాన్ని అంచనా వేయొచ్చునని స్పష్టం చేశారు. గతంలో తెలం గాణలోని నల్లగొండ జిల్లాలో కూడా ధన్ ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు పూడిక మట్టి తీసిన,తీయని చెరువుల్లో, భూగర్భ జలాల రీచార్జి స్థితిని తులనాత్మకంగా అధ్యయనం చేశామని గుర్తు చేశారు. పూడిక మట్టి తీసిన చోట భూగర్భ జలాల మట్టం బాగా పెరిగినట్టు తేలిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోరితే ఉచితంగానే పరిశోధనలు నిర్వహించి నివారణా చర్యలు సూచిస్తామని అన్నారు. కొత్త సాంకేతిక పద్దతిపై తమకు అవగాహన కల్పించిన సిన్హాను ప్రభుత్వ సలహాదారు ఎస్కే జోషి అభినందించారు. -
కాల్చేస్తే ఖతం.. కుళ్లిపోతే విషం!
సాక్షి, అమరావతి: చెత్తాచెదారం కుళ్లిపోతే ఎరువుగా మారుతుంది. ఇది భూమికి లాభం చేకూరుస్తుంది. అదే మనుషులకొచ్చే జబ్బులను నయం చేసే మందులు కుళ్లిపోతే విషమవుతాయి. ఇవి భూమిని విషతుల్యంగా మారుస్తాయి. భూగర్భ జలాలు కలుషితమై కొత్త జబ్బులొస్తాయి..ప్రస్తుతం రాష్ట్రంలో ఇదే జరుగుతోంది. అత్యధిక ఉష్ణోగ్రతల మధ్య (100–200 డిగ్రీల సెల్సియస్‌ల మధ్య) కాలి్చవేయాల్సిన మందులు..మున్సిపాలిటీ డంపింగ్ యార్డుల్లో కుళ్లిపోతుండడంతో ప్రమాదం ముంచుకొస్తోంది. కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. కాలం చెల్లిన మందులతోనే తీవ్ర సమస్యలు మందుల షాపుల యాజమాన్యాలు కాలం చెల్లిన మందులను చెత్త డబ్బాల్లో వేసి కొత్త సమస్యలకు తెరతీస్తున్నారు. వీటితో పాటు పలు ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో సీవరేజీ ట్రీట్మెంటు ప్లాంట్లు లేకపోవడం వల్ల బయో ద్రవ వ్యర్థాలు (బయో లిక్విడ్ వేస్ట్) మురికి కాలువల్లో కలుస్తున్నాయి. దీనివల్ల కూడా భయంకరమైన జబ్బులు వస్తున్నాయి. దీనిపై సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) ఇటీవలే తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితులు ఏ మాత్రం ఉపేక్షించతగ్గవి కావని, దీనిపై ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అన్నిటికీ మించి కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ మందులు కుళ్లిపోయి తీవ్ర ముప్పును తెస్తున్నట్టు సీపీసీబీ పేర్కొంది. మందులు కుళ్లిపోతే వచ్చే నష్టాలు... ►కాలం చెల్లిన యాంటీబయోటిక్స్ కుళ్లిపోవడం వల్ల కొత్తరకం బాక్టీరియా పుట్టుకొస్తోంది. ఈ బాక్టీరియా వల్ల జబ్బులు సోకితే అత్యంత సామర్థ్యం కలిగిన యాంటీబయోటిక్స్ వాడినా తగ్గే అవకాశం ఉండదు. ►చెత్త కుప్పల్లో మందులు కుళ్లిపోతే వాయు కాలుష్యం తీవ్రమవుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందే జబ్బుల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ►భూగర్భ జలాలు విషతుల్యమవుతున్నాయి ►ఈ జలాలు తాగడం వల్ల మూత్రపిండాలు, కాలేయ సమస్యలు, హెపటైటిస్ బి వంటి జబ్బులు వస్తున్నాయి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏం చెబుతోంది పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం మందులను బయట పడేయకూడదు. వాటిని విధిగా బయోవ్యర్థాల నిర్వహణ సంస్థలకే అప్పజెప్పాలి. పర్యావరణానికి ఎలాంటి హాని లేకుండా వీటిని క్లోజ్డ్ డిగ్రేడబుల్ హౌస్ (నాలుగు గోడల మధ్య ఉన్న బయోవ్యర్థాల ప్లాంటు)లో కాలి్చవేయాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే హక్కు, జరిమానాలు విధించే అధికారం ఆయా రాష్ట్రాల కాలుష్య నియంత్రణ మండళ్లకు ఉంది. కేరళలో ‘ప్రౌడ్’ ప్రాజెక్టు వినియోగించని మందుల నిర్వీర్యంపై కేరళ అద్భుతమైన చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రౌడ్ (ప్రోగ్రాం ఆన్ రిమూవల్ ఆఫ్ అన్యూజ్డ్ డ్రగ్స్)ను ప్రారంభించింది. కేరళ డ్రగ్ కంట్రోల్ అథారిటీ, కేరళ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పనికిరాని, కాలం చెల్లిన మందుల నిరీ్వర్యం చేయడంలో ముందంజ వేశాయి. ఒక్క మాత్ర కూడా మున్సిపాలిటీ డబ్బాల్లోకి వెళ్లకుండా చేయగలుగుతున్నాయి. తిరువనంతపురంలో మొదలైన ఈ పైలెట్ ప్రాజెక్టును రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని కేరళ యోచిస్తోంది. రాష్ట్రంలో ఫార్మసీ సంస్థల వివరాలు ఇలా ►మాన్యుఫాక్చరింగ్ లైసెన్సులు 258 ►రిటైల్ అండ్ హోల్‌సేల్ ►మెడికల్ స్టోర్లు 33,039 ►బయోవ్యర్థాల నిర్వహణ ప్లాంట్లు 12 ►2018–19లో నిబంధనల ఉల్లంఘనలు 6,385 ►సీజ్చేసిన షాపుల సంఖ్య 66 అగ్రిమెంటు లేకుంటే లైసెన్సులు రద్దు చేస్తాం మందుల షాపులు గానీ, సీ అండ్ ఎఫ్ (క్యారీ ఫార్వర్డ్ ఏజెన్సీలు)లు గానీ కాలం చెల్లిన మందులను చెత్త బుట్టల్లో వేయడానికి వీల్లేదు. కచి్చతంగా బయోవ్యర్థాల ప్లాంట్లకు పంపించాల్సిందే. సీ అండ్ ఎఫ్ ఏజెన్సీలు బయోవ్యర్థాల నిర్వాహకులతో అవగాహన ఒప్పందం చేసుకోకపోతే లైసెన్సులు రద్దు చేస్తామని చెప్పాం. మందులు మున్సిపాలిటీ చెత్త డబ్బాల్లో వేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలో నిఘా పెంచాం. – ఎంబీఆర్ ప్రసాద్, సంచాలకులు, ఔషధనియంత్రణ మండలి ఈ చట్టం ఆస్పత్రులకు మాత్రమే వర్తిస్తోంది ఎన్వీరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కేవలం ఆస్పత్రుల బయోవ్యర్థాల నిర్వీర్యం కోసం మాత్రమే ఉపయోగపడుతోంది. ఇప్పటివరకూ మెడికల్‌షాపులు లేదా మాన్యుఫాక్చరింగ్ సంస్థలు మందులను నిబంధనలకు విరుద్ధంగా పారబోస్తే వాటిపై చర్యలు తీసుకుని, జరిమానాలు విధించిన దాఖలాలు కనిపించలేదు. – ఎ.విజయభాస్కర్‌రెడ్డి, ఫార్మసీ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు -
వందేళ్ల క్రితమే ఒడిసిపట్టారు
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: మండువా లోగిలి మధ్య ధ్వజ స్తంభంలా పక్క ఫొటోలోని ఈ ఇత్తడి గొట్టం అమరికను డోలియా అంటారు. పూర్వం వర్షం నీటిని ఒడిసి పట్టి.. దానిని ఓ చోటకు చేర్చి మంచినీటిగా మార్చే ప్రక్రియ కోసం దీనిని వినియోగించేవారు. 130 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ డోలియా తూర్పు గోదావరి జిల్లా రాయవరంలోని వెంకటేశ్వరస్వామి ఆలయం సెంటర్లోని మండువాలో నేటికీ చెక్కు చెదరకుండా సేవలందిస్తోంది. అందులో ఎనిమిది పదుల వయసు దాటిన సాలిగ్రామం నరసింహారావు, ఆయన భార్య అలివేలుమంగ ఉంటున్నారు. ఆ దంపతుల్ని ‘సాక్షి’ పలకరించింది. మండువా విశేషాలు, డోలియా ప్రత్యేకతలను అడిగి తెలుసుకుంది. తాతల కాలంలో నిర్మించారు అప్పట్లోనే ఎంఏ ఇంగ్లిష్ చదివిన ఇంటి యజమాని నరసింహారావు మాట్లాడుతూ.. ‘మండువా లోగిలిపై పడే ప్రతి నీటి బొట్టు వృథా కాకూడదన్న ఉద్దేశ్యంతో డోలియా పెట్టించారు. మా తాత నరసయ్య ఎంతో ఇష్టపడి కట్టించిన మండువాను, అందులోని డోలియాను కాపాడుకుంటూ వస్తున్నాం. అప్పట్లో ఇత్తడి లేదా రాగితో ఇలాంటివి ఏర్పాటు చేసేవారు. ఇంటి కప్పుపై కురిసే వర్షం నీరంతా డోలియా గొట్టం ద్వారా ఇంటి అడుగు భాగంలో నిర్మించిన రాతి ట్యాంక్‌లోకి చేరేది. అప్పట్లో ఇలా నిల్వ చేసిన నీటినే తాగేవాళ్లం. అలాగని అప్పుడు నీటి కొరత లేదు. అప్పట్లో వర్షం నీరంటే ఎలాంటి కాలుష్యం లేనిది. రాగి లేదా ఇత్తడి తొడుగు ద్వారా ఒడిసి పట్టడం వల్ల అందులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే నశించేది. ఆ నీటిని తాగితే ఆరోగ్యం చేకూరుతుందని గట్టి నమ్మకం. డోలియా ద్వారా వచ్చిన నీరు ఇంటిల్లిపాదికీ వారం, పది రోజులు సరిపోయేది. అది అయిపోయాక చెరువు నీళ్లు తెచ్చుకునే వాళ్లం. వర్షం నీటిని ప్రకృతి వర ప్రసాదంగా భావించేవారు. నీటిని నిల్వ చేసుకునేందుకు, భూగర్భ జలాలను పెంచేందుకు, వినియోగం తరువాత మిగిలిన నీటిని డ్రెయిన్లలోకి పంపించేందుకు మండువా లోగిళ్లలో కనిపించే ప్రత్యేక ఏర్పాట్లు నాటి జీవన శైలికి సాక్ష్యాలు. ప్రతి లోగిలిలో 10 నుంచి 12 కుటుంబాలు నివసించేవి. మండువా చుట్టూ గదులు, వసారాలు, కొట్టు గదులు ఉండేవి. కొన్నింటిలో అయితే మేడలు (డూప్లెక్స్ ఇళ్లు) కూడా ఉండేవి. మా మనుమలు, ముని మనుమలు సెలవులకు వచ్చినప్పుడల్లా ఈ మండువాను, డోలియాను తీసేద్దామనేవారు. ఏది చేయాలన్నా నన్ను ఇంటి నుంచి బయటకు పంపేశాక చేసుకోండని గట్టిగా చెప్పడంతో దాని గురించి మాట్లాడటం మానేశారు’ అని వివరించారు. కాపాడాల్సిన బాధ్యత మాదే నరసింహారావు సతీమణి అలివేలు మంగ మాట్లాడుతూ.. ‘మా మావయ్య గారి తండ్రి 130 ఏళ్ల క్రితం ఎంతో ఇష్టపడి కట్టించిన ఇల్లు ఇది. డోలియాను ఇప్పుడు వాడటం లేదు కానీ.. ఒకప్పుడు చాలా ఉపయోగపడేది. అందుకే దీనిని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాం. రెండు, మూడేళ్లకు ఒకసారి మెరుగు పెట్టించి కాపాడుకుంటున్నాం. పిడుగులు పడినప్పుడు డోలియా ఉండటం వల్ల ఇంట్లో వారెవరికీ ప్రమాదం ఉండదు’ అని చెప్పారు. మండువా అంటే.. మండువా లోగిలి అంటే.. పురాతనమైన సంప్రదాయక పెంకుటిల్లు. చుట్టూ నలువైపులా గదులుంటాయి. కనీసం 10 కుటుంబాలు నివాసం ఉండేలా.. పెద్ద విస్తీర్ణంలో దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారంలో నిర్మాణం ఉండేది. నాలుగు వైపులా ఒక దానిని ఆనుకుని మరొకటి చొప్పున 10 నుంచి 12 వాటాలు (పోర్షన్లు) ఉండేవి. ప్రతి వాటాలో వంట గది, విశ్రాంతి గది, పడక గది, పెరటి దొడ్డి ఉండేవి. ఒక్కొక్క పోర్షన్లో 8 నుంచి 10 గుమ్మాలను అమర్చేవారు. సింహద్వారం నుంచి పెరటి గుమ్మం వరకు వందకు పైగా గుమ్మాలు ఉండేవి. లోగిలి మధ్యలో కల్యాణ మండపం ఉండేది. ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా రావడానికి ఇంటి మధ్య హాలు భాగంలో పైకప్పు లేకుండా నిర్మాణం చేసేవారు. వాన నీరు హాలులో మధ్యలో పడటానికి వీలుగా ఒక గుంట, ఆ గుంటలోంచి నీరు బయటకు పోవడానికి డ్రెయినేజీ పైపు ఉంటాయి. వర్షం వస్తున్నప్పుడు నీటి కోసం బయటకు వెళ్లే అవసరం లేకుండా ఇంట్లోని బిందెలు, పాత్రలలో నింపుకుని అవసరానికి ఉపయోగించుకునేవారు. మండువా చుట్టూ ప్రహరీ గోడ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరూ ఖాళీ సమయంలో ఈ మండువా లోగిలిలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడిపేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఉమ్మడి కుటుంబాల మమతల కోవెళ్లుగా మండువా లోగిళ్లు వెలుగొందేవి. అలనాటి నిర్మాణాలకు ప్రతీక కె.గంగవరం మండలం కూళ్ల గ్రామంలో చిట్టూరి వంశీయులు నిర్మించిన మండువా లోగిలి అలనాటి నిర్మాణాలకు ప్రతీకగా రాజసాన్ని చాటుతోంది. ఇక్కడ 1830లో చిట్టూరి గోపాలయ్య నిర్మించిన ఈ మండువా లోగిలో మూడు తరాల వారు నివాసం సాగించారు. గోదావరి ఏటుగట్టుని అనుకుని ఉన్న ఈ గ్రామం తరచూ గోదావరి వరద ముంపునకు గురయ్యేది. ఈ దృష్ట్యా ఏటిగట్టుకు కిలోమీటరు దూరంలో ముంపు బారిన పడకుండా రెండెకరాల విస్తీర్ణంలో 10 కుటుంబాలకు చెందిన 50 మంది ఉండేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 189 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లోగిలిలో అన్ని సదుపాయాలను శాస్త్రానికి, వాస్తుకు అనుకూలంగా నిర్మించారు. ఇందులో 114 గుమ్మాలతో నిర్మించిన ప్రతి గది ఆధునిక హంగులను ప్రతింబిస్తుంటుంది. లోగిలి మధ్యలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపం విశేషంగా అకట్టుకుంటుంది. చిట్టూరి వంశంలో మూడో తరానికి చెందిన పార్థసారథి ఈ మండువాను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడక్కడా ఇంకా ఉన్నాయ్ తూర్పు గోదావరి జిల్లాలోని కె.గంగవరం మండలం కూళ్ల, ఉప్పలగుప్తం, సన్నవిల్లి, భీమనపల్లి, నంగవరం, గోడి, కూనవరం, పోతుకుర్రు, లక్కవరం, తూర్పుపాలెం, బట్టేల్లంక, కేశనపల్లి, గుడిమెళ్లంక, మోరిపోడు, గుడిమూల, సఖినేటిపల్లి, వీరవల్లిపాలెం, టేకి, పామర్రు గ్రామాల్లో మండువా ఇళ్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మత్స్యపురి, శివదేవుని చిక్కాల, వీరవాసరం, మల్లవరం, పోడూరు, కుమారదేవం, ఇలపర్రు, బూరుగుపల్లి, చించినాడ, తణుకు, భీమవరం, ఉండి, ఆకివీడు తదితర ప్రాంతాల్లో మండువాలు, డోలియాలను భద్రంగా చూసుకుంటున్నారు. - చిట్టూరి పార్థసారథి -
కరువు తీరా వర్షధార
అనంతపురం అగ్రికల్చర్ : అనంతపురం జిల్లా రైతులను ఈసారి వరుణుడు కరుణించాడు. కీలకమైన ఖరీఫ్‌లో ముఖం చాటేసినా.. సెప్టెంబర్, అక్టోబర్‌లో కరుణించాడు. ఫలితంగా జిల్లాలోనే పెద్దదైన శింగనమల చెరువుకు భారీగా నీరు చేరింది. ఇక 15 ఏళ్లుగా ఎండిపోయిన కంబదూరు చెరువు జలకళను సంతరించుకుంది. పరిగి, నార్పల, గుమ్మఘట్ట చెరువుల్లోకి నీరు చేరగా సమీప ప్రాంతాల్లోని భూగర్భ జలమట్టం భారీగా పెరిగింది. నిజానికి నైరుతి రుతుపవనాలు జూన్ 22న జిల్లాలోకి ప్రవేశించినా.. అనుకున్న మేర వర్షాలు కురవలేదు. గతేడాది కూడా 552.3 మి.మీ గానూ సాధారణం కన్నా 40.6 శాతం తక్కువగా 327 మి.మీ వర్షపాతం నమోదైంది. వందేళ్ల చరిత్ర తీసుకుంటే.. 40 శాతం లోటు ఎప్పుడూ నమోదు కాలేదు. దీంతో భూగర్భ జలాలు రోజురోజుకూ అడుగంటిపోయాయి. జిల్లాలోని 63 మండలాల్లో 50కి పైగా మండలాలు డేంజర్ జోన్లోకి చేరాయి. మే నెలలో భూగర్భ జలమట్టం సగటున 25.96 మీటర్లకు పడిపోయింది. ఆగస్టు 14 నాటికి అది 27.75 మీటర్లకు క్షీణించడంతో సమస్య జఠిలంగా మారింది. ఇది జిల్లా చరిత్రలోనే అత్యంత కనిష్టస్థాయి. 2.45 లక్షల బోరుబావుల్లో కేవలం 1.20 లక్షలు మాత్రమే పనిచేశాయి. ఖరీఫ్‌లో వేసిన 6.10 లక్షల హెక్టార్ల వర్షాధార పంటలు, 2 లక్షల హెక్టార్లలో విస్తరించిన ఉద్యాన తోటలు, 40 వేల ఎకరాల్లో ఉన్న మల్బరీ తోటలు, 10 లక్షల సంఖ్యలో ఉన్న పశుసంపద, 48 లక్షల సంఖ్యలో ఉన్న జీవసంపద మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. రెండు నెలల్లో 352 మి.మీ వర్షం ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో వరుణుడు విశ్వరూపం చూపించాడు. ఆగస్టు 16 నుంచి వర్షించడం ప్రారంభించాడు. సెప్టెంబర్, అక్టోబర్ నాటికి ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా అంతటా భారీగా వర్షాలు కురిశాయి. ఫలితంగా రెండు నెలల్లోనే రికార్డుస్థాయిలో 352.7 మి.మీ భారీ సగటు వర్షపాతం నమోదైంది. చెరువులు, కుంటలు నిండిపోవడంతో ‘అనంత’కు ఒక్కసారిగా జలకళ వచ్చింది. భూమిలో ఇంకిన 56 టీఎంసీలు భారీ వర్షాలతో సెప్టెంబర్‌లో సాధారణం కన్నా 65 శాతం, అక్టోబర్‌లో 43 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రెండు నెలల వ్యవధిలో కురిసిన 352.7 మి.మీ వర్షానికి కుంటలు, వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహించాయి. పెద్దపెద్ద చెరువులు సైతం నిండిపోయాయి. దశాబ్దాలుగా నీటి చుక్క పారని నదీ పరీవాహక ప్రాంతాలు నీటితో కళకళలాడాయి. వర్షాధార పంటలు, పాడి, పట్టు, పండ్లతోటలకు ఉపశమనం కలిగింది. 2 నెలల వర్షాలకు 56 టీఎంసీల వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకినట్లు భూగర్భ జలశాఖ నివేదిక చెబుతోంది. జిల్లాలో ఉన్న బోరుబావులకు 50 టీఎంసీల నీళ్లు అవసరం కాగా ఇప్పుడు ఆరు టీఎంల నీళ్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో దాదాపు 70 వేల బోర్లు పూర్తిస్థాయిలో రీచార్జ్ అయ్యాయి. వేలాది ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చాయి. నాడు అనంతపురం జిల్లాను కరువు మేఘాలు కమ్మే శాయి.. ఏటా గంపెడంత ఆశతో వేసే గింజ మొలకెత్తి మూడ్రోజులే మురిపించేది. పదిమందికి అన్నం పెట్టే అన్నదాత చివరికి ఊరుకాని ఊరిలో పరాయి పంచన చేరి కడుపు నింపుకునేవాడు. గ్రాసం, నీరు లేక పశువులూ కటకటలాడేవి. ఇలా, ఒక్కో ఇంట్లో ఒక్కో కన్నీటి వ్యథ కనిపించేది.. వినిపించేది. నేడు కరువు నేలను వరుణుడు ముద్దాడాడు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కరువుతీరా వర్షించి పుడమి తల్లికి జలాభిషేకం చేశాడు. చెరువులు, కుంటలు నింపేశాడు. భూగర్భ జలమట్టం భారీగా పెంచాడు. నిలువునా ఎండుతున్న లక్షల హెక్టార్ల పండ్ల తోటలు పచ్చటి కళ సంతరించుకున్నాయి. తాగు, సాగునీటి సమస్య దాదాపు లేనట్టే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు ‘అనంత’ రూపురేఖలే మారిపోయాయి. ►2018లో లోటు వర్షపాతం 40 % ►ఆగస్టు 14న భూగర్భ నీటిమట్టం27.75మీటర్లు (అత్యంత కనిష్టం) ►సెప్టెంబర్, అక్టోబర్‌లో వర్షపాతం352.7మి.మీ (రికార్డు స్థాయి) ►నవంబర్‌లో భూగర్భ నీటిమట్టం19.70మీటర్లు ►భూమిలోకి ఇంకిన నీరు56 టీఎంసీలు►రీచార్జ్ అయిన బోర్ల సంఖ్య70 వేలు -
కరువు సీమలో ఆనందహేల
అనంతపురం అగ్రికల్చర్: పాతాళ గంగమ్మ పైపైకి పొంగుతుండగా...బీడువారిన పొలాలన్నీ పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. గ్రాసం లభించక కబేళాలకు తరలిన మూగజీవాలు కడుపునిండా పచ్చిగడ్డి మేస్తున్నాయి. వర్షాభావంతో పొట్టచేత పట్టుకుని వలస పోయిన జనాలు తమ భూముల సాగుకు తిరుగుపయనమయ్యారు. ఖరీఫ్ సీజన్లో చాలా ఏళ్ల తరువాత అనంతపురం జల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిండిన చెరువులు... పొంగిన నదులు... ఎప్పుడూ నెర్రలు చీలి కనిపించే పెద్ద చెరువులు తాజా వర్షాలతో పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని వందలాది చెరువులు జలకళను సంతరించుకున్నాయి. వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు నిండి ఉధృతంతా ప్రవహిస్తున్నాయి. పూర్తిగా ఎండిపోయి ఎడారిలా కనిపించిన పెన్నా, చిత్రావతి, కుముద్వతి, వేదవతి, హగరి, జయమంగళి లాంటి నదుల్లోనూ నీళ్లు పారుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారంలో భూగర్భజలాలు 27 మీటర్ల దిగువన కనిష్ట స్థాయిలో ఉండగా అక్టోబర్ మొదటి వారంలో 24 మీటర్లకు ఎగబాకడం విశేషం. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 110.7 మి.మీ కాగా ఇప్పటికే 78.9 మి.మీ నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 552.3 మి.మీ కాగా ఈ ఏడాది అక్టోబరు 7వ తేదీ నాటికే 411.7 మి.మీ. వర్షం నమోదయింది. చాలా సంవత్సరాల తర్వాత జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతుండటంతో అన్నదాత ఇంట ఆనందం వ్యక్తమవుతోంది. లక్ష హెక్టార్లలో సాగుకానున్న పప్పుశనగ భారీ వర్షాలతో ఈ రబీలో పప్పుశనగ కనీసం లక్ష హెక్టార్లలో సాగులోకి వచ్చే పరిస్థితి ఉందని వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే పొలాల్లో నీరు చేరడంతో ఇప్పటికే వేసిన కొన్ని పంటలు దెబ్బతినగా రూ. 20 కోట్ల పంట నష్టం వాటిల్లినట్లు అధికారుల ప్రాథమిక అంచనా. ఒకేరోజు 30.2 మి.మీ వర్షపాతం వరుణుడి ప్రభావంతో అనంతపురం జిల్లా వ్యాప్తంగా 25 రోజులుగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలతో కరువు సీమ కోనసీమలా మారింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 63 మండలాల్లోనూ ఒకే రోజు 30.2 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. గుత్తి, పరిగి, పెద్దవడుగూరు, రొద్దం, హిందూపురం, కళ్యాణదుర్గం, మడకశిర తదితర మండలాల్లో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కిలోమీటర్ల మేర రహదారులు, పదుల సంఖ్యలో కల్వర్టులు దెబ్బతిన్నాయి. రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
కృష్ణా నదిపై కొత్తగా మూడు బ్యారేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన మూడు బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై చోడవరం, గాజులంక, ఓలేరు వద్ద బ్యారేజీల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి రూ. 8.78 కోట్లను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌కు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో డీపీఆర్‌ల కోసం టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి కృష్ణా డెల్టా సీఈ కసరత్తు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై గత నెల 12న సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు చోట్ల డబుల్‌లేన్ బ్రిడ్జిలు, ఒక బ్యారేజీగానీ లేదా మూడు చోట్ల బ్యారేజీలుగానీ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. వీటిపై సీఎం జగన్ స్పందిస్తూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి మూడు చోట్ల బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బ్యారేజీలు నిర్మిస్తే సముద్రపు నీరు కృష్ణా నదిలోకి ఎగదన్నదని.. దీని వల్ల డెల్టాను చౌడు బారిన పడకుండా రక్షించవచ్చునని.. భూగర్భజలాలు పెంపొందించడమే కాకుండా కలుషితం కాకుండా చూడవచ్చన్నారు. ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ.ల దిగువన కృష్ణా జిల్లా చోడవరం వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 2.70 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,210 కోట్లు నిండుగా కృష్ణమ్మ.. భద్రాచలం దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి నది ఎప్పుడూ నిండుగా కన్పిస్తుంది. అదే తరహాలో పులిచింతల నుంచి సముద్రంలో కలిసే వరకూ కొత్తగా నిర్మించే బ్యారేజీలతో కృష్ణా నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సాగు, తాగునీటి అవసరాలు, పర్యాటక రంగంతో పాటు జలరవాణాకూ ఊతమిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 45 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా గాజుల్లంక వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 4.47 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,275 కోట్లు ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 60 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా ఓలేరు వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 3.25 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,350 కోట్లు కృష్ణా వరద ప్రవాహాన్ని ఈ మూడు బ్యారేజీల నుంచి కాలువల ద్వారా మళ్లించి ఆయకట్టుకు నీటిని అందివచ్చు. తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. -
ట‘మోత’ తగ్గట్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టమాటా ధరలు మోత మోగిస్తున్నాయి. వర్షాకాలంలోనూ ఏ మాత్రం దిగిరావడం లేదు. వర్షాభావ పరిస్థితులు, భూగర్భ జలాల్లో భారీ క్షీణత, బోర్ల కింద సాగు చతికిలబడటంతో జూలై నెలలో సాధారణంగా తగ్గాల్సిన ధరలు తగ్గడం లేదు. గతేడాది ఇదే నెలలో గరిష్టంగా కిలో రూ.30 నుంచి రూ.35 పలికిన ధర ఈ ఏడాది రూ.50కి పైనే పలుకుతోంది. రాష్ట్ర పరిధిలో సాగు పూర్తిగా పడిపోవడం, పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడటంతో ధరలు ఏ మాత్రం దిగిరానంటున్నాయి. నిజానికి రాష్ట్రంలో టమాటా సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు మించి ఉండదు. నిజామాబాద్, వికారాబాద్, గజ్వేల్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో టమాటా సాగు జరుగుతున్నా ఈ ఏడాది అది పూర్తిగా చతికిలబడింది. ఈ జిల్లాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. ఈ జిల్లాలో సరాసరి మట్టాలు 10 మీటర్ల నుంచి 14 మీటర్ల వరకు తగ్గాయి. దీంతో బోర్ల కింద టమాటా సాగు పూర్తిగా తగ్గింది. సాగు చేసిన పంటల్లోనూ దిగుబడి తగ్గింది. రాష్ట్రం నుంచి వస్తున్న టమాటా కనీసం 10 శాతం అవసరాలను కూడా తీర్చలేకపోతోంది. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే టమాటాపైనే ఆధారపడాల్సి వస్తోంది. దిగుమతులు తగ్గడంతో: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లి, కర్ణాటకలోని కొలార్, చిక్‌మంగళూర్, చింతమణిల నుంచి దిగుమతి అయ్యే టమాటాలపై రాష్ట్రం ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుండగా, ప్రస్తుతం అక్కడి నుంచి దిగుమతులు కూడా తగ్గాయి. ముఖ్యంగా మదనపల్లిలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గింది. వస్తున్న కొద్దిపాటి టమాటా కూడా తమిళనాడుకు ఎక్కువగా సరఫరా అవుతుండటంతో రాష్ట్రంపై ప్రభావం చూపుతోంది. గతేడాది జూలై 23న 3 వేల క్వింటాళ్లు, 21న 3,095 క్వింటాళ్లు, 21న 3,490 క్వింటాళ్లు మేర బోయిన్పల్లి మార్కెట్‌కు పొరుగు రాష్ట్రాల నుంచి టమాటా రాగా ఈ ఏడాది 23న 2,664 క్వింటాళ్లు, 22న 2,239 క్వింటాళ్లు, 21న 1,800 క్వింటాళ్ల మేర సరఫరా అయినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1,200 క్వింటాళ్ల మేర ఒక్క బోయిన్పల్లి మా ర్కెట్‌కే సరఫరా తగ్గింది. దీంతో జూలైలో తగ్గాల్సిన ధర ఏమాత్రం తగ్గనంటోంది. ఈ పరిస్థితుల్లో మహా రాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల నుంచి దిగుమతులు పెరగాల్సిన అవసరముంది. దీనికి తోడు ఇప్పు డిప్పుడే పుంజుకుంటున్న వర్షాలతో దిగుబడులు పెరిగితే ధర దిగి వచ్చే అవకాశముంది. లేని పక్షంలో సామాన్యుడికి ట‘మోత’తప్పేలాలేదు. ఇతర కూరగాయలు కిలో రూ.50 పైనే.. టమాటాతో పాటు క్యారెట్, క్యాప్సికం, క్యాలీఫ్లవర్, కాకర, బీన్స్, బీరకాయ ధరలు ఏ మాత్రం దిగిరావడం లేదు. వీటన్నింటి ధరలు కిలో రూ. 50కి పైనే పలుకుతున్నా యి. తమిళనాడు, కర్ణాటక, గుజరాత్ నుంచి దిగుమతులు లేకపోవడంతో క్యాప్సికం ధర రూ.60కి పైనే ఉంది. క్యారెట్ సైతం రూ.70 వరకు ఉంది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్, మహారాష్ట్ర నుంచి రావాల్సిన కాకర దిగుమతులు తగ్గడంతో దీని ధర కిలో రూ.50 నుంచి రూ.60కి మధ్యలో ఉంది. -
సిటీకి దూపైతాంది
సాక్షి, హైదరాబాద్: చినుకుల సీజన్లోనూ గ్రేటర్లో భూగర్భజలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు చాలినన్ని లేకపోవడం, విచక్షణారహితంగా బోరు బావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ పైకి రావడంలేదు. ఈ జూన్ భూగర్భ జలమట్టాలను గతేడాది జూన్‌తో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 1 నుంచి 3 మీటర్ల మేర తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నగరం సరాసరి భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తే.. గతేడాది 20.53 మీటర్ల లోతున భూగర్భజలాలు కనిపించగా, ప్రస్తుతం 22.53 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. కాగా శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీట్ మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భ జలాల వినియోగం రెట్టింపవుతోంది. -
శ్రీసూర్యనారాయణా..కూల్ కూల్!
సాక్షి, హైదరాబాద్: మునుపెన్నడూ లేనంతగా.. ఈసారి సూర్యనారాయణుడు రౌద్రరూపాన్ని చూపిస్తున్నాడు. భగభగా మండుతూ.. రాష్ట్రంలో జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. దీంతో మండుతున్న ఎండలు.. తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా రాష్ట్రంలో దాదాపు 80 శాతం కరువుఛాయలు కనిపిస్తున్నాయని.. భూగర్భజల మట్టం దారుణంగా పడిపోయిందని ప్రభుత్వ గణాంకాలే చెపుతున్నాయి. రాష్ట్రంలోని 27 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు కావడంతో ఈ నెలాఖరుకు భూగర్భజలాలు మరింత తగ్గిపోయి రాష్ట్రంలో సగటున 15 మీటర్ల లోతుకు వెళతాయని అంచనా. ఠారెత్తిస్తున్న ఎండలతో సాగు, తాగునీటి అవసరాలు తీర్చే ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆవిరైపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. భూగర్భజలాలు తగ్గిపోతుండడంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో గ్రామాల్లో కూడా తాగునీటికి ఇబ్బందులు తప్పడంలేదు. పశువులకు తగినన్ని నీళ్లు అందుబాటులో లేకపోవడంతో పాలదిగుబడి తగ్గిపోగా, గడ్డిరేటు రెట్టింపైంది. దీంతో వానలు వచ్చే వరకు రాష్ట్రంలో బతుకు వెళ్లదీయడం అత్యంత దుర్భరంగా మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. నీటి సమస్యలు ఒక ఎత్తయితే.. ఈ వేసవిలో భానుడి ప్రతాపానికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే 55 మంది ఎండదెబ్బకు ప్రాణాలు వదలడం గమనార్హం. 28 జిల్లాల్లో పాతాళానికి గంగమ్మ ఎండల తీవ్రత భూగర్భజలాలపై ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోని 33 జిల్లాలకు గానూ.. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్‌లో గంగమ్మ 28 జిల్లాల్లో పాతాళానికి చేరిపోయింది. ముఖ్యంగా మెదక్ జిల్లాలో 25.72 మీటర్ల లోతులోకి భూగర్భజలాలు వెళ్లిపోయాయి. వికారాబాద్‌లో 20.46, సిద్దిపేటలో 20.04, సంగారెడ్డిలో 23.47 మీటర్ల లోతుకెళ్తే గానీ నీటిచుక్క కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాలో మాత్రమే 10 మీటర్లకు పైన నీళ్లున్నాయి. గతేడాదితో పోలిస్తే భద్రాద్రి, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, పెద్దపల్లి జిల్లాల్లో భూగర్భజలాలు పెరిగాయి. అది కూడా ఒక మీటరులోపే. రాష్ట్ర సగటును పరిశీలిస్తే.. గత వేసవిలో ఈ సమయానికి 12.77 మీటర్ల లోతులో నీళ్లుంటే ఇప్పుడు 1.37 మీటర్ల లోతుకు వెళ్లి 14.14 మీటర్లకు చేరాయి. 16% లోటు వర్షపాతం రాష్ట్రంలో జూన్, 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు 16% లోటు వర్షపాతం నమోదైంది. యాదాద్రి జిల్లాలో 42% లోటు కనిపిస్తుండగా, సంగారెడ్డిలో అత్యధికంగా 45% లోటు వర్షపాతం నమోదయింది. మెదక్‌లో కూడా సాధారణంతో పోలిస్తే 41శాతం తక్కువ వర్షం పడింది. రాష్ట్రం మొత్తం మీద సగటు వర్షపాతం 877.31 మిల్లీమీటర్లు కాగా, పడింది కేవలం 737.40 మిల్లీమీటర్లే. సాగర్ నీటిమట్టం ఆందోళనకరం నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ట నిల్వ సామర్థ్యం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 511 అడుగుల నీటి మట్టం ఉంది. ఇందులో మన అవసరాలకు వాడుకునే వీలున్నది 1.2 టీఎంసీలు మాత్రమే. అదే గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 512.90 అడుగుల మేర నీళ్లున్నాయి. అప్పుడు అవసరాలకు వినియోగించుకునే నీళ్లు 3 టీఎంసీలుగా ఉంది. 2017–18లో ప్రాజెక్టు నీటి మట్టం డెడ్‌స్టోరేజి స్థాయికి వెళ్లింది. ఆ ఏడాది మేలో 508 అడుగులకు చేరింది. 505 అడుగులకు చేరే వరకు నీటి వినియోగం జరిగింది. 2016–17లో ఈ సమయానికి 510 అడుగుల కనీస స్థాయిలో నీళ్లున్నాయి. అయితే, ఈసారి మిషన్‌భగీరథ అవసరాలకు నిల్వ ఉంచి మిగిలిన నీటిని మాత్రమే వాడుకోవాలని ప్రభుత్వం కచ్చితమైన ఆదేశాలు జారీ చేయడంతో ఈమేరకైనా నీళ్లున్నాయి. ఆవిరి నష్టాలను కూడా ముందుగానే గుర్తించిన అధికారులు కొంతమేర నివారించే ప్రయత్నం చేశారు. మార్చి–ఏప్రిల్ నెలల్లో ఆవిరి నష్టం నెలకు 0.75 టీఎంసీ నుంచి 1 టీఎంసీ వరకుంటుంది. ఇది ఒకనెల హైదరాబాద్ తాగునీటి అవసరాలతో సమానం. కాగా, మే నెలలో ఈ ఆవిరి నష్టం 1.5 టీఎంసీలకు చేరడం ఆందోళనకరం. జూరాల నుంచి సాగర్‌కు 3 టీఎంసీల నీరు విడుదల చేస్తే సాగర్ ప్రాజెక్టు చేరింది 1.1 టీఎంసీలే. ఇందులో 1 టీఎంసీ నీటి ప్రయాణ నష్టం కాగా, మరో టీఎంసీ ఆవిరి అయిపోవడం గమనార్హం. శ్రీశైలందీ అదే పరిస్థితి! శ్రీశైలంలో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఈ ప్రాజెక్టు గరిష్ట సామర్థ్యం 885 అడుగులు కాగా ఇప్పుడు 807.80 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టులో గత మూడేళ్లతో పోలిస్తే ఫరవాలేదనే స్థాయిలో నీళ్లున్నాయి. సింగూరు ప్రాజెక్టు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ ప్రాజెక్టులో 21.91 టీఎంసీల గరిష్ట నీటిసామర్థ్యానికిగాను కేవలం 0.68 టీఎంసీలు మాత్రమే నీళ్లున్నాయి. అదే గత ఏడాది 8 టీఎంసీల నీళ్లున్నాయి. ఈ ఏడాది మహా రాష్ట్రలోని గైక్వాడ్ ప్రాజెక్టు నుంచి నీళ్లు రాలేదు. నిజాంసాగర్‌లో ఈ ఏడాది 0.63 టీఎంసీల నీరుం డగా, గతేడాది ఇదే సమయానికి 2.61 టీఎంసీలున్నాయి. సింగూరు నుంచి నీటి విడుదల లేకపోవడంతో ఇక్కడా నీళ్లు లేకుండా పోయాయి. ఎస్సారెస్పీలో 90 టీఎంసీలకు గాను 6.26 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అదే గతేడాది ఇది 6.81 టీఎంసీలుగా ఉంది. కడెం ప్రాజెక్టుకు మహారాష్ట్ర నుంచి కొంత ఇన్‌ఫ్లో ఉండడంతో ఆ కొద్దిమేరనైనా నీళ్లున్నాయి. లేదంటే పరిస్థితి దారుణంగా ఉండేదని అధికారులు చెపుతున్నారు. మొత్తం మీద మనం ఎక్కువగా ఆధారపడే సాగర్, సిం గూరు, నిజాంసాగర్, ఎస్సారెస్పీ, ఎల్ఎండీలలో నీటి నిల్వలు అధమస్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సాగు తక్కువే రబీలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 33.45 లక్షల ఎకరాలు కాగా, 29.70 లక్షల ఎకరాల్లో సాగైనట్లు (89%) వ్యవసాయశాఖ నివేదిక తెలిపింది. అత్యధికంగా పప్పుధాన్యాల సాగయ్యాయి. పప్పుధాన్యాల రబీ సాధారణ సాగు విస్తీర్ణం 3.12 లక్షల ఎకరాలు కాగా, ఏకంగా 3.22 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. రబీ వరి సాధారణ విస్తీర్ణం 17.62 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకు 17.50 లక్షల ఎకరాల్లో నాట్లు పడినట్లు నివేదిక తెలిపింది. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 4.15 లక్షల ఎకరాలు కాగా, 3.22 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. ఇక కీలకమైన పప్పుధాన్యాల సాగు 103% నమోదు కావడం గమనార్హం. ఇక నూనెగింజల సాధారణ సాగు విస్తీర్ణం 4.47 లక్షల ఎకరాలు కాగా, ఇప్పటివరకు 3.30 లక్షల (74%) ఎకరాల్లో సాగు జరిగింది. అందులో కీలకమైన వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.57 లక్షల ఎకరాలు కాగా, 2.80 లక్షల (78%) ఎకరాల్లో సాగైంది. రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 126% రబీ పంటలు సాగయ్యాయి. అక్కడ సాధారణ సాగు విస్తీర్ణం 49 వేల ఎకరాలు కాగా, 62 వేల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. ఇదిలావుంటే రబీ మొక్కజొన్న పంటను కత్తెరపురుగు దెబ్బతీసింది. దీని ప్రభావంతో 8 జిల్లాల్లో మొక్కజొన్న దిగుబడి చాలా తగ్గింది. నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ (అర్బన్), వరంగల్ (రూరల్), నిర్మల్, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో మొక్కజొన్న పంటపై కత్తెరపురుగు వ్యాపించింది. అకాల వర్షాలకు గాను మామిడి, బత్తాయి తోటలు దెబ్బతిన్నాయి. రబీ నాటికి 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యుత్ తెగ ఖర్చవుతోంది రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తుండడంతో గృహ అవసరాలకుగానూ విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. మే నెలలో గత 10 రోజుల్లోనే దాదాపు 900 మెగావాట్ల విద్యుత్ వినియోగం పెరిగింది. మే 1వ తేదీన రాష్ట్రంలో 7,221 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రాగా, 10వ తేదీన 8,147 మెగావాట్లకు చేరింది. 11న కొంత మేరకు తగ్గి 8,053 మెగావాట్లకు చేరింది. అయితే, వ్యవసాయ పనులు లేకపోవడంతో కొంత డిమాండ్ తగ్గినట్టు కనిపిస్తున్నా.. వ్యవసాయ వినియోగం సగటు 3,500 మెగావాట్లను కలిపితే అది 11,500 మెగావాట్లు దాటనుంది. అయితే, రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ రోజుకు 10,500 మెగావాట్లు మాత్రమే ఉంది. కానీ, మే నెలలో ఏకంగా వ్యవసాయ వినియోగం లేకుండా 8,147 మెగావాట్లకు చేరడం గమనార్హం. భానుడు దంచేస్తున్నాడు ►రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. ఎంతగా అంటే గ్రామాల్లో నీటిచెల్మలు కూడా లేక పక్షులు చనిపోతున్నాయి. ఇతర మూగజీవాలు నీళ్ల కోసం తండ్లాడుతున్నాయి. చాలా జిల్లాల్లో భూగర్భజలాలు పడిపోతుండటం తో నీళ్లు రావడమే గగనమైపోయింది. పట్టణాల్లోని అపార్ట్మెంట్లలో ఉన్న బోర్లు వట్టిపోతున్నాయి. ►ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండల కారణంగా జిల్లాలో రోజుకు 4లక్షల లీటర్ల పాల దిగుబడి తగ్గిపోయింది. మూగజీవాలకు నీళ్లు కరువయ్యాయి. గడ్డి తగ్గిపోయింది. ట్రాక్టర్ గడ్డి రూ.5వేల నుంచి రూ.8వేలకు పెరిగింది. ►ఉమ్మడి మెదక్ జిల్లాలో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమను ఎండలు ఘోరంగా దెబ్బతీస్తున్నాయి. భానుడి ప్రతాపానికి తాళలేక కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రాష్ట్రంలోని 50% పౌల్ట్రీ ఉత్పత్తులు ఈ జిల్లా నుంచే ఉండడం గమనార్హం. ►గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కూడా 43 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే10వ తేదీన హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 3,102 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరిగింది. గతంలో 2018 మే30న 2,958 మెగావాట్ల డిమాండ్ రికార్డు కాగా, ఇప్పుడు 104 మెగావాట్లు పెరిగింది. ఫీడర్లు ట్రిప్ అవుతుండడంతో విద్యుత్ సరఫరా>కు అంతరాయం కలుగుతోంది. ►మహబూబ్‌నగర్‌లో ట్రాక్టర్ గడ్డి రూ.15వేలు పలుకుతోంది. వలస కార్మికులు నిలువ నీడ లేని పరిస్థితుల్లో పనులు చేసుకుంటూ బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ►రంగారెడ్డి జిల్లాలో 191 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదయింది. భూగర్భజలాలు 18.43 మీటర్ల లోతుకు వెళ్లాయి. 24 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 200 గ్రామాలు డేంజర్ జోన్లోకి వెళ్లాయి. ►నల్లగొండ జిల్లాలో 46 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ భూగర్భజలాలు 14.89 మీటర్లకు పడిపోగా, వేలాది బోర్లు ఎండిపోతున్నాయి. ప్రస్తుత నల్లగొండ జిల్లాలో 31 మండలాలుండగా, 25 మండలాల్లో కరువు ఛాయలు అలముకున్నాయి. ట్రాక్టర్ గడ్డి రూ.8వేల నుంచి 12వేలు పలుకుతోంది. ►ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేసవిలో వడదెబ్బకు 55 మంది వరకు చనిపోయారు. ఇక్కడ 43–46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ►ఖమ్మం జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయినప్పటికీ భూగర్భ జలాలు లోపలికి వెళ్లాయి. గత ఏడాదితో పోలిస్తే అరమీటరుకు పైగా ఎక్కువగానే గంగమ్మ పాతాళంలోకి చేరింది. ►నిజామాబాద్ జిల్లాలో ఈ ఏడాది సాధారణ వర్షపాతం 1015.7 మిల్లీమీటర్లు కాగా, కురిసింది కేవలం 850.9 మిల్లీమీటర్లే. ఇక భూగర్భజలాలు గతేడాది 15.32 మీటర్ల లోతున ఉంటే ఇప్పుడు 17.05 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. ►వరంగల్ జిల్లాలో పది మీటర్లకు అటు ఇటుగా భూగర్భజలాలున్నాయి. అయితే, వర్షపాతం మాత్రం 70 శాతం కూడా నమోదు కాలేదు. పెద్ద ఎత్తున బోర్లు ఎండిపోయే పరిస్థితుల్లో గ్రామాల్లో తాగునీటికి కూడా కష్టమవుతోంది. -
భూగర్భ జలాల్లో ‘ప్లాస్టిక్’
వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా 25 శాతం మంది తాగునీటి అవసరాలను తీరుస్తున్న భూగర్భ జలాల్లోనూ ప్లాస్టిక్ భూతం ప్రవేశించిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ‘గ్రౌండ్‌వాటర్’ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం, అమెరికాలోని రెండు జలాశయాల్లో సూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్ధాలు, ఔషధాలు, గృహోపకరణ వ్యర్థాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ‘ప్లాస్టిక్ పర్యావరణంలోకి సూక్ష్మకణాలుగా విచ్ఛిన్నమవుతుంది. ఇది జలచర జీవుల నాశనానికి కారణమవుతుంది’ అని ఇలినాయిస్ టెక్నాలజీ సెంటర్ పరిశోధకుడు జాన్ స్కాట్ చెప్పారు. ఫలితంగా మన ఆహార సరఫరా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని ఆయన అన్నారు. సున్నపురాయి పగుళ్ల ద్వారా, కొన్నిసార్లు మురుగునీటి సరఫరా వ్యవస్థ ద్వారా కూడా భూగర్భంలోకి నీరు చేరుతుంది. అయితే, పరిశోధకులు సెయింట్ లూయిస్ మెట్రోపాలి టన్, ఇల్లినాయిస్ ప్రాంతాల్లో పలు భూగర్భ జల నమూనాలను సేకరించి పరీక్షించగా 15.2 శాతం ప్లాస్టిక్ సూక్ష్మకణాలు కనిపించాయి. 1940 నుంచి 600 కోట్ల మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు తయారైనట్లు ఒక అంచనా. అందులో కనీసం 79 శాతం పర్యావరణంలో కలిసిపోయి ఉంటుందని అనుకుంటున్నామని స్కాట్ ఆందోళన వ్యక్తం చేశారు.